Previous Page Next Page 
శుక్ల యజుర్వేద సంహిత పేజి 35


    23. (ఔదుంబర పాత్రలోని పాలు, యవలు మున్నగువానిని స్రువముతో ఆహవనీయగ్నిలో హొమము చేయవలెను)

    అన్నములను కల్పించిన వాడు ప్రజాపతి. అతడు సృష్టి ఆదిన సోమమును జలమునుండి, ఓషధులనుండి- సృజించినాడు. ఆ జలములు, ఓషధులు మాకు మధురములు కావలెను. మేము పురోహితుల సహితులమై స్వరాజ్యమున అప్రమత్తులము కావలెను స్వాహా.

    24. అన్నములను కల్పించినవాడు ప్రజాపతి. ఈలోకములను - సమస్త భూతములను అతడే కల్పించినాడు. హవి ఇవ్వని నావంటివానితో సహితము హవి ఇప్పించును. అతడు మాకు సమస్త వీరుల సహితమగు ధనము ప్రసాదించవలెను -స్వాహా.

    25. అన్నములను కల్పించినవాడు ప్రజాపతి. అతడు సమస్త భూతమాత్రలను సృష్టించినాడు. అతడు నిత్య సామ్రాట్టు. తన అధికారమును ఎరిగినవాడు. స్వేచ్ఛగా సర్వత్ర సంచరించువాడు. అతడు మాకు సంతానపుష్టి - ధనపుష్టి కలిగించుచు సర్వత్ర వ్యాపించవలెను- స్వాహా.

    26. మమ్ము రక్షించుమని రాజగు సోమమును- ద్వాదశ ఆదిత్యులను- సూర్యుని- బ్రహ్మను- బృహస్పతిని ఆహ్వానించుచున్నాము. స్వాహా.

    27. అగ్నీ! ఇది మా యజ్ఞము. ఇందు మా హితము పలుకుము - శుభములు సంకల్పించుము. వేలధనముల విజేతా! అగ్నీ! మాకు ధనాదులు ప్రసాదించుము - స్వాహా.

    27. ఆర్యమ,  ఇంద్ర, బృహస్పతి, ఈశ్వరులారా! మీరు దానములను ప్రోత్సహించండి. వాగ్దేవి సరస్వతి, విష్ణు, సవిత, అన్నవంత ప్రజాపతికి స్వాహా.

    28. అగ్నీ! ఇది మా యజ్ఞము. ఇందు మాహితము పలుకుము. మాకు శుభములు సంకల్పించుము. వేల ధనముల విజేతా! అగ్నీ! మాకు ధనాదులు ప్రదానము చేయుము. నీవే కదా ధనస్వామివి స్వాహా.

    29. ఆర్యమ, పూష, బృహస్పతి, వాగధిదేవత సరస్వతి మాకు ధనము ప్రసాదించవలెను స్వాహా.

    30. (హుతశేషము యజమాని మీద చల్లవలెను)

    నేను సవిత అధీనపువాడిని, అశ్వినుల బాహువులతోను, పూషహస్తములతోను, వాక్కును నియంత్రించు సరస్వతి అనుగ్రహముతోను, యజమానివగు నిన్ను ధనములందు. ప్రతిష్ఠంచుచున్నాను. నిన్ను బృహస్పతి సామ్రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేయుచున్నాను.

    31. (ఇవి 'ఉజ్జితి' మంత్రములు వీనిచే ఘృతాహుతి ఇవ్వవలెను)

    అగ్ని ఏకాక్షర ఛందమున పంచప్రాణములను గెలిచినాడు. యజమానినగు నేను నా పంచప్రాణములను గెలిచెదను. అశ్వినులు రెండక్షరముల ఛందమున రెండు కాళ్లుగల మానవులను జయించినారు. నేను కూడా ఆ మానవులను గెలువవలెను. విష్ణువు మూడక్షరముల ఛందమున ముల్లోకములను గెలిచినాడు. నేను కూడ ఆ మూడు లోకములను గెలువవలెను. సోమము నాలుగక్షరముల ఛందమున చతుష్పాత్త పశువులను గెలిచినది. నేను సహితము చతుష్పాద జంతువులను గెలువవలెను.

