Previous Page Next Page 
ఆనందం పరమానందం పేజి 38

"అది పట్టుక్కూచుంటే పుట్టగతులుండవు."
తోటపాండు పేపర్ వెయిట్ తీసుకున్నాడు.
"ఆనెస్టుగా బతికేవాళ్లు నా దృష్టిలో మూర్ఖులు."
పేపరు వెయిట్ ని ఆ చేతిలోంచి ఈ చేతిలోకి మార్చుకుంటున్నాడు తోటపాండు.
"అయ్ హేట్ దెమ్!"
అనగానే తోటపాండు ఆ పేపరు వెయిట్ ని సత్యమూర్తి మీదికి విసిరేడు.
ఆ దెబ్బకి సత్యమూర్తి ముక్కు పచ్చడైంది.   నెత్తురు  కారుతోంది.
అక్కడ్తో ఆగలేదు  తోటపాండు. మేకపిల్ల మీద పెద్దపులి  దూకినట్లు సత్యమూర్తి మీదకి తోటపాండు దూకెడు. సత్యమూర్తి కింద పడ్డాడు.
పడ్డవాడు లేచి నిలబడే అవకాశ మివ్వకుండా తోటపాండు తన  కాళ్లూ, చేతులూ వాడి -  సత్యమూర్తిని కైనూ చేస్తున్నాడు. దెబ్బలకు తట్టుకోలేక సత్యమూర్తి ఆర్తనాదం చేస్తున్నాడు.
కేవలం కొట్టడమే గాకుండా నోటి కొచ్చిన  బూతులు  కూడా  ప్రయోగిస్తున్నాడు. ఏం జరిగిందో  తెలీని ఆఫీసు సిబ్బంది అతి కష్టమ్మీద సత్యమూర్తిని ఆ  గదిలోంచి లాక్కుపోయేరు.
తోటపాండు ఫోన్ డయల్ చేసేడు. అవతల్నుంచి  ఆనందం "హాల్లో" అన్నాడు. అతని కంఠం వినగానే తోటపాండు కోపంతో ఊగిపోతూ అంటున్నాడు -
"నోర్ముయ్ రాస్కెల్! యస్సల్నీ పరీక్షల్లో లెక్కలు కాఫీ  కొట్టి పాసైతే పాసవచ్చు. అంతమాత్రాన నేను ఆనెస్టీని ఆప్టరాల్ గా తీసిపారేసే మనిషినికాను. డోంటా క్! నేను చెప్పేది పూర్తిగా విను. నన్నుఅవమానించాలని  నీ ఉద్దేశం. అందుకేవాడిని - వాడి పేరేమిటి? .... సత్యమూర్తిని నా మీదకి ఉసిగోల్పేవు. వాడు..... ఆ బాస్టర్డ్... ఏం చేసేడో చెప్పను .... పిచ్చికూతలు కూసేడు. నా ముందే నా కిష్టంలేని పదజాలం ఉపయోగించేడు. ఒరే! అనందం! ఇంకో  తడవ నువ్వు నాతో మాటాడినా - ఆఖ్ఖర్లేదు. కనిపించినా చాలు! కాల్చిపారేస్తాను. అసలు ఇవ్వాళే ఆ పని చేద్దును. నాకు ప్లయిట్  టైమవుతోంది. అంచేత బతికిపోయేవు. అంతమాత్రాన సంతోషించకు. అమెరికా నుంచి వచ్చేక నిన్ను కాల్చి చంపుతాను. అయ్ విల్ సీ యువరెండ్!"
అని ఫోన్ ని గాల్లోకి ఎగరేసి గాలి పీల్చుకుంటున్నాడు తోటపాండు.   
                                   *    *    *
తోటాస్ టైర్స్ నుంచి -
నెత్తురు మరకల్తో, చిరిగిన దుస్తులతో బయటపడుతున్న సత్యమూర్తిని చూసేడు పరమానందం.
గబగబా సత్యమూర్తిని చేరుకొని అడిగేడు -
"ఏమిటయ్యా? ఏం జరిగింది?"
పరమానందాన్ని చూచి బావురుమన్నాడు సత్యమూర్తి.
