Previous Page Next Page 
ఆనందం పరమానందం పేజి 40

"వేణుగోపాలా! ఈ పని జయప్రదం చెయ్యి తండ్రీ!"
సత్యమూర్తి నడకవేగం ఇంకా పెంచేడు. తన మనో నేత్రంలో అందమైన భవిష్యత్తు స్పష్టంగా  కనిపించడంతో కులాసాగా నడుస్తున్నాడు.
"అట్లా నడుస్తున్న సత్యమూర్తిని ఎవరో ఢీకొన్నారు!
చేతిలో భీఫ్ కేసు కిందపడింది. ఢీకొట్టిన ఆగంతుడి చేతిలో కూడా బ్రీఫ్ కేసుంది.
సత్యమూర్తి కళ్లు బైర్లు కమ్మడం వల్ల కొంచెం ఆలిస్యంగా తెప్పరిల్లినిలబడ్డాడు. ఆ వ్యవధిలో ఢీకొట్టిన మనిషి బ్రీఫ్ కేనుని తీసుకుంటో సత్యమూర్తి అన్నాడు -
"అప్పుడు కూడా ఇదే టైపులో నన్ను ఆ సిక్కు యువకుడు  డేష్ కొట్టేడు."
"అయ్ సీ! నేను సిక్కుని కాను. నా పేరు అబ్దుల్ రహమాన్!" అన్నాడు ముసల్మాను గెటప్పులో వున్న భద్రాచలం.
"అయినా దారి చూచుకుంటో నడవాలి గాని, ఊహల్లో తేలిపోతూ నడుస్తుంటే ఇల్లాంటి ఇబ్బందులో కలుగుతాయి!" అన్నాడు అబ్దుల్ రెహమాన్.
"ఇప్పుడు ఊహల్తో నడుస్తున్నా మాట వాస్తవమే! కానీ అప్పుడు సిక్కు యువకుడు గుద్దినప్పుడు ఊహల్లో లేను.  వాస్తవంలో జీవించేను!" అన్నాడు సత్యమూర్తి.
"నేను అర్జంటు పని మీద వెడుతున్నాను. క్షమిస్తే వెళ్లిపోతాను!"
"నిజమే! నేను కూడా అత్యవసరమైన పనిమీదే ఉన్నాను. వెళ్లిరండి!" అని సత్యమూర్తి గబగబా నడుస్తున్నాడు.
అబ్దుల్ రెహమాన్ అనబడే భద్రాచలం పక్కసందులో దూరిపోయేడు.

                               *    *    *
గోవిందం మేడలో -
కుక్కలు మొరుగుతున్నాయి. అవి చెప్పే గొడవ వింటూ గోవిందం గొప్ప చిరాకు పడిపోతున్నాడు.
"అంత దైర్యంగా వస్తున్నాడంటే - అయిదు లక్షలూ తెస్తున్నట్టేగా?"
జాకీ రాగాలు తీస్తూ మొరిగింది.
"అయ్ సీ! వాడి చేతిలో బ్రీఫ్ కేసు కూడా వుందా?"
టైగరు మొరిగింది.
"చూద్దాం! అయిదు లక్షలూ ముట్టేక తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం!"
"నాన్నా!" అన్నది శారద మేడ దిగుతూ.
"అదేనమ్మా! సత్యమూర్తి వస్తున్నాట్ట! కుక్కలు చెబుతున్నాయి."
శారద చేతిలో కత్తి వుంది. ఆ కత్తిని చూస్తూ ఖంగారు పడుతూ అడిగేడు గోవిందం -
"ఇప్పుడు అదెందుకమ్మా?"
"అంతా సవ్యంగా జరిగితే దీంతో ఏపిల్ కోసి మీ అందరికీ ఆనందంగా పంచుతాను. అతన్ని మోసం చేస్తే ఈ కత్తి నా గుండెల్లో దిగుతుంది."
"శారదా!"
"దయచేసి మాట మీద నిలబడు నాన్నా!"
గోవిందం ఏదో చెప్పబోతుండగా కైలాసం పరుగెత్తుకుంటో వచ్చి అన్నాడు -
"అయ్యా! వస్తున్నాడు!"
