Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 36

 

    లూనాకు తాళంవేసి ఇంట్లోకి వస్తూ, "ఏమిటి అక్కా, తమ్ముడు తెగ నవ్వేసుకుంటున్నారు?" అన్నాడు సుబ్బారావు అర్దాంగిని చూస్తూ.

    "మిమ్మల్ని చూసి కాదులేండి" అంది సుందరి కిలకిలా నవ్వుతూ. అది ఆమెధంటూ ప్రత్యేకంగా నవ్వే నవ్వు.

    "మరి మీ తమ్ములుగారిని చూశా?" సుబ్బారావు అడిగాడు.

    "కాదు పక్కింటి శంకర్రావుని చూసి" సుధీర్ చెప్పాడు.

    "అయ్యో, పాపం వాడేం చేశాడు?" అంటూ లోపలికి వచ్చిన సుబ్బారావు- "ఆ లెటర్ ఎక్కడనుండి?" అన్నాడు సుధీర్ చేతిలోని కవరుని చూస్తూ.

    "యు. శంకర్రావుకి వచ్చిన లెటర్ ని మేము చదివాము" సుధీర్ చెప్పాడు.

    "అదేమిటి?" సుబ్బారావు ఆశ్చర్యంగా అడిగాడు.

    "అది సీక్రెట్ లెటర్"

    "అదేమిటి?"

    "మీరు అదేమిటి ఇదేమిటి అని అన్నిసార్లు ఆశ్చర్యపోయినా అసలు విషయం అర్ధంకాదు గానీండి, ముందు ఈ లెటర్ చదవండి" అంటూ మిగతా విషయం టూకీగా చెప్పింది సుందరి.

    సుబ్బారావు లెటర్ తీసుకుని ఆతృతగా చదివాడు.

    "సుధీర్ చదువులో ఫస్ట్ కాకపోవచ్చుగాని, మిగతా విషయాలలో ఫస్ట్. మీ తమ్ముడికి ఈ విషయంలో నెంబర్ వన్ స్థానం యిచ్చాను సుందరీమణీ!" అన్నాడు సుబ్బారావు.

    ఆ తర్వాత ముగ్గురూ కలసి యిదే విషయం చర్చించుకున్నారు.

    U.S.R. అంటే యు. శంకర్రావు. రారాజు అనేవాడు స్మగ్లింగ్ వ్యవహారాలలో పెద్దబాస్ అనిఅర్ధం. అవతలి ముఠాలో వాళ్ళని చావగొట్టి చెవులుమూసి ఏదో పెద్దది చేజిక్కించుకున్నాడు. దానిని రహస్యంగా శంకర్రావుకి, రాబర్ట్ అనేవాడికి సగం సగం పంపిస్తున్నారు. దానిని రెండో కంటికి తెలియకుండా ఆమ్మాలి. పంపించే సరుకు ఏమయి వుంటుంది?

    కొద్దిసేపు ఆలోచించగా అది హిరాయిన్ అని గట్టిగా తోచింది. హిరాయిన్ బంగారంతో సమానం. హిరాయిన్ కాకపోతే వజ్రాలు, రత్నాలు. అంతకుమించి అతి ఖరీదైన స్మగ్లుల్డ్ గూడ్స్-యింకేముంటాయి?

    రారాజు యు. శంకర్రావుకి పంపించేది ఏవైనా కావచ్చు. ఈ లెటర్ పోలీసులకిస్తే శంకర్రావుని శంకరగిరి మాన్యాలకి పంపటం ఖాయం. అలా చేయటం మంచిపనా? లేక ఓ కంట శంకర్రావు చర్యలని కనిపెడుతూ, సమయం వచ్చినప్పుడు లటుక్కున పట్టేసి......

    పట్టేయటం సరుకునా! శంకరాన్నా!?

    ఏదైనా ఫరవాలేదు.

    శంకర్రావుని పట్టేసి వాడి ఆచూకీ పోలీసులకి చేరవేస్తే చాలు. తర్వాత పని వాళ్ళే చూస్తారు. ఇన్ స్పెక్టర్ ని ముఖా ముఖీ కలుసుకుని విషయం చెప్పక్కరలేదు. మారుపేరుతో ఫోన్ కాల్. లేక ఆకాశరామన్న లెటర్- ఏదైనా చాలు. ఆ దెబ్బతో ఇరుక్కుపోతాడు.

    సరుకు విషయం అయినా అంతే చేయాలి. సరుకుతోపాటు శంకర్రావు చిక్కాడంటే అది బలమైన సాక్ష్యం అవుతుంది.

    ముగ్గురూ-ఆ విధంగా ఆలోచించారు.

    లెటర్ ని భద్రంగా దాచారు.

    ఇతరుల తప్పుని భూతద్దంలోంచి చూస్తూ విడ్డూరంగా విమర్శించుకునే వాళ్ళు ఏ  చిన్నతప్పు చేయని వారయి వుండాలి. ఆ ఇంగితజ్ఞానం లేనప్పుడు అందరూ తప్పుడువాళ్ళే.

    పరాయివాళ్ళకొచ్చిన ఉత్తరాలు చదవటం తప్పు. ఆ తప్పు చేసిన సుబ్బారావు, సుందరి, సుధీర్ తాము చేస్తున్నది తప్పు అన్నమాట మర్చిపోయారు.

    దాని ఫలితం ఈ రాత్రికే వాళ్ళు అనుభవించబోతున్నారు.

                                           19

    రాత్రి-

    సుందరి సుబ్బారావుని లేపింది.

    సుబ్బారావు సగం నిద్రకళ్ళతో లేచి కూర్చున్నాడు.
   

 Previous Page Next Page