    32. పూషదేవత అయిదక్షరముల ఛందములచే 4 దిక్కులను + 1అవాంతరదిశ = అయిదింటిని గెలిచినాడు. నేను సహితము ఆ అయిదింటిని గెలువవలెను. సవితా దేవత ఆరక్షరముల ఛందమున ఆరు ఋతువులను గెలిచినాడు. నేను సహితము ఆరు ఋతువులను గెలువవలెను. మరుత్తులు ఏడక్షరముల ఛందమున ఏడుగ్రామ్య జంతువులను గెలిచినాడు. నేను సహితము ఆ ఏడింటిని గెలువ వలెను. బృహస్పతి అష్టాక్షర ఛందమున గాయత్రిని గెలిచినాడు. నేను సహితము గాయత్రిని గెలువవలెను.

    33. మిత్రుడు నవాక్షర ఛందమున త్రివృత్తమును గెలిచినాడు. నేను కూడ దానిని గెలువవలెను. వరుణుడు దశాక్షరఛందమున "విరాజము"ను గెలిచినాడు. నేను కూడ దానిని గెలువవలెను. ఇంద్రుడు ఏకదశాక్షర ఛందమున "త్రిష్టుప్". ను గెలిచినాడు. నేను కూడ దానిని గెలువవలెను. విశ్వేదేవతలు ద్వాదశాక్షర ఛందమున "జగతి"ని గెలిచినారు. నేను కూడ దానిని గెలువవలెను.

    34. వసువులు పదమూడు అక్షరముల ఛందమున త్రయోదశస్తోమమును గెలిచినారు. నేను సహితము వానిని గెలువవలెను. రుద్రులు పదునాలుగు అక్షరముల ఛందమున చతుర్దశస్తోమమును గెలిచినారు. నేను  సహితము వానిని గెలువవలెను. ఆదిత్యులు పదిహేను అక్షరముల ఛందమున పంచదశ స్తోమమును గెలిచినారు. నేను సహితము దానిని గెలువవలెను. అదితి పదహారు అక్షరముల ఛందమున షోడశస్తోమమును గెలిచినది. నేను సహితము దానిని గెలువవలెను. ప్రజాపతి పదిహేడు అక్షరముల ఛందమున సప్తదశస్తోమమును గెలిచినాడు. నేను సహితము దానిని గెలువవలెను.

       

        వాజపేయ యజ్ఞము సమాప్తము.

   
    ఆలోచనామృతము

    వేదము సనాతనము. పురాతనము. మహత్తమము. పవిత్రము. విశాలము. గహనము. ఉపమానమునకు అందనది.

    వేదము అను పదము ఒక్కటి. కాని వేదము అనంతము. ఈ అనంత వేదమును ఆరాధించిన ఆరాధించుచున్న - ఆరాధించనున్న వారు అనేకానేకులు. ఒకసూర్యుదే ఒక్కొక్క పరిశోధకుని ఒక్కొక్క రీతిగా కనిపించును. ఒక్కవేదమనునది లెక్కకు మించిన పరిశోధకులకు లెక్కకు మించినరీతిగా అగుపించును.

    వేదమును పరిశీలించిన  - వ్యాఖ్యానించిన విమర్శించినవారు అనేకులు. వీరిలో వేదమును అధ్యయనము చేసి సద్విమర్శలు - దుర్విమర్శాలు చేసినవారున్నారు. అధ్యయనము చేసి దుర్విమర్శించిన వారిని అధ్యయనము ఖండించవచ్చును.

    కాని వేదమును అధ్యయనము చేయకయే వేదమును గురించి ఒక అభిప్రాయమును ప్రచారము చేసిన వారిని ఖండించుట అసంభవము. ఏలనన వారు ఎవరో తెలియదు. వారు ఏ ఆధారమున అపోహలు కలిగించినారో తెలియదు.