"ఏం చెప్పమంటారు! ఇదంతా నా ఖర్మ! ఉద్యోగమిమిస్తానంటే కాబోసనుకుని వచ్చేను. ఇంటర్వ్యూలో ఆయన అడిగిన ప్రశ్నకి ఆయన మెచ్చుకునే విధంగా సమాధానం చెబితే - ఇదుగో సార్, ఇదీ ఫలితం! ఉద్యోగం ఇవ్వకపోగా నన్ను ఈ విధంగా చితగ్గోటేడు.  చొక్కా చించేడు."
"అయ్యో పాపం! కొందరంతే నాయనా! అన్నం పెడతాం అని ఆహ్వానించి  సున్నం  పెడతారు. వెళ్లేళ్లు. దెబ్బలకి సున్నం రాసుకో!" అని ఉచిత సలహా ఒకటి విసిరి వెళ్లిపోతున్నాడు పరమానందం.
వెళ్లిపోతూ - "ఆహా! దునియా నువ్వు అసాధ్యుడివి! ఇంక నిన్ను విడిచి పెట్టకూడదు!" అని దునియాని మనసారా మెచ్చుకున్నాడు పరమానందం.
                                                        36
చింతామణి శారీ మందిర్.
ఆ షాపులోకి వెళ్లబోయే ఆనందాన్నీ షాపు బయటే కలిసేడు సత్యమూర్తి.
సత్యమూర్తిని చూడగానే ఆనందం చాలా విచారించేడు.
"హు! పాండు గాడికి ఆవేశం ఎక్కువ. గొడ్డుని బాదినట్టు బాదేడు" అన్నాడు ఆనందం.
"వద్దండీ, పోలిక లొద్దు! అసలే మీ  ఫ్రండు కొట్టిన దెబ్బలకి నేను చితికిపోయేను. నా ముక్కు చూడండి. చితికిపోయింది. నా మొహం చూడండి. అప్పడం లాగా అన్యాయమైపోయింది. అతనేమో నన్ను చితగొట్టేడు. మీరేమో నన్ను చావనీకుండా నాకెందుకు సార్ ఆశలు కలిగించేరు?" అన్నాడు సత్యమూర్తి ఏడుస్తూ.
"నీకో దారి చూపించి నేనో దారి వెతుక్కుందామని ముచ్చట పడ్డాను."
"వద్దు! మీ ముచ్చట్లు నా ప్రాణమ్మీదికి తిప్పకండి. నా మీద ప్రయోగాలు చేయకండి. గోవిందం నా మీద దాడి చేస్తున్నాడంటే దానికో మీనింగుంది. నేను మీకు చేసిన ద్రోహమేమిటి? వచ్చేవాణ్ని చావనీకుండా చంపుకుతింటున్నారు మీరు!" అన్నాడు సత్యమూర్తి ఉక్రోషంగా.
ఆనందం లాలనగా సత్యమూర్తి భుజం తట్టెడు.
"నిజానికి తోటపాండు చాలా మంచివాడు ఉద్రేకం ఎక్కువైతే పట్టుకోలేం గాని, మామూలు పరిస్థితుల్లో తోటపాండు చాలా  సౌమ్యంగా వుంటాడు. అతనికి ఉద్రేకం కలిగించే మాటలేమైనా అన్నావా?"
"లేదు. అతనికిష్టమైన ... ఎంతో ఇష్టమైన మాటలే తూచి తూచి అన్నాను."
"ఏమన్నావు?"
"ఆనెస్టీని తిట్టిపోసేను."
ఆ మాట వినగానే ఆనందం ఖంగారుపడుతూ అడిగేడు -
"ఏమిటేమిటి? ఆనెస్టీని తిట్టిపోసేవా?"
"అవునండి! ఆ టాపిక్ అతనికి చాలా  ఇష్టం గదాని రెచ్చిపోయి తిట్టను."
"కొంప ముంచేవ్!" అన్నాడు తాపీగా.
"సార్?"
