నందిని భగ్గుమంది.
కోపంగా ప్రశాంత్ వేపు చూసింది.
"ఏంటి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావ్.....? నీ స్థాయేమిటో తెలుసా....? ఆఫ్ట్రాల్ నువ్వో లైట్ బాయ్ వి..... తారతమ్యం లేకుండా పెట్రేగిపోతే డొక్క చీరేస్తాను" అన్నాడు ప్రశాంత్ భవానీ మీదకొస్తూ,
"ఏది.....చీరు.....చూస్తాను..... వృత్తిమీద గౌరవంలేని మీరంతా ఏక్టర్స్....ఆర్టిస్టులు..... బ్లాక్ మెయిల్ చేయటానికి సిగ్గులేదు" భవానీ తగ్గలేదు.
ఏం జరగబోతోందో అని అందరూ ఊపిరి బిగబట్టి భయంగా చూస్తుండగా ఆ ప్రాంతానికి శిరీష్, నారాయణ్, టాగూర్, అనిల్ వచ్చారు.
ప్రశాంత్ పర్సనాలిటీ, బలం ముందు భవానీ నిజానికి నిముషామైనా నిలబడలేడు - కాని తనకి హంపీ మీదున్న గురుభావం, కృతజ్ఞత అతన్ని ఆవేశపరుస్తున్నాయి.
ప్రశాంత్ కోపంగా భవానీ చొక్కా పట్టుకున్నాడు.
భవానీ మొఖం ఆవేశంతో, అవమానంతో ఎర్రబడింది.
కుడిచేతిని పిడికిలిగా బిగించి ప్రశాంత్ డొక్కలో పొడిచాడు.
ఊహించని భవానీ ఎటాక్ కి ప్రశాంత్ తూలిపడి, క్షణాలలో తేరుకొని ముందుకుదూకి భవానీ జుత్తుని దొరకబుచ్చుకున్నాడు.
"ఎంతన్యాయం.....? డైరక్టర్ ప్రొడ్యుసర్ ఒక స్త్రీ అనే గదా ఆ ఆర్టిస్టులకంత లోకువ..... లోకేషన్ లోకొచ్చి డబ్బుఇస్తే తప్ప నటించమని పట్టుబడతారా.....? స్టుపిడ్స్" అంటూ శిరీష ప్రశాంత్ కి అడ్డంగా వెళ్ళింది.
"నువ్వెవరు మధ్యలో....! అడ్డు తప్పుకో - లేదంటే ముందు నీ మీద చేయి చేసుకోవాల్సి వస్తుంది" అన్నాడు ప్రశాంత్ శిరీషకేసి కళ్ళురుముతూ చూస్తూ.
భవానీ గింజుకుంటున్నాడు ప్రశాంత్ పట్టునుంచి తప్పుకొనేందుకు.
"నీకేం తెల్సని నువ్వొచ్చావ్ మధ్యలో....?" నందిని శిరీష మీద ఎగిరిపడింది.
"నాకన్నీ తెలుసు..... మీ బుద్ధి..... వాళ్ళ అవసరం.... నీ నటనకూడా తెలుసు. నీ మాత్రం నటనా అవకాశం వస్తే నేనూ చేయగలను - మర్యాదగా ఆ కుర్రాడ్ని వదిలేయండి" అంది శిరీష కోపంగా.
జనరేటర్ కి ఆవలప్రక్కనున్న హంపీ, ప్రొడక్షన్ మేనేజర్ చేష్టలు దక్కినిల్చుండిపోయారు శిలాప్రతిమల్లా.
భవానీ నువ్వాగిపో" భవానీవేపు తిరిగి అని ప్రశాంత్ వైపు చూస్తూ "ఏంటిసార్ ఇదంతా....? లోకేషన్ లో ఇలాంటి చిల్లరపనులు చేస్తే చూట్టానికి అసహ్యంగా ఉండదా....?" అన్నాడు విల్సన్ షాక్ నుంచి తేరుకొని ముందుకొస్తూ.
