"ఇంత జరిగాక ఇంకా అలా ఊరుకొంటున్నారంటే నాకే అవమానంగా ఉంది" టాగూర్ మెల్లగా అన్నాడు నారాయణ్ తో.
"అవునుగాని - అసలు మనం చూసింది కలా? నిజమా....? మన అనిల్ గాడేమిటలా పూనకం వచ్చినవాడిలా అలా విరుచుకుపడ్డాడు....? వాడు వాడేనా....? అంత పిరికివాడు.... నాకంతా అయోమయంగా ఉంది...." అన్నాడు నారాయణ్ కళ్ళు తేలవేస్తూ. వీళ్ళలా ఉండగా నందినీ ప్రక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్ళి దశరథ ఫోన్ చేసి - దశరథ ప్రశంసలు అందుకొని ఫోన్ పెట్టేసింది.
* * *
"మీకు మాగొప్ప ఎవేర్ నెస్ ఉందండి" బ్రహ్మానందం అప్పుడే ఫోన్ మాట్లాడి దాన్ని క్రెడిల్ చేస్తున్న దశరథతో అన్నాడు.
"ఎవేర్ నెస్సా....? అదేమిటో తరువాత చెబుదూగాని - ఇప్పుడు ఫోన్ చేసిందెవరో తెలుసా....? నందిని"
"మరలా ఎవరికొంపకు ఎసరుపెట్టింది మహాతల్లి....?"
"హంపీ కొంపకు" అంటూ నందిని ఎలా హంపీని ఇరుకున పెట్టింది చెప్పాడు దశరథ.
"ఐదు నిముషాలు టైమ్ అడిగారా....?"
"అవును - అడక్కేం చేస్తుంది....?"
"అంత ఆనందపడిపోకండి.... క్షణాల్లో చరిత్రలు తిరగబడిన సంఘటనలు చాలా ఉన్నాయి"
"సర్లే..... ఎవరి చరిత్ర తిరగబడుతుందో తరువాత నీకే తెలుస్తుంది. ఇందాకేదో ఎవేర్ నెస్ అన్నావ్...?"
"అదా..... సామాజిక స్పృహ.....మీకు బోఫోర్స్, ఎయిర్ బస్ - 320 నుంచి, గుంటూరు జిల్లా వరద నిధులెలా మాయమయిపోయాయో కూడా తెలిసాయంటే మీకు సామాజిక స్పృహ బాగానే ఉందని నాకర్ధమయింది. కాకపోతే మీరే స్పృహలో ఉండరు...." బ్రహ్మానందం వాపోతూ అన్నాడు.
"ఊరకే కబుర్ల చెప్పకురా..... ఈ మధ్య ప్రతివాడికీ సామాజిక స్పృహ సామాజిక స్పృహని అరవటం ష్యాషనయిపోయింది - ఆ అరిచే వాళ్ళు సమాజానికేం చేసారో చెప్పమను- వాళ్ళ ఆదాయంలోంచి ఐదు పైసలు సమాజ శ్రేయస్సుకి ఖర్చుపెట్టారేమో అడుగు..... అరవటానికేముంది.... ఖర్చాపాడా....? ఐదుపైసలు ఖర్చుపెట్టవలసి వచ్చినప్పుడే అసలురంగు బయటపడేది. ఐదు పైసలు సమాజనికి ఖర్చు పెట్టకుండా సామాజికస్పృహ..సామాజిక స్పృహంటూ ణా ముందెవరన్నా అరవనీ చెప్పుతీసుకుకొడతాను....
సామాజిక స్పృహని, మాకాలంలో ఇలాకదాని, ఈ తరాలు పాడయిపోయాయని - మారోజుల్లో అంటూ ప్లాష్ బ్యాక్ ల గురించి చెప్పేవాళ్ళను కూడా తరిమితరిమి కొట్టాలి. నేటితరాలకు వాళ్ళకాలమేగా పునాది -వీళ్ళేదో అప్పట్లో పొడిచేసినట్లు పెద్దగొప్పలు..... బడాయి కబుర్లు.... అలా చెప్పుకొనే అర్హత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగధను లకు మాత్రమే ఉంది - ఈ మధ్య కాలంలో ప్రతి ముసలివాడికి నేటి తరాల్ని తిట్టడం కూడా పెద్ద ఫ్యాషనయి పోయింది. వీళ్ళు అప్పట్లో ఏం ఊడబొడిచారో..... దాని మూలంగా సమాజానికి, దేశానికేం మేలు జరిగిందో చెప్పమని విలదీస్తేసరి చల్లగా జారుకుంటారు.... "చిరాకు పడ్డాడు దశరథ చుట్ట వెలిగించుకుంటూ.
