జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ||
పదవ అధ్యాయము
1. అపోదేవా మధుమతీరగృభ్ణన్నూర్జస్వతీ రాజస్వశ్చితానః|
యాభిర్మిత్రా వరుణా వభ్యషించిన్యాభిరింద్రమనయన్నత్యారాతీః||
(అభిషేకమునకు గాను ఔదుంబరపాత్రలందు సరస్వతి మున్నగు నదుల జలము తెచ్చిఉంచవలెను. గోసంబంధములను వేరు పాత్రలో ఉంచవలెను. వానిని యూపపు ఉత్తరభాగమున ఉంచవలెను.)
దేవతలు మధురములు - శక్తిమంతములు - రాజస్వములు - చైతన్య వంతములగు జలములను తెచ్చినారు. మిత్రావరుణులను దేవతలకు రాజునుగా అభిషేకించిన జలమును తెచ్చినారు. ఇంద్రుని శత్రుంజయుని చేయుటకు అభిషేకించిన జలమును తెచ్చినారు.
2.(ఈమంత్రములకు రెండు పాఠములు ఉన్నవి. స్వాహాంతమున ఆహుతినీయవలెను. మరొక పాఠమున జలమును గ్రహించవలెను. మనుష్యులు లేక పశువులు నదిలో ప్రవేశించినపుడు కలిగిన తరంగముల జలమును స్వీకరించవలెను)
1. తరంగమా! నీవు సేచన సమర్థవు. రాజ్యమును ఇచ్చుదానవు. మాకు రాజ్యమును ప్రదానము చేయుము. స్వాహా. 2. తరంగమా! నీవు సేచన సమర్థవు. రాజ్యమును ఇచ్చుదానవు. దేవదత్తుదులకు రాజ్యము ప్రసాదించుము.
3.1. జలమా! నీవు అభిషేకార్థము యజ్ఞభూమికి చేరుకొనుదానవు. నీవు రాజ్యమును ఇచ్చుదానవు. మాకు రాజ్యము ప్రసాదించుము - స్వాహా. 2. జలమా నీవు అభిషేకార్థము యజ్ఞభూమికి చేరుకొనుదానవు. రాజ్యము ఇచ్చుదానవు. దేవదత్తాదులకు రాజ్యము ప్రసాదించుము.
1. జలమా! నీవు అభిషేకార్థము యజ్ఞభూమికి చేరుకొనుదానవు. నీవు రాజ్యమును ఇచ్చుదానవు. మాకు రాజ్యము ప్రసాదించుము - స్వాహా. 2. జలమా నీవు అభిషేకార్థము యజ్ఞభూమికి చేరుకొనుదానవు. రాజ్యము ఇచ్చుదానవు. దేవదత్తాదులకు రాజ్యము ప్రసాదించు.
1. జలమా! నీవు ఓజోయుక్తవు. రాజ్యము ఇచ్చుదానవు. మాకు రాజ్యము ప్రసాదించుము స్వాహా. 2. జలమా! నీవు ఓజోయుక్తవు. రాజ్యము నిచ్చుదానవు. దేవదత్తాదులకు రాజ్యము ప్రసాదించుము.
1. జలమా! నీవు సర్వత్ర గమనము గలదానవు. మాకు రాజ్యము ప్రసాదించుము - స్వాహా. 2. జలమా! నీవు సర్వగమనవు. రాజ్యము నిచ్చుదానవు. దేవదత్తాదులకు రాజ్యము ప్రసాదించుము.
1. సముద్రజలమా! నీవు నదులు మున్నగు జలములకు స్వామివి. రాజ్యము నిచ్చుదానవు. మాకు రాజ్యము ప్రసాదించుము- స్వాహా. 2. సముద్రజలమా! నీవు నదులు మున్నగు జలములకు స్వామివి. రాజ్యమునిచ్చుదానవు. దేవదత్తాదులకు రాజ్యము ప్రసాదించుము.