జనరేటర్ వ్యాన్ కి ఆవలి ప్రక్కన ఏదో జరుగుతోందని గ్రహించిన మిగతా యూనిట్ సభ్యులు ఒక్కొక్కరే అటుకేసి రాసాగారు హడావిడిగా.
"డబ్బులివ్వలేకపోగా....?" గొడవేమిటి..... నందిని సీరియస్ అయి పోయింది.
ఆమె మాటలకు అందరూ షాక్ తిన్నారు.
"అసలు చేసిందంతా మీరు- ఇప్పుడు ఎవరో చేసినట్లు మాట్లాడతారేం...? పైలట్ షూటింగ్ అయిపోగానే ఇస్తామని చెప్పాంగదా.....?" ప్రొడక్షన్ మేనేజర్ అర్ధిస్తున్నట్లుగా అన్నాడు.
చుట్టప్రక్కల ఇళ్ళలోని జనాలు ఈ గొడవ వినిపించటంతో బయటకొచ్చి చూడసాగారు.
హంపీకి తలకొట్టేసినట్లయింది.
హఠాత్తుగా ఆ ప్రాంతంనుంచి అదృశ్యమైపోతే బావుండని కోరుకుంటోంది.
ఆమె ఎంత కాలంగానో కోరుకుంటున్న అనిల్ ఆ జనరేటర్ కి ఆవలి ప్రక్కనే ఉన్నట్లు- ఆమెకి తెలీదు. పులిమీద పుట్రలా ఇదో సమస్యని ఆమె కృంగిపోయింది.
"నేనే డైరెక్టర్ ని అయితే నిన్నీపాటికి పీకి పారేసేదాన్ని - సంస్కారం పుట్టుకతోనైనా రావాలి-లేదా పుట్టి బుద్ధేరిగాక నేర్చుకోనన్నా నేర్చుకోవాలి....ఛీ....ఛీ...." అంది శిరీష ప్రశాంత్ చేతుల్లో ఇరుక్కొని ఉన్న భవానీ జుత్తుని విడిపించేందుకు ప్రయత్నిస్తూ.
"నువ్వు మా మధ్య నుంచి తప్పుకోకపోతే ముందు నీ పని పట్టవలసి వస్తుంది" అనంటూ ప్రశాంత్ శిరీషని ఒకచేత్తో ఎడంగాతోసే ప్రయత్నం చేసాడు.
ప్రశాంత్ తన భుజం మీద చేయివేసి నెట్టడంతో శిరీష బ్యాలన్స్ తప్పి ఒకడుగు ముందుకు తూలింది.
అప్పటివరకు మౌనంగా చూస్తున్న టాగూర్ బృందంలో చలనం వచ్చింది.
"పరిస్థితి చేయిదాటిపోయేలా ఉంది. మనం కల్పించుకోక తప్పదు. పదండి" అంటూ టాగూర్ కదిలే ప్రయత్నం చేస్తుండగా అతని భుజం మీద అనిల్ చేయి పడింది.
దాన్ని తనను ఆగిపోమన్నట్లుగా అనిల్ కోరుకుంటున్నాడని అర్థం చేసుకున్న టాగూర్ "నువ్వోపిరికివాడివి- మమ్మల్నెందుకు ఆపుతావ్....? మన వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు కూడా ఆదుకోకపోతే మనకే మాత్రం పౌరుషం, మానాభిమానాలు లేనట్లు లెఖ్ఖ.....నువ్వుండిపో కావాలంటే" అంటూ టాగూర్ అనిల్ చేతిని విసురుగా తోసిపడేసి ముందుకు వెళ్ళబోతుండగా అనిల్ మరింత గట్టిగా టాగూర్ భుజాన్ని పట్టుకొని ఆపాడు.
అనిల్ ప్రవర్తన టాగూర్ కి, నారాయణ్ కి ఆశ్చర్యం కలిగించటమే కాక అసహ్యాన్ని కలిగించింది.
అప్పటికే భవానీని క్రిందపడేసాడు ప్రశాంత్.
