Previous Page Next Page 
సూపర్ స్టార్ పేజి 35


    "మేమా....?" ఫోన్ కి వేపునున్న స్త్రీ కంఠంలో భయం తొంగిచూసింది.

    "అవును మీరే.... ఆ అమ్మాయి ఎవరు? పేరేమిటి....?" ఎప్పటినుంచి మీ ఇంట్లో పని చేస్తోంది....?" సీతారామారావు బెదిరిస్తుంటే హంపి, భవానీ  విస్మయంగా ఆయనకేసి చూస్తుండిపోయారు.

    "మాకేపాపం తెలీదు. ఆ అమ్మాయి ఎక్కడికెళ్ళిందో ఏమో..? పోలీసులయినంత మాత్రాన బెదిరిస్తారా ఇలా? మా ఆయన పెద్ద ఆఫీసర్ తెలుసా....?" ఆ వేపునుంచి ఆమె బెదిరించే సరికి సీతారామారావు వెంటనే మాటమారుస్తూ అన్నాడు. "అవును చాలా పెద్ద ఆఫీసరే మీ ఆయన.....లేదంటే గుంటూరు తుఫాన్ బాధితుల నిధులన్నీ మీ ఇంటికెలా చేరతాయి....?" ఫోన్ కి ఆవేపు నిశ్శబ్దం.

    సీతారామారావు నవ్వుతూ అన్నాడు "ఇప్పటికైనా చెప్పండి లేదంటే పోలీసులతో పాటు - యాంటీకరప్షన్ వాళ్ళను కూడా ఆహ్వానించవలసి వస్తుంది....."

    సీతారామారావు ఎత్తుపారింది.

    ఆమె బాగా భయపడింది.

    వివరాలు అందించింది.

    "ఆ అమ్మాయి పేరు శిరీష - ఆరునెలల నుంచి మా ఇంట్లో పనిచేస్తోంది. ఆ అమ్మాయి గురించి ఇంతకంటే మాకేం నిజంగా తెలీదు. దయచేసి నన్ను నమ్మండి...." అందామె ప్రాధేయపూర్వకంగా.

    "ఏదో మీరు చెబుతున్నారని ఊరుకుంటున్నాం. ఆ అమ్మాయి రాగానే నే చెప్పే నంబర్ కి తెలియపర్చండి" అంటూ తమ నెంబర్  చెప్పి పెట్టేసాడు.

    "ఏమిటి నాన్నగారు..... ఏమందామె....?" హంపి ఎగ్జైట్ మెంట్  కి గురవుతూ అడిగింది.

    "ఆ అమ్మాయి పేరు శిరీషట...... అంతకంటే ఆమెకేం తెలీదట. నిజమే చెప్పిందని నమ్ముతున్నాను" అన్నాడు సీతారామారావు ఒకింత నిరాశతో.

    ఆశ చిగురించినట్లే చిగురించి వాడిపోయినట్లయింది హంపి పరిస్థితి.

    "ఈ సాయంత్రం, రాత్రికికూడా తీవ్రంగా ప్రయత్నిస్తాను మేడమ్.  నాకెందుకో వాళ్ళను పట్టుకోగలనన్న నమ్మకం ఉంది. నే వెళ్ళి వస్తాను. చిన్న విషయం మేడమ్...." భవానీ సందేహిస్తున్నట్లుగా.

    "ఫర్వాలేదు భవానీ చెప్పు" అంది నిరాసక్తంగా.

    "నేను ఆ ఆఫీసర్ ఇంటి ప్రక్కవీధిలో ఒక విచిత్రమైన ఇంటిని చూసాను మేడమ్..... అది మన సీరియల్ లోని హీరోకి తల్లి చనిపోయాక ఉపయోగించుకొనే ఇంటిగా బాగా ఉపయోగపడుతుందని....." భవానీ ఆపైన మాట్లాడలేక వస్తానంటూ వెళ్ళబోతుండగా హంపీ అంది- విల్సన్ ఎక్కడ....?" అని.

    "రేపటి షూటింగ్ అరేంజ్ మెంట్స్ లో ఉన్నారు మేడమ్" అన్నాడు భవానీ ఒక్కక్షణం అక్కడే ఆగి.

