అంతేకాదు- ఉపనిషత్తుల్ని పుక్కిట పట్టారని చెబుతారు. బుద్ధభగవానుడు ఆయనకు ఆరాధ్యదైవం.
బుద్ధుడు తిరిగి, తిరిగి జన్మిస్తున్నాడనే ఆధ్యాత్మిక నమ్మికే- ఆయనలో పునర్జన్మ అలోచనల్ని రేకెత్తించి వుండవచ్చు. '....శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి' ని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినదాన్ని అక్షరసత్యంగా నమ్ముతారు బౌద్ధులు. శాక్యవంశంలో జన్మించి అహింసను ప్రబోధించి నిర్యాణం చెందిన సిద్ధార్ధుడు తిరిగి తిరిగి జన్మిస్తూనే వుంటాడని వారి విశ్వాసం. 'బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్త్వుడు 'ఫలానా జన్మనెత్తాడు' అంటూ ప్రారంభమయ్యే జాతక కథలు వారి విశ్వాసాలను చాటి చెబుతుంటాయి.
బోధిసత్వుని దయాస్వరూప అవతారం అవలోకితేశ్వరుడు- తదుపరి జన్మలో దలైలామాగా రూపుదాల్చాడనీ, దలైలామా కూడా పునర్జన్మ ఎత్తుతూనే వుంటాడనీ బౌద్ధుల నమ్మకం.
ఒక దలైలామా మరణానంతరం అతని పునరవతరమను గుర్తించి తిరిగి అతడు ఎక్కడ జన్మించిందీ వెతికి పట్టుకోవడం బౌద్ధుల ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో చాలా ముఖ్యమైనది.
దలైలామాల పరంపరలో ఐదో దలైలామా గురువైన లోబ్ సాంగ్ చోక్యిగ్యాల్ త్సేన్ జ్ఞానసంపన్నుడిగా పేరుపొందాడు. ఐదో దలైలామా, ఆయనను అవధులులేని ప్రకాశరూపుడైన బుద్ధుని అవతారంగా తెలియజేసి, ఆయన తిరిగి పంచన్ ఎర్దేని అనే పేరుతో పుడతాడని ప్రకటించి ఆయనను టిబెట్ లోని ముఖ్యనగరమైన షిగేట్స్ లోని- తాషిల్ హుంపో మఠాధిపతి చేశాడు. అప్పటినుంచీ తాషిల్ హుంపో- పంచన్ లామా పీఠంగా పేరు పొందింది. దలైలామాలాగే పంచన్ లామా కూడా పునర్జన్మ నెత్తుతాడని బౌద్ధుల ఉవాచ.
"ఈ విశ్వాసాన్ని కొన్ని కోట్లమంది నమ్మారు. నమ్ముతున్నారు. సైన్స్ కి అందిందే నిజమని నమ్మలేం. ఎందుకంటే ఇప్పటివరకు కనుగొన్న శాస్త్రవిజ్ఞానం మహాసముద్రంలో ఓ చిన్న నీటిబొట్టులాంటిదే" అంటూ చెప్పడం ఆపింది శృతి. ఎక్కడో ఆలోచిస్తున్నట్లుగా అరమోడ్పు కనులతో.
ఆమెలో నిక్షిప్తమై వున్న ఆధ్యాత్మిక లోతుల గురించి మొదటిసారిగా తెలుసుకున్న అన్వేషి దిగ్భ్రాంతికి గురయ్యాడు. విశ్వాత్మ ఫౌండేషన్ లో పనిచేసే ప్రతివారిలోనూ పునర్జన్మపట్ల అపారమైన నమ్మకం ప్రోది చేసుకొనుంది. అంటే- వీరిపై విశ్వాత్మ నమ్మకాలు ఎంత బలంగా పనిచేస్తున్నాయో?!
"ఇంతకీ మనం వర్తమానంలోకొస్తే- మనచుట్టూ పరిసరాల గురించి మాట్లాడుకోవచ్చు. ఈ బిల్డింగు గురించేనా మీరు వర్ణించి మహాకవి కాళిదాసు టైపులో చెప్పారు. ఏం వుందిక్కడ. తుప్పలు.... డొంకలూ... అంతులేని నిశ్శబ్దం. అంతేగా?"
"మిస్ శృతీ! సీరియస్ గా మీకో చిన్న విషయం చెప్పనా?" అన్నాడు అన్వేషి.
"మళ్ళీ కవిత్వమా మహానుభావా! కాళిదాసు టైపులో చెప్పకుండా, వేటూరి సుందరరామ్మూర్తి టైపులో చెప్పండి. నేను అర్థం చేసుకొంటాను."
ఆమె వ్యంగ్యాన్ని అతను పట్టించుకోలేదు.