"నువ్వు నోర్ముయ్! ఆ సంగతి - ఎప్పటి మాదిరే నీ కంటే ముందు కుక్కలే చెప్పేయి" అన్నాడు గోవిందం.
సరిగ్గా అప్పుడు -
ఎంతో ఠీవిగా హాల్లోకి ప్రవేశించేడు సత్యమూర్తి.
అతను కళకళలాడుతున్నాడు. ఎంతో ఉత్సాహంగా వున్నాడు. ఠీవితో పాటు దర్జాగా వున్నాడు. మూర్తీభావించిన దైర్యమల్లే మిలమిల మెరిసి పోతున్నాడు. సత్యమూర్తిని చూడగానే శారద గబగబా అతన్ని చేరుకుంది. అతని పక్కనే నిలబడింది!
శారద సత్యమూర్తి పక్కన నిలబడటం నచ్చని గోవిందం "శారదా!" అని  మందలించబోయేడు.
అతని మాటకు అడ్డం పడ్డాడు సత్యమూర్తి.
"షటప్"
గోవిందం నోరు మూసేడు.
"షటప్పని ఎందుక్కోప్పడ్డానో అర్థం చేసుకో! కన్నకూతుర్ని అయిదు లక్షలకు బేరం పెట్టిన  నీలాంటి లోఫర్ని చెప్పుతో కొట్టాలి! కానీ నేను మాటల్తో కొడతాను!"
"సత్యమూర్తి!" అరిచేడు గోవిందం.
"నోర్ముయ్! ఇప్పుడు తెలుగులో తిట్టాను. ఎందుకో తెలుసా! నీకు తెలీదు. నేను చెప్పను. అన్ని రోజులూ నీ ఇష్టప్రకారమే నడుస్తాయని విర్రవీగకు! నీ నీచ నికృష్ట స్వభావానికి ఇక స్వస్తి! ఆరునెలల గడువు. అయిదు  లక్షల ముడుపు! గడుపు పూర్తికాకుండానే పైకం మొత్తం తెచ్చేను. మా పెళ్లి నువ్వు చేస్తావా? లేక మమ్మల్నే చేసుకోమంటావా?" అన్నాడు సత్యమూర్తి.
"ముందు డబ్బు ఇవ్వు!"
"డబ్బు ... డబ్బు ... డబ్బు! ముష్టి డబ్బు, మురికి డబ్బు, వెధవ డబ్బు, వెర్రి డబ్బు!" అని పకపకా నవ్వుతున్నాడు సత్యమూర్తి.
ఈ వింత దృశ్యం చూడటానికి ఇంటో పనిచేసే మనుషులంతా హాల్లోకి చేరిపోయేరు. తన  కుటుంబ విషయం పనిమనుషులకు తెలీడం గోవిందానికిష్టం లేదు.
కుక్కల్ని ఉసిగోలిపితే పావుగంట పని! సత్యమూర్తి చిరనామా భూలోకంలో చిరిగిపోతుంది. కానీ, ప్రాణప్రదంగా పెంచుకున్న శారద కూడా దక్కదు.
కేవలం శారద మీద భయంతో గోవిందం హెచ్చరికలు చేయకుండా మర్యాదగా అన్నాడు -
"నువ్వు తెచ్చిన అయిదు లక్షలూ నేను లెక్క పెట్టాలి!"
సత్యమూర్తి మళ్లా నవ్వేడు.
"నీ గుణం తెలిసి తక్కువ తెస్తానా, మావా? అక్షరాలా అయిదు లక్షలూ తెచ్చేను. అన్నీ  అయిదు వందల నోట్ల కట్టలే! ఈ సోఫాలో గుమ్మరిస్తాను. ఏరుకో! ఏబ్రాసి వెధవలాగా ఏరుకుని లెక్కపెట్టుకో!"
అని బ్రీఫ్ కేసు మూత తెరిచేడు. సోఫా మీద బ్రీఫ్ కేసుని వంచేడు. అన్నీ కాగితాలే! అయితే అవి అయిదొందల నోట్ల కట్టలు కావు ...పిచ్చి కాగితాలు!
