Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 36


    అప్పుడు కనిపించింది నేలమాళిగ అన్వేషికి.

 

    అండర్ గ్రౌండ్ లోకి మెట్లున్నాయి.

 

    అప్పటికే అక్కడ లైట్లు వెలుగుతుండటం చూసి ఆశ్చర్యంగా అడిగాడు అన్వేషి. "మీరు స్విచ్ లేవీ వెయ్యలేదుకదా... లైట్లెలా వెలుగుతున్నాయి?"

 

    "విశ్వాత్మని మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు. లోనికి రావటానికి ఇనుప చట్రాన్ని తిప్పుతున్నప్పుడే అండర్ గ్రౌండ్ లోని జనరేటర్ ఆటోమేటిగా ఏక్టివేట్ అవుతుంది" చెప్పింది శృతి చిన్నగా నవ్వుతూ.

 

    నిశ్చేష్టుడైపోయాడు ఆ మాటలకు అన్వేషి.

 

    అండర్ గ్రౌండ్ లోకి మెట్లు దిగుతున్నప్పుడు చెప్పింది శృతి ఏదో గుర్తొచ్చినట్లు.

 

    "విశ్వాత్మ మరణించాక అతను క్యాన్సర్ తో చనిపోయారనుకున్నారంతా. కాని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియటానికి చాలాకాలం పట్టింది. విశ్వాత్మ ట్రస్ట్ వాళ్ళే సీక్రెట్ గా వుంచారీ విషయాన్ని".

 

    "విశ్వాత్మ సూసైడ్ చేసుకుని చనిపోయారా? ఇట్స్ సర్ ప్రైజింగ్!" విచిత్రంగా మెరుస్తున్న శృతి కనుబొమల వైపు చూస్తూ అన్నాడు అన్వేషి.

 

    "అవును. చాలాకాలంగా ఈ విషయమై పరిశోధనలు కూడా జరిగాయి. అంతటి కోటేశ్వరుడు ఆకస్మికంగా ఆత్మహత్య చేసుకోవటం, అప్పట్లో చాలా సెన్సేషన్ సృష్టించిందట. ఎట్టకేలకు ఆయన డైరీల ద్వారా తెలిసిందేమిటంటే-

 

    తను ఆత్మహత్య చేసుకుంటేనే- వెంటనే పునర్జన్మ ఎత్తుతాననే ఒక ప్రగాఢమైన నమ్మకమే ఆయనని ఆ పనికి పురిగొల్పిందని మనోశాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు."

 

    చెప్తూ ముందుకు నడుస్తోందామె. సగం వెలుతురు, సగం చీకట్లో నుంచుంది శృతి. పాలరాతితో చేసిన శిలాప్రతిమలా వింతకాంతితో మెరుస్తోందామె.

 

    "ప్రపంచంలోనే చాలా అరుదైన వ్యక్తిలా వున్నాడు విశ్వాత్మ" తనలో తను నెమ్మదిగా అనుకున్నాడు అన్వేషి.

 

    క్రిప్టోగ్రాఫ్ రూం విశాలంగా లేదు. అలాగని ఇరుకుగా కూడా లేదు.

 

    రూంలోని పాతకాలపు వాసన ముక్కుపుటాలకు సోకుతోంది.

 

    పొడవాటి, ఎత్తయిన పాతకాలపు కుర్చీ, దాని ముందు టేబుల్, దానిమీద కంప్యూటర్ మెషీన్. ఆ మెషీన్ ను క్షుణ్ణంగా పరిశీలించాడు అన్వేషి.

 

    కీ బోర్డ్, వెనక వున్న కనెక్షన్... అన్నీ పకడ్బందీగా వున్నాయి.

 

    కీ బోర్డ్ ని ఆపరేట్ చెయ్యటానికి కొద్దిగా ముందుకు వంగి దానిమీద చెయ్యి వేయబోయాడు అన్వేషి.

 

    మెరుపు వేగంతో ముందుకు దూకి కీ బోర్డుపై వేయబోతున్న అతని తిని గబుక్కున వెనక్కి లాగేసింది శృతి.

 

    "నో మిస్టర్ అన్వేషీ! హయ్యర్ అథారిటీ పర్మిషన్ లేనిదే మీరు కీ బోర్డును ఆపరేట్ చేయటానికి ఏమాత్రం వీల్లేదు" అంది శృతి.

 

    చిరుకోపం వచ్చింది అన్వేషికి.

 

    చివాలున తలతిప్పి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ కళ్ళు నిర్మలంగా వున్నాయి.

 

    తన కుడిచేయి ఆమె చేతిలో వుండటం గమనించాడు అన్వేషి. ఆ చేయి మెత్తగా వుంది. ఆ స్పర్శ కొత్తగా వుంది.

 

    "సారీ! మీకు కోపం వచ్చిందా...?" చేతిని వెనక్కి తీసుకుంటూ అంది శృతి.

 

    "దేనికి? మీ చెయ్యి మీరు తీసుకుంటే నాకెందుకు కోపం?" ఆమె వైపు నవ్వుతూ చూస్తూ అన్నాడతను.