    ఆ బస్సుని చూస్తే మేడమ్ కి ఖచ్చితంగా నచ్చుతుందనే భవానీ ఆశ- కానీ ఆమె దానిగురించేం చెప్పకపోయేసరికి నిరాశగా వెనుదిరిగాడు భవానీ.


                     *    *    *

    టీవీ తెరమీద ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కేసట్ లోని దృశ్యాలు కదలి పోతున్నాయి- ఒక్కొక్కటి....

    ఆ గదిలో ప్రభు, సి.బి.సి.ఐ.డి. కి చెందిన చాకులాంటి ఇన్ స్పెక్టర్  ఒకరున్నారు.

    గదిలో నిశ్శబ్దం పరుచుకొని ఉంది.

    పరమాణువులాంటి ఆధారం దొరికినా పరిశోధనలో ఎంతో లోతుకు వెళ్ళగల ఎఫ్.బి.ఐ. ఏజెంట్స్ గుర్తుకొస్తున్నారు ఆ ఎస్...ఐ.కి- ప్రభుని చూస్తుంటే.

    కస్టమ్స్ కౌంటర్స్ కేసి నడుస్తున్న ప్రయాణికులు.....

    ప్రభు అలర్ట్ అయి పదిహేనవ నెంబర్ ప్రయాణికుడికేసి చూస్తూ రిమోట్ లోని ఫాజ్ ని నొక్కాడు. వెంటనే ప్రక్కనే సిద్దంగా ఉంచుకున్న హండ్రెడ్ టైమ్స్ మేగ్నిఫైయింగ్ గ్లాసెస్ ని తీసి కళ్ళకు ధరించాడు.

    అప్పుడు సునిశితంగా టీవీ తెరకేసి చూడసాగాడు. మంచి పర్సనాలిటీ....... మొఖం వంచుకొని అటుప్రక్కకు తిప్పుకున్నాడు.....ఒక్కొక్క ఫ్రేమ్ ముందుకు కదులుతోంది తెరమీద..... మరింత శ్రద్ధగా చూసాడు.... ప్రభు. నుదురు  అనుమానంతో ముడిపడింది.... ఆ అనుమానం క్రమంగా పెద్దది కాసాగింది.

    అ....ను...మా...నం....

    నేర పరిశోధనకి ప్రాణమైన, నిర్థిష్టమైన అనుమానం..... అతని ఎడంచెవి చివర చిన్న బొడుపు... ప్రత్యేకమైన గుర్తు..... మరో ఫ్రేమ్ ముందుకు కదిలింది. అతని ఇమేజ్ మరింత దగ్గరయింది..... కళ్లు చిట్లించుకొని మరీ చూసాడు ప్రభు.....ఎస్.... సందేహం లేదు.... అది ఎక్సెస్ గా వచ్చిన మజిల్... బహుశా పులిపిరికాయ అయుండాలి..... ఎడంచెవి క్రింద భాగంలో కంది గింజంత పులిపిరికాయ..... ప్రభు కళ్ళు ఆనందంతో మెరిసాయి.... ఇంకేమయినా ప్రత్యేకమయిన గుర్తులు కనిపిస్తాయేమోనని ప్రయత్నించాడు కాని ఫలితం లేకపోయింది.

    తాను చూసిన ప్రత్యేకమయిన గుర్తునే ఒకటికి పదిసార్లు చూసి, కరక్టే అని నిర్ధారించుకున్నాడు.

    వెంటనే గ్లాసెస్ తీసి ప్రక్కన పెట్టి తన డైరీ తీసుకొని - త్వరత్వరగా నోట్స్ రాసుకున్నాడు ప్రభు.

   
                                         *    *    *

    మరుసటిరోజు ఉదయం ఏడు గంటలకల్లా యూనిట్ మొత్తం లోకేషన్ కి వెళ్ళిపోయింది.

