"దేశం ఎటువెళ్తుందోనని బాధేసి బాదుకుంటున్నాను - లంచగొండి తనం విశ్వరూపం చూసి బాదుకుంటున్నాను"
"అసలేమయిందో చెప్పి బాదుకో" దశరథ కసురుకున్నాడు.
ఖర్మకాండ.... అదే మీ అపురూప సీరియల్ కి ఎక్స్ టెన్షన్..... అంతోటి గొప్ప సీరియల్ ని చూసి ప్రజలు మూర్చపోతున్నారట - ఆనందాన్ని తట్టుకోలేక అల్లాడిపోతున్నారట- అంతసీరియల్ ని ప్రసారం చేసినందుకు తమనుతాము మెచ్చేసుకొని మరో పదమూడువారాలు పొడిగిస్తున్నట్లు ఉత్తరీయం పంపారు...."
"వెరీగుడ్..... మంచోళ్ళు మనవాళ్ళు"
"డబ్బండి బాబు - డబ్బు మంచిది మందు మంచిది- బహుమతులు మంచివి - వాటిని పుచ్చుకున్నవారు - ఇచ్చినవారు అందరూ మంచివాళ్ళే దాన్ని క్షమించలేని ప్రేక్షకులే చెడ్డవాళ్లు. నాకో సందేహమండి"
"అడుగు" అన్నాడు దశరథ ఆనందంతో బాటిల్ ని అమాంతం పైకెత్తుతూ.
"పదమూడు వారాలు మనస్సులో పెట్టుకొని ఒక కథని తయారు చేసి దాన్ని పదమూడు ఎపిసోడ్స్ క్రింద విభజిస్తారు కదా.....? కథ కూడా పదమూడవ వారంతో పూర్తవుతుంది కదా....? మరి హఠాత్తుగా జాస్ - ఒన్...... టూ లాగా మరో పదమూడు వారాలు చూడటమే బహుభారంగా ఉంటుందే-మరలా పొడిగింపా - ఎక్స్ టెన్షనా.....: ఏమిటండిబాబు ఈతద్దినాలు.... ప్రజలకు మతిపోదా....? వాళ్ళ ఆరోగ్యాలు పాడవ్వవా...?" బ్రహ్మానందం బాధగా అన్నాడు.
"వడ్డించేవాడు మనవాడయితే బంతి చివరలో కూర్చున్నా ఫర్వాలేదు..... లంచం ఎరవేస్తే భారతదేశంలో కానిపనంటూ ఉండదు. మాట్లాడితే దూరదర్శన్ వాళ్ళని విమర్శిస్తుంటావు-ఢిల్లీ దర్బార్ లోని మంత్రుల మాటేమిటి? అధికారుల మాటేమిటి....?
ఇండియాలో దేనినైనాసరే - డబ్బుతో కొనిపారెయొచ్చు - అవినీతి లంచగొండితనం పల్లెప్రాంతంలో మొదలై పైస్థాయి వరకూ అల్లుకుపోయింది. అందుకే ఈదేశం ఎప్పటికీ, ఎన్నటికీ ఎదగదు అని అన్నదెవరో తెలుసా....?"
"ఆ.... నేనే ఎప్పుడో అనుంటాను..... ఆ ఎప్పుడన్నదీ గుర్తులేదు..."
"ఏడ్చావ్ లే ..... ఆ మాటలన్నది అంతర్జాతీయ హంతకుడు ఛార్లెస్ శోభరాజ్.... ఢిల్లీ నగరానికి పదిమైళ్ళదూరంలో రెండువందల అరవై ఒక్క ఎకరాల విస్తీర్ణంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఉండే తీహార్ జైలులో డబ్బు ఎదజల్లి సర్వసుఖాలనుభవిస్తూ చేసిన కామెంటది.....
2,000 కోట్ల రూపాయలతో భారతదేశ వాతావరణానికి పనికిరాని 19 ఎయిర్ బస్ - 320 విమానాలు కొన్నారు తెలుసా....? ఫిబ్రవరి, 1990లో చనిపోయారు. దాంతో కొత్త ప్రభుత్వం భయపడి ఆ విమానాల్ని ఎయిర్ బస్ ఒకటి బెంగుళూరు ఎయిర్ పోర్ట్ సమీపంలో కూలిపోగా 90మంది చనిపోయారు. దాంతో కొత్త ప్రభుత్వం భయపడి ఆ విమానాల్ని మూలన పెట్టేసింది, ఏమిటిదంతా.....?
