"శంకర్రావు మామూలు మనిషికాదు. పెద్ద స్మగ్లరు." తాను కనిపెట్టిన సత్యం సుధీర్ చెప్పాడు.
"ఏమిటీ? ఆ త్రాష్టుడికి వున్న అలవాట్లు చాలక స్మగ్లింగ్ కూడానా! అమ్మో అమ్మో! ఎంత గుండెలు తీసిన బంటు?" అని సుందరి ముందు గుండెలు బాదుకున్నంత పనిచేసి, ఆ తర్వాత "వాడు స్మగ్లరని నీకెలా తెలుసురా" అని అనుమానంగా అడిగింది.
"నేను చెప్పేది సావధానంగా విని అర్ధం చేసుకో అక్కా?"
"నీవు ముందు చెప్పు__ఆ తర్వత నేను అర్ధం చేసుకుంటాను."
"జేమ్స్ బాండ్ దొంగల ముఠాలు వుండే సినిమాలలోనూ, డిటెక్టివ్ పుస్తకాలలోనూ కొద భాష అని వకటుంటుంది. దొంగలు, డిటెక్టివ్ లు ఒకరి నుంచి ఒకరికి సమాచారం అందించటం మామూలుగా వుండదు. కోడ్ లో వుంటుంది. ఆదివారం హత్య చేయి అని బాస్ తన కిందవాళ్ళకి సమాచారం అందించాలి అనుకో....అప్పుడు బాస్ పంపే సమాచారం యిలా వుంటుంది.
త్యహ సండే యహా ఓహో__అలా అన్నమాట....."
"ఏది మళ్ళీ చెప్పు!" సుందరి అడిగింది.
"త్యహ సండే యహా ఓహో" సుధీర్ చెప్పాడు.
"ఏదో సంస్కృతం లాగా వుంది. ఒక్కమాట అర్ధమయి చావటంలేదు"
"అలా ఓ పట్టాన అర్ధమయి చావంది కోడ్ భాష అన్న మాట! కోడ్ ని డీకోడ్ చేస్తే అర్ధం బాగా తెలుస్తుంది. అది యిలా అన్నమాట.
త్యహ అంటే హత్య అని. సండే అంటే ఆదివారం యహా అంటే హిందీలో యిక్కడ అని అర్ధం. ఓహో అంటే బాస్ పేరు అన్నమాట.
ఆదివారం యిక్కడ హత్య చేయాలి రమ్మని అర్ధం అన్నమాట.
కోడ్ ని నేను తేలిక భాషలో నీకు చెప్పాను. అసలు కోడ్ వుంటుంది. అర్ధంగాక హడలిపోవాల్సిందే. శంకర్రావుకి వచ్చిన ఈ లెటర్ కోడ్ భాషలో వుంది."
అంతా విని సుందరి అంది_"నీవు చెపుతుంటే నిజమే ననిపిస్తుందిరోయ్. త్రాష్టుడు శంకర్రావు పెద్ద స్మగ్లర్ అయి వుండవచ్చు. ఎందుకంటే వాడికో యిల్లు తప్ప ఉద్యోగం సద్యోగం లేదు. ఏదో బిజినెస్ వుంది. దానిలో డబ్బు వస్తుంది. డబ్బుతో హాయిగా టింగురంగడులా కాలం గడిపేస్తున్నాడని అందరూ అనుకోటం వాడి బిజినెస్ ఏమిటో ఎవరికీ తెలియదు. పూల రంగడిలా మాత్రం వుంటున్నాడంటే వుండడా మరి__వాడో పెద్ద స్మగ్లరాయే."
"స్మగ్లర్ కాబట్టే వాడి పని మూడు పూలు ఆరుకాయలు" సుధీర్ అన్నాడు.
"సరే ఈ లెటర్ కి అర్ధం ఏమిటి?"
"వాళ్ళకేదో సరుకు వచ్చింది. వాళ్ళ బాస్ సగం శంకర్రావుకీ మిగతా సగం రాబర్ట్ అనే వాడికి అప్పగించాడు."
"సరుకు అంటే సుందరి అడిగింది."
"అమ్ముడయేది ప్రతిదీ సరుకే ఆఖరికి స్త్రీకూడా- అన్నాడట ఓ మహానుభావుడు."
"అన్నవాడు నీలాంటి బుర్రలేనివాడు కట్నానికి అమ్ముడు పోవటంలేదా మగవాడు? పశువుకీ పురుషుడికీ తేడా ఏమిటంటే 'ప' కొమ్మిస్తే 'పు' అన్నదిట ఓ మగువ"
సుందరి మూతి తిప్పుతూ అన్న తీరుకి సుధీర్ నవ్వాడు.
సుందరీ, ఆమె తమ్ముడు సుధీర్ శంకర్రావుకి వచ్చిన ఉత్తరాన్ని డిసైఫర్ చేసే ప్రయత్నంలో మునిగి, జోకుల్లో తేలుతున్నప్పుడే సరిగ్గా సుబ్బారావు బండి ఇంటిముందు ఆగింది.