Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 35


    అప్రతిభుడయిపోయి ఆ దృశ్యాన్ని చూశాడు అతను. భావుకుడిలా, అద్భుతమైన ఆనందంతో మెరిసిపోతున్న అన్వేషి ముఖం వైపే చూస్తోంది శృతి.

 

    'గూఢచారిగారు సౌందర్యారాధకుడే కాదు..... సౌందర్యాన్వేషి కూడా' అనుకుందామె.

 

    సడెన్ గా అతనికి ఫౌంటెన్ వెనుకగా వున్న పొదల పక్కన ఏదో కదలిక కనిపించేసరికి చురుగ్గా కిటికీవైపు కదిలాడతను.

 

    సెక్యూరిటీగార్డ్ వైర్ లెస్ లో ఏదో మాట్లాడుతూ కనిపించేసరికి ఊపిరి పీల్చుకున్నాడు.

 

    కొత్త వ్యక్తులమీద నిఘా ఏ స్థాయిలో వుంటుందో అతనికి వెంటనే అర్థమైంది.

 

    ప్యాలెస్ కు సంబంధించి అక్కడ పనిచేస్తున్న అందర్నీ చూడాలను కొంటున్నాడతను.

 

    అదడగాలనే శృతివైపు తిరిగి చూశాడు.

 

    ఆమె విండోలోంచి ఫౌంటెన్ వైపు తన్మయంగా చూస్తోంది.

 

    "ఇక్కడున్న హౌస్ కీపర్, కేర్ టేకర్, నౌకర్లందర్నీ పరిచయం చేసుకుంటే బావుంటుందనుకుంటున్నాను. ఎవరి చప్పుడూ వినిపించడం లేదేం? కొంపదీసి విశ్వాత్మగారు రోబోట్స్ ని పనివాళ్ళుగా పెట్టాడా" అన్నాడతను హుషారుగా.  

 

    చురుగ్గా అతని ముఖంలోకి చూసింది శృతి.

 

    "విశ్వాత్మ ఫౌండేషన్ లో పనిచేసే ఉద్యోగులు ఆయనమీద ఏ విధమైన కామెంట్స్ చేయకూడదనేది పటిష్టమైన రూల్. అది మీరు తెలుసుకోవడం మంచిది" ఒకింత చిరుకోపాన్ని అభినయిస్తూ అందామె.

 

    "సారీ" అన్నాడు వెంటనే అతను. విశ్వాత్మ అంటే అక్కడున్న అందరికీ దేముడితో సమానమని అప్పటికిగాని పూర్తిగా అర్థం కాలేదు అతనికి.

 

    తర్వాత అతను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పింది శృతి. "మనల్ని డిస్టర్బ్ చేయకూడదనుకుని ఎవరూ రాలేదు ఇక్కడికి. బహుశా క్రింద వెయిట్ చేస్తుంటారు. మనం పిలిస్తే వస్తారు" హుందాగా చెప్పింది శృతి.

 

    "ఇక్కడున్న ఆర్ట్ కలెక్షన్స్ చాలా ఖరీదైనవనుకుంటాను" అని టాపిక్ మారుస్తున్నట్లు అడిగాడతను.

 

    "మిలియన్లు... కొన్ని బిలియన్లు ఖరీదు చేస్తాయి. బట్ కళకు వెలకట్టే ఆలోచన నాకు నచ్చదు. మిత్రాగారు చెప్పిన 3170 కోట్ల అరవై లక్షల సంపదలో పెయింటింగ్స్ ని చేర్చలేదు. కారణం కళకు విలువకట్టడం విశ్వాత్మ కిష్టం వుండేది కాదు" కళ్ళల్లో ఓ వింత భావన వ్యక్తం చేస్తూ చెప్పింది శృతి.

 

    అతనికి కొత్తగా అనిపించింది ఆమె ఫీలింగ్.

 

    "నో నో... నా అభిప్రాయం కళకు వెలకట్టడం కాదు తెలుసుకోవాలనే క్యూరియాసిటీ, అంతే. ప్రపంచంలోని అందాలను ఆస్వాదించే మనసు నాకుంది. ఐ లైక్ దిస్ ప్యాలెస్. అది మీతో కలిసిరావడం వండ్రఫుల్ ఎక్స్ పీరియన్స్" అన్నాడతను తన్మయత్వంగా.

 

    "అందాలను ఆస్వాదించే మనసులో రొమాన్స్ క్కూడా స్థానం ఎక్కువే అనుకుంటాను" పెదవిని మునిపంట నొక్కి పెడుతూ అంది శృతి.

 

    "ప్రపంచంలోని అందాలన్నీ నావే... ప్రస్తుతం తప్ప. ఈ ప్యాలెస్ ను చూసి ఆనందిస్తున్నాను" చాలా ఫ్రాంక్ గా చెప్పిన ఆ జవాబుకి చిన్న తడబాటుకి లోనైంది శృతి.

 

    కలవరంగా ఒకింత సిగ్గును దాచుకుంటూ చూసిందామె అన్వేషి కళ్ళల్లోకి.

 

    ఆ కళ్ళు అన్వేషి భావాలకు వంత పలుకుతున్నాయి. భాష లేని భావం అంటే ఇదేనేమో అనుకున్నది శృతి. ఏదో చెప్పాలన్నట్లు తడబడిందామె.

 

    "పదండి.... మీకు క్రిప్టోగ్రాఫ్ అమర్చిన గది చూపిస్తాను" అని అంది.

 

    ఆ రూంలోంచి బయటికొచ్చి పొడవాటి కారిడార్ లో నడుస్తున్నారిద్దరూ.