ఇప్పటికీ డ్రాయింగ్ బోర్డ్ లో ఉన్న ఎయిర్ బస్ ల్ని, ఎయిర్ బస్.....320ని తయారుచేసే యూరోపియన్ కన్ సోర్టియమ్ కంపెని పరిశోధనశాలలో ధృవీకరించబడని, కేబిన్ స్మోక్ తో, ప్రెజరైజేషన్, హైడ్రాలిక్, ఆక్సలరీపవర్ యూనిట్, నోస్ స్టీరింగ్ లాంటి సాంకేతిక లోపాలతో సతమతమవుతున్న ఎయిర్ బస్-320ని ఎలా కొన్నారు...?
ఆధునిక సౌకర్యాలు లేని ఇండియన్ ఎయిర్ పోర్ట్సు గురించి, అవసరమైన శిక్షణ పూర్తిగా పొందని ఇండియన్ పైలట్స్ మనకున్న స్థితిలో అంత సోఫిస్టికేటేడ్ ఎయిర్ కాప్ట్స్ ని ఎలా కొన్నారు....?
వారానికి ఇండియన్ ఎయిర్ లైన్స్ సంపాదించుకున్న 30కోట్ల లాభం గూబలోకి వెళ్ళింది.
దీని మూలంగా ఎయిర్ బస్ ఇండస్ట్రీస్ బ్రహ్మాండమైన లాభాన్ని సంపాదించుకొంది - ఎయిర్ బస్ ల్ని తయారుచేసే కంపెనీ ఫలానా రేటుకి విమానాల్ని అమ్మగలమని ఇండియాకి ఆఫర్ చేస్తే - మీరు పిచ్చోళ్ళ లాగున్నారు రేటు 20 కోట్లకు పెంచి మీరు పదికోట్లు తిని, మాకు పదికోట్లు ఇవ్వమని ఇండియన్ జేబుదొంగలన్నారట.....
ఏమిటా ఈ వ్యవహారం అని కొత్త ప్రబుత్వం ఎంక్వైరీ చేయబోతే దానికి సంబంధించిన అసలైన ఫైలు రెక్కలోచ్చి ఎగిరిపొయిందట......
ఇవన్నీ ఏమిటి....? ఎవడమ్మ మొగుడిసొమ్ము ఆ రెండువేల కోట్లు-? ప్రజలదికాదా....? ప్రజల ప్రాణాలంత తేలికయిపోయాయా ఆ కాంట్రాక్టుని కుదుర్చుకున్న పెద్దలకు.....? మాజీ కేబినెట్ సెక్రటరీ పి.కె. కెల్, మాజీ సివిల్ ఏవియేషన్ సెక్రటరీ డాక్టర్ ఎస్.ఎస్ సిద్దుని ఏమిటయ్యా ఈ అన్యాయమని అడిగితే ఆగస్ట్ ఐదు,1985నాడు, మాజీమంత్రి అశోక్ గెహ్ లోట్, సీనియర్ అఫిషియల్ గోపీ శరోరా సమక్షంలో మాజీ ప్రధాన మంత్రి ఛాంబర్ లోనే ఆ నిర్ణయం తీసుకోవటం జరిగింది - మమ్మల్నేం చేయమంటారని అడిగారట- ఏం చేయాలో తోచక వాళ్ళమీద ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేసారట....ఒరేయ్ బ్రహ్మానందం .....వీలు కావటం లేదుకాని- వీలయితే అరగంటలో మనదేశాన్ని అమ్మిపడేసే రాజకీయ నాయకులు ఈదేశం నిండా ఉన్నార్రా.....అలాటప్పుడు దూరదర్శన్ లంచగొండు వ్యవహారాలెంతరా.... మహా సముద్రంలో కాకి రెట్టంత....నువ్వూరికే వర్రీ అవ్వక ఎక్స్ టెన్షన్ ఇచ్చిన దేవుళ్ళకు రాత్రికి మంచి పార్టీ ఏర్పాటుచేయ్...." అన్నాడు దశరథ వేదాంత ధోరణిలో.
