Previous Page Next Page 
జీవితం చేజారనీయకు పేజి 36

    శారదాంబకి తెలుసు. కొడుకుల అసంతృప్తికి కారణం సరయినదే అని. ఆవిడ భర్తతో ఎప్పుడో చెప్పింది. కూతురి పట్ల వెర్రి ప్రేమతో కొడుకులు చెల్లెలిని ద్వేషించే స్థితితేవద్దని - కాని ఆయన వినలేదు. "నేనేం చెయ్యనునాయనా! ఆయన నాకేం చెప్పి చేశారు? దాని కాపురం అలా అయిందన్నబాధతో చేసి వుంటారు - ఆడపిల్లకి నిలవనీడ వుండాలని రాసి వుంటారు" అని సర్ది చెప్పడానికి ప్రయత్నించింది.- కాని కొడుకుల మొహాలలో అసంతృప్తి ఆవిడకి బాధ కలిగించింది.
    తరువాత సంవత్సరం నిర్మలకి అతి భారంగా గడిచింది. ఇంట్లో ఏదో గొడవ జరగని రోజులేదు. శివశంకరంగారు ఇంట్లో పెద్ద దిక్కుగా, యజమానిగా ఉన్నన్నిరోజులు లోపల ఎలా వున్నా, ఏం అనుకున్నా ఎదుటపడి అనడానికి భయపడేది దివ్య. రఘుకీ తండ్రి పట్ల భయం, గౌరవం వుండి, ఆయన ఏమనుకుంటారోనని ఎప్పటికప్పుడు దివ్యని వెనుకనుంచి కంట్రోలు చేస్తూ, నచ్చచెపుతూ, బతిమిలాడుతూ ఇంట్లో గొడవలు రాకుండా చూసేవాడు. మామగారు పోయాక దివ్య స్వతంత్రురాలయిపోయింది. భర్తపోయిన దుఃఖంతో, విరక్తితో శారదాంబ ఇంటిగొడవలు పట్టించుకోకుండా దవ్యపైన వదిలేయటంతో దివ్యదే ఇంట్లో పెత్తనం అయిపోయింది. ఇన్నాళ్ళూ చాటుమాటుగా నిర్మలని ఆడిపోసుకునేది, ఇప్పుడింక నన్నడిగేవారు ఎవరు అన్నట్టు ప్రతిదానికీ పిల్లమీద, ఎలుకమీద పెట్టి ఏదో అనేది. సాధించేది, సణిగేది, అరిచేది. పనిమనుషుల దగ్గర, వంటవాళ్ళదగ్గర నిర్మలని దుయ్యపట్టడమే పనిగా మారింది.      
    "అయ్యో...... మహాలక్ష్మమ్మగారూ! ఆ కాకరకాయ కూర చేశారు. మా ఆడబిడ్డగారు తినరు. అమ్మో ఒక్కపూట ఆవిడకి కూరలేకపోతే భూప్రపంచం తలకిందులయిపోతుంది. వదినగారు కావాలని చేయించింది అనినన్నాడిపోసుకుంటారు అందరూ. ఆవిడ గారికి ఇంకో కూర ఏదన్నా చెయ్యండి" అనేది వ్యంగ్యంగా.   
    "మహాలక్ష్మమ్మగారూ! మా ఆయనగారికి ఆలస్యం అయినా ఫరవాలేదు. ఆవిడగారికాలేజి టైముకి మాత్రం వంటయిపోవాలి - ఉద్యోగస్తురాలు కదండీ - ఈ ఇంటి యజమానురాలు - వంట అది సరిగా టైముకి చెయ్యండి. లేదంటే మీకు ఉదాసన జరుగుతుంది." వ్యంగ్యంగా విసుర్లు.        
    "ఓ సుశీలా, ఇన్ని బట్టలు అని నా మీద ఎగిరితే ఏం లాభమే - ఈ ఇంట్లో మహారాణిగారు మూడు పూటలా మూడు చీరలు మారుస్తారు. అయ్యో రాత! మొగుడు మొద్దులు లేకపోయినా షోకులకి ఏం లోటే - నా మీద ఎగరకు తల్లీ - ఇన్ని బట్టలు ఎలా ఉతకాలి అని, ఆవిడకి చెప్పు. ఉద్యోగస్తురాలుగా - ఇంకో పదో, ఇరవయ్యో జీతం ఎక్కువ యిస్తుందిలే." పనిమనిషి దగ్గర విసుర్లు.       