పిచ్చి కాగితాలను చూచి శారద షాకు తిన్నది. ఏం చేయాలో తోచక, వచ్చే  దుఃఖాన్ని దిగమింగుకుని చేతుల్లో  మొహాన్ని దాచుకుని గబగబా మేడ ఎక్కింది.
గోవిందం రుద్రరూపంలో సత్యమూర్తి వేపు నడుస్తున్నాడు. కరెన్సీ నోట్లు పిచ్చి కాగితాలుగా మారినందుకు సత్యమూర్తి  ఖంగారుపడుతున్నాడు.
గోవిందం అరుస్తున్నాడు -
"నాకు తెలుసురా! ... నీకు పిచ్చెక్కింది! ఇప్పుడు నేను నిన్నేం చేస్తానో  తెలుసా?"
"నో! ఆవేశపడకండి .... ఏదో మోసం జరిగంది. నన్నెవరో మోసం చేసేరు. నేను తెచ్చింది అసలైన డబ్బు! ఆ డబ్బు మాయమై ఈ కాగితాలు ఎల్లా వచ్చేయో నాకు తెలీదు!" అన్నాడు సత్యమూర్తి.
సత్యమూర్తి చెంపని చెళ్లుమనిపించేడు గోవిందం.
ఆ దెబ్బకి సత్యమూర్తి కళ్లు బైర్లు కమ్మేయి. పట్టు తప్పి నేల మీద పడ్డాడు. నేలమీద పడ్డవాడ్ని లేవనీకుండా కాల్తో కొడుతున్నాడు గోవిందం. అట్లా కొడుతూనే తనకి సాయం చేయమని కుక్కలకి ఆర్డరు వేసేడు.
అంచేత గోవిందంతో పాటు కుక్కలు కూడా సత్యమూర్తి మీదకి లంఘించేయి - ఆకల్తో వున్న సింహాల్లాగా!
పనిపనుషులు మాత్రం ఆ భీభత్సాన్ని చూళ్లేక అయ్యో పాపమని సత్యమూర్తి మీద జాలిపడ్డారు.
సరిగ్గా అదే సమయంలో - సింహాచలం, భద్రాచలంలు బేంకులో ఆరున్నర లక్షలు తమ జాయింటు ఎకౌంటులో జమ చేసేరు.

                                        38
డాక్టర్ పశుపతి ఆసుప్రతి.
ఊళ్లో మంచి పేరున్న ఆసుపత్రి. డాక్టర్ పశుపతి మొదట్లో పశువుల డాక్టరుగా వుండి, గిట్టుబాటు కాకపోవడంతో మళ్లా మెడిసిన్ చదివి మనుషుల డాక్టరైనట్లు ఊళ్లో గిట్టనివాళ్లు చెప్పుకుంటారు.
అయితే డాక్టర్ పశుపతి శాఖ మార్పిడి ఎట్లా వున్నా, హస్తవాసి మంచిదని పేరు తెచ్చుకున్నాడు.
డాక్టర్ పశుపతి ఆసుపత్రిలో బెడ్ నెంబరు 43లో సత్యమూర్తి పడుకుని వున్నాడు.
మనిషి మొత్తాన్ని దుప్పటితో కప్పేశారు. తొంభై శాతం శారీరం దెబ్బల్తో కమిలిపోయి వుంది. కేవలం పదిశాతం మాత్రమే డామేజు కాకుండా వుందని డాక్టర్ పశుపతి మెడికల్ రిపోర్టులో రాసేడు.
డాక్టర్ పశుపతి ఇచ్చిన ఇంజక్షను పవరు తగ్గిందో ఏమో సత్యమూర్తి మెల్లిగా కళ్లు విప్పేడు. అబ్బా ... అమ్మా .... అని బాధగా గొణుక్కున్నాడు. సత్యమూర్తికి తెలివి వచ్చినందుకు అతని కాళ్ల దగ్గిర నిలబడ్డ సింహాచలం గాలిలో చేతులు జోడించి చెంపలు వాయించుకుంటున్నాడు.
సత్యమూర్తి తలపక్కనే కూచున్న ఆనందం తెప్పరిల్లేడు.  గట్టిగా నిట్టూర్చేడు.

 Previous Page Next Page