Previous Page Next Page 
శుక్ల యజుర్వేద సంహిత పేజి 37


    14. యజమానీ! నీవు ఊర్ధ్వదిశన సంచరించుము. పంక్తిఛందము నిన్ను రక్షించవలెను. ఋక్కుపై నిలిచినా శాక్వర సామము నిన్ను రక్షించును గాత. త్రినవ, త్రయస్త్రింశ సామము నిన్ను రక్షించును గాత. హేమంత, శిశిర ఋతువులు నిన్ను రక్షించునుగావుత. తేజోరూపమగు ధనము నిన్ను రక్షించును గాత.

    (పులిచర్మము క్రింద ఉంచిన పీసమును కాలితో తొక్కి దూరమునకు పారవేయవలెను)

    సీసపురూపమున ఉన్న 'నముచి' శిరము దూరమునకు విసరబడినది.

    15. (స్నానము కొరకు యజమానిని పులిచర్మము మీదకూర్చుండపెట్టవలెను)

    పులిచర్మమా! నీవు సోమపు కాంతివి. నీవంటి కాంతి నాకు లభించవలెను.

    (యజమాని బంగారమును త్రొక్కవలెను)

    స్వర్ణమా! నీవు నన్ను మృత్యువునుండి రక్షింపుము. నీవు ఉత్సాహరూప ఓజస్సువు. శారీరక బలమవు. 'అమృతమసి' అమృతమవు.

    16. మిత్రావరుణులారా! ఉషఃకాలము దాటును. అప్పుడు పరమైశ్వర్యవంతులగు మీరు ఉదయింతురు- సూర్యుడు కూడ ఉదయించును. మీరు బంగరు రంగువారు. మీరు రథమును ఎక్కండి. దేవమాత అదితిని, దైత్యమాత దితిని దర్శించండి. దక్షిణ బహువా! నీవు మిత్రుడవు. వామ బహువా! నీవు వరుణుడవు.

    (యజమాని రెండుచేతులను పైకి ఎత్తవలెను)

    17. (యజమాని తనచేత బంగారము పట్టుకొని పులిచర్మము మీద తూర్పుముఖముగా కూర్చండవలెను. అతని ముందు పలాశ, ఔదుంబర, న్యగ్రోధ, పిప్పలపాత్రలలో జలము ఉండవలెను. ఒక్కొక్క పాత్రతో ఒక్కొక్కరు యజమానిని మంత్ర యుక్తముగా స్నానము చేయించవలెను)

    1. (పురోహితుడు పలాశపాత్ర జలముతో స్నానము చేయించుచు) నిన్ను చంద్రుని కీర్తి కాంతులతో అభిషేకము చేయుచున్నాను. క్షత్రియుల ఏకమాత్ర క్షత్రపతివై వర్థిల్లుము. రాజువై మమ్ములను శత్రువుల శస్త్రముల నుండి రక్షించుచు పాలింపుము.

    "సోమస్యత్వామ్నేనాభిషించామి. క్షత్రాణాం క్షత్రపతిరేధ్యతిదిద్యూన్పాహి"

    2. (రాజుసోదరుడు ఔదుంబర పాత్రజలమున స్నానము చేయించవలెను) యజమానీ! నిన్ను నేను అగ్నియొక్క తేజమున అభిషేకించుచున్నాను. క్షత్రియులకు ఏకమాత్ర క్షత్రపతివై వర్ధిల్లుము. శత్రువుల బాణాది అస్త్రములనుండి మమ్ము రక్షించి ప్రజలను పాలింపుము.

    "అగ్నేర్భ్రాజసా త్వమభిషించామి. క్షత్రాణాంక్షత్రపతిరేధ్యతిదిద్యూన్పాహి"

    3. (రాజుమిత్రుడు న్యగ్రోధపాత్ర జలమున అభిషేకము చేయించవలెను) యజమానీ! నిన్ను సూర్యవర్చస్సున అభిషేకించుచున్నాను. క్షత్రియులకు ఏకమాత్ర క్షత్రపతివై వర్థిల్లుము. శత్రువుల బాణాది అస్త్రములనుండి మమ్ము రక్షించి ప్రజలను పాలింపుము.

