ఎండాకాలం మూలాన వెలుతురు ఇంకా తగ్గలేదు.
మబ్బులు వెండిపళ్ళాల్లా మెరుస్తున్నాయి. దూరంగా దట్టంగా చెట్లు, ఆ చెట్ల వెనుక మినుకు మినుకుమంటూ కనిపిస్తున్న పల్లెటూరు. కొండల్లోంచి దిగుతూ, ఊరివైపు వెళుతున్న గేదెలు, పల్లెజనం.
"ఈ హైదరాబాద్ లో, ఈ జనారణ్యంలో ఇలాంటి అందమైన ప్రదేశం ఒకటి వుందని నాకు తెలీదు. వాటే వండ్రఫుల్ ప్లేస్...." చల్లగాలిలో సేదదీరుతూ బండరాయి మీదకెక్కింది శృతి.
"అందుకే తీసుకొచ్చాను. నాకీ ప్రదేశమంటే చాలా ఇష్టం. అరుదుగా దొరికే ఖాళీసమయాన్ని నేనిక్కడికొచ్చి ఎంజాయ్ చేస్తుంటాను. అటు చూశారా ఆ దూరంగా కనబడుతున్నదే అదే గోల్కొండ కోట. ఆ చెరువుకి అటుపక్కనున్న పాతకాలపు శిథిల భవనాన్ని అయిదో నిజాం నవాబు వేసవి విడిది కోసం కట్టించుకున్నాడట. అప్పట్లో ఆ భవనం చెరుకు మధ్యలో వుండేదిట. ఇప్పుడు నీళ్ళ కరువు కదా, నీళ్ళు ఎండిపోయాయి. బిల్డింగ్ అందం కూడా ఎండిపోతోంది" అన్నాడు అన్వేషి ఆలోచిస్తూ.
"ఆ శిథిలమైన బిల్డింగును చూస్తూంటే మీకేం అనిపిస్తుందో చెప్పండి" బండరాయిమీద నుంచునే అంది శృతి.
"ఏ పాతకాలపు బిల్డింగుల్ని చూసినా నాకు విషాదపు ప్రేమగాథలు గుర్తుకొస్తాయి. గులాబీరేకుల్లా నలిగిపోయిన అమ్మాయిల వయసు, కల్లలై పోయిన వారి కలలూ గుర్తుకొస్తాయి. ఒక్క తాజ్ మహల్ చూసినప్పుడు మాత్రమే పరిపూర్ణత సిద్ధించుకున్న ప్రేమలోకం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. మిగతా ప్రేమచరిత్రల్ని తిరగేసినప్పుడల్లా అందరూ ఆనందంతో ఉప్పొంగితే, నాకు మాత్రం జాలికలుగుతుంది. సౌందర్యం పక్కనే విషాదం కూడా వుంటుంది. మొదట నాకు గుర్తుకొచ్చేది ఆ విషాదమే"
"వండ్రఫుల్! గాలిబ్ లా చెప్పారు. మీరు కవా? బహుశా పూర్వజన్మలోనైనా కవై వుంటారు. మిమ్మల్ని చూస్తుంటే, నాకేదో ఎక్కడో అనుమానంగా వుంది. మీరు ఎప్పుడో, ఎవర్నో గాఢంగా ప్రేమించారు. ఆ ప్రేమ దారుణంగా ఫెయిలైంది. అవునా?" బండరతి మీద కూర్చుంటూ అంది శృతి.
"విశ్వాత్మ ఎస్టేట్ లో మీ పనేంటో నాకు తెలీదుగానీ, మీరు మా డిటెక్టివ్ ఫీల్డ్ లోకొస్తే పైకి రాదగ్గ క్వాలిటీస్ లు మీలో చాలా వున్నాయి" ఆమెని నఖశిఖ పర్యంతం చూస్తూ చిన్నగా నవ్వుతూ అన్నాడు అన్వేషి.
ఆ మాటకు సూటిగా అన్వేషివైపు చూసింది శృతి. ఎస్టేట్ లో తన హోదా ఏమిటో, తనెవరో పరోక్షంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న అతని తెలివితేటల్ని మనసులోనే మెచ్చుకుంది శృతి.
"రండి! ఆ బిల్డింగ్ లో ఏముందో చూద్దాం" అంటూ బండరాతిమీద నుంచి లేవబోయిన శృతి కుడికాలు స్లిప్పయి, ఏటవాలుగా పడిపోబోయింది.
అమాంతంగా ఒక్క ఉదుటున లేచి ఆమెను రెండు చేతుల్తో పట్టుకొన్నాడు అన్వేషి.
ఇప్పుడు శృతి పూలగుత్తిలా అన్వేషి చేతుల్లో వుంది. ఆమె చెంపలకు అన్వేషి ముక్కుపుటాల్లోంచి వస్తున్న గాలి వెచ్చగా వుంది.
ఏదో తెలీని ఉద్వేగం ఆమెనో క్షణం వివశురాల్ని చేసింది. నడుం పైభాగంలో అతని చేతులుండడంవల్ల... ఆ చేతులు మెత్తగా తాకుతున్నాయి.
పురుష స్పర్శ- తమకంలోకి లాక్కెళుతున్న పురుష స్పర్శ- అప్రయత్నంగా ఆమెకు స్త్రీత్వపు స్పృహ గుర్తుకొస్తోంది.
తేరిపారగా అతని కళ్ళవైపు చూసిన శృతికి, అతని కళ్ళు చున్నీ పక్కకు తొలగిన తన ఎదవైపు చూస్తుండడంతో గబుక్కున్ సిగ్గుపడి తప్పించుకొని ముందుకు పరిగెత్తింది.
