"కోతి మొహమో, ఏ మొహమో నచ్చలేదని మొహాన చెప్పారుగా, యింకా ఎందుకా గర్వం. మనం రంభలా వున్నామనుకోగానే సరా, అవతలివాళ్ళు అనుకోవాలి. నీ పోగరణగడానికే దేముడిలా చేశాడు. యింక నోర్మూసుకుని కూర్చో పెద్ద కబుర్లు చెప్పకుండా" కాంతమ్మ కోపంగా మందలించింది.
'పోనీలేవే.....యిది కాకపొతే మరోటోస్తుంది. నీకేం చక్కగా ఉద్యోగం చేస్తున్నావు, బోలెడు మంది చేసుకుంటారు" చిన్నపోయిన వసంత ముఖం చూచి ఓదార్పుగా అంది కమల.
"పెళ్ళి కాలేదని నేనేం ఏడ్వడం లేదుగా.....వెధవ వేషం వాళ్ళెలా వున్నా పిల్ల అందం కావాలి, చదువుకోవాలి "చిన్నపోయిన వసంత ముఖం చూచి ఓదార్పుగా అంది కమల.
"ఏం చేస్తాం, మగ మహారాజుల వాళ్ళదే పై చెయ్యి . ఏదో సంబంధం కుదిరి ఈ ఏడాది ఎలాగో యిద్దరి పెళ్ళిళ్ళు అయిపోతే."
"శని విరగడయిందని హాయిగా వుందువు గానిలే. ఆడపిల్లలనగానే ఎప్పుడు యింట్లోంచి తరుముదామా అని చూస్తారు' వసంత తిరస్కారంగా అంది.
'అనవే అను. నీకు పెళ్ళయి, నీకూ ఓ ఆడపిల్ల పుడితే తెలుస్తుంది.'
మరో నెలకి వసంతకి , మాలతికి యిద్దరికీ సంబంధాలు కుదిరాయి. వసంతకి కాబోయే వరుడు ఆ వూర్లోనే కాలేజీ లెక్చరర్ గా వున్నాడు. చూడ్డానికి బాగానే వున్నాడు వసంతని నచ్చి, పెళ్ళయ్యాక వసంత ఉద్యోగం చెయ్యడాని కభ్యంతరం చెప్పలేదు. చలాకీగా , సరదాగా పెళ్ళి చూపులకి వచ్చినట్లు గాక స్నేహితుడిలా మాట్లాడిన అతని స్వభావం వసంతకి నచ్చింది. కాలేజీ లెక్చరర్ పరవాలేదు. యిద్దరి జీతం కలిపితే బాగానే వుంటుంది. ఓ స్కూటరు కొనుక్కోవాలి. యింట్లో ఫర్నీచరు కొనాలి.
వసంత ఊహలు అప్పుడే చాలాదూరం వెళ్ళాయి. కట్నం పదివేలు, లాంచనాలు మూడువేలు. మాలతి పెళ్ళికొడుకు స్తేటుబ్యాంకు లో గుమస్తా . ఉద్యోగం గుమస్తా అయినా మంచి జీతం, వెనకాతల బాదర బందీలు లేనివాడని వెంకట్రావు గారు నిర్ణయించారు. యిద్దరి కూతుళ్ళ కి సమంగా కట్నాలు, లాంచనాలు అన్ని జరిపించాలని, యిద్దరి పెళ్ళిళ్ళు కొన్ని గంటల తేడాలో జరిగేటట్టు నిర్ణయం అయింది. కట్నాలు, పెళ్ళి ఖర్చు అంతా కల్సి నలభై వేలవుతుందని , మిగతా పది వేలు పెట్టి యిల్లు బాగుచేయించాలని తండ్రి కొడుకులు, పధకాలు వేసారు. మరో యిరవై రోజులల్లో పెళ్ళిళ్ళకు ముహూర్తాలు నిర్ణయించారు. "పెళ్ళి బట్టలు అవి కొనాలి, ఇద్దరికీ చేతికి, మెడకి కాస్తన్న బంగారం పెట్టాలి గదా! ఆ డబ్బు ...." అర్ధోక్తిలో ఆగి ప్రసాద్ వంక చూసారు వెంకట్రావు గారు.
"ఆ, తెచ్చి యిస్తాను రెండు మూడు రోజులలో" ప్రసాద్ అన్నాడు.