    "సూర్యస్యవర్చసాత్వాభిషించామి. క్షత్రాణాంక్షత్రపతిరేధ్యతి దిద్యూన్పాహి"

    4. (వైశ్యుడు రాగి పాత్రజలమున అభిషేకము చేయించవలెను) యజమానీ! నిన్ను నేను ఇంద్రుని విపుల శరీరబలమున అభిషేకించుచున్నాను. క్షత్రియులకు ఏకమాత్ర క్షత్రపతివై వర్ధిల్లుము. శత్రువుల బాణాది అస్త్రములనుండి మమ్ము రక్షించుచు ప్రజలను పాలింపుము.

    18. (యజమానికి స్నానము చేయించు నపుడు పురోహితుడు చదువవలసినది)   

    దేవతలారా! మీరు ఈ యజమానిని శత్రురహితుని చేయండి. మహారాజ్యమున, మహాజ్యేష్ఠమున నిలుపండి. మహాజనరాజ్యమున నిలుపండి. ఇంద్రుడు ఇతనికి పరమోత్కృష్ట బలమును ప్రసాదించును గాత. యజమాని పుత్రుని దేశవాసుల ఆధిపత్యమున నిలుపండి. కాని "సోమ్కోస్మాకం బ్రహ్మణానాం రాజా" మా బ్రాహ్మణులకు మాత్రము సోముడే రాజగును.

    19. సూర్యుడు స్తుత్యుడు గమనశీలుడు, సేచనకారి. జలవర్షణశాలి. అతడు పర్వతపుచాటున జారుచున్నాడు. సూర్యుడు జలమును అంతరిక్షమేఘమున చేర్చును. ఆ జలమే వర్షముగ మారి సూర్యుని దిగువకు చేరును.

    (యజమానిని వ్యాఘ్రచర్మము మీద మూడడుగులు నడిపించవలెను)

    ప్రథమపాదక్షేపమా! సర్వవ్యాపి, యజ్ఞపురుష జగదీశ్వరుడు తొలిపాదము మోపిన భూమివినీవు. ద్వితీయ పాదక్షేపమా! నీవు- యజ్ఞపురుషుడు రెండవకాలు మోపి గెలిచినా- అంతరిక్షమవు. తృతీయ పాదక్షేపమా! యజ్ఞపురుషుడగు విష్ణువు మూడవపాదము మోపి గెలిచిన వైకుంఠమవు

    20. (సభాభవనము నుండి యజ్ఞశాలకుచేరి ద్యావాగ్నిలో హొమము చేయవలెను)

    ప్రజాపతీ! నీవు కాక మరొక దేవత ఈ భూత- భవిష్యత్- వర్తమానములందలి వివిధ ప్రాణులను సృష్టింప, సంహరింపగలవాడు లేడు. ఏ ఏ పదార్థములను కోరి మేము హొమము చేయుచున్నామో అవన్నియు మాకు లభించవలెను. ఇతడు తండ్రి. ఇతని తండ్రి ఇంకొకడు. మేము మాత్రము ధనస్వాములము కావలెను. స్వాహా.

    (పలాశాఘటమున మిగిలిన జలముల ఆహుతులు అగ్నీధ్రవాదుల ఉత్తరమున అర్పించవలెను)

    రుద్రగ్నీ! నీవు సర్వభక్షకనామకుడవు, హావీ! ఆ సర్వభక్షక అగ్నికి ఆహుతివి ఆగుము. నీవు మాఇంటి వైపు వెడలుము - స్వాహా.

    21. (వాజపేయ యాగము వంటి రథమును వేదికి దక్షిణ భాగమున నిలిపి మంత్రయుక్తముగ అశ్వములను దూర్చవలెను)

    రథమా! నీవు ఇంద్రుని వజ్రమవు. శాసించు మిత్రావరుణుల అనుమతిచే నీకు అశ్వములను పూన్చుచున్నాను. నేను హింసింపనలవికాని ఇంద్రతుల్యుడను. అన్నప్రాప్తి కొరకు నిన్ను అధిరోహించుచున్నాను.

    (రథసారధి కుడివైపు గుర్రమును కొరడాతో కొట్టి నడుపవలెను)

    అగ్రభాగపు అశ్వమా! నీవు మరుత్తుల అనుజ్ఞచే మాశత్రువులను జయించుము. మేము మనసా ప్రారంభించిన కర్మఫలమును అందుకున్నాము.

    (అంతకుముందే అచట ఉంచిన గోవును యజమాని ధనుస్సు యొక్క అల్లెత్రాటితో తాకవలెను)

    22. (రథమును వేదికి తూర్పున- గోవుప్రక్కన - నిలుపవలెను)

    వజ్రహస్త ఇంద్రా! నీవు ఆసీనుడవగు రథమున్నది. దానికి జోడించు అశ్వములున్నవి. అట్టి రథమును- అశ్వములును ఇక్కడ సిద్ధముగా ఉన్నవి.