"మా గొప్పగా సెలవిచ్చారండి...... హందీ సీరియల్స్ నుంచి దిగుమతి చేసుకున్న జబ్బు, పొడిగింపు- ఎక్స్ టెన్షన్ - తెలుగు టీవీ.లో బాగా ముదిరిపోయింది. ఎప్పుడన్నా ఒకటి అరామ్ సీరియల్స్ పొడిగిస్తే ఫర్వాలేదు. ప్రతి దానిని పొడిగించటం టూమచ్.....కొత్త సీరియల్స్ ని ఏక్సెప్టుచేయటం ఎంత కష్టంగా ఉందో - పాత వాటిని పొడిగించటం అంత తేలిగ్గా ఉంది. హిందీ సీరియల్స్ స్టాండర్డ్ బాగుంటుంది గనుక కొన్నింటిని పొడిగించినా ఫర్వాలేదు- ఈ మధ్య ప్రేక్షకులకు మరోభయం పట్టుకుంది-26 భాగాల తరువాత మరలా ఎక్స్ టెన్షన్ - అంటే 39 వారాలు- హారిబుల్ - అభినయంసున్నా- వాచికం జీరో- విసుగ్గా, వెగటు పుట్టించే పిచ్చిగంతులు.....ప్రేలాపనలు... ఛీ.....ఛీ....టీవీ ఆన్ చేయాలంటే భయంగా ఉంది...... ఎలాగోలా దూరదర్శన్ ని సమాధిచేయండి-మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం,అ కరప్టెడ్ అధికారులు దూరదర్శన్ కేంద్రాల్లో ఉన్నంతకాలం తెలుగు ప్రేక్షకులు కొన్న టీవీ సెట్స్ వైట్ ఎలిఫెంట్స్ క్రిందే లెఖ్ఖ..... ఖర్మకాండ సీరియల్ పొడిగింపు- ఓపని చేయండి మీ ఖర్మకాండ సీరియల్ ని వంద భాగాలకు పొడిగించండి. అప్పుడు మరో సీరియల్ ని మొదలెట్టండి- దాని పేరు నేను చెబుతా-తద్దినం..... లేదా పిండాకూడు....బాగుంది కదా...?" బ్రహ్మానందం కంపరంగా ఫీలవుతూ అన్నాడు.
నువ్వేమో దూరదర్శన్ చెత్తంటావు.....కొన్ని వందల మంది టీవీలో వార్తలు చదివేందుకు పోటీపడి ప్రయత్నిస్తున్నారు..... దానికంత గ్లామర్ లేకపోతే అలా చేస్తారా.....?"
"నాకు తెలిసిన ఒక నత్తివాడు కూడా ప్రయత్నిస్తున్నాడు- అది చాలనుకుంటాను....." బ్రహ్మానందం లేచిపోతూ అన్నాడు.
* * *
"మేడమ్ గారొచ్చే టైమవుతోంది - త్వరగా మేకప్ - - కానిచ్చేస్తే బాగుంటుంది" అన్నాడు విల్సన్ మామూలుగా.
నందిని ఆశ్చర్యపోతూ విల్సన్ కేసి చూసింది.
ప్రశాంత్ ముఖంలో ఏ భావమూ తొంగిచూడలేదు.
"మేడమ్ గారు ఈపాటికి బయలుదేరి చాలాదూరం వచ్చేసి ఉంటారు. రాగానే షూటింగ్ మొదలుపెట్టేస్తారు. ఇప్పటికే చాలా ఆలస్యమయింది మరొక్కక్షణం ఆలస్యమైనా ఊరుకోరు" అన్నాడు సౌమ్యంగానే.
కానప్పటికే హంపి రావటం- ప్రొడక్షన మేనేజర్ ద్వారా విషయాల్ని తెలుసుకోవటం -దిక్కుతోచని స్థితిలో పడిపోవటం జరిగింది.
యూనిట్ ఇప్పుడు అనిల్, టాగూర్, నారాయణ్ నివాసముండే (చెడిపోయి, స్క్రాప్ క్రింద పడేసిన) బస్ ప్రక్కనుంది.
"విల్సన్ మరోసారి ప్రయత్నిస్తున్నారు- బహుశా ఒప్పుకోవచ్చేమో మేడమ్. ఈబస్ మీకు నచ్చిందా మేడమ్....." ప్రొడక్షన్ మేనేజర్ అడగటంతో ఈ లోకంలోకి వచ్చేసింది హంపి.
ప్రశాంత్, నందిని పెట్టే హ్యూమిలియేషన్ ఆమెను గాయపరుస్తున్నా బలవంతంగా తననుతాను నిగ్రహించు కుంటోంది.