"అబ్బ.... ఎన్నాళ్ళకి కొన్ని నిజాలు మాట్లాడారండి..... శెభాష్.... ఈ విషయాల్లో మాత్రం మీతో ఏకీభవిస్తున్నాను....." అంటూ బ్రహ్మానందం చప్పట్లు కొట్టాడు.
"నాకూ నిజాలు తెలుసురా..... నాకూ అప్పుడప్పుడు నిజాలు మాట్లాడాలనే అనిపిస్తుంది. భారతదేశంలోని రాజకీయవేత్తలు తొంభై శాతం యాభైఏళ్ళకు పైబడినవాళ్ళేగా.....? వాళ్ళ తప్పుడు విధానాల మూలంగానే గదా నేటితరాలు కష్టాలపాలవుతున్నది - అదెవరన్నా ఆలోచిస్తున్నారా.....? ప్రతి అడ్డమైనవాడు నేటి యువతను విమర్శించటమే .....ఇప్పటి నిరుద్యోగం, ఆకలి, పేదరికం సమస్యలు, కష్టాలు అప్పుడున్నాయా....? అప్పుడింత జనాభా ఉందా.....? దేశ వనరులపై ఇప్పుడున్న ఒత్తిడి అప్పుడుందా....? ఇప్పుడున్న లంచగొండితనం, స్వార్థం, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు అప్పుడున్నాయా....? వాళ్ళేగా నేటి తరాలకు భవిష్యత్ లేకుండా చేసింది..... నేటి బాలలే రేపటి పౌరులని, నేటి యువతీయువకులే రేపటి నాయకులని యువతను మభ్యపెట్టడం బాగా అలవాటయిపోయింది. ఏమిటి..... ఏమిటి వాళ్ళు నేటి తరానికి అందించిన భవిష్యత్....? అప్పుల ఊబి....అష్టకష్టాలతో నెగ్గుకురాలేని భవిష్యత్..... యువత చేతుల్లోనే దేశ భవిష్యత్ అంటూ దేశాన్ని బాగుచేయాల్సిన బాధ్యతను యువత భుజాలపై వేసి వాళ్లు తప్పించుకోవటం - దేశాధికారం, దేశవనరులు, నిధులు అన్నీ ఉండేది వాళ్ళగుప్పిట్లో - వాటినడ్డం పెట్టుకొని అనుభవించేది వాళ్లు - కాని దేశాన్ని, దేశ భవిష్యత్ ని తీర్చిదిద్దవలసింది మాత్రం నిస్సహాయతలో మ్రగ్గిపోతున్న యువత..... ఎంత న్యాయం....? గుర్రపుకళ్లెం మాత్రం వాళ్ళచేతుల్లో ఉంటుంది - గుర్రపు వేగాన్ని మాత్రం యువత పెంచాలి - హారిబుల్ బాస్టర్డ్స్... ఎప్పుడో ఒకప్పుడు యువత తిరగబడుతుంది - నీతులు వల్లేవేసే వృద్ధజంబుకాల పనిపడుతుంది - ఒరేయ్ బ్రహ్మానందం .... నేను తప్పుడు పనులు చేసేవాడ్నే - కాదనటం లేదు. కాని నాకూ వాస్తవాలు తెలుసురా..... నాకు మంచిదారి తెలీకకాదు అడ్డదారి తొక్కింది..... అడ్డదారిలో ప్రయాణిస్తేనే ఈ సమాజం ఫలాల్ని అందిస్తుంది. ఏం నేను చెత్త సీరియల్స్ ని ప్రోడూస్ చేసినప్పుడు ప్రేక్షకులు దూరదర్శన్ వాళ్ళకు బుద్ధిచెబితే మరోసారి దూరదర్శన్ వాళ్ళు నాలాంటి ప్రొడ్యూసర్ ని ఎంటర్ టైన్ చేస్తారా.....? చచ్చినా చేయరు. ప్రేక్షకులు ప్రోగ్రామ్స్ ని చూట్టం- బాగోలేకుంటే సణుక్కోవటం - ఊరుకోవటం - ఎదురుతిరగమను - దూరదర్శన్ వాళ్లు, మాలాంటివాళ్లు దారికొస్తారో లేదో....?" ఆవేశంగా అంటున్న దశరధకేసి బ్రహ్మనందం విస్తుపోయి చూసాడు.
