పదిరోజులు గడిచాక ..... లాయరు అందరి సమక్షంలో వీలునామా చదివి వినిపించాడు. ఆ వీలునామా ఇదివరలోనే నారాయణమూర్తి గారూ రాసి వుంచారు. చదవక ముందే కూతురి కాక మరెవరికిస్తారు అని అందరూ అనుకున్నదే. అయన యావదాస్తి ....ధన, వస్తు , వాహన , చరస్తి స్థిరాస్తి అన్నీ కూడా కూతురికే రాసిపోయారు. ప్రసాద్ మనసు చిన్నపోయింది. ఆయనకి కూతురి మనస్తత్వం తెలిసి, తననెంత నీచంగా చూస్తుందో తెలిసి, తనకంటూ ఏది యివ్వకుండా భార్య దయా దర్మం మీదే బతికేట్టు చేసిన ఆయనని క్షమించలేకపోయాడు. ఆస్థి యిస్తే కూతుర్ని లెక్క చెయ్యడని భయపడి అలా రాసాడు అనుకున్నాడు. కొద్దిగా .....తను ప్రతి చిన్నదానికి ఆమె మీద ఆధారపడకుండా ఏదన్నా రాసి వుంటే ఎంత బాగుండేది అని విచారించాడు. ఈ వీలునామాతో లత తన చెయ్యి నించి పూర్తిగా దాటిపోతుందని అతనికి తెలుసు. తెలిసి చెయ్యగల్గింది ఏమీ లేదు కనుక నిట్టూర్చాడు. మామగారి మీద వున్న గురి, గౌరవం తగ్గిపోయి ఏదో నిర్లిప్తత , అసంతృప్తి చోటుచేసుకుంది అతనిలో. లతని వెనక నించి కాస్త అదుపులో పెట్టగలిగిన అయన లేకపోయాక .....లత రౌతు లేని గుర్రంలా ఎలా ఎగిరిపెడ్తుందో , ఆమెతో సవారి ఎంత దుర్భరంగా వుంటుందో వూహించగల్గిన ప్రసాద్ కి ముందేలా వున్న భవిష్యత్తు చింత పట్టుకుంది.
తండ్రిపోయిన దుఃఖంతో ఒక నెలరోజులు నిర్లిప్తంగా ఉదాసీనంగా గడిపింది లత. అంత దుఖంలోనూ తండ్రి వీలునామా చదివాక తృప్తిగా నవ్వుకుంది. వీలునామా లాయరు చదివి వినిపిస్తుంటే ప్రసాద్ మొహం ఎలా మాడిపోయిందో చూసాక ఏదో తృప్తి కల్గింది. హా...... యింకేక్కడికి వెడతాడు నా చేతిలోంచి అనుకుంది గర్వంగా. తండ్రి పోయిన నెలరోజుల నించి తన అసలు నిజ స్వరూపం , తన ప్రతాపం చూపించడం ఆరంభించింది. నౌకర్ల ను హడలగొట్టేసింది. ప్రతి నయా పైసాకి లెక్కలు అడిగేది. యింతింతా వండారని దెబ్బలాడేది , యిన్ని పాలెందుకు , యిన్ని కూరలేందుకు, నా డబ్బంతా నాశనం చేస్తున్నారు అని తిట్టిపోసేది. ఏ చిన్న లోటుపాటు వచ్చినా, ఏ పదార్ధంలో కాస్త లోపం వచ్చినా మొహాన విసిరికొట్టేది. ప్రసాద్ కల్పించికుని మందలించబోతే మీరూరుకొండి, వాళ్ళు నౌకర్లు, నా సొమ్ము పెడ్తున్నాను నా యిష్టం అని దులపరించేది, ప్రసాద్ విరక్తిగా కల్పించుకోవడం మానేశాడు. ఇంట్లో వున్న కాసేపు చెవులు మూసుకుని ఓ గదిలో కూర్చునేవాడు. ప్రసాద్ అలా కల్పించుకోకపోయినా అంతా తినేవాళ్ళే , యింటి గొడవ ఎవరికి పట్టదు . ఆ నౌకర్లు అలా దుబారా చేస్తుంటే చూచేవారన్నా లేరు . నా ఖర్మ , కాళ్ళు లేకపోబట్టి యిలా పడి వున్నాను యింకోరి దయాదాక్షిణ్యాల మీద అంటూ తిట్టేది. నౌకర్లు కొందరు లత ఆరడి భరించలేక మానేశారు. పాత నౌకర్లు ఒకరిద్దరు తప్ప మిగతా అంతా మొహం మీదే నీచేత యిన్ని మాటలు పడ్తూ వుండే ఖర్మ మాకేమిటి, పని ఎక్కడబడితే అక్కడ దొరుకుతుంది అని తెగేసి చెప్పి వెళ్ళిపోయారు. పాతవాళ్ళు మానగానే యింకోరిని పెట్టడం ప్రసాద్ వంతు వాళ్ళు నాల్గు రోజులుండి మానేసేవారు. పాత నౌకర్ల ద్వారా లత సంగతి తెలిసి ఎవరూ పనికి రావడం మానేశారు. వంటవాడు లేక నాల్గురోజులు నానా అవస్థ అయింది. పనిమనిషి ఎలాగో వండి పెట్టిన వంట విసిరేసింది లత.
ప్రసాద్ సహనం ఆఖరి మెట్టుకు తెచ్చింది. లత యిదంతా కావాలనే తనని ఏడిపించడానికి చేస్తుందని అర్ధం అయింధతనికి. "లతా, నేనంటే కట్టుకున్న మొగుడ్ని గనక నీ ఆగడం సహిస్తున్నాను. నీ తిట్లు ఏ నౌకర్లు సహించరు. పనివాళ్ళు యింట్లో వుండాలంటే సౌమ్యంగా చేయించుకోవాలి. డబ్బు ఇచ్చినంత మాత్రాన తిడ్తే యీ రోజుల్లో ఎవరూ పడరు."
