"నేనేం చెప్పగలనురా...... మీరు మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. నన్నడిగితే మీ అమ్మ బతికినన్నాళ్ళు ఈ ఆస్తులు ఉమ్మడిగా ఉండటమే మంచిదేమో! ఆవిడకి మీరందరూ సమమే. ఆవిడ కళ్ళ ముందే మీరంతా ఎవరిది వారు పంచుకు విడిపోవడం ఆవిడకి బాధాకరమే. నన్నడిగితే ఇప్పుడీ ఆస్తులమీద మీరు బతకడం లేదు. ఇప్పటికిలా వుండనీయండి. ఇంకా మోహన్ పెళ్ళి అదీ వుంది. మీ అమ్మ తదనంతరం చూసుకోవచ్చు."
నాన్నగారి ఉద్దేశం అదే అయితే ఈ ఇల్లు నిర్మలకివ్వడం, అమ్మని అక్కడ వుండమనడం అదీ ఎందుకు రాస్తారు? నా చావు తదనంతరం పంచుకోండి అని రాసేవారు."
"మీకు తెలియదు మావయ్యగారూ! మేము ఇక్కడ వుండడం మామగారికి ఇష్టం లేదు. కూతురిని బాధపెడ్తామని ఆయన ఉద్దేశం అయి వుంటుంది. అంచేత ఇన్ డైరెక్ట్ గా మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళమనడానికి అలా రాశారు" అంది దివ్య కటువుగా.
దివ్య అనడం కటువుగా అన్నా ఆ మాటల్లో నిజం వుందని అందరికీ తట్టింది. "మేం అంత పనికిరానప్పుడు మాకేనా అందరి గొడవా కావాలి. నేనీ ఇంట్లో చచ్చినా వుండనింక. ఇన్నాళ్ళు మంచికో చెడుకో వున్నాం. మొదటిరోజే వేరింటి కాపురానికి వెళ్ళితే ఈ రోజు మామగారు పోగానే ఆడవాళ్ళని వదిలేసి పెద్దకొడుకు వెళ్ళిపోయాడన్న అపవాదుండేది కాదు - మా మరిదిగారు అదృష్టవంతులు. ఈ బాదరబందీలు, ఈ అపనిందలు అన్నింటికి దూరంగా ఉన్నారు. మామయ్యగారూ! మీరుండగానే ఎవరిదివారికిచ్చేసి పంపకాలు చేసేయ్యండి" అంది దివ్య గట్టిగా.
"దివ్యా! ఆయన పోయి పట్టుమని పదిరోజులయినా అవలేదు. ఇప్పుడు ఇంట్లోంచి మీరు వెళ్ళవలసిన అవసరం ఏమీలేదు. నే బతికినన్నాళ్ళు ఇక్కడే వుందాం. తరువాత ఎలాగో ఎవరిదారి వారిది. నా మాట వినమ్మా"...... అంది శారదాంబ.
రఘు దివ్య వంక చూశాడు - దివ్య కఠినంగా "చూడండీ..... ఇంత జరుగుతున్నా మనం ఇంత చర్చించుకుంటున్నా ఆవిడగారు ఒక్కమాటయినా అందా! అన్నయ్యా, మీరు వెళ్ళొద్దు, మనం అందరం కల్సి ఉందామన్న మాటయినా ఆవిడ అనలేదు. ఇల్లు తన పేర వుంది. వీళ్ళంతా పోవల్సిందేనన్నట్టు మాట్లాడకుండా వుంటే మమ్మల్ని ఇంకా ఈ కొంప పట్టుకుని వేలాడమంటారా?"
రాధాకృష్ణ నిర్మలవంక జవాబు ఏమన్నా చెప్తుందేమోనన్నట్టు చూశాడు. అప్పటికి నిర్మల ఏమీ మాట్లాడలేదు- "ఏమ్మా! నీరూ...... మాట్లాడవేం..... నీ వుద్దేశం చెప్పమ్మా?"
నిర్మల తనని కాదన్నట్టు చూస్తూ వూరుకుంది." ఇంక ఇంతకంటే ఏం చెప్పాలి? ఆవిడ మౌనం అర్థం కావడం లేదూ! చూడండి..... ఏం తెలీనట్టు ఎలా చూస్తుందో..... మామగారిచేత ఈవిడ కల్లబొల్లి ఏడ్పు ఏడ్చి రాయించుకునుంటుంది" కసిగా అంది దివ్య.
"దివ్యా..... దాని మొహం చూడు - ఆదసలు ఈ మాటలు వింటున్నట్టు లేదు - ఈ పదిరోజులుగా అది అసలు మనలో లేదు..... మనం అనుకుంటున్నది విన్నట్టు లేదు" దివ్య కూతురి మీద నింద వేస్తూంటే శారదాంబ అంది.