1. జలభ్రమణమా! నీవు జలముల గర్భమవు. రాజ్యమునిచ్చుదానవు. మాకు రాజ్యమును ప్రసాదించుము. స్వాహా. 2. జలభ్రమణమా! నీవు జలముల గర్భమవు. రాజ్యమును ఇచ్చుదానవు. దేవాదత్తాదులకు రాజ్యము ప్రసాదించుము.
4. 1. స్థిర ధర్మయుక్తజలమా! నీవు సూర్యుని తేజస్సు గలదానవు. రాజ్యము నిచ్చుదానవు. మాకు రాజ్యము ప్రసాదించుము- స్వాహా. 2. స్థిర, ధర్మయుక్త జలమా! నీవు సూర్యుని తేజస్సు గలదానవు. రాజ్యము నిచ్చుదానవు. దేవదత్తాదులకు రాజ్యము ప్రసాదించుము.
(యూపమునుంచి వచ్చు జలమును సేకరించి- యూపమునకు ఉత్తరమున స్థాపించిన జలములందు హొమము చేయుచు)
1. యూపమునుండి కురిసిన జలమా! నీవు సూర్యతేజస్సు గలదానవు. రాజ్యమునిచ్చుదానవు. మాకు రాజ్యము ప్రసాదించుము- స్వాహా. 2. యూపమునుండి కురిసిన జలమా! నీవు సూర్యతేజస్సుగల దానవు. రాజ్యమునిచ్చుదానవు. దేవదత్తాదులకు రాజ్యము ప్రసాదించుము.
1. తాటకజలమా! నీవు పశుపక్ష్యాదులకు ఆనందము కలిగించుదానవు. రాజ్యము నిచ్చుదానవు. మాకు రాజ్యము ప్రసాదించుము- స్వాహా. 2. తటాకజలమా! నీవు పశుపక్ష్యాదులకు ఆనందము కలిగించుదానవు. రాజ్యమునిచ్చుదానవు. దేవదత్తాదులకు రాజ్యము ప్రసాదించుము.
1.కూపస్థ జలమా! రాజ్యమునిచ్చుదానవు. మాకు రాజ్యము ప్రసాదించుము. స్వాహా 2. కూపస్థజలమా! నీవు రాజ్యమునిచ్చుదానవు. దేవదత్తాదులకు రాజ్యము ప్రసాదించుము.
1. అవశ్యాయజలమా! నిన్ను సర్వజనులు కోరుదురు. నీవు రాజ్యమునిచ్చుదానవు. మాకు రాజ్యము ప్రసాదించుము - స్వాహా. 2. అవశ్యాయజలమా! నీవు సర్వకామ్యవు. రాజ్యము నిచ్చుదానవు. దేవదత్తాదులకు రాజ్యము ప్రసాదించుము.
1. మధురూపజలమా! నీవు బలమును, రాజ్యమును ఇచ్చుదానవు. మాకు రాజ్యాము ప్రసాదించుము- స్వాహా. 2. మధురూపజలమా! నీవు బలమును, రాజ్యమును ఇచ్చుదానవు. దేవదత్తాదులకు రాజ్యము ప్రసాదించుము.
1.శక్వరజలమా! నీవు గోవుల వలన లభించినదానవు. నీవు రాజ్యమునిచ్చుదానవు. మాకు రాజ్యము ప్రసాదించుము. స్వాహా. 2. శక్వరజలమా! నీవు గోవుల వలన లభించినదానవు.
(నదులు గోముఖము నుండి బయలుదేరినవని విశ్వాసము)
(పాలలో హొమము చేయుచు)
1. దుగ్ధజలమా! నీవు ప్రజల పానాదులకు ఉపయుక్తవు. నీవు రాజ్యము నివ్వగలదానవు. మాకు రాజ్యము ప్రసాదించుము - స్వాహా. 2. దుగ్ధజలమా! నీవు ప్రజల పానాదులకు ఉపయుక్తవు. రాజ్యమునివ్వగలదానవు. దేవదత్తాదులకు రాజ్యము ప్రసాదించుము.
(ఘృతమున హొమము చేయుచు)
1. ఘృతరూపజలమా! నీవులోకములను పోషించు దానవు. రాజ్యము నిచ్చుదానవు. మాకు రాజ్యమును ప్రసాదించుము - స్వాహా. 2. ఘృతరూపజలమా! నీవు లోకములను పోషించుదానవు. రాజ్యమునిచ్చుదానవు. దేవదత్తాదులకు రాజ్యము ప్రసాదించుము.