"పడకపోతే పోతారు" లత విసురుగా అంది.
"పొతే అవస్థ పడేది నీవే. నన్నేదో సాదిద్దామనుకుని చేస్తున్నావు కాని, నాకు నౌకర్లు , చాకర్లు అక్కరలేకుండా నా పనులు నేను చేసుకోగలను. ముందు నించి అలా పెరిగాను. ఆ వరియన్నం తిని గడుపుకోగలను. అంచేత నన్నేదో సాదిద్దామనుకుంటే అవస్థ పడేది నీవు. ఈసారి నౌకర్లని తిడితే వాళ్ళు వెళ్ళిపోతే మరొకళ్ళు దొరకరు. రారు నీ యిష్టం" తెగేసి చెప్పాడు. వూరుకుంటుంటే లత మరీ రెచ్చిపోతుందని ప్రసాద్ ఈ మధ్య జవాబులు గట్టిగానే యిస్తున్నాడు.
"ఏం నాన్న పోయారు , యింటికి తమరే అధికారులనుకుంటున్నారేమిటి, గట్టిగా దబాయిస్తున్నారీ మధ్య" ఒకరోజు ప్రసాద్ ఏదో అంటే వ్యంగ్యంగా ఎత్తి పొడిచింది లత.
"అబ్బే ఇంటి యజమానిని ఎలా అవుతాను. నీవు అవనివ్వవని నాకు తెలుసుగా. నీ బానిసని. ఆస్థిపరురాలివి, హక్కుదారివి నువ్వుండగా నేనెలా అవుతాను" ప్రసాద్ అంతకంటే వ్యంగ్యంగా చురక అంటించాడు.
యింట్లో ప్రతిక్షణం ప్రతి చిన్న విషయానికి యిద్దరి మధ్య ఘర్షణ తప్పటం లేదు. తండ్రి భయాన ఇదివరకు కాస్త గొంతు తగ్గించి మాట్లాడే లత యిప్పుడు పూర్తి స్వేచ్చతో ప్రసాద్ తో డీ అంటే డీ అని తల పడ్తుంది. ప్రసాద్ యింటిపట్టునే వుండడం మానుకున్నాడు. ఉదయం ఎనిమిదికి వెళ్ళి రాత్రి పదివరకు తిరిగి తిరిగి వస్తాడు. దానికి ఓ రాద్దాంతం చేసి తనంటే నిర్లక్ష్యం అని, ప్రేమ లేదని , తన డబ్బు తింటూ తననే లెక్కచెయ్యడని రోజూ దెబ్బలాడేది. ఆఖరాఖరికి ప్రసాద్ ఆమె ఏమన్నా చెవిటి వాడిలా జవాబు చెప్పకుండా మౌనంగా వుండే సహనం అలవరచుకున్నాడు. నోరిప్పని భర్తని ఎలా సాధించాలో తెలియక దారులు వెతికింది లత.
ఆఖరికి ఓ దారి కన్పించింది లతకి. ప్రసాద్ ఆఫీసు లో శాంతికి ఉద్యోగం యిచ్చిన విషయం లతకి తెలిసింది. శాంతికి ఉద్యోగం యివ్వడం, అప్పటినించి ప్రసాద్ బొత్తిగా యింటి పట్టునుండక పోవడం ఒక దానితో ఒకటి కలిపి ఆలోచించింది. అసూయ, ద్వేషంతో రగిలిపోయింది. ఆఫీసులో ఏం జరిగేది ఎప్పటికప్పుడు లతకి వార్తలందించే బంట్రోతు రంగయ్య లతకి నమ్మినబంటు. అతని ద్వారా శాంతి అందచందాలు గురించి విని అసూయపడాల్సింది ఏమి లేదని గ్రహించినా, అతను శాంతికి ఉద్యోగం యివ్వడానికి పడిన శ్రమ , చూపిన శ్రద్ధ తెలిసి ఆమె పట్ల అతనికి జాలి, సానుభూతి , అబిమానం వున్నాయని మిగతా అందరితో కంటే ఆమెతో దయగా, అభిమానంగా , మర్యాదగా ప్రవర్తిస్తాడని విని భర్తని సాధించే కారణం ఒకటి దొరికిందని సంతోషించింది.
"మీ ఆఫీసులో అడ టైపిస్టు కి ఉద్యోగం యిచ్చారుటగా" ఆఫీసు నించి రాగానే వ్యంగ్యంగా అడిగింది.
ఎలా తెల్సింది చెప్మా అనుకుని ఆశ్చర్యపోయాడు. అయినా పైకి అది తెలీయనీయకుండా "ఊ" అన్నాడు నిర్లిప్తంగా.
"రాత్రింబవళ్ళు ఆఫీసు కెళ్ళి ఎందుకు కూర్చుంటున్నారో అర్ధం అయింది" హేళనగా, కసిగా అంది.
"లతా! ప్రసాద్ మొహం ఎర్రబడింది. "వక్రబుద్ధి అంతకంటే ఎక్కువగా ఆలోచించదని నాకు తెలుసు. అనవసరంగా ఆ అమ్మాయి మీ నీ దృష్టి పడనీయకు. నన్ను ఎన్ని మాటలన్నా సహిస్తున్నాను నిన్ను కట్టుకున్న పాపానికి కాని ఆ అమ్మాయిని యిందులో కలపకు" కఠినంగా అన్నాడు.