"చాలా బాగుంది- కథకు అనుగుణంగా, ప్రేక్షకులను మూడ్ లోకి తీసుకెళ్ళగల లోకేషన్ సెలక్షన్ కూడా ముఖ్యమైన విషయంగా గుర్తించాలి. బ్యాగ్రౌండ్ లో కనిపించే లోకేషన్ సీరియల్ సక్సెస్ లో కచ్చితంగా కొంతభాగాన్ని షేర్ చేసుకుంటుంది. ఈ బస్ చాలా చిత్రంగాను, తమాషాగానూ ఉంది. హైటాఫ్ పావర్టీ..... ఇన్ కాంటెంపరరీ ఇండియన్ సొసైటీ.....హౌసింగ్ ప్రాబ్లమ్ ని సర్ కాస్టిగ్గా ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్ళటానికి ఈ బస్ మనకు చాలా ఉపయోగపడుతుంది.... ప్రభుత్వాలు పేదప్రజలకు సమకూర్చే గృహాలపధకం ఎంత మందకొడిగా సాగుతుందో సజెస్టివ్ చెప్పే బాధ్యతను ఈ బస్సే సగం తీసుకుంటుంది. ఈ బస్ లో ఎవరన్నా ఉంటున్నారా....? అసలింతకూ దీన్ని ఎన్నికచేసిందెవరు......?"
"మన భవానీ మేడమ్.... ఈ బస్ లో ముగ్గురు నిరుద్యోగులు నివాసముంటున్నారట మేడమ్"
"ఫెంటాస్టిక్.... నిజంగా.....?" హంపీ విస్మయంతో కళ్ళు పెద్దవిచేస్తూ అంది.
"అవును మేడమ్...."
"వాళ్ళెవరూ....? ఉన్నారా ఇప్పుడు....?"
"లేరు మేడమ్....? ఎవరోకూడా తెలీదు. లోపలకెళ్ళి చూసాం. ఒకజత చినిగిపోయిన బట్టలు - ఒక పాత స్టవ్ - ఒక చీపిరి - నాలుగు గోనెసంచులు- పాత గుడ్డలతో తయారుచేసిన దిండ్లు రెండున్నాయి. డోర్ కూడా ఉంది మేడమ్. గోనెసంచులతోనే డోర్ తయారుచేసారు..."
"స్ట్రేంజ్ ఫెలోస్.... అయినా ఫ్రీగా షూటింగ్ చేసుకొంగదా....? ఎంతో కొంత పే చేస్తాం...."
"లేటయిపోతోంది" అంటూ హంపీ ప్రశాంత్, నందినీ ఉన్న వేపు బయలుదేరింది. ఆమె వెనుకే ప్రొడక్షన్ మేనేజర్ వెళ్ళాడు.
"లోకేషన్ లోకి యూనిట్ వచ్చాక ఇలా అడగటం న్యాయమేనా......? ఒక్కసారి ఆలోచించండి - స్పాన్సరర్స్ లేకుండానే మేడమ్ కి లక్షకుపైగా నష్టం వచ్చింది. ఫైనాన్షియల్ గా మేడమ్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు అర్థం చేసుకోకపొతే ఎలా.....?" విల్సన్ నందిని, ప్రశాంత్ లను ప్రాధేయపడుతున్నాడు.
హంపీ ఆవేశంగా ముందుకు రాబోగా ప్రొడక్షన్ మేనేజర్ రెండు చేతులెత్తి ఆమెకు నమస్కారం పెట్టి కళ్ళతోనే ప్రాధేయపడ్డాడు.
"మమ్మల్ని ఉద్దరించటానికి సీరియల్ తీస్తున్నారా....? స్పాన్సరర్స్ లేరంటున్నారు- ఆ తరువాతయినా ముందుకొస్తారో లేదో తెలీదు. అలాంటప్పుడు మిమ్మల్ని నమ్మి నటిస్తే తరువాత ఇవ్వటానికి మీ దగ్గరే ముంటుంది....? బూడిదా....?" నందిని మాటలు పూర్తవుతుండగానే అప్పుడే వచ్చిన భవానీ ఆవేశంగా నందిని మీదకు వెళ్తూ "ఇంకొక్కమాట అనవసరంగా మాట్లాడావంటే చంపేస్తాను- నువ్వేమన్నా మార్లిన్ మాన్రోను కుంటున్నావా.....? బ్రిజిత్ బార్డో, జేన్ పొండా, మెరిల్ స్ట్రిఫ, అడ్రి హెప్ బర్న్ ననుకుంటున్నావా....? ఇష్టమైతే చేయ్.... లేదంటేమానిపడేయ్... అవకాశాలకోసం అందాల్ని ఎరవేసే నీకు మా మేడమ్ గురించి విమర్శించే అర్హతుందా....? నా సంగతి నీకు తెలీదు. నడిరోడ్డు మీద నరికి పోగులుపెడతాను...." అన్నాడు ఊగిపోతూ.