తండ్రి దగ్గర అనడం అన్నాడు కాని ప్రసాద్ కి ఎందుకో మనసులో ఏదో అపనమ్మకం, శంక బయలుదేరాయి. లత డబ్బిస్తుందా, యిదివరకటి మాట మీద నిలబడ్తుందా! యిప్పుడు తండ్రి కూడా లేడు. యింకా లెక్క చేస్తుందా! నయా పైసలు లెక్క పెడ్తున్న లత ఏభై వేలు అంత సుళువుగా యిస్తుందా! అందులో ఈ మధ్య అసలు తనతో మాట్లాడకుండా చాలా ముభావంగా వుంటుంది. యింట్లో తను అనేమనిషి లేనట్టే ప్రవర్తిస్తుంది. ఆరోజు శాంతి విషయంలో దెబ్బలాట జరిగాక మర్నాడు చాలా భయపడ్డాడు. తనమీద కోపంతో శాంతిని ఉద్యోగం లోంచి తీసేసి కసి తీర్చుకుంటుందేమోనని భయపడి, ఆ ఉద్యోగం పొతే మళ్ళీ ఆ అమ్మాయి గతి ఏమిటని దిగులు పడ్డాడు. శాంతి నిజంగా ఎంత మంచి పిల్ల! ఆ అమ్మాయిలో ఆకర్షణ కళ్ళు! ఆ కళ్ళు ఎంత ప్రశాంతంగా నవ్వకుంటాయి. అంతటి కష్టాలలో కూడా ఆ కళ్ళలో ప్రశాంతత చెదరలేదు. ఎంత మార్దవంగా, ఎంత చల్లగా చూస్తుంది ఆమె. ఆ కనుపాపల నీడల్లో సేద తీర్చుకునే అదృష్టవంతుడేవరో ! ఆమె నెమ్మది, అణుకువ తన పట్ల అనుక్షణం ఆమె చూసే కృతజ్ఞత , ఆమె చల్లటి చిరునవ్వు, స్త్రీ అంటే ఇలా వుండాలి అన్పించింది. ఆమెలో అందం లేదు.. ఆకర్షణ లేదు. కాని పురుషుడు స్త్రీలో చూడాలనుకునే మాతృహృదయం కన్పిస్తుంది ఆమెను చూసిన క్షణం ! శాంతి! పేరుకి తగ్గట్టు ప్రశాంతంగా వుండే శాంతి అంటే అతనికి ఈ నెల రోజులలోనే అభిమానం కల్గింది. ఆ అభిమానం లత అనుకునే హీయమైన అభిమానం కాదు. అది ఆమెకు అర్ధం కాదు శాంతి బతుకు ఒక గాడిలో పడి .....కాస్త ప్రశాంతంగా వూపిరి తీసుకునే వేళకి ఉద్యోగం పొతే.....ఇంకా ఆమె ఎలా బతుకుతుంది అనుకుంటూ రాత్రంతా మధనపడ్డాడు.
కాని చిత్రంగా .....లత ఆ విషయం మళ్ళీ ఎత్తలేదు. శాంతి విషయం రెట్టించలేదు. ఆరోజు నించి అతని దేప్పలేదు. ఇంట్లో ప్రసాద్ అనే మనిషి లేనట్టుగా నిర్లిప్తత వహించిన లతలో మార్పుకి లోలోపల ఆశ్చర్య పడి, తరువాత ఆనందించాడు. కాని..... అది తుఫాను ముందు ప్రశాంతత అని తెలుసుకోలేకపోయాడు. ప్రసాద్ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకు డబ్బడిగినరోజున ఆమె మౌనం, ఆమె నిర్లిప్తత, ఆ ప్రశాంతత అన్నీ పెనుతుఫాను తాకిడికి పటాపంచల మైనట్టు అయిపొయింది. "ఎండబ్బు ! ఏం తెలవనట్టు నిర్లక్ష్యంగా అంది పుస్తకము చదువుతూ.
ప్రసాద్ కి వళ్ళు మండినా సౌమ్యంగా పని చేసుకోవాలి అని గ్రహించి 'అదే ఏభై వేలు , ఇదివరకు అడిగా.....సంబంధాలు చూసారు పెళ్ళి ఇంకో ఇరవై రోజులుంది ....డబ్బు కావాలి' అన్నాడు.
"మీ చెల్లెళ్ళ పెళ్ళి అవుతున్నందుకు సంతోషం......కాని మధ్యన డబ్బు నేనెందుకియ్యాలి" ఆశ్చర్యపడినట్టు అడిగింది.
"లతా , నటన చాలించు . ఆ డబ్బు పెళ్ళిలో మీ నాన్నగారు నాకిస్తానన్నది . అది నావాళ్ళ కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ పెళ్ళి వల్ల వాళ్ళకి కనీసం యీ మాత్రం లాభం అన్నా దక్కాలి. కొడుకుగా నా బాధ్యత తీర్చుకోవాలి అనవసరంగా నన్ను వాగించకుండా యియ్యి- పళ్ళ బిగువున అన్నాడు.
"కొడుకుగా బాధ్యత తీర్చుకోవాలంటే సంపాదించి యీయండి అంతే గాని యింకోరి డబ్బు తెరగావస్తే అందరూ యిస్తారు. ఆ డబ్బు నేనివ్వను . ,మా నాన్న కష్టపడి అర్జించింది వీళ్ళకి వాళ్ళకీ కాదు" లత ఖండితంగా అంది.


