"ఆహా నన్ను కట్టుకున్న పాపానికి సహిస్తున్నారా.....నా డబ్బు కోసం సహిస్తున్నారా అదంటే అప్పుడే అంత ప్రేమా , ఒక్కమాట అంటే వూరుకోనంటారు' ఎత్తి పొడిచింది హేళనగా.
"హు ప్రేమ, అభిమానం.....అన్న పదాలకి నీకర్ధం తెలుసు అసలు...."
"అబ్బ! యీ నెల్లాళ్ళలో వాటి అర్ధం తెలుసుకున్నారన్నమాట" విలాసంగా నవ్వింది.
ప్రసాద్ తిరస్కారంగా ఏహ్యంగా చూసాడు. నీలాంటి దానితో మాటలు పెంచను అన్నట్టు మౌనంగా వూరుకున్నాడు. 'ఆ కోతిమొహం నాకంటే అందంగా అన్పించిందా మీకు....' కవ్వించింది.
"కోతిమొహం అని తెలిసి యింకెందుకు యిర్ష్యా!' ప్రసాద్ కూడ వ్యంగ్యంగా నవ్వాడు.
"మీ మోగాళ్ళకు అడదయితే చాలుగా" మరో బాణం విసిరింది.
"హు నిన్ను పెళ్ళాడాక ఆడదాని మీద ఇచ్చ చచ్చిపోయింది. ఆ విషయంలో నీవు నిశ్చింతగా వుండచ్చు" కసిగా అన్నాడు.
ఆ మాటలకి , ఆ వ్యంగ్యానికి ఆ అవమానానికి లత మొహం ఎర్రబడిపోయింది. ఆ అవమానం తట్టుకోడం కష్టం అయిపొయింది. మీరు.....మీరు....నన్ను.... అంటూ శివంగిలా అడపులిలా విరచుకుపడి అందినవన్నీ అతని మోహన విసిరింది, ఉద్రేకంలో ఊగిపోతూ "దాన్ని ముందు రేపటికల్లా ఉద్యోగం లోంచి తీసేయండి....లేకపోతే వూరుకొను. మళ్ళీ అది ఆఫీసులో అడుగు పెట్టడానికి వీలేదు" అరిచింది. రేపటికి దాన్ని గెంటించకపొతే నాపేరు మార్చుకుంటాను. చూద్దురు గాని రేపు ఏం చేస్తానో అరిచింది. ప్రసాద్ మొహం తెల్లబడింది. ఈ రాక్షసి అన్యాయంగా అ అమ్మాయి మీద పగబట్టింది ఏమిటి? పాపం బీదది అని సానుభూతి చూసి ఉద్యోగం యిస్తే నెలరోజులన్నా కాకుండా ఆమె ఆశ లన్నీ క్రూలదీస్తూ ఉద్యోగం లోంచి తీయించుతుందా . ప్రసాద్ కి పట్టరాని ఆవేశం వచ్చింది.
'లతా, నీకిదే చెప్తున్నాను.....అనవసరంగా నా ఆఫీసు విషయాలలో కలుగజేసుకోకు. ఆ అమ్మాయికి నేను ఉద్యోగం యిచ్చాను. తీయడానికి వీలు లేదు. నీకేం అధికారం లేదు. నేను కంపెనీ మానేజింగ్ డైరక్టర్ ని..... ఎవరిని ఉద్యోగంలో వుంచేది మానేది నాయిష్టం" కరుకుగా అజ్నాపిస్తున్నట్టు అన్నాడు.
'ఆహాహా....మానేజింగ్ డైరక్టర్ ....ఎవరిచ్చారా పదవి మీకు. ఆ కంపెనీ నాదని.....సర్వాధికారాలు నావని, నాకింద మీరు ఉద్యోగం అని మరవకండి" లత చాలా శాంతంగా చూస్తూ ఒక్కొక్క మాట పలికింది.
ప్రసాద్ ఒక్కక్షణం నిరుత్తరుడయ్యాడు. ఆ తర్వాత ఏదో స్థిర నిశ్చయానికి వచ్చినవాడిలా తల పంకించి, " నా ఉద్యోగం నేను చెయ్యాలంటే నా ఉద్యోగంలో నీ జోక్యం వుండకూడదు. అలా కాదంటే నా స్థానంలో యింకోరిని వేసుకోవచ్చు. ఆ అమ్మాయిని ఉద్యోగం లోంచి తీస్తే తక్షణమే నేను రాజీనామా చేస్తాను."
"ఫరవాలేదు , డబ్బిస్తే పని చెయ్యడానికి చాలామందే దొరుకుతారు" నిర్లక్ష్యంగా తలెగరేసింది లత.
"సరే అయితే ' ప్రసాద్ యింక మాట్లాడవలసింది ఏమి లేదని" అక్కడ నించి లేచి వెళ్ళిపోయాడు. లత ఏదో ఆలోచిస్తూ వుండిపోయింది.
* * * *
"మొన్న ఆఫీసు కొచ్చిందే ఆ అమ్మాయి మన బాస్ పీయాన్సీ ట. ఎంగేజ్ మెంట్ అయిందిట మొన్న. యింకో నెలలో పెళ్ళిట" లంచ్ బ్రేక్ లో ఫతిమా వసంతతో అంది.
