సుందరికి ప్రతిరాత్రి శివరాత్రికాదుగాని, అవసరనిమిత్తం రాత్రిపూట రెండుసార్లు లేస్తుంది. ఆ ఇంటికి ఎటాచ్డ్ బాత్ రూమ్ లేదు. పెరట్లో ఓ మూలగా చిన్న స్నానాలదొడ్డి వుంది సుందరి రాత్రిళ్ళు ఆ మూలదాకా వెళ్ళలేదు.
వంటరిగా రాత్రిళ్ళు పెరట్లోకి వెళితే సమయానికి అక్కడా ఏ దొంగవెధవో వుంటే వాడు తన బుర్ర బద్దలుకొట్టి , మెడలో నగలు లాగేయవచ్చు. లేక తనసలే అందమైన ఆడది. వాడు తనని ఏ చెట్టు మూలకో లాక్కెళ్ళి.....నోరుమూసి బలవంతాన......
సుందరి ఆలోచనలు భయంతో అలా సాగేవి. దాంతో అవసర నిమిత్తం భర్తని లేపేది. నిద్రకళ్ళతో సుబ్బారావు తలుపు తీసి గుమ్మందగ్గర నుంచుంటే, సుందరి కాస్త పక్కకివెళ్ళి పని కానిచ్చుకువచ్చేది. చలికాలం మాత్రం వకటికి నాలుగుసార్లు లేస్తుంటే ముద్దుగా సుబ్బారావు భార్యని విసుక్కుంటాడు" చిరు కప్ప" అంటూ.
అవసర నిమిత్తం సుందరి లేవటంతో అలవాటు ప్రకారం సుబ్బారావు తలుపుతీసి గుమ్మానికి అనుకుని నుంచున్నాడు.
పక్కింటి యు. శంకర్రావు ఇంట్లో బెడ్ లాంప్ వెలగటం లేదు. అంటే శంకర్రావు వూరినుంచి రాలేదని అర్ధం. ఉదయం శంకర్రావుకి వచ్చిన కోడ్ లో వున్న స్మగ్లింగ్ లెటర్ విషయం తక్కున గుర్తొచ్చిన సుబ్బారావుకి ఆ సమయంలో శంకర్రావు యింటి పై ఓ కన్నువేసి వుంచాలన్నది కూడా గుర్తొచ్చింది. శంకర్రావు యింటి నలుమూలలా పరికించి చూస్తూ వుండి పోయాడు.
సరిగా అప్పుడే-
రంగశాయి నెత్తిమీద చెక్కపెట్టె పెట్టుకుని వీధి కుక్కలా గోల భరిస్తూ ఆ యింటిదాకా వచ్చాడు.
ఓసారి అటూ యిటూ చూసి శంకర్రావు యింటి ప్రహరీ గోడ మీదకి పెట్టెని ఎక్కించి పెరటి లోపల పడేలా బలంగా, విసురుగా పెట్టెని గోడ మీదనుంచి లోపలికి నెట్టి కాళ్ళకి బుద్ది చెప్పాడు.
అక్కడితో రంగశాయి పని అయిపోయింది.
రంగాశాయికి పట్టి వదిలిన శని ఎక్కడికీ పోదు. మరునిమిషంలో సుబ్బారావుకి పట్టటానికి రెడీగా వుంది.
శంకర్రావు యింటివేపు చూస్తున్న సుబ్బారావు కళ్ళు విచ్చుకున్న పత్తికాయల్లా మారాయి.
గోడ మీదకి పెట్టె ఎక్కింది. అదేమిటబ్బా అనుకునే లోపలే రెండుచేతులు ఆ పెట్టెని లోపలికి నెట్టాయి.
దబ్ మన్న చప్పుడు.
ఆ తర్వాత అంతటా నిశ్శబ్దం.
సుందరి రావటం సుబ్బారావు చూడలేదు.గుడ్లు మిటకరించుకుని అటే చూస్తున్నాడు.
"ఆ త్రాష్టుడు ఊరినుంచి రాలేదు లెండి. వస్తే ఒక గుర్తు. కిటికీ అద్దాలలోంచి చిన్న లైటు వెలుతురు కనపడుతూ వుంటుంది" అంది సుందరి.
"ఉష్" అన్నాడు సుబ్బారావు.
"అదేమిటి?" అంది సుందరి.
మళ్ళీ "ఉష్" అన్నాడు సుబ్బారావు.
"ఏమిటీ? ఏమైంది?" తగ్గుస్వరంతో అడిగింది సుందరి.
"ఏదయినా అలికిదిగాని, ఎవరయినా కదలడం గాని కనబడుతుంటే చూడు. ఇంతకుముందు ఓ తమాషా జరిగింది" సుబ్బారావు యింకా అటే చూస్తూ గుసగుసగా చెప్పాడు.
సుధీర్ ఎందుకో మెలుకువ రావటంతో అతను కూడా లేచి వచ్చాడు.
ముగ్గురూ కలసి కొద్దిసేపు తర్జన భర్జన పడ్డారు.
"వాడెవడో స్మగుల్ద్ గూడ్స్ లోపలికినెట్టి వెళ్ళిపోయాడు. నేను నా కళ్ళారా చూశాను" సుబ్బారావు అన్నాడు.
"మీరు మీ కళ్ళతో చూడక నా కళ్ళతో చూసారని అనటం లేదు లెండీ. శంకర్రావు యింట్లో వున్నాడో లేదో చూసుకోకుండా వాడెవడో అంతఖరీదైంది పెరట్లో పారేసి పోతాడా అని నా అనుమానం" అంది సుందరి.