నిజానికి ప్రశాంత్ అంత దుర్మార్గుడేంకాదు- తన భవిష్యత్ నందిని చేతుల్లో ఉండటం-నందిని చేతిలో స్టార్ మేకర్ సుశీల్ కుమార్, దశరథ ఉండటంతో తన భవిష్యత్ కోసం, నందినిని సంతృప్తిపరచక తప్పలేదు. ఒకసారి తిరగబడ్డాక భవానీ కుర్రచేష్టలు చేస్తున్నట్లుగా ఫీలయ్యాడు.
ప్రశాంత్ కాలులేపి భవానీ గుండెలమీద వేస్తుండగా ఒక అద్బుతం జరిగిపోయింది.
అప్పటివరకు స్తబ్ధుగా ఉన్న అనిల్ ఒక్కసారి పెనుతుఫాన్ లా దూసుకు వచ్చి ఎగిరి ప్రశాంత్ గుండెలమీద తన్నాడు.
కళ్ళెదుట ప్రత్యక్షంగా అంతా కనిపిస్తున్నా, ముందు అనిల్ చర్య ఎవరికీ జీర్ణం కాలేదు.
షాక్ నుంచి తేరుకొని ఏం జరిగిందని ఎవరికి వాళ్లు సమీక్షించుకొనే లోపే ప్రశాంత్ లేచి అనిల్ మీద తిరగబడ్డాడు.
శిరీషయితే శిలాప్రతిమయిపోయింది..
ప్రపంచవింతను చూస్తున్న విభ్రాంతికి లోనయింది....
కాని అనిల్ ఆవేశం వెనుక అవమానాలు, ఫ్రస్టేషన్, నిస్సహాయత, న్యూనతాభావం, అనంతమైన బాధ, కసి, కోపం, దాగున్నాయి. అందుకే చూస్తుండగానే అనిల్ ఆవేశం ముందు ప్రశాంత్ తలవాల్చేశాడు.
అప్పటికే తేరుకున్న హంపి, భవానీ, విల్సన్ గిన్నిస్ బుక్ లోని వింతలన్నింటిని ఒక్కసారి చూసిన ఆనందోద్వేగానికి గురయ్యాడు.
తామెవరికోసమైతే అన్వేషిస్తున్నారో, ఎవరికోసమయితే ఆతృత చెందుతున్నారో.....ఎవరిమీదయితే ఆశలు పెట్టుకున్నారో ఆ వ్యక్తి అనుకోకుండా ఎదురుపడటమే కాక- తమ మనిషికి జరిగిన అవమానాన్ని ఎదుర్కొంటున్నాడు..... ఇది కలా? నిజమా....? నిజమే అయితే ఇంత అద్భుతమైన యాదృచ్చికమా....?!!
"చిన్న పిల్లాడి మీద కాదు నీ సాహసాన్ని ప్రదర్శించేది-దమ్ముంటే నాతో పోటీపడి గెలుపు..... ఆఫ్ట్రాల్ పదివేల కోసం బ్లాక్ మెయిల్ చేస్తారా.....? మీ కసలు మనవత్వముందా....?" అని అనిల్ అంటుంటే టాగూర్, నారాయణ్ శిరీషకు మతులుపోయాయి.
"ఏదో మీ మధ్య రాజీకుదర్చటాని కొచ్చిన మాఫ్రెండ్ మీద ఒక స్త్రీ అని కూడా చూడకుండా చేయిచేసుకుంటావా....? నవరసాల్ని పోషించే నటుడిలో కనీసం కొన్నయినా ఉండాలి...." చొక్కాని దులుపుకుంటూ అన్నాడు అనిల్.
పిడిగులా హఠాత్తుగా మీదపడిన అనిల్ ని చూసి ప్రశాంత్ భయపడిపోయాడు. అతనికేం చేయాలో తోచలేదు. నందిని అయితే భయంతో బిగుసుకుపోయింది.
కొద్ది క్షణాలు గడిచాయి.
వాతావరణంలో యుద్ధం తరువాత అలుముకొనే ప్రశాంతత అలుముకుంది.