వసంత మొహం ఒక్క క్షణం నల్లబడింది. ఆ వార్త యిదివరకైతే అఘాతంలా తగిలేదేమో కాని, యిలాంటిదేదో వింటానని ఎదురు చూసిన వసంతకి అంత ఎక్కువ బాధ అన్పించలేదు. రతన్ లాల్ ముభావ వైఖరి, అంటి ముట్టనట్లుండె అతని ప్రవర్తన, ఆ అమ్మాయితో అతని చనువు నవ్వు, మాటలు చూసాక వసంతకి ఆరోజు.....ఆ క్షణానే అర్ధం అయింది. తను అందని పండ్లకి అర్రులు చాస్తుందని, కాని ఇన్నాళ్ళు ఏమూలో చిన్న ఆశ! ఏదో ప్రలోభం! ఎవరు చెప్పారు?" అంది నిర్లప్తంగా.
"ఆఫీసులో అంతా అనుకుంటున్నారు .'
'ఆహా మంచిదే. మళ్ళీ మనకో పార్టీ వుందన్న మాట" పేలవంగా నవ్వింది వసంత.
ఫతిమా వసంత వంక చూసి "థాంక్ గాడ్ నీవింత లైట్ గా తీసుకుంటా వనుకోలేదు. సో యూ హేవ్ కమ్ ఔట్ ఆఫ్ దట్ క్రేజీ నెస్ ఐయాం హాపీ" అంది ఫతిమా.
వసంత జవాబివ్వకుండా కళ్ళు వాల్చుకుంది. వసంత పైకి నవ్వినా ఆమె మనసులో అలజడి గుర్తించ కల్గింది ఫతిమా.
'ఆవిడ పేరు గీతట. ఫాదర్ మరో బిజినెస్ మాగ్నటేట్. రెండేళ్ళుగా ఈవిడ ఏవో కోర్సులు చదవడానికి అమెరికా వెళ్ళి వచ్చిందట. పెళ్ళి ఇదివరకు అనుకున్నదేట. యిద్దరూ భలే కుదిరారు. అందం, ఐశ్వర్యం...." ఫతిమా వసంత ముఖకవళికలూ గమనిస్తూ కావాలనే చెప్పింది. వసంత ఎంత పూలిష్ గా ఆలోచించిందో బాగా తెలిస్తే తన తప్పు తెలిసి త్వరగా ఆ మైకంలోంచి మేల్కొంటుందని ఆమె ఉద్దేశం. వసంత వింది ఆ మాటలు ఆమె మీద బాగానే పనిచేశాయి.... హ..... అలాంటి అందగత్తె, ఐశ్వర్యవంతురాలు వుండగా వసంత మీద ఎందుకు కుతూహలం వుంటుంది అతనికి. మగాడు పెళ్ళి కెప్పుడూ సమ ఉజ్జీలనే కోరుకుంటాడు. మహా అయితే కాస్త చంచల మనస్కుడయితే అందివచ్చిన అమ్మాయిని వూరికే పోనీయటం ఎందుకని అవకాశాన్ని వినియోగించుకుని వదిలేస్తాడు. రతన్ లాల్ చంచలుడు కాడు కనక వసంత ఊబిలో దిగలేదు అంతే! ఈ పుస్తకాలు, సినిమాలు ఆమె లాంటి బలహీన మనస్తత్వాల మీద బాగా పనిచేసి కళ్ళముందు అందమైన రంగుల కలలు పరుస్తాయి అంతే! కలల్లోంచి మేల్కొన్నాక మిగిలేది రంగు వెలిసిన బొమ్మ ఆ బొమ్మతో సంతృప్తి పడలేక, ఆశించినది అందక నిరాశ నిస్పృహల మధ్య వేగిపోతున్నారు తమ లాంటి మధ్యతరగతి అమ్మాయిలు. చదువుండి తెలిసి వుండి వసంత యింత అవివేకంగా ఆలోచించిందంటే , అది ఆమె బలహీన మనస్తత్వాన్ని తెలుపుతోంది. యిప్పటికైనా యీ సంఘటనతో కళ్ళు తెరిస్తే నయమే ఫతిమా అనుకుంది.
వసంత నిట్టూర్చి "థాంక్స్, ఫతిమా' అంది.
ఆ కృతజ్ఞతలు ఎందుకో ఫతిమాకి అర్ధమై సంతృప్తిగా నిట్టూర్చింది.
వెంకట్రావుగారు ముందు వసంతకి సంబంధాలు వెతకసాగారు. వసంత తనకేం వద్దన్నట్టు వూరుకుంది. రెండు సంబంధాలు నచ్చి పెళ్ళి చూపులకి పిలిచారు. ఓ పెళ్ళి కొడుకు జూనియర్ యింజనీరు, పెళ్ళి చూపులకి వచ్చి చూసుకున్నారు వసంత ని. పెళ్లి కొడుకు కాస్త పొట్టే, రంగు అంతలేదు. చేసే జూనియర్ ఇంజనీరు ఉద్యోగానికి వెంకట్రావు గారిస్తాం అన్న పదివేల కట్నం లాంచనాలు నచ్చక , అతని అందానికి వసంత నచ్చక మరో సంబంధం కుదుర్చుకున్నారు. ఆ దెబ్బతో వసంత అహంకారం సగం తగ్గిపోయింది. మామూలు సంబంధం అంతంత మాత్రం ఉద్యోగం , అందం వున్న పెళ్లి కొడుకు తనని నచ్చలేదని తిరస్కరించగానే వసంత తలకొట్టేసినట్లయింది. "ఏడిశాడు , కోతి మొహం వీడూను. వీడిని నేనసలు చేసుకునేదాన్నా, ఏదో మీరు చంపారని పెళ్లి చూపులకి కూర్చున్నా గాని ' సమర్ధించుకుంటూ దబాయించింది. కాని మనసులో భవిష్యత్తు గురించి భయపడింది. తనని వీడే నచ్చకపోతే యింతకంటే మంచి సంబంధాల వాళ్ళు నచ్చుతారా!