    వేదమును గురించి అవ్యాఖ్య కువ్యాఖ్య చేసిన వారు రెండురకములు. ఒకరు సనాతనులము అనిపించుకొనవలెనను కొను స్వప్రయోజనపరులు. వీరు వాస్తవముగ సనాతనులు కారు. సనాతనపు ముసుగు వేసుకున్నవారు. వేదము వారిస్వంత ఆస్తిఅని భావించువారు. వీరికి ఏమియు తెలియదు. సర్వము వేదములందే ఉన్నది అనువారు రెండవరకము. పాశ్చాత్యుల మెప్పుపొందదలచి ఆదునికులము అనిపించు కొనవలెనను ఉబలాటము గలవారు. వీరిలో వామపక్షాల వారలమనిపించు కొనవలెనని జబ్బలు చరచువారు. మీరు వేదమును పనికిరాణి దానిగను- అందులో ఏదో  ఒకవర్గానికి ఉపయోగపడేది ఉందని ఒకప్రమాదకర అభిప్రాయాన్ని - వారికి తెలియకుండగనే - కనిపించినారు.

    వేదము పాతకాలపు బొంత అని చెప్పడం విప్లవముగా భావించుచున్నారు.

    ఇది ఒక వస్తువును చూడకయే దానిని గురించి వ్యాఖ్యనించుట. వీరు. తమను తాము Rationalists అనుకుంటారు! ఇదొక వింత!!

    వేదమందంతట వైరాగ్యమున్నదని - ఈ లోకమునకు సంబంధించినది లేదని, సమస్తము పరలోకము గురించియే ఉన్నదని ఒకభ్రమ భారతదేశమున బహుళ ప్రచారమున ఉన్నది. ఇది వట్టిభ్రమ మాత్రమే! వైరాగ్యము మాత్రమే ఉపదేశించునది భారత సాహిత్యమున లేదనునది నా దృఢవిశ్వాసము.

    భారతసాహిత్యము, తాత్త్వికము సాంతము మానవుని ఇహలోక జీవితమును సుఖశాంతులతో గడుపు ఉపాయములనే బోధించుచున్నవి. వేదమునందు ఇహలోకమును గురించియే వివరించి ఉన్నది. ఇది వాస్తవసత్యము.

    వేదము మానవుని మహిమాన్వితునిగ దర్శించినది. మానవుని ఒక్కొక్కసారి దేవతలను మించిన వారిని చేసినది. వాస్తవమేమన్న దేవతలందరు మానవుని సుఖజీవనమునకు ఉపయోగ పడువారే!

    సత్రస్య ఋద్విరస్యగన్మ జ్యోతిరమృతా అభూమ
    దినం పృథివ్యా అధ్యారుహామావిదామ దేవాన్స్వర్జోతిః 8-52

    సోమమా! నీవు సాక్షాత్తు యజ్ఞసమృద్ధివి. నీ వలన మేము ఆదిత్య రూపజ్యోతిని అందుకున్నాము. ఇక మేము మరణాంతము ధర్మపరులము అయినాము. మేము భూమి నుంచి లేచినాము. స్వర్గమును ఆరోహించినాము. ఇంద్రాది దేవతలను పరంజ్యోతిని తెలిసికున్నాము.

    మానవుడు ఇన్ని సాధించగలడు! అందుకు ఒకటే షరతు - అతడు లోకమునకు కళ్యాణమును కూర్చుధర్మమును ఆజీవ పర్యంతము అవలంబించవలెను.

    ఇది దైవత్వము సాధించు ఉపాయము. దైవత్వము ఆకాశమున కాదు. మానవుని యందున్నది, దానిని గుర్తించవలసి ఉన్నది. అది దుస్సాధ్యము కావచ్చును. అసాధ్యము మాత్రముకాదు.

    ఈ అధ్యాయమున 31  నుండి 34 వరకు మంత్రములందు సమస్త దేవతలు గెలిచినా వాటిని మానవుడు తాను ఒక్కడే గెలువవలెనని సంకల్పించుచున్నాడు. మానవుని ఇంతకన్న మహామహునిగా కల్పించుటసాధ్యమా!

    35. (రాజసూయమంత్రములు ప్రారంభము)

    ఫాల్గుణశుక్ల దశమినాడు - అనుమతికిగాను - ఎనిమిది పాత్రలందు వండిన బియ్యపు హవిస్సు అర్పించబడును. అందుకు బియ్యమును రాతిమీదనూరవలెను. పడిపోయిన బియ్యమును స్రువమున నింపి దక్షిణాగ్నికి ఆహుతి ఇవ్వవలెను.