    ఇంద్రా! నీవు శత్రువులను రౌద్రముగా పరాజితులను చేయుదువు. పరమైశ్వర్యయుక్తుడవు. మేము నీభక్తులము. యజమానులము. మేము అయాచకములను కావలెను. నీరథము నుండి విడిపోరాదు. శత్రువు బారిన పడిపోరాదు.

    23. (రథవిమోచన ఆహుతులు ఇవ్వవలెను)

    అగ్నయే గృహపతయో స్వాహా. సోమాయ వనస్పతయోస్వాహా. మరుతామోజసే స్వాహా. ఇంద్రస్యేంద్రాయ స్వాహా.

    (రథమునందున్న యజమాని భూమిని చూడవలెను)

    అమ్మాభూమీ! నీవు నన్ను-నీ అన్నపానాదులు- లేనివానిని చేయకుము. తల్లీ! అనవసరమగు త్రవ్వుటలు మున్నగు వాని వలన నిన్ను నేను బాధించకుండవలెను.

    24. అతడు అహంకారహంత. పవిత్రుడు. మానవ ప్రవర్తకుడు, వాయురూపమున అంతరిక్షమున ఉండువాడు. దేవతల ఆహ్వానకర్త. అగ్నిభాగమున వేదిపై ఉండువాడు. పూజ్యుడు. ఆహవనీయాది రూపమున యజ్ఞగృహమున నివసించువాడు. ప్రాణభావమున మానవు లందుండువాడు. ఉత్కృష్ట స్థానవాసి. యజ్ఞస్థితుడు. మండలాకారమున ఆకాశమున ఉండువాడు. మత్స్యాదిరూపమున జలములందు ఉద్భవించువాడు. స్వేదజ- అండజ-పిండజ-ఉద్బజ్జ రూపమున పృథ్విపై ఉత్పన్నుడగువాడు. సత్యమున పుట్టినవాడు. అద్రిన పుట్టినవాడు. అతడే మహాసత్యము- ఋతమ్ బృహత్"

    25. (యజ్ఞశాల దక్షిణభాగమున రథమును వహించు శకటమును నిలుపవలెను. ఆ శకటపు కుడిచక్రమునకు నూరునూరు మాషముల బంగారము కట్టి ఉండవలెను. దానిని యజమాని స్పృశించి)

    శతమాషసువర్ణమా! నీవు జీవన స్వరూపవు. నాకు వంద సంవత్సరముల ఆయువును ఇమ్ము. నీవు దక్షిణరూపమవు. కావున నీవే యజ్ఞమును నిర్వహించుదానవు. అందువలన తేజోరూపము గలదానవు. నాకు బ్రహ్మవర్చస్సు కలిగింపుము.

    (యజమాని రెండు స్వర్ణములను బ్రహ్మయను ఋత్విజునకు ఇవ్వవలెను. రథ వాహనమున ఉన్న ఔదుంబర శాఖను యజమాని స్పృశించవలెను)

    ఔదుంబరశాఖా! నీవు స్వయముగా అన్నమయమవు. నీవు నన్ను అన్నమున స్థాపించుము.

    (వ్యాఘ్రచర్మము మీద  ఉన్న ఔదుంబరపాత్రలో యజమాని తనరెండు చేతులను ఉంచవలెను)

    యజమాని బాహువులారా! మీరు పరాక్రమవంతులు. పరమైశ్వర్యవంతులు. అధ్వర్యుడనగు నేను మిమ్ము ఈపాత్రలో వంచుచున్నాను.

    26. (చండ్రకర్రతో చేసిన ఆసందికి నులుక అల్లి వ్యాఘ్రచర్మము మీద మిత్రావరుణుల ధిష్ణ్యముందు ఉంచవలెను)

    ఆసందీ! నీవు సుఖము నిచ్చుదానవు. సుఖాసీనయోగ్యవు. (ఆసందిమీద బట్టపరచి) వస్త్రమా! నిన్ను యజమాని ధరించినందున దాని ఉత్పత్తికి కారణమవు. (ఆసందిమీద యజమానిని ఆసీనుని చేయవలెను) యజమానీ! నీవు ఈ సుఖకర ఆసనమున ఆసీనుడవగుము. క్షత్రియయోని భూతమగు ఈ ఆసనమున కూర్చుండుము.

