కమల నొచ్చుకుంటూ "మీకిలా వుందని తెలిస్తే నేనే దింపి వెళ్ళే దాన్ని కదా! యిది బాగులేదు మీరిలా చెప్పకపోవడం . పిల్లలతో ఎంత అవస్థ పడ్డారో పాపం."
అడక్కండి నా అవస్థలు . పక్కింటి వాళ్ళు పాపని తీసికెళ్ళి అన్నం పెడ్తున్నారు. అదెమ్మ యింత కాఫీ కాచి ప్లాస్కు లో పోసి పోయింది నాకు. పాపం పాప ఏదో ఆదుకుంటుంది గాని, బాబెండుకో తెగ ఏడుస్తున్నాడు. యివాళయితే నాకు బొత్తిగా లేచే ఓపిక పోయింది. అక్కడికి పాపం పక్కవాళ్ళ అమ్మాయి బాబుని కాసేపు ఆడించింది. ఎవరు ఎంత సేపు చూస్తారు. నాకు తప్పదు గదా ఎవరికి తప్పినా, ఏనాడో ఏదో పాపం చేశాను" అతని గొంతు రుద్దమయింది. కమలకి చప్పున కళ్ళలో నీరు తిరిగింది.
"వూరుకోండి . మీకు నయమయ్యే వరకు పిల్లలని నేను చూసుకుంటాను లెండి. రాత్రి మా యింటికి తీసికేడతాను . మీరేం విచారించకండి అంది.
అతను ఆశ్చర్యంగా చూశాడు. ప్రతిఘటించటానికి కూడా ఓపిక లేక కళ్ళు మూసుకుండిపోయాడు.
తరువాత కమల చొరవ తీసుకుని యింట్లో చిందరవందరగా పడున్న వస్తువులన్నీ సర్దింది. రామారావుకి టెంపరేచర్ చూసింది. నూట రెండు జ్వరం. కాఫీతో క్రోసిన్ మాత్ర ఒకటిచ్చింది. బలవంతాన రెండు బ్రెడ్డు ముక్కలు కాల్చి ఇచ్చి తినిపించింది. బాబు లేస్తే పాలు పట్టి పిల్లలిద్దరిని తయారు చేసి రాత్రికి బాబుకి కావాల్సిన వస్తువులన్నీ బ్యాగ్ లో సర్దింది. పాపకి, బాబుకి రెండు జతల బట్టలు తీసుకుంది. రామారావుకి రాత్రి కోసం హార్లిక్స్ కలిపి ప్లాస్క్ లో పోసింది.
కమల యింట్లో తిరుగుతూ పనిచేస్తుంటే రామారావుకి కళ్ళు చెమ్మగిల్లాయి." "అయ్యో మీ చేత చేయిస్తున్నాను. మీకు ఎలా థాంక్స్ చెప్పను" నొచ్చుకుంటూ అన్నాడు.
"కష్టంలో తోటిమనిషికి కాస్త సహాయం చెయ్యకపోతే యింక మనిషి జన్మ ఎందుకు, ఈ స్థితిలో మీరుంటే నేనే కాదు ఎవరన్నా చేస్తారు" అంటూ కమల అభిమానం గా అతన్ని మందలించి , రేపు పది గంటలకి వచ్చి చూస్తానని జ్వరం తగ్గేవరకు పిల్లల బాధ్యత తనదే అని చెప్పి పిల్లలను తీసుకుని రిక్షా ఎక్కి యింటికి చేరింది.
యింట్లో అంతా ఆశ్చర్యంగా చూసి ప్రశ్నలు కురిపించారు. కమల సావకాశంగా ముందు నించి అంతా చెప్పింది. 'అయ్యో పాపం యింత పసిపిల్లలకి తల్లి లేని వారయ్యారా" అని సానుభూతిగా మాట్లాడింది కాంతమ్మ. అంతలోనే "నీవు ఒక్కర్తివే వెళ్లావుటే అతనింటికీ.....ఒక్కడే ఉంటున్నాడు యింట్లో..... చూసిన వాళ్ళు ఏమనుకుంటారే , నీ సాహసం నీవు " కాంతమ్మ మందలింపుగా అంది.
"వూరుకోమ్మా ....పాపం అతనంత యిబ్బందిలో వుంటే చూస్తూ ఎలా ఊరుకోమన్నావు. మంచిపని చేశావక్కయ్యా పిల్లలని తీసుకొచ్చి" మాలతి అంది. పిల్లలని ముద్దులాడుతూ, తల్లి మాటలకి కమల నొచ్చుకుని మొహం ముడుచుకుంది.
'అక్కయ్యా యిన్నాళ్ళ కి ఓ మంచి పని చేసింది తనంతట తానుగా ధైర్యంగా. అక్కయ్య , ఒంటరిగా బస్సులో వెళ్లి రావడం ఉద్యోగం చేయడం అవన్నీ ఒక ఎత్తు......ధైర్యంగా మగాళ్ళతో మాట్లాడే స్థాయికి ఎదిగింది అంటే అభినందించాల్సింది పోయి తిడ్తావేమిటమ్మా తప్పేముంది అతనింటికీ వెడితే. అంతమాత్రానికే పోయే పరువు వున్నా ఒకటే లేకపోయినా ఒకటే" వసంత కస్సుమంది.
"ఏమో తల్లీ , మీకేం.....ఆడపిల్లలు ఎటొచ్చి ఎటుపోయినా మీకే భాద అందులో" అంటూ ఆగిపోయి కమల మొహం చూసి ఆగిపోయి అక్కడ నించి వెళ్ళిపోయింది.