"ఒకప్పుడు కళకళలాడే ఆ బిల్డింగులో అప్పుడున్నది నిశ్శబ్దమే. తుప్పలూ, డొంకల మధ్య ఇప్పుడున్నదీ నిశ్శబ్దమే. దీనర్థం ఏమిటో తెలుసా.... ప్రేమంటే, ఎవరూ ఛేదించలేని అంతులేని ఓకే మధురమైన నిశ్శబ్దమని..." అంటూ చెప్పాడు.
ఆ మాటకు మనిషంతా ప్రశ్నార్థకంగా అయిపోయింది శృతి. ముందుకెళ్తూ, వెళుతూ వెనక్కి తిరగబోయి, కెవ్వున అరిచిందామె. అకస్మాత్తుగా ఆమె అరిచిన అరుపుకి అతను బిత్తరపోయి, ముందుకెళ్ళాడు కంగారుగా.
చీకట్లో వున్న గబ్బిలాలు ఒక్కసారిగా పైకి రావడం వల్ల ఆమె అరిచింది.
గబ్బిలాల్ని చెదరగొట్టడానికి ముందు కురికిన అన్వేషి ఎగుడుదిగుడు మెట్లమీద నుంచి జారిపడ్డాడు.
కిందంతా బండరాళ్ళు. ఆ బండరాళ్ళమీద అతను తుళ్ళిపడిపోవడం... నుదుటికి బలంగా దెబ్బ తగలడం... ఏదో తెలియని మగత అతన్ని ఆవహించటం, అతను స్పృహ తప్పి పడిపోవటం అంతా క్షణాల మీద జరిగి పోయింది.
"అన్వేషీ... అన్వేషీ...." బిగ్గరగా, భయంగా అరుస్తూ శృతి అతని దగ్గరకు పరుగుతీసింది.
అకస్మాత్తుగా అక్కడేర్పడిన కలకలానికి గుడ్లగూబలు మరింతగ రొద చేయడం ప్రారంభించాయి.
అప్పటికి దట్టంగా చీకటి అలుముకుంది.
* * * *
వనస్థలిపురానికి యాభై గజాల దూరంలో రోడ్డుకి కుడివైపున మామిడితోట మధ్య వుందా బిల్డింగ్. చీకటిని తరిమేసి సింహాసనం అధిష్టించిన నియంతలా, రాజఠీవితో వెలిగిపోతుందా భవనం. హైద్రాబాద్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పారిశ్రామికవేత్తల్లో ఒకడైన ఫణివర్మదా భవనం.
ఫణివర్మ రోమ్ నగరంలోని కూడలిలో నిలబెట్టిన ఎర్రరాతి శిల్పంలా వుంటాడు.
కండలు దీరిన శరీరం, వత్తయిన రింగు రింగుల జుత్తు, వెడల్పాటి నుదురు, ఆ నుదురుకి తగ్గట్టు కళ్ళు, డొప్ప చెవులు, బండముక్కు, బండ పెదాలు, పొడవాటి కాళ్ళూ, చేతులు. అతన్ని చూడగానే అసహనంతో కొట్టుమిట్టాడుతున్న వాడిలా వుంటాడు.
తోటంతా నిశ్శబ్దాన్ని కప్పుకుని చీకట్లో వుంది. బిల్డింగులో సగం దీపాలే వెలుగుతున్నాయి.
తోటకూ, బిల్డింగుకీ మధ్య నీలపు సరోవరం లాంటి స్విమ్మింగ్ ఫూల్, పక్కన విశాలమైన ఛైర్ లో ఈజీగా కూర్చున్నాడు ఫణివర్మ.
అతనికి 30 ఏళ్ళుంటాయి. ఛెయిర్ ముందు టీపాయ్ మీద విదేశీ డ్రింకు సగం ఖాళీ అయివుంది. మంద్రంగా వస్తున్న జిప్సీ, వయొలెన్స్ మ్యూజిక్ ను వింటూ నాలుగో రౌండ్ లో వున్నాడతను.
దూరంగా మిణుకు మిణుకుమంటూ కనిపిస్తున్న లైట్లకాంతి అతని మెదడులోని ఆలోచనలను రాజుకునేలా చేస్తోంది. సరిగ్గా అదే సమయంలో లోనెక్కడో వాల్ క్లాక్ లోంచి పియానో సంగీతపు ధ్వనిలోంచి పదకొండు గంటలు విన్పించాయి.
ఛైర్ లోంచి లేచాడు ఫణివర్మ. అసహనంగా దూరంగా కనిపిస్తున్న గేటువైపు చూశాడు.
సరిగ్గా అదే సమయంలో బిల్డింగ్ గేటుముందు బ్లాక్ అంబాసిడర్ కారొచ్చి ఆగింది.