లత నిర్మల దగ్గరికెళ్ళి భుజంమీద చెయ్యి వేసి "నిర్మలా..... నీ ఉద్దేశం చెప్పు" అని అడిగింది.
"ఏం ఉద్దేశం?" అంది కలలోంచి మేల్కొన్నట్టు, ఆశ్చర్యంగా చూస్తూ. 'చూడండి ఆ నటన' అన్నట్టు దివ్య రఘు వంక చూసింది.
శారదాంబ అన్నట్టు నిర్మల ఈ విషయాలు ఏమీ వినలేదని రాధాకృష్ణకి అర్థం అయింది. ఆయన శివశంకరంగారి విల్లు గురించి అందరి అభిప్రాయాలూ విడమర్చి చెప్పాడు. మధ్యలోనే నిర్మల ఆవేశంగా అడ్డు వచ్చింది. "వద్దు - నాకేం వద్దు - నాకేం అక్కరలేదు, ఇప్పటికే ఇంటినపడి తినిపోతున్నానని అందరికీ బాధగా వుంది, నాకీ విల్లు వద్దు, ఆస్తి వద్దు, నేను బతకడానికి నాకేదో ఉద్యోగం ఉంది. ఇదంతా నాకేం వద్దు..... ఎవరికి కావాలో వాళ్ళకిచ్చేయండి" విరక్తిగా అంటూ లేచిపోబోయింది.
"కూర్చోమ్మా నిర్మలా..... మీ నాన్నరాశాక ఆయన కోరినట్టు జరపాలిగాని, నీవు వద్దన్నంత మాత్రాన వాళ్ళది అవుతుందా? మీ నాన్న ఆడపిల్లవి, నీకేదో ఆధారం వుండాలని ఆలోచించి రాసి వుంటారీ ఆస్తి, ఇప్పుడు పంచుకోవడమా, మీ అమ్మ తదనంతరం పంచుకోడమా అన్నది ఇప్పటి ప్రశ్న. నీ ఉద్దేశం చెప్పు."
"అదంతా నాకు తెలియదు. నాకేం ఆస్తిలో భాగం అక్కరలేదని కాగితం రాసిమ్మంటే ఇచ్చేస్తాను. నాకేం వద్దు...... వద్దు" అంటూ వడివడిగా అక్కడినుంచి వెళ్ళిపోయింది నిర్మల. అంతా మొహాలు చూసుకున్నారు.
"దాని మొహం..... ఏదో దుఃఖంలో, బాధలో అంటోంది. చిన్నది, దానికేం తెలుసు. రఘూ! నాయనా! నా మాట వినండి. ఇప్పటికి ఆస్థి పంపకాలు మానండి. అంతగా అవసరమైతే సంవత్సరీకాలనాడు చూద్దాం. మీరెవరూ ఇల్లు వదిలి వెళ్లడానికి వీలులేదు. కన్నతల్లిని చెపుతున్నా..... నా మాట వినండి. రాధాకృష్ణా! ఇప్పటికి వూరుకో, సంవత్సరీకాలకి ఆలోచిద్దాం" అంది శారదాంబ నిర్ణయం చేసి అక్కడినించి లేచిపోయింది.
తరువాత అన్నదమ్ములు ముగ్గురూ చాలాసేపు మాట్లాడుకున్నారు.
ఆ రాత్రి కృష్ణ తల్లితో "అమ్మా..... నాన్నగారు ఇల్లంతా నీరూ పేర రాసేయడం బాగులేదమ్మా. అన్నయ్య చాలా బాధపడుతున్నాడు. ఇంత పెద్ద ఇల్లు. ఆరు ఏడు లక్షలు చేస్తుంది. అంతా దానికే రాశారు. అన్నయ్య ఈ ఊర్లో ఉండేవాడు, వాడి గురించన్నా ఆలోచించలేదు. ఇంత ఇల్లుంచుకుని అద్దె ఇంట్లో వుండే గతి పట్టిందని బాధపడుతున్నాడు. నీరూ అంటే అభిమానం ఉండొచ్చు. కాని న్యాయాన్యాయాలు వద్దా? మీ పెద్దవాళ్ళే అసలు అన్నదమ్ములలో, అక్కచెల్లెళ్ళలో కలతలకి కారణం అవుతారు, ఇలాంటి అవకతవక రాతలు రాసి. ఇప్పుడు చూడు, నీరూ అంటే ఎవరికీ సానుభూతి వుండదు. ఆస్తంతా రాయించుకుందని అనుకుంటారు. పైకి అనకపోయినా మనసులో ఆ భావం ఉండిపోయి దానిపట్ల అసూయాద్వేషాలు పెరుగుతాయి. ఏమిటో నాన్నగారు ఇలా చేశారు. పోనీ, ఆస్తి అంతా నాలుగు భాగాలు సరిగా చెయ్యాల్సింది" అని అసంతృప్తి వెల్లడించాడు.