 

    కొంత దూరం వెళ్ళాక ఓ గది ముందాగింది శృతి.

 

    ఆ గది తలుపుల్ని తన దగ్గరున్న కీతో తెరిచి బయటే హైహీల్స్ వదిలి లోపలికి అడుగుపెట్టింది.

 

    "ఇదే విశ్వాత్మ బెడ్ రూం ఇందులోంచే అండర్ గ్రౌండ్ లో కెళ్ళే మెట్లున్నాయి" చెబుతూ నడిచి ఓ ఎత్తయిన కిటికీ దగ్గరకు వెళ్ళింది శృతి.

 

    ఆ గదిలోని కెళ్ళగానే అన్వేషి నలువైపులా చూశాడు. మనసు లోతుల్లోపల్నుంచి ఎవరో జ్ఞాపకాలను తవ్వుతున్న అస్పష్టమైన వింతైన అనుభూతి. ఆ అనుభూతికి ఆకృతి లేదు. కళ్ళముందు కనబడని ఏదో అడుగుల చప్పుడు... ఏవేవో గుసగుసల మాటల ధ్వని.

 

    యుగాల క్రిందటి వింత పరిమళం... ఒక పక్క విశాలమైన బెడ్, ఆ పక్కన టేబిల్, దానిమీద పాతకాలపు టేబుల్ లైట్, పెన్ స్టాండ్, కొన్ని బుక్స్, చుట్టూ అల్మరాల నిండా బుక్స్, బట్టల స్టాండ్, వాటికి కొంచెం దూరంలో ఈజీఛైర్.

 

    ఆ పక్కన టీపాయ్ మీద పాత న్యూస్ పేపర్, దానిపక్కన రేడియో, మకిలిపట్టిన షాండెలీర్, కింద కార్పెట్. సన్నని వెలుతురు షాండెలీర్ మీద పడి గదినిండా వింతకాంతుల్ని ప్రతిఫలింపజేస్తుంది. ఆ షాండెలీర్ వైపు కన్నార్పకుండా చూస్తూ అన్వేషి అచేతనుడై పోయాడు... అప్రతిభుడై పోయాడు. ఎడారిలో ఇసుక తెరలు, తెరలుగా ఎగురుతున్న వింత చప్పుడు.... నందనవనంలో పూలరెక్కలు కళ్ళెదురుగా వికసిస్తున్న వింత అనుభూతి. అస్పష్ట జ్ఞాపకాల జలపాతంలో తడుస్తున్నాడతను. కాసేపటికి తేరుకుని-

 

    టీపాయ్ మీదున్న పాత న్యూస్ పేపర్ని అందుకోటానికి చేయి ముందుకు సాచాడు అన్వేషి.

 

    అల్లంత దూరంలో వున్న శృతి పరుగు పరుగున అతని దగ్గరకొచ్చి, ఆ చేతిని వెనక్కి లాగేస్తూ గట్టిగా పట్టుకుంది. "ఇక్కడి వస్తువుల్నెవరూ ముట్టుకోకూడదు. మరీ ముఖ్యంగా ఈ బెడ్ రూంలోనివి. ఎందుకంటే విశ్వాత్మ చనిపోయిన సమయంలో ఈ బెడ్ రూం ఎలా వుందో, అలాగే యథాతథంగా ఈ బెడ్ రూంని వుంచడం జరిగింది" అందామె కంగారుగా.

 

    "సారీ" అన్నాడు అన్వేషి.

 

    ఆమె చేయి అతని చేతిలోనే వుంది. సుతిమెత్తని స్పర్శ మృదువుగా వుంది. ఒక ఆడపిల్ల చేతిని స్పర్శించటం అన్వేషికి అదే ప్రధమం. అతని కనుబొమ్మల్లోకి చూస్తూ సడన్ గా స్పృహలోకొస్తూ కాసేపటికి తన చేతిని వెనక్కి తీసేసుకుంది శృతి.

 

    "ఆ న్యూస్ పేపర్..." ప్రశ్నించబోయాడు అన్వేషి.

 

    "ముప్పై సంవత్సరాల క్రితం విశ్వాత్మ మరణించిన రోజునాటి న్యూస్ పేపర్.

 

    విశ్వాత్మ మరణంపై పరిశోధన చేయటానికి వచ్చిన శాస్త్రవేత్తలు ఆధ్యాత్మిక వాదులు చాలామంది ఆ న్యూస్ పేపర్ ఒక్కసారైనా చూడాలని పట్టుబట్టారు. రిక్వెస్ట్ చేశారు. ట్రస్టీ మెంబర్లు ఎందుకోగాని ఒప్పుకోలేదు" చెప్పింది శృతి.

 

    దూరం నుంచే ఆ న్యూస్ పేపర్ వైపు చూసాడు అన్వేషి. అది హిందూ- ఇంగ్లీషు దినపత్రిక. బ్యానర్ అక్షరాలు స్పష్టంగా కనిపించడం లేదు.

 

    ముందుకు నడిచి, కిటికీ పక్కన బ్యాంక్ లాకరులా వున్న ఐరన్ డోర్ అన్ లాక్ వీల్ ని క్లాక్ వైజ్ లో తిప్పింది. కళ్ళముందు జరుగుతున్న దృశ్యాన్ని చాలా వింతగా చూస్తున్నాడు అన్వేషి.

 

    చిన్నగా చప్పుడు చేస్తూ ఆ చట్రం తిరగటం, అ వెనువెంటనే అంతవరకూ గోడలా వున్న ప్రదేశంలో ఫిక్స్ చేసిన డోర్ పక్కకు జరగడంతో-

 

    శృతి ముందుకు కదిలింది.

 Previous Page Next Page