"అనుమానం, ఆడవాళ్ళు కలిసే పుట్టారు" సుబ్బారావు విసుక్కున్నాడు.
"ఇలాంటి సమయంలో వాదులాడుకోవడం టైమ్ వేస్ట్. యు. శంకర్రావుగారు ఊరు వెళ్ళిన సంగతి వాళ్ళకి తెలియదు. లెటర్ రాసి పడేశారు. అది అందింది అనుకున్నారు. వాళ్ళ దోవన వాళ్ళు ఎప్పటిలాగా సరుకు పడేసిపోయారు" సుధీర్ అన్నాడు.
"లక్షళు విలువచేసే సరుకు అలా పారేసి పోతారటరా?" సుందరి అడిగింది.
"అదిగో-మళ్ళీ అనుమానం" అన్నాడు సుబ్బారావు.
జరిగిందానిలో పెద్ద లొసుగు ఉంది. అదేమిటో సుబ్బారావు, సుధీర్ కనిపెట్టలేదు. సుందరికి అనుమానం వచ్చిందిగాని అదేమిటో అర్ధం కాలేదు.
"స్మగ్లింగ్ చేసేవాళ్ళ సంగతి మీకు తెలియదు. నేను చాలా నవలల్లో చదివాను. వాళ్ళు పైకి యిలా నిర్లక్ష్యంగానే వుంటారు. సవ్యంగా పని కాకపోతే మాత్రం కత్తులు తీస్తారు."
సుధీర్ చెపుతుంటే "కత్తులెందుకురా?" అంది సుందరి.
"ఒకరినొకరు పొడుచుకోటానికి" అన్నాడు సుబ్బారావు.
పావుగంట చర్చ తరువాత ముగ్గురూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఏం చేయాలన్నది కూడా నిర్ణయించుకోవటం జరిగింది.
సుబ్బారావు నాలుగు బ్యాటరీల టార్చిలైటు తెచ్చి పక్కవాళ్ళ పెరట్లోకి వేశాడు.
పెరట్లో వున్న ప్రతిదీ స్పష్టంగా కనబడింది. ఆఖరికి రంగశాయి గోడ మీదనుంచి దొర్లించిన చెక్కపెట్టె కూడా.
ముగ్గురూ చూశారు చెక్కపెట్టెని.
సుబ్బారావు వున్న యింటికి, శంకర్రావు వున్న ఇంటికి మధ్య గోడ నాలుగడుగుల ఎత్తు. గోడ లెక్కడం చాతగాని ఆడవాళ్ళు కూడా ఆ గోడని ఎక్కగలరు.
సుబ్బారావు గోడ పక్కనే కుర్చీపీట వేసుకుని దానిమీద కెక్కి ఆపై గోడ ఎక్కాడు. పెద్ద సాహసవీరుడిలా అటువైపుకి గోడ దూకాడు.
ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా రయ్యిన పరుగుతీసి పెట్టెని అందుకున్నాడు.
పెట్టె మోసేంత బరువు వుంది. రెండు చేతులతో పెట్టెని పైకిలేపి గుండెకి ఆనించుకుని తిరిగి చూడకుండా వేగంగా గోడ దగ్గరకు వచ్చాడు.
అప్పటికే గోడెక్కి కోతిలా కూర్చున్న సుధీర్, బావ చేతిలోంచి పెట్టెని అందుకుని ఇటు పక్క వున్న అక్కకి అందించాడు.
ఆ తర్వాత సుధీర్ చెయ్యి అందిస్తే సుబ్బారావు గోడ ఎక్కి ఇటు దూకాడు.
ఆ సమయంలో ముగ్గురి ముఖాలు గొప్ప సాహసకార్యం చేస్తున్నట్లు వున్నాయి.
పెట్టె తీసుకుని ముగ్గురూ యింట్లోకి వచ్చి తలుపులు బిడాయించుకున్నారు.
పోస్టువాడు చేసిన పొరపాటు.
యు. శంకర్రావుకి అందాల్సిన లెటరు.
ఈ యింటికొచ్చి పడటం!
విషయం అర్ధమయ్యేసరికి-
పెట్టెకి కాళ్ళొచ్చినట్టు య్న్ట్లోకి రావటం!!
ఎంత అదృష్టం?
మరి కొద్దిసేపటిలో తమని వరించిన అదృష్టాన్ని చూసి ముగ్గురూ తబ్బిబ్బవుతారో, తల్లకిందులే కానున్నారో? చూడాలి.
20
ఇంట్లోకి రాంగానే-
"ఇప్పుడు ఏం చేద్దాం?" సుందరి అడిగింది.
"నువ్వు యిష్టపడ్డ చీర కొనటానికి మర్నాటి దాకా ఆగమంటే నువ్వేమనేదానివి?" సుబ్బారావు చిలిపిగా అడిగాడు.
"ఏమో బాబూ-నాకు గుర్తులేదు" అంది సుందరి. నిజంగా గుర్తులేకనే ఆ మాట అన్నది.
"ఆలస్యం అమృతం విషం అనే దానివి."
"అంటే అన్నానేమో. చీరల విషయం ఇప్పుడెందుకుట?"