 

    ఆ విషయం అతను గమనించలేదేమోనన్న భ్రమలో వున్న శృతి మనసులోనే సిగ్గుపడింది. మనసులో సిగ్గుపడినా, మౌనంగా సిగ్గుపడినా, ఆడవాళ్ళు సిగ్గును కానీ, కోపాన్నిగానీ దాచి వుంచలేరు. అలాగే ప్రేమను కూడా.

 

    ఆమె ఏదో అనబోయింది గానీ ఎందుకనో మాటలు రాలేదు. వారు వచ్చి ఇరవై అయిదు నిముషాలు గడిచాయి.

 

    రకరకాలుగా విశ్వాత్మ పనుల్ని ఎనలైజ్ చేస్తున్నాడు అన్వేషి. అక్కడున్న పరిస్థితికి అన్వేషి అంచనా సరయినదేననిపించింది ఆమెకు. వాచీవైపు చూసుకుంటూ "వెళదామా?" అంది శృతి.

 

    అన్వేషికెందుకో అక్కడనుంచి వెళ్ళాలని లేదు. మెట్లవైపు దారి తీసింది శృతి. మెట్లు ఎక్కుతున్న అన్వేషి ఒక పక్కకు కాస్త కుంటుతున్నట్లు నడవటం గమనించిన శృతి ఆశ్చర్యపోయింది.

 

    "ఏమిటలా నడుస్తున్నారు?" ప్రశ్నించింది.

 

    "బైక్ కిక్కిచ్చినప్పుడు కుడికాలు కాస్త స్లిప్ అయింది. ఆ పెయిన్ ఇప్పుడు తెలుస్తోంది" చెప్పాడు అన్వేషి.

 

                                   *    *    *    *

 

    ప్రేమంటే నీ మనసు గురించి నువ్వు తెలుసుకోవడం కాదు- ఎదుటి మనసులోని లోతుల్ని గుర్తించడం కూడా. ఎప్పుడో, ఎక్కడో చదివిన ఆ వాక్యం చప్పున ఆ సమయంలో గుర్తుకు వచ్చింది శృతికి.

 

    సాయంకాలం ఆరుగంటలు దాటింది.

 

    జూబ్లీహిల్స్ ఎత్తుపల్లాల రోడ్లమీద చల్లని గాలి కూడా వంపులు తిరుగుతూ పరుగెడుతోంది.

 

    అటూ ఇటూ దట్టమైన చెట్ల మధ్యలోంచి కారు ముందుకు దూసుకుపోతోంది.

 

    స్టీరింగ్ వైపు చూడకుండా సూటిగా రోడ్డువైపు చూస్తూ డ్రైవ్ చేస్తున్న అన్వేషిని, గాలికెగురుతున్న అతని జుత్తుని చూస్తోంది శృతి- ఆ చూపుల్ని మిర్రర్ లోంచి గమనిస్తున్నాడు అన్వేషి.

 

    "ఎక్కడకు వెళ్తున్నాం మనం? నన్ను ఎక్కడకు తీసుకువెళుతున్నారు?" నెమ్మదిగా అడిగింది శృతి.

 

    "నేనెక్కడకు వెళ్తే మీరక్కడకు వస్తానన్నారు కదా?"

 

    "అలాగని చెప్పాచెయ్యకుండా ఎక్కడికో తీసికెళ్ళిపోతానంటే ఎలా?" నవ్వుతూ అంది శృతి.

 

    "కొత్తగా ఎక్కడకు తీసుకెళుతున్నాను. ఇక్కడ అన్నీ మీకు తెలిసిన రోడ్లే కదా" అన్నాడతను.

 

    "రోడ్లన్నీ తిప్పి తిప్పి కొండల్లోకి తీసుకెళుతున్నారు. కొండల్లో కెందుకూ?" అనడిగింది.

 

    "ఎందుకంటే...ఏం చెప్పాలి? ఏకాంతం కోసం"

 

    "కాంతలు పక్కనుంటే ఏకాంతం ఎలా అవుతుంది. గందరగోళం అవుతుంది" మరింతగా నవ్వుతూ అంది.

 

    "కొంతమంది అమ్మాయిలు పక్కనుంటే, ఏకాంతానికి అందం వస్తుంది" అన్నాడు అన్వేషి.

 

    "ఏకాంతం తాలూకూ అందం మీకు తెలుసన్నమాట. చెప్పరేం... మిమ్మల్ని చూసి అమాయకులనుకున్నాను. ఎవరెవరితో ఏకాంతంగా ఎక్కడెక్కడ గడిపారో చెప్పకూడదూ... ఆనందిస్తాను" ఆమె చున్నీ ఎగిరి అతని భుజమ్మీద పడింది.

 

    అన్వేషి ఏం మాట్లాడలేదు.

 

    మరో మూడు నిమిషాలు గడిచిన తర్వాత, కారు ఓ కొండపక్కకెళ్ళి ఆగింది. దూరంగా ఎండిపోతున్న చిన్న చెరువు, ఆ చెరువుకి దక్షిణం వైపున కూలిపోతున్న పాతకాలపు కట్టడం.

 

    కారులోంచి బయటకు దిగి ఒళ్ళు విరుచుకుంటూ నలువైపుల పరికించి చూశాడు.

 Previous Page Next Page