(ఈ పదహారు హొమజలములు. మరీచి- ఎండకు కాగిన మరియు సరస్వతీ జలముల వేరుగా హొమము ఉండదు. మరీచి జలమును దోసిలితో తీసి మిగిలిన నీట కలుపువలెను)
మరీచిజలమా! నీవు స్వయంశోభితవు. రాజ్యము నిచ్చుదానవు. మాకు రాజ్యము ప్రసాదించుము- స్వాహా. 2. మరీచిజలమా! నీవు స్వయంశోభితవు. రాజ్యమునిచ్చు దానవు. దేవదత్తాదులకు రాజ్యము ప్రసాదించుము.
(సరస్వతి మున్నగు నదుల జలమును ఔదుంబర పాత్రలో కలిపి)
మధురజలము మధురజలమున కలసినది. ఈ మహారాజ్యము క్షత్రియుని వారించవలెను)
(ఔదుంబరపాత్ర యందలి జలమును మిత్రా వరుణ సంబంధి ధిష్ణ్య ముందుంచవలెను)
జలములారా! ఈక్షత్రియ యజమానికి రాక్షసులు పరాభవించలేని బలమును కలుగజేసి, అతనికి రాజ్యము వప్పగించి మీరు స్థిరపడండి.
జలములేమిటి? రాజ్యము లిచ్చుటేమిటి అబ్బురమా ఇది!! ఏమాత్రముకాదు .రాజ్యములను నిర్మించునవి, రక్షించునవి, కూల్చునవి జలములే! జలములు 18 కలసి ఈ పనులు చేయగలవు. ఒక్కొక్కటి కాదు.
జలము అనుపదము ద్రవము అను అర్థమున వాడినట్లున్నది.
5. (మిత్రావరుణుల ధిష్ణ్యముందు స్థాపించిన పలాశాది నాలుగు పాత్రలకు తూర్పున పులిచర్మము పరచవలెను)
చర్మమా! నీవు సోమపు దీప్తివి. నాకు నీవంటి కాంతి లభించవలెను.
(పన్నెండు ఆహుతులందు ఆరు అభిషేకమునకు ముందు ఆరు అభిషేకము తరువాత అర్పించవలెను)
అగ్నయేస్వాహా సోమాయస్వాహా. సవిత్రే స్వాహా. సరస్వత్యైస్వాహా. పూష్ణేస్వాహా. బృహస్పతయే స్వాహా.
ఇంద్రాయస్వాహా. ఘోషాయస్వాహా. శ్లోకాయస్వాహా. భగాయ స్వాహా. అంశాయస్వాహా. ఆర్యమ్ణే స్వాహా.
6. (దర్భలతో రెండు పవిత్రములు చేసి వానిలో బంగారము పెట్టవలెను. మిత్రావరుణ సంబంధ దిష్ణ్యముందున్న పాత్రలలోని జలమును పవిత్రములచే పవిత్రము చేయవలెను)
పవిత్రములారా! మీరు ఇరువురు విష్ణుసంబంధులు. నేను సర్వప్రేరక సవిత అధీనపువాడను. నేను మీతోను, ఛిద్రరహిత సూర్య కిరణములతోను అభిషేకజలమును పవిత్రము చేయుచున్నాను.
రాక్షసులచే బాధింపరాని జలమా! నీవు అగ్నియందు పుట్టినావు. సోమమునకు దానము చేసినావు. స్వాహా. అభిషేకమున రాజును చేయుదానవు.
7. (నాలుగు పాత్రలందలి అభిషేక జలమును తేవలెను)
ఈజలమును ఒక్కొక్క పాత్రలో హర్షించునది. యశోవంతము. అన్నవంతము. రాక్షసులు పరాభవించలేనిది. కర్మసమర్థము. పాత్రలందు పవిత్రము. గృహస్థ జలము పుత్రిక కాగా వానికి తల్లిఅగునది. ఈ జలములందు వరుణుడు ప్రవేశించినాడు.