'అక్కయ్యా మంచి ఐడియా , అతనికి భార్య పోయింది. చిన్న పిల్లలు, యింట్లో నానా యిబ్బంది పడ్తున్నాడు. ఎలాగో పెళ్ళి చేసుకుంటాడు మళ్ళీ , నీవు అతను చేసుకోగూడదా"
'ఛా.....ఏమిటా మతి లేని మాటలు, నాకు పెళ్ళేమిటి" కమల కసిరింది మొహం ఎర్రబరుచుకుని.
"మతి లేకపోవడానికి ఏముంది. ఏం నీకు రెండో పెళ్ళయితే అతనికి రెండో పెళ్లి కాదూ....నీకేం పిల్లలున్నారా ఏమన్నానా"
"అతనికేం ఖర్మ రెండో పెళ్లిదాన్ని చేసుకోడానికి. పెళ్ళాం పోయినా చిన్నవాడు. , మంచి ఉద్యోగం చేస్తున్నాడు కన్నెపిల్లలే దొరుకుతారు" అంది కమల నిరాసక్తంగా.
"అదిగో , మన ఆడవాళ్ళమే యిలా మాట్లాడి మనల్ని మనమే అవమానపరుచుకుంటాం. నీకు రెండో పెళ్ళయితే పెళ్ళికి పనికి రావూ. అతనికి రెండో పెళ్ళయినా కన్నెపిల్ల కావాలా..... ఏమిటా ఎక్కువ తక్కువలు" వసంత వాదనకి దిగింది.
"అవునక్కయ్యా వసంత అన్నది నిజమే. అతనికి అడతోడు కావాలి. నీకు ఓ యిల్లు, భర్త సహచర్యం కావాలి. యిద్దరికీ ఇష్టం అయితే తప్పేముంది" ఎక్కువ మాట్లాడని మాలతి కూడా వసంత ఆలోచన నచ్చి అంది.
కమల మొహం సిగ్గుతో ఎర్రబడింది. కాసేపటికి సర్దుకుని "బావుంది, అన్నీ మీరే అనేస్తున్నారు. అతనికేం ఉద్దేశాలున్నాయో..... ఏదో రెండురోజులు పిల్లల్ని చూసానని పెళ్ళాడమని అడగమంటారేమిటి" హాస్యంగా అన్నట్టు అంది బాబుని జోకొడుతూ. అప్పటికింకేం అనకుండా వూరుకున్నా వసంత మనసులో ఏదో ఆలోచన తట్టింది.
* * * *
నారాయణమూర్తిగారూ హటాత్తుగా గుండెనొప్పి వచ్చి, మళ్ళీ స్పృహ లోకి రాకుండానే పోయారు. ఆయనకున్న డబ్బు, పలుకుబడి ఏమి ఆయన్ని బతికించ లేకపోయాయి. ప్రసాద్ ఆఫీసులో వుండగా ఫోను వచ్చి వున్నపాటున యింటి కెళ్ళాడు. అప్పటికే అయన వళ్ళంతా చెమటలు పట్టేసి, బాధతో లుంగచుట్టుకు పోతున్నారు. శరీరం నీలరంగులోకి మారుతోంది. ప్రసాద్ క్షణం ఆలశ్యం చెయ్యకుండా చేతుల మీద ఎత్తుకుని ఆస్పత్రికి తీసికెడుతుండగానే అయన స్పృహ కోల్పోయారు. పెద్ద పెద్ద డాక్టర్లంతా గంట రెండుగంటలు చేయ్యావలసిన ప్రయత్నాలు అన్నీ చేసినా ఆయనని బతికించ లేకపోయారు.
అయన మరణంతో లత విరిగిన మానులా అయిపొయింది. ప్రసాద్ వేళ్ళతో సహా కూలిన వృక్షంలా అయిపోయాడు. యింటికి పెద్ద దిక్కు, లతకి తనకి వారధిలా వుండేవారు. ఆయనే లేకపోతే ఆ ఇంట్లో వుండడం ఎంత గగనం అయిపోతుందో ప్రసాద్ కి తెలుసు. కనక అయన మరణంతో ప్రసాద్ కృంగిపోయాడు. లత దుఃఖం చెప్పనలవి కాదు కాస్త జ్ఞానం వచ్చిన దగ్గిరి నించి తల్లి, హితుడు , స్నేహితుడు , బంధువు అన్నీ తండ్రే అయి పెంచాడేమో, వున్న ఒక్కగానొక్క ఆత్మ బంధువుని పోగొట్టుకున్న లత పసిపిల్లలా ఏడ్చింది. ఆమెని చూసి మొదటిసారిగా జాలిపడాడు ప్రసాద్. తండ్రితో వున్న చేరిక తెలుసు కనక అయన మరణం ఆమెని ఎంతగా దెబ్బ తీసిందో ప్రసాద్ కి అర్ధమయి సానుభూతిగా ఆమెని ఓదార్చాడు. పచ్చి మంచినీరు ముట్టకుండా విలపిస్తున్న ఆమెని చూసి ఆమెకీ ఓ హృదయం వుందన్న సంగతి అర్ధమయి సానుభూతి చూపి నేనున్నానని దైర్యం చెప్పాడు. అనునయించాడు. ఆ పదిరోజులు పెద్ద ఎత్తున కర్మలు చేశాడు. దానాలు యిచ్చాడు. సంతర్పణలు చేశాడు. అయన అంతస్థుకి తగినట్టు అన్ని చేసి కొడుకు లేని లోటు తీర్చాడు.