ఆనందం సత్యమూర్తి చెయ్యి పట్టుకుని అక్కడికి కొంచెం దూరంలో వున్న బస్టాపుకి తీసుకొచ్చి అన్నాడు -
"నీకు  తెలుసో, తెలీదో! తోటపాండుకి ఆనెస్టీ ఆరోప్రాణం నాయనా! ఆనెస్టీ ఎవరైనా విమర్శిస్తే నిప్పులు కక్కుతాడు!"
"అవునా?" అని  విస్మయంగా అడిగేడు సత్యమూర్తి.
"అందుకే కాబోలు, ఫోన్లో నా మీద కారాలూ మిరియాలూ నూరేడు. అయినా - తోట పాండుకి ఆనెస్టీ పడదని నీ కెవరు చెప్పేరు?"
"ఎవరో సిక్కుల కుర్రాడు. అతనికి ఆ కంపెనీలో అందుకే ఉద్యోగమొచ్చిందట!"
"ఎందుకు? ఆనెస్టీని తిట్టినందుకా?"
"అవును."
"ఇదేదో గోల్ మాల్ వ్యవహారంగా వుందే?"
"అంతేనంటారా!" అని నీళ్లు నముల్తూ అడిగేడు.
"అయినా, ఎవడో చెప్పింది నువ్వెందుకు నమ్మాలి?"
"ఏమిటోనండి! నా చేతుల్లో ఏమీ లేకుండానే అంతా  జరిగిపోయింది."
"తోట పాండు మళ్లా ఆర్నెల్లకు గాని తిరిగి రాడు."
"నా పెళ్లి గడువు అంతకంటే ముందే ముగుస్తుంది."
"నీ పెళ్లి విషయం అట్లా వుంచు. నా పచ్చటి బతుకు సర్వనాశనమైపోతుంది!"  
"ఏమిటండీ? ఏమిటి మీరు  మాటాడేది?" అన్నాడు సత్యమూర్తి - ఆనందం మాటల్లో అంతరార్థం బోధపడక.
"నా పెళ్లి ఆగిపోతే  మీ పచ్చటి బతుకు ఎందుకు సర్వనాశనమవుతుంది? నా పెళ్లీకీ, మీకూ సంబంధమేమిటి?" అని ప్రశ్నల వర్షం కురిపించబోగా -
"వద్దు! వివరాలడగవద్దు. సమయం వచ్చినప్పుడు అన్నీ చెబ్తాను. నేను నీశ్రేయోభిలాషిని, ఇది చెప్పడు మాటలు విని చెడిపోయే ప్రమాదం కొని తెచ్చుకోకు!" అని హెచ్చరించి ఆనందం అక్కడ్నించి వెళ్లిపోయేడు.
అప్పుడే -
ఒక బస్సు వచ్చి ఆ బస్టాపులో ఆగింది.
అందులోంచి శారద దిగుతోంది. శారదను చూడగానే పారిపోయేందుకు సిద్దపడ్డాడు సత్యమూర్తి. అయితే, అతను ఆ పని చెయ్యడముందే శారద అతన్ని చూచింది.
సత్యమూర్తికి తగిలిన దెబ్బల్ని చూస్తో ఖంగారుగా అడిగింది శారద.
"అయ్యయ్యో! ఏం  జరిగింది? ఈ దెబ్బలేమిటి?"
"మామూలే! ఏక్సిడెంట్లు, దెబ్బలు తినడాలూ నాకు తెలీకుండానే జరిగిపోతుంటాయి. రీజన్లుండవు!"
"అసలేం జరిగింది?"
"అభిప్రాయ భేదాలు అనేకం వస్తుంటాయి శారదా! అట్లాంటి పరిస్థితుల్లో మాటా  మాటా  అనుకోడం, చెయ్యీ, కాలూ వాడటం  అతి సాధారణమైన విషయం!" అన్నాడు సత్యమూర్తి.
"అర్థం లేని మాటల్ని పొడిపొడిగా వాడుతూ నువ్వేదో దాస్తున్నావ్ కదూ?" అడిగింది శారద.
"కొన్ని సంఘటనలు నువ్వు తెలుసుకొకపోవడమే మంచిది, శారదా!  

 Previous Page Next Page