* * *
నందిని, ప్రశాంత్ లకిచ్చిన ఐదు నిముషాల గడుపు అయిపోతుండగా విల్సన్ పరుగెత్తుకుంటూ వచ్చి "ఒక్క పావుగంటాగితే చాలు ప్లీజ్" అని అభ్యర్ధించి తిరిగి వెళ్ళిపోయాడు.
నందిని, ప్రశాంత్ లు మరింత కొండెక్కిపోయారు.
"దెబ్బకు దెయ్యం దిగిపోయింది. ఏమిటట. ఆమె పొగరు....? ఇప్పుడుగాని దారికి రాలేదు" నందిని భుజాల్ని ఎగురవేస్తూ అంది.
"టైమ్ అడుగుతున్నారెందుకు.....?" ప్రశాంత్ సాలోచనగా అడిగాడు.
"ఏముందీ తలతాకట్టు పెట్టి మనం అడిగిన డబ్బు తేవటానికి- లేకపోతే మనం నటించం గదా.... పనిలోపనిగా ఆ భవానీ మనకు క్షమాపణలు చెప్పాలని కూడా ఒత్తిడి తేవాలి" అంది అప్పుడే ప్రొడక్షన్ బాయ్ తెచ్చిన టీ అందుకొంటూ.
పావుగంటకూడా పూర్తవుతుండగా ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి, చేతులు కట్టుకొని "మేడమ్ ఇక్కడ ఎండగా ఉంది - తమరికి గాలి కూడా తగలటం లేదు. ఆ ఎందురింట్లో మాట్లాడి వచ్చాను. మీరక్కడ రిలాక్స్ అవుదురుగాని-ఈ లోపు మేం అన్ని అరేంజ్ మెంట్స్ పూర్తిచేసుకుంటాం" అన్నాడు వినయంగా
నందిని ఇగో తృప్తిపడింది.
"మాకు ఆ భవానీ క్షమాపణలు కూడా చెప్పాలి" డిమాండ్ చేస్తున్నట్లుగా అంది నందిని.
కొద్దిక్షణాలు ఇబ్బందిగా చూసిన ప్రొడక్షన్ మేనేజర్ ఒప్పుకోక తప్పటం లేదన్న భావాన్ని వ్యక్తంచేస్తూ "తప్పుతుందా మేడమ్ -తప్పు మాదయినప్పుడు అలాగే చెప్పిస్తాం - మీరు పదండి - ఆ ఇంట్లో దిగబెట్టి వస్తాను" అంటూ ఆ ఇంటికేసి దారితీసాడు.
అతని వెనుకే నందిని, ప్రశాంత్ లు బయలుదేరారు.
కాలం కరిగిపోతోంది.....
సమయం మధ్యాహ్నం ఒంటిగంటన్నరయింది.
నందినీమ్ ప్రశాంత్ లకు వేడి వేడి క్యారియార్ వచ్చింది. ఇద్దరూ భోం చేసారు.
గడువు మరికాస్త పెరిగింది.
హంపీని అంతగా హింస పెట్టగలుగుతున్నందుకు నందిని శాడిస్టిక్ ఇన్ స్టింక్ బాగా తృప్తిపడింది.
"ఎలాగూ ఖాళీయేగదా.....? ఆ గదిలో రెస్ట్ తీసుకుందాం రా ప్రశాంత్" అంటూ గదిలోకి నడిచింది నందిని.
వెనుకే ప్రశాంత్ లోపలకు వెళ్ళాడు.