అప్పుడు ఆలోచనలు, విచక్షణా మొదలయ్యాయి అందరిలో. "ఇంత జరుగుతున్నా చూస్తూ అడ్డు రాలేదు- అంటే ఏమిటి మీ ఉద్దేశం- మీ నటీనటుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు లేదనేగా మీరు భావించేది.....? ఇలా అయినప్పుడు మేం నటించాల్సిన అవసరం మాకులేదు. మేం చేసిన తప్పేమిటి....? డబ్బు అడిగాం-అంతేగా....దానికింత రభస చేస్తారా....!" నందిని కోల్పోయిన ధైర్యాన్ని తిరిగి తెచ్చుకుంటూ అంది.
"ఆవేశం చల్లారాక ఆలోచనలు మొదలయ్యాయా....? డబ్బు అడగటం తప్పని అనలేదే....! కానీ సమయంలో డబ్బు ఇవ్వందే మొఖాలకి మేకప్ వేసుకోనంటే దాన్నెలా అర్థంచేసుకోవాలి....? బ్లాక్ మెయిల్ అనేగా...? మీ అవసరం మాకుందనేగా....?" హంపీ ముందుకొస్తూ కోపంగా అంది.
"వీళ్ళతో మనకేమిటి మేడమ్.....ఎథిక్స్ లేని మనుష్యులు....వీళ్ళను పీకి పడేసి వేరే వాళ్ళను పెట్టుకుంటేగాని వీళ్ళకు బుద్ధిరాదు" భవానీ చెదిరి పొయిన జుత్తును సరిచేసుకుంటూ అన్నాడు.
నందినీ భవానీవేపు మ్రింగేసేలా చూసింది.
"ఎందుకలా కోపంగా చూస్తారు....? భవానీ ఎందుకు ఆవేశపడ్డాడు....? మిమ్మల్ని నమ్మి నటిస్తే మీ దగ్గరేముంటుంది ఇవ్వటానికి బూడిదా..... అని మాటలయితే తేలిగ్గా అనేసారు..... మాకెంత బాధగా ఉంటుంది మా ఆర్ధిక స్థోమతును ప్రశ్నిస్తే...? ఇప్పటికీ మిమ్మల్ని మా మేడమ్ నాలుగుసార్లు కొని అమ్మగలదు. మాటలు మాకూ తెలుసు-మేమూ అనగలం" విల్సన్ కోపంగా అన్నాడు.
"అవసరం మీది.... అనవసరంగా మాటలంటే ఊరుకోం- మా బాగ్రౌండ్ మీకు తెలీదేమో.... మేం తలుచుకుంటే మీకు స్పాన్సరర్స్ దొరక్కుండా చేయగలం, ఆ మాటకొస్తే అసలు ఈ సీరియలే దూరదర్శన్ లో రాకుండా చేయగలం.....ఇన్ని మాటలనవసరం- మేం అడిగిన డబ్బు మాకు పడేస్తే ఈ రోజు షూటింగ్ జరుగుతుంది. లేదంటే పేకప్ చెప్పుకోవలసి వస్తుంది" నందిని క్రిందపడినా తన చేయే పై నుండాలన్న బింకాన్ని ప్రదర్శిస్తూ అంది.
"షూటింగ్ జరగదా....?" శిరీష కల్పించుకుంటూ అంది.
"అవును జరగదు....." ప్రశాంత్ అరిచినట్లుగా అన్నాడు.
"ఒక్క ఐదు నిముషాలు టైమివ్వండి" అంది హంపి ప్రక్కకు వెళ్తూ.
నందిని గర్వంగా తలెగురవేస్తూ నవ్వింది.
హంపి లొంగివచ్చినందుకు ప్రశాంత్ రిలాక్సయ్యాడు.
హంపి ప్రక్కకు వెళ్ళి విల్సన్ కి కబురుపెట్టింది.
ప్రశాంత్, నందిని అక్కడే ఉన్న కుర్చీల్లో కూర్చుని రిలాక్సయ్యారు.