భారంగా నిట్టూర్చాడు అన్వేషి. అతని మనసులో కూడా ఏదో అలజడి పూలవాసనలన్నీ ఒక్కుమ్మడిగా దాడిచేస్తున్న పులకరింత.
ప్రేమంటే ఇదేనా? తను శృతిని ప్రేమిస్తున్నాడా? ఒక్కక్షణం తన మనసును ప్రశ్నించుకున్నాడు.
శృతి పరుగు పరుగున ముందుకెళ్ళి పాడుబడ్డ మెట్ల కానుకుని నిలబడి- "హలో.... రండి..... సార్... కమాన్" అరుస్తోంది బిగ్గరగా.
"ఏయ్.... ఎందుకా అరుపు.... అయామ్ కమింగ్" నవ్వుతూ లేచి ముందుకు పరిగెత్తాడు అన్వేషి.
మరో పావుగంట గడిచింది. ఒకప్పటి అందమైన ఆ భవనంలో ప్రస్తుతం శూన్యం నెలకొంది.
అన్వేషికి విశ్వాత్మ కారెక్టరే సరిగ్గా అర్థంకావటంలేదు. అసలిలాంటి మనిషి ప్రపంచంలో ఎక్కడైనా వుంటాడా అని అనిపిస్తోంది.
"తను మరో జన్మ ఎత్తి వచ్చి కొన్ని గుర్తులు చూసి తనే విశ్వాత్మని అని చెప్పి తను గతజన్మలో సంపాదించుకున్న ఆస్తుల్ని తన స్వంతం చేసుకుంటానంటే మన చట్టమూ, కోర్టులూ ఒప్పుకుంటాయా....?" అనడిగాడు అన్వేషి.
అతని మాటలకు శృతి చిన్నగా నవ్వింది.
ఒకింతసేపు అతని మాటల గురించే ఆలోచిస్తూ నిశ్శబ్దంగా వుండి పోయింది.
ఆ తరువాత చెప్పడం ప్రారంభించింది.
"చాలామంది మానవులు భౌతికంగా మరణించిన తర్వాత, సూక్ష్మ లోకంలో 500 నుంచి 1000 సంవత్సరాల వరకు వుంటారట. జన్మకూ జన్మకూ మధ్య ఇంత వ్యవధి వుండాలన్న నిశ్చిత నియయం ఏదీ లేదట. భౌతిక శరీరంతోగాని, సూక్ష్మశరీరంతోగాని ఒక మనిషికి కేటాయించిన జీవితకాలం, అతని కర్మానుసారంగా పూర్వనిర్ధారితమై వుంటుంది.
చావూ, 'చిన్న చావు' అనిపించుకునే నిద్ర కూడా మర్త్యులకు అవశ్యమైనవే. ఆత్మసాక్షాత్కారం పొందని జీవిని ఇవి ఇంద్రియ బంధనాల నుంచి తాత్కాలికంగా విముక్తం చేస్తాయి.
మానవుడి మౌలిక ప్రకృతి ఆత్మ కనక అతడు నిద్రలోనూ, చావులోనూ తన అశరీరత్వాన్ని పునరుజ్జీవింపజేసే జ్ఞాపికలు కొన్ని పొందుతాడట.
హిందూ పవిత్ర గ్రంథాల్లో చెప్పిన ప్రకారం అసమతులనం కర్మ నియమం- చర్యా ప్రతిచర్యలకూ, కార్య కారణాలకూ, బీజావాహన ఫలోప లబ్దులకూ సంబంధించినది ప్రతి మనిషీ తన నిసర్గిక, ధర్మ (ఋతం) వర్తనలో, తన ఆలోచనల ద్వారానూ చేతలద్వారానూ తన భవితవ్యాన్ని తానే మలుచుకుంటాడట.
తెలివిగానో, తెలివితక్కువగానో అతడు చాలనం చేసిన విశ్వశక్తులు ఒక బిందువు దగ్గర మొదలైన వృత్తపరిధి తప్పనిసరిగా ఆ బిందువు దగ్గరికే తిరిగివచ్చి వృత్తం పూర్తి అయినట్లుగా, ఆరంభ కేంద్రమైన అతని దగ్గరికి తప్పనిసరిగా తిరిగిరావాలి. ఈ ప్రపంచం ఒక గణిత సమీకరణంలా కనిపిస్తుంది.
దాన్ని ఎవరూ ఎలా తిప్పినా దానంతట అది సమతులనం చేసుకుంటుందట. నిశ్శబ్దంగానూ, నిశ్చయంగానూ ప్రతి రహస్యమూ వెల్లడి అవుతుంది. ప్రతి నేరానికీ శిక్ష పడుతుంది. ప్రతి సుగుణానికీ బహుమతి లభిస్తుంది. ప్రతి అన్యాయానికీ పరిహారం లభిస్తుంది. జీవిత సమానతల వెనక వున్న కర్మను న్యాయసూత్రంగా అవగాహన చేసుకున్నప్పుడు, మానవ మనసులో దేవుడిమీదా, మానవుడిమీదా వున్న ఆగ్రహం తొలగి పోవడానికి అది తోడ్పడుతుందట, ఇదంతా ఎమర్సన్ కాంపెన్సేషన్ ద్వారా తెలుసుకున్నాడు.
దీన్నిబట్టి విశ్వాత్మ ఆశలో, ఆకాంక్షలో ఆధ్యాత్మికమైన హేతువాదం వుందేమోననిపిస్తోంది. ఆయన చాలా ఆలోచనాపరుడు- ఆధ్యాత్మిక వాది- ఆయన నాలుగువేదాలు ఔపాసన పట్టారట. భారత, భాగవత, రామాయణ గ్రంథాల్ని ఎన్నిసార్లు అధ్యయనం చేశారో ఆయనకే తెలీదు.