వెంటనే ఆగది తలుపులు మూసుకున్నాయి.
ఆ ఇంటివాళ్లు ముక్కున వేలేసుకున్నారు- ఏదో బయట, లోకేషన్ లో ఎండగా ఉందని ఇంట్లోకి రానిస్తే ఇదేంపని పట్టపగలనుకొంటూ చెవులు కొరుక్కున్నారు.
ప్రశాంత్ హంపీపట్ల ఆకర్షితుడవుతున్నాడని నందిని చాలా కాలంగా జెలసీ ఫీలవుతోంది - తన ఒంపుసొంపులపట్ల ఇన్ ఫీరియర్ గా ఫీలయ్యే స్టేజ్ కి వెళ్ళింది. అందుకే అవకాశం దొరికితే చాలు ప్రశాంత్ ని తన పట్టువిడుపులతో, దీర్ఘశ్వాసలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
గాలి సరిపోవటం లేదంటూ పైటను తప్పించి, ఆ పైటతోనే విసురుకొ సాగింది.
కొద్దిక్షణాలు గడిచాయి.
"మీ మగవాళ్లు చాలా అదృష్టవంతులు" అంది అలాగే విసురుకొంటూ. ఆమె ఎత్తైన హిమోన్నత శిఖరాలు అతన్ని అప్పటికే ఉద్రేకపర్చాయి.
"ఏం.....?" అన్నాడు ప్రశాంత్ చిన్నగా నవ్వుతూ.
"గాలి చాలకపోతే షర్ట్ ని తేలిగ్గా విప్పేసుకుంటారు"
"ఓ..... అదా..... గాలి చాలకపోతే నువ్వూ ఆపని చేయ్" అన్నాడు ప్రశాంత్ ఉద్రేకపడుతూ.
ఆమె కళ్ళు మెరిసాయి - చేతుల్ని గుండెల మీదకు తెచ్చుకొని వేళ్ళకు పని చెప్పింది.
ప్రశాంత్ ఆమెకేసే చూస్తూ కన్నర్పటం మరచిపోయాడు.
ఆమె తననుకున్న పనిని పూర్తిచేసి, మెల్లగా ఫ్లోర్ మీద కూర్చుంది.
ఎదురుగా మంచం మీద ప్రశాంత్....
ఆమె మరికొంచెం ప్రశాంత్ కి దగ్గరగా జరిగి అతని మోకాళ్ళ పై తన తలను అనించుకుంది.
మెత్తగా, మత్తుగా ఉన్న వారిద్దరి మధ్య కాలం ఫ్రీజ్ అయిపోయింది.
ఆమె దేనికోసమో ఆరాటపడుతోంది-
అతనామెకు సహకరించేందుకు ప్రయత్నిస్తున్నాడు-
పొద్దు ఏటవాలుతోంది.....
ఆవేశాలు చల్లారాక ఇద్దరూ తేరుకున్నారు.
వాల్ క్లాక్ కేసి చూసి ఉలిక్కిపడ్డారు.
హడావిడిగా బట్టల్ని సరిచేసుకొని గది నుంచి బయటపడ్డారు.
ప్రశాంత్ ఆ ఇంటివారి చూపుల్ని తప్పించుకొనేందుకు ఇబ్బంది పడుతున్నాడు.
నందిని మాత్రం "మా కోసం ఎవరన్నా వచ్చారా....?" అనడిగింది.
ఆ ఇంటామె నందినికేసి కంపరంగా చూస్తూ "ఈ లోకేషన్ లో షూటింగ్ అయిపోయిందట - యూనిట్ అరగంటక్రితమే మరో లోకేషన్ కి వెళ్ళి పోయింది. అదే విషయాన్ని మీతో చెప్పమన్నారు. మీరు బయటకు వెళ్తే మేం తలుపులు వేసుకుంటాం" అందామె నిర్మొహమాటంగా.
తాను విన్నదేమిటో అర్ధం కాలేదు నందినికి.
సూచాయగా అర్థం చేసుకున్న ప్రశాంత్ మొఖం పాలిపోయింది. క్షణాల్లో తేరుకొని నందిని చేయి పట్టుకొని బయటకు లాక్కు వచ్చాడు.