    పృథివీ! ఈ పిష్టచరు నీభాగపుది. దీనిని స్వీకరించుము -స్వాహా.
    (పంచవతీయ కర్మచేయుటకు దిశలందు ఆహవనీయాగ్నిని స్థాపించి ఆహుతులు అర్పించవలెను)

    పూర్వదిశన ఆసీనులైన అగ్నినేతృక దేవతలకు స్వాహా.
    దక్షిణదిశన ఆసీనులైన యమనేతృక దేవతలకు స్వాహా.
    పశ్చిమదిశన ఆసీనులైన విశ్వేదేవతనేతృక దేవతలకు స్వాహా.
    ఉత్తరదిశన ఆసీనులైన మిత్రావరుణ నేతృక దేవతలకు స్వాహా.
    పైన ఉండి, పరిచర్యలందు కొను సోమనేతృక దేవతలకు స్వాహా.
   
    36. (అయిదు చోట్ల ఏర్పరచిన ఆహవనీయాగ్నిని ఒక చోటచేర్చి ఆహుతులు ఇవ్వవలెను)

    పూర్వదిశన ఆసీనులైన అగ్నినేతృక దేవతలకు స్వాహా.
    దక్షిణదిశన ఆసీనులైన యమనేతృక దేవతలకు స్వాహా.
    పశ్చిమదిశన ఆసీనులైన విశ్వేదేవతనేతృక దేవతలకు స్వాహా.
    ఉత్తరదిశన ఆసీనులైన మిత్రావరుణ నేతృక దేవతలకు స్వాహా.
    పైన ఉండి, పరిచర్యలందు కొను సోమనేతృక దేవతలకు స్వాహా.

    37. (తండుల హొమము దక్షిణాగ్నిలో చేయవలెను)

    అగ్నీ! నీవు శత్రుసేనను పరాభవించుట కాదు. దూరదూరములకు పారద్రోలుము. శత్రువులను దూరము చేసిన నీవు యజ్ఞమును నిర్వహించు యజమానికి బ్రహ్మవర్చస్సు ప్రసాదించుము.

    38. నేను సవిత అనుశాసనమున ఉన్నవాడను. అశ్వినుల బాహువులతోనూ, పూషహస్తములతోను తండులములారా! ఉపాంశుగ్రహపుబలమున సోమముచే హొమము చేయుచున్నాను. స్వాహా.

    (హొమము చేసిన దిశకు స్రువము త్రిప్పవలెను)

    స్రువమా! నిన్ను రాక్షసుల వధకు త్రిప్పుచున్నాను. నేను ఈ రాక్షసవర్గమును హతమార్తును. ఇప్పుడు సమస్త రాక్షస వర్గము హతమారినది.

    39. (ఎనిమిది దేవస్ హవిస్సులు ఇవ్వవలెను)

    యజమానీ! సవితా దేవత నిన్ను అనుశాసనములకు అధిపతిని చేయవలెను. అగ్ని నిన్ను గృహస్థులకు అధిపతిని చేయవలెను. సోమసామ్రాట్టు నిన్ను వనవృక్షాదులకు అధిపతిని చేయవలెను. బృహస్పతి నిన్ను వాణికి అధిపతిని చేయవలెను. ఇంద్రుడు నిన్ను జ్యేష్ఠత్వమునకు అధిపతిని చేయవలెను. రుద్రుడు నిన్ను పశువులకు అధిపతిని చేయవలెను. సత్యానుశాసన మిత్రా వరుణులు నిన్ను ధర్మాధికారుల అధిపతిని చేయవలెను.

    యజమానీ! ఈఅష్టదేవస్ హవిస్సుల దేవతలు నిన్ను సకల పదార్థముల అధిపతులను చేయవలెను.

    (యజమాని వద్దకు వెళ్లి- స్రువమును కుడిచేత, యజమాని బాహువులను ఎడమ చేతపట్టుకొనవలెను. మంత్రము చెప్పునపుడు యజమాని తల్లిదండ్రులు, దేశకాలములను పెర్కొనవలెను.)