8. (వస్త్రము దాల్చుచు)
పట్టు లేక నూలు వస్త్రమా! నీవు యజమానిని నీగర్భమున వలె దాల్చుము. కంబళమా! గర్భమందున్న యజమానిని కప్పునట్టి చర్మమవు. కంచుకమా! నీవు యజమానిని గర్భమునందు దాల్చుయోనివి. శిరోవేష్టమా! నీవు యజమాని శిరోరక్షవు.
(ధనుస్సు రెండు కొనలను శుభ్రము చేయవలెను)
దక్షిణకోటీ! నీవు మిత్రసంబంధివి. ఉత్తరకోటీ! నీవు వరుణసంబంధివి.
(అధ్వర్యు యజమానికి ధనుస్సును ప్రదానము చేయవలెను)
ధనువా! నీవలన ఈయజమాని తన శత్రువును వధించుశక్తి గలవాడు కావలెను.
(అధ్వర్యు మంత్రము ఉచ్చరించుచు మూడు బాణములను- శరములను- యజమానికి అందించవలెను)
బాణమా! నీవు యజమానిని తూర్పుదిక్కున రక్షించుము. బాణమా! నీవు యజమానిని పశ్చిమ దిశన రక్షించుదానవు. బాణమా! యజమాని ఉన్నచోటనల్ల రక్షింపుము. బాణమా! యజమానిని సకల దిశలందు రక్షింపుము.
9. మానవులారా! యజమాని అందరిముందు ప్రకటించబడినాడు. గృహస్వామి అగ్నిముందు ప్రకటించబడినాడు. యశోవంతుడగు ఇంద్రుని ముందు ప్రకటించబడినాడు. దేవశాసకులగు మిత్రావరుణుల ముందు ప్రకటించబడినాడు. విశ్వధనస్వామి పూషముందు ప్రకటించబడినాడు. లోకకళ్యాణకారులగు ద్యావాపృథ్వుల ముందు ప్రకటించబడినాడు. అనేక సుఖముల అదితి ముందు ప్రకటించబడినాడు.
10. (సోమమును అభిషవించుచు- యజమానిచే మంత్రములు చెప్పించుచు- ఒక్కొక్క దిక్కునక తీసికొనివెళ్లవలెను)
యజమానీ! నీవు తూర్పుదిక్కున సంచరించుము. గాయత్రి నిన్ను రక్షించును గాత. ఋక్కు పై నిలిచినా రథంతరము నిన్ను రక్షించును గాత. త్రివృత్ సామము నిన్ను రక్షించును గాత. వసంతబుతురు నిన్ను రక్షించును గాత. ధనురూపబ్రహ్మణము నిన్ను రక్షించును గాత.
11. యజమానీ! నీవు దక్షిణదిశన సంచరించుము. త్రిష్టుప్ ఛందము నిన్ను రక్షించును గాత. ఋక్కుపై నిలిచిన బృహత్ సామము నిన్ను రక్షించును గాత. పంచదశస్తోమము నిన్ను రక్షించును గాత. గ్రీష్మఋతువు నిన్ను రక్షించును గాత. ధనురూప క్షాత్రము నిన్ను రక్షించును గాత.
12. యజమానీ! నీవు పశ్చిమదిశన సంచరించుము. జగతీ ఛందనము నిన్ను రక్షించును గాత. ఋక్కు పైనిలిచిన వైరూపసామము నిన్ను రక్షించును గాత. సప్తదశస్తోమములు నిన్ను రక్షించును గాత. వర్షఋతువు నిన్ను రక్షించును గాత.
13. యజమానీ! నీవు ఉత్తరదిశన సంచరించుము. అనుష్టుప్ ఛందము నిన్ను రక్షించును గాత. ఋక్కుపై నిలిచిన వైరాజసామము నిన్ను రక్షించును గాత. ఏకవింశతిస్తోమము నిన్ను రక్షించును గాత. శరదృతువు నిన్ను రక్షించును గాత. యజ్ఞఫలస్వరూప ధనము నిన్ను రక్షించునుగాత.