    క్రితంరోజు సాయంత్రం వెళ్ళిన భవానీ అంతవరకు తిరిగి రాలేదు దాన్నెలా అర్థం చేసుకోవాలి....? శిరీష బృందాన్ని పట్టుకోగలిగినట్లా....? వారి జాడ తెలిసినట్లా..... లేదా...? ఆలోచిస్తూ హంపి డ్రస్ చేసుకుంటుండగా తల్లి వస్తూ- "దొరకని వ్యక్తిగురించి ఆశపడిమ్ దొరుకుతాడో లేదో తెలీని పరిస్థితుల్లో జాప్యంచేస్తే పైలట్ లేట్ అయ్యే ప్రమాదం ఉంది తల్లి..... ఎలాగో మనస్సును సరిపుచ్చుకొని పూర్తిచేయ్" అంది క్యారేజీ అందిస్తూ.

    హంపి అన్యమనస్కంగా క్యారేజ్  తీసుకొని మెట్లుదిగి వెళ్ళి కారెక్కింది. అది మరుక్షణం విల్సన్ ఫోన్ చేసి చెప్పిన హిందూ స్ట్రీట్ కేసి దూరుకుపోయింది.

   
                                           *    *    *

    యూనిట్ లోకేషన్ లో సిద్దంగా ఉంది.

    అన్ని అరేంజ్ మెంట్స్ పూర్తయిపోయాయి.

    యూనిట్ సభ్యులంతా హంపీకోసం ఎదురుచూస్తూ బ్రేక్ ఫాస్ట్ కానిస్తున్నారు.

    అంతలో ప్రొడక్షన్ మేనేజర్ దగ్గరకు వచ్చి చేతులు నలుపుకొ సాగాడు.

    ఏదో సమస్య వచ్చి ఉంటుందని గ్రహించాడు విల్సన్ .

    కెమేరా లెన్స్ ని సరిచూసుకొని ప్రొడక్షన్ మేనేజర్ వేపు తిరిగి-

    "ఏదైనా సమస్యా.....?" అన్నాడు.  

    "అవును సార్"

    "ఫర్వాలేదు చెప్పు"

    "తనకేదో అర్జంట్ గా డబ్బు అవసరం వచ్చిందట. ఒక పదివేలు కావాలని నందిని గారడుగుతున్నారు....ప్రశాంత్ గారు కూడా మరో పదివేలు అడుగుతున్నారు..... నాకేం చెప్పాలో తోచటంలేదు. డబ్బివ్వందే మేకప్ వేసుకోనంటున్నారు. ఈ ఒక్కరోజు వర్క్ చేస్తే పైలట్ షూటింగ్ అయిపోతుంది.

    దాన్ని దూరదర్శన్ కి సబ్ మిట్ చేసి ఎమౌంట్ ఇచ్చేస్తాం అని చెప్పినా వినటంలేదు. నాకేం చేయాలో తోచటం లేదు..... మేడమ్ గారొచ్చేస్తే, వారికి సర్థిచెప్పలేక పోయినందుకు నాకు మాటొస్తుందని  భయంగా ఉంది" అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్ భయపడుతూ.

    విల్సన్ కి కూడా ఏంచేయాలో పాలుపోలేదు.

    నందిని, ప్రశాంత్ ల పీకపిసికి చంపేయాలన్నంత కోపంగా ఉంది - కాని ఏమీ చేయలేని నిస్సహాయత....

    "ఇదంతా ఆ దశరథ, సుశీల్ కుమార్ ఆడిస్తున్న నాటకమే.... లేదంటే ప్రశాంత్ మరీ అంత చెడ్డవాడు కాదు. నందిని మాత్రం పొలిటికల్ కార్డ్న్ బాగా ప్లే చేయగలదు...." కసిగా అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్".

    "నిజంగా డబ్బు అవసరం ఉందేమో....?" విల్సన్ ఒకమెట్టు దిగివస్తూ అన్నాడు.

    "నిజంగా ఆ అవసరం ఉందే అనుకున్నా బ్లాక్ మెయిల్ చేయటం సబబా....? అదీ ఈ టెన్షన్ లో ....లోకేషన్ కి తరలివచ్చాక..... మోస్ట్ డిజ్ గస్టింగ్ ఆర్టిస్ట్సు..... డ్రామాలేసుకు బ్రతకవలసిన ఊర నటీనటుల్ని అందలం ఎక్కిస్తే ఇంతే....." ప్రొడక్షన్ మేనేజర్ తన అక్కసుని వెళ్ళగ్రక్కాడు.