    40. దేవసహవిర్భాగ దేవతలారా! మీరు ఈ యజమానిని శత్రురహితువి చేయండి. మహారాజ్య కార్యమున నిలుపండి. మహాజనరాజ్య కార్యమున నిలుపండి. ఇంద్రుడు పరమోత్కృష్ట బలమును ప్రసాదించును గాత. యజమాని పుత్రుని దేశవాసుల ఆధిపత్యమున నిలుపండి. కాని 'సోమ్కోస్మాకం బ్రహ్మణానాం రాజా' మా బ్రాహ్మణులకు మాత్రము సోమసామ్రాట్టే ప్రభువు అగును.

    ఆలోచనామృతము

    ఈమంత్రమున రాజకీయశాస్త్రజ్ఞులు ఆలోచించవలసినవి ఉన్నవి.

    1. మహతేక్షత్రాయ, మహతేజ్యేష్ఠ్యాయ అన్నది ఇప్పటి రాష్ట్రపతి-గవర్నరు పదవుల వంటివలె ఉన్నది.

    2. "జనరాజ్యాయ" అనిన ప్రజారాజ్యమునకు అని అర్థము. ఇదినేటి ప్రజాస్వామ్యము వంటిది కావచ్చును.

    3. రాజు కొడుకును రాజును చేయుటకు దేశవాసుల అనుమతి అక్కర అయినట్లున్నది. ఇది నేటి ఎన్నికల వంటిది కాకున్నను ప్రజామోదము అవసరమైనట్లున్నది.

    రామాయణమున రాముని యౌవరాజ్య పట్టాభిషేకమునకు దశరథుడు ప్రజల అనుమతి కోరినాడు. ప్రజలు ఆమోదించినారు:-

    "రామమిన్దీవరశ్యామం సర్వశత్రు నిబర్హణమ్|
    పశ్యామో యౌవరాజ్యస్థం తవ రాజోత్తమాత్మజమ్ ||

    రాజు నిరంకుశుడు కాకుండుటకు ఈ నియమములు విధించినట్లున్నారు.

    4. "సోమ్కోస్మాకం బ్రహ్మణానాం రాజా" అని మంత్రము ఎవరికి ఎవడు రాజయినాను బ్రాహ్మణులకు మాత్రము రాజు కాడని అర్థము.

    నేను శ్రీ మహాభారతము రచించినపుడు బ్రాహ్మణుడనగా మేధావి అని అర్థము చెప్పినాడు.

    మేధావులు రాజకీయశాసనమునకు లొంగక స్వతంత్రులైనపుడే తమ ఆలోచనలు అన్వేషణల వలన సమాజమునకు మేలుచేయగలరు.

    నేడు సహితము రాజ్యసభకు జరుగు నిష్ణాతుల, మేధావుల ఎన్నికలందు ప్రజలు పాల్గొనరు.

    శ్రీమహాభారతమున పాండవులు లక్క ఇంటినుంచి తప్పించుకోని ఏకచక్రపురమను అగ్రహారమునాకు చేరుకున్నారు. అక్కడ దుర్యోధనుని రాజ్యము సాగదు. ఏలనన బ్రాహ్మణ అగ్రహారములు రాజశాసనములోనివి కావు. ఈవిషయములు తెలిసియే పాండవులు భద్రతకొరకు అగ్రహారమునకు చేరినారు.

    రాజులకు జరుగు సంధులు మున్నగు వాని నుండి దేవాలయభూములు, బ్రాహ్మణ అగ్రహారములకు మినహాయింపు ఉండెడిది.

    బ్రహ్మణులను ఒకజాతిగా కాక మేధావులనుగా చెప్పుకున్నపుడు వేదము మేధావులగు వారికి ఎంతో స్వాతంత్ర్యము ప్రసాదించినది.

    "బ్రహ్మణోవై సర్వేదేవతాః" మేధావులే కదా అందరు దేవతలు - అందరి దేవతలు.


       
                       దాశరథి రంగాచార్య విరచిత
           శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
                   వాజపేయో రాజసూయరంభాన్తమను
                  తొమ్మిదవ అధ్యాయము ముగిసినది.         

 Previous Page Next Page