    27. (ఆసంది మీద కూర్చున్న యజమాని హృదయమును అధ్వర్యు తాకవలెను)

    యజమాని యజ్ఞరూప కర్మమును స్వీకరించువాడు. అనిష్టనివారకుడు. శుభ సంకల్పముల వాడు. ప్రజ్ఞావంతుడు. ఇతడు ఆసనమున కూర్చొని  ప్రజల వరించిన వాడయినాడు. ఈ ఆసనమున సార్వభౌమ సామ్రాజ్యమునందే ఆసీనుడయినాడు.

    28. (కృత' నామము గల నాలుగు 'కలి' నామముగల ఒకటి మొత్తము అయిదుపాచికలు అధ్వర్యుయజమాని చేత ఉంచవలెను)

    సర్వవిజయ 'కలి' అక్షముగల యజమానీ! నీవు సర్వత్ర వ్యాపింపుము . అయిదు పాచికల రూపముగల అయిదు దిశలు మీ సర్వకార్యములకు సిద్ధి కలిగించవలెను.

    (ఇది యజమాని బ్రహ్మమధ్య సంభాషణ రూపము)

    యజమాని:- బ్రహ్మా! నీవు బ్రహ్మవు.

    బ్రహ్మ:- యజమానీ! నీవు సత్యపరమవు. నీ ఆజ్ఞ అనుల్లంఘనీయము.

    యజమాని:- బ్రహ్మా! నీవు బ్రహ్మవు.
   
    బ్రహ్మ:- యజమానీ నీవు సత్యపరాక్రమవరుణుడవు.

    యజమాని :- బ్రహ్మా! నీవు బ్రహ్మవు.

    బ్రహ్మ:- యజమానీ! నీవు ప్రజలలో వ్యాపించిన తేజమగు ఇంద్రుడవు.

    యజమాని:- బ్రహ్మా! నీవు బ్రహ్మవు.

    బ్రహ్మ:- యజమానీ! నీవు మంచి సేవలను అందుకొను రుద్రుడవు.

    యజమాని :- బ్రహ్మా! నీవు బ్రహ్మవు.

    బ్రహ్మ:- యజమానీ! త్వంబ్రహ్మాసి
   
    యజమాని:- బహు కార్యములు చేయు సజ్జనులారా!

    (జూదభూమి సిద్ధము చేయుటకు అధ్వర్యు యజమానికి స్థ్య ఇవ్వవలెను.)

    స్థ్యా! నీవు ఇంద్రుని వజ్రాంశమవు. నా శత్రువులను నాకు వశపరచుము.

    (యజమాని జూద భూమిని సమతలను చేయవలెను.)

    29. (సిద్ధమైన జూద భూమి మీద సువర్ణము ఉంచి ఘృతాహుతులు ఇవ్వవలెను.)

    మహానుడు - ధర్మపాలకుడగు అగ్నికి స్వాహా

    మహానుడు - ధర్మపాలకుడగు అగ్నికి స్వాహా
   
    (అగ్నిని ఆదరించుటకు పునరుక్తి)

    (యజమాని ద్యూత రంగమున అయిదు పాచికలు వేయవలెను.)

    పాచికలారా! మీరు ఆహుతులచే పునీతులై సూర్య తేజము కలవారలయినారు. నాకు మా జనుల మధ్యన ఉత్తమ స్థానము కల్పించుటకు ప్రయత్నించండి.

    ౩౦. (భోజనమునకు బయలుదేరిన వందమంది బ్రహ్మణులలో ఒకడు అనవలసినది.)

    ఆదేశకారి సూర్యుడు - వాగ్రూప సరస్వతి - రూపముల త్వష్ట - పశు సంపన్న పూష - ప్రత్యక్ష ద్రష్ట ఇంద్రుడు - దేవయాగ బ్రహ్మ బృహస్పతి - ఓజస్వి వరుణుడు - తేజస్వి అగ్ని రాజాసోముడు - పదవ యజ్ఞ దేవత విష్ణువు ఆదేశములను అందుకొని సాగుచున్నాను.

    31. (రాజసూయాంతమున చదువు ఈ నాలుగు మంత్రములు "చరక సౌత్రామణి" అనబడును. పట్టు బట్టలో మొలకలు వచ్చినవి, రానివి ధాన్యము కట్టి ఉంచవలెను.)