    "నేనోసారి ప్రయత్నిస్తాను...... పదండి" అంటూ విల్సన్ ప్రశాంత్  నందినీ ఉన్నవేపుకు నడిచాడు.


                       *    *    *

    ఈరోజు మరో బాంబు పేలుతుందిరా -" దశరథ నవ్వుతూ అన్నాడు.

    "బాంబా...? ఏది.... ఆ ఇద్దరూ డబ్బుకోసం పట్టుబట్టడమా....?" బ్రహ్మానందం అడిగాడు.

    "అవును.....ఆ ఇద్దరికి చెరో పదివేలు ఇస్తేగాని ఈ రోజు మేకప్ వేసుకోరు. ఇప్పుడు కుడితిలో పడుతుంది ఎలుక"

    "ఎలుక కుడితిలో పడితే- ఎలుకకు చాలా ఇబ్బందే- కాని ఆ అమ్మాయి ఎలుక కాదు - ఆడసింహం.... కుడితిలో పడేది ఆ అమ్మాయి కాదు- మీ మాటలు వినే ఆ నందిని, ప్రశాంత్ లు. చూస్తుండండి ఏం జరుగుతుందో మీరే చూద్దురుగాని........" అన్నాడు బ్రహ్మానందం.

    "అదిసర్లే.... మొన్నేమిటి అంతర్జాతీయ క్రిమినల్ మా తమ్ముడితో కలిసాడని అనేసావ్-? ఇంకా నయం.... ఆ జయధీర్ పేరు చెప్పావు కావు..."

    "ఉన్నదున్నట్లు మాట్లాడానే కాని - రహస్యాల్ని బయటపెట్టే మీలాంటి విశ్వాసఘాతకుడ్ని కాదు నేను.....హంపీని దెబ్బకొట్టాలంటే మంచి సీరియల్స్ ని దూరదర్శన్ కి అందించండి. మంచి టెక్నీషియన్స్ ని తీసుకోండి - మంచి కథను ఎన్నుకొని ఖర్చుకు వెనుకాడకుండా తీయండి. అంతేకాని కుళ్ళు, కుట్రలు ఎక్కువకాలం మిమ్మల్ని మార్కెట్టులో నిలబెట్టలేవు..... పాపం చివరకు ఏమైపోతారోనని భయంగా ఉంది నాకు. మీ తమ్ముడు హొమ్ మినిస్టర్ గదాని విర్రవీగకండి. ఒకసారి పదవిపోతే మంత్రుల్ని ప్రజలు పరుగులుకన్నా హీనంగా చూస్తారు. శవాల్ని పీక్కుతినే నక్కలు అంటే ఎవరో తెలుసా.....? మంత్రులు. గోతికాడ నక్కలన్నా వాళ్ళే - ఐదుపైసలు లేకుండా రాజకీయాల్లోకి వచ్చి లక్షలకు లక్షలు ప్రజలు సొమ్ము తినేసి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మహేంద్ర హిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో లక్షలు ఖరీదుచేసే బంగ్లాలు నిర్మించుకున్నట్లు ప్రజలకు తెలీదనుకోకండి- వరద బాధితులకు సహాయం అందేలా చూడమని ప్రభుత్వం ఇద్దరు మంత్రుల్ని గుంటూరు పంపిస్తే - ప్రజల్ని గాలికొదిలేసి కొట్టుకు చచ్చారట. వీళ్ళండి మంత్రులు మనకు..... ఏ పార్టీని అందలమెక్కించినా ఆ పార్టీ నాయకులు పదవుల్లో కూర్చున్న క్షణంనుంచే ఫైళ్ళను అమ్మకాలకు పెట్టి లక్షలు గడించి పంచుకోవటమే సరిపోతుంది. అలాంటి కుక్కమూతి పిందె జాతికి చెందిన తమ్ముడ్ని అట్టే నమ్ముకోకండి....మునిగిపోగలరు...."

    బ్రహ్మానందం దాన్ని ఓపెన్ చేసి చూసి వెంటనే గుండెలు బాదుకున్నాడు.

    "ఏమయిందిరా....? ఏముందా కవర్ లో.....? ఎందుకలా గుండెలు బాదుకుంటున్నావు....?" దశరథ బాటిల్ అందుకుంటూ అన్నాడు.

 Previous Page Next Page