    మొలకలు వచ్చినవాటిని ఉడికించి రాని వాటిని పిండి చేసి అందులో కలుపువలెను.

    సురా! నీవు అశ్వినుల కొరకు పచనమగుము. సరస్వతి కొరకు పచనమగుము. చక్కగా రక్షించు ఇంద్రుని కొరకు పచనమగుము. వాయువుచే పవిత్రము చేయబడినదియు కుశలచే వడగట్టబడి - కిందకు దిగినదియునగు సోమము ఇంద్రునకు యోగ్యమగు మిత్రమగును.

    32. సోమమా! యజమానులు దర్భాసనముల మీద ఆసీనులై సమంత్రకముగా యజించుచున్నారు. యవల పొలమున కోత కోసి ధాన్యమును వేరు చేసినట్లు - నీవు ఇతర యజమానుల భోజనాది పదార్థములను - ఇచట ఆసీనులైన - యజమానులకు అందించుము.

    సోమమా! నిన్ను ఉపయామ గ్రహమున గ్రహించినాను.  నిన్ను అశ్వినుల కొరకు గ్రహించినాను అశ్విభ్యాం త్వాగృహ్ణామి నిన్ను సరస్వతి కొరకు గ్రహించినాను - సరస్వత్యై త్వా గృహ్ణామి. చక్కని రక్షణలిచ్చు ఇంద్రుని కొరకు నిన్ను గ్రహించుచున్నాను - ఇంద్రాయత్వాసుత్రామ్ణే గృహ్ణామి.

    33. అశ్వినులారా! మీరు వివిధ రూప సోమములను పరీక్షించి ఆస్వాదించువారు. శుభములగు యజ్ఞాది కర్మలను పవిత్రము చేయువారు. అసుర నముచితో కలసి మీరు సుష్ఠుగా సోమపానము చేసినారు. అట్లు పానము చేసిన దానిని శుద్ధి చేసి ఇంద్రునకు ఇచ్చినారు. ఆ విధముగా ఇంద్రుణి స్వకర్మ క్షమ గలవానిని చేసినారు.

    నముచి అసురుడు. అతడు ఇంద్రునకు విశ్వాస పాత్రుడైనాడు. అతడు ఇంద్రుని కూడి సోమపానము చేయుచు ఇంద్రుని బలమును కూడ త్రావినాడు. ఇంద్రుడు వీతవీర్యుడు అయినాడు. అప్పుడు అశ్వినులును, సరస్వతియు ఇంద్రునకు ఫేన రూప వజ్రము నిచ్చినారు. దానిచే ఇంద్రుడు నముచి తల నరికినాడు. తల తెగిన నముచి ఉదరము నుంచి సోమము ప్రవహించినది. దానిని అశ్వినులు త్రావినారు. ఆ సోమమును శుద్ధి చేసి ఇంద్రునకు ఇచ్చినారు. ఇది తైత్తరీయ వృత్తాంతము.

    34.  ఇంద్రా! అశ్వినులు ఋషుల మంత్రములచేతను - దర్శనీయ కార్యముల చేతను పూర్వకాలమున - నిన్ను - తల్లిదండ్రులు ఆపదలందున్న బిడ్డలను వలె రక్షించినారు. అప్పుడే నీవు ఎంతో రమణీయమగు సోమమును అందించినావు. అందుకే సోమపాయివగు నిన్ను సరస్వతి సేవించుము.

    శ్రీమాన్ దాశరథి లక్ష్మణాచార్య బుచ్చమాంబల పౌత్రుండును, విద్వాన్ దాశరథి వేంకటాచార్య వేంకటాంబల పుత్రుండును - ఆంధ్ర ప్రదేశ్ ఆస్థాన కవి దాశరథి
    కృష్ణమాచార్య అనుజుండును - కమలానామ్ని ధర్మ పత్నీ సమేతుండును శ్రీమదాంధ్రవచన ఋగ్వేద సంహిత, శ్రీమద్రామాయణము, సీతాచరితము, శ్రీమహా భారతము, హరివంశము, శ్రీమహాభాగవతము మున్నగు మహాగ్రంథ రచయితయునగు దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్ర వచన శుక్ల యుజుర్వేద సంహితయందలి దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్ర వచన శుక్ల యుజుర్వేద సంహితయందలి

    రాజసూయాన్త వర్ణనమను పదవ అధ్యాయము సమాప్తము.

                                                         సర్వేపి సుఖినస్సంతు.

 Previous Page Next Page