    "ఇంట్లో మనుషులు చస్తున్నావేళకి వచ్చితినిపోవటం తప్ప ఇంట్లో వాళ్లు చస్తున్నా పట్టించుకోరు....... ఏం, చాకిరి చేయటానికి నేనేం తేరగా వున్నానా? వదిన అని కదూ - ఏం చేస్తుంది, చచ్చినట్లు చేసుకుంటుంది అనుకుంటుంది. అదే వాళ్ళ అమ్మ చేస్తే సాయం చెయ్యదా?" ఏ పూటన్నా వంట వండాల్సి వస్తే నానా రాద్ధాంతం జరిగేది ఇంట్లో.
    "ఇదుగో, మీ కూతురంటే మీకు అపురూపమయితే నెత్తిన ఎక్కించుకోండి. ఆవిడగారికి భయపడ్తూ, అడుగులకి మడుగులు వత్తాల్సిన ఖర్మ నాకు లేదు." కోడలి విసుర్లకి శారదాంబ ఎప్పుడన్నా ఏదన్నా అనబోతే ఆవిణ్ణి దులపరించి పారేసేది.   
    "ఇదుగో, ఏమండోయ్...... ఓ అద్దెకొంపచూసి రెడీగా పెట్టండి, మీ చెల్లెలు గారికి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు - వచ్చిందంటే ఆవిడ ఇంట్లోంచి పొమ్మంటే అప్పటికప్పుడు ఇల్లు దొరకదు." రఘుతో వ్యంగ్యంగా అనేది అందరూ వినేటట్టు.
    వదినగారి విసుర్లు, వ్యంగ్యాలు, నోటి దురద అన్నీ వింటూ చాలావరకు అనుకోనీలే అన్నట్లు పట్టించుకోకుండా వెళ్ళిపోయేది నిర్మల. ఒక్కొక్కరోజు మనసు బాగుండనిరోజు, తిక్క చిరాకువస్తే వదినగారి నోరు మూయించేది, ఆమెతో సరిగా దెబ్బలాడి. వదినా ఆడపడుచులు అరుచుకుంటుంటే రఘు తలపట్టుకునేవాడు. శారదాంబ సర్ది చెప్పబోయి ఇద్దరిచేత చివాట్లు తినేది.
    "ఇల్లు నీపేర వుందని మిడిసిపడుతున్నావు. మేం ఏదో ఖర్మకాలి వుండటం లేదు. మీ అమ్మగారు, అందరూ బతిమిలాడారని వున్నాం, లేదంటే ఎప్పుడో పోయేవాళ్ళం." అనేది దివ్య.
    "ఆ.... వెళ్ళు..... వుండి ఎవర్ని ఉద్దరించక్కర్లేదు" అని నిర్మల. ఇంట్లో ఈతగవులు, మనస్పర్థలతో ఎన్నాళ్లో ఇక్కడ వుండటం జరగదు అని రఘుకి అర్థం అయింది. ఇంట్లో శాంతి కావాలంటే వేరే వెళ్ళడం మంచిది. సంవత్సరీకాల తరువాత వేరే కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నాడు రఘు. ఇంట్లో రోజూ ఈ గొడవలతో శారదాంబ ప్రాణం విసిగిపోయింది. కోడలు గుణం తెలిసిన ఆవిడకి ఆ ఇంట్లో సర్దుకుని బతకటం జరిగేపనికాదని, విడిపోతేనే కాస్త ప్రాణం హాయిగా వుండి, బంధుత్వం నిలుస్తుంది అనిపించింది.   
    సంవత్సరీకాలకి అందరూ వచ్చారు. రాధాకృష్ణగారితో విడిగా ఒకపూట తనమనసులో మాట చెప్పాడు రఘు. ఇంట్లో గొడవలతో మనశ్శాంతి లేదని, ఎవరి వాటాలు వారు పంచుకొని వెళ్ళటం కంటే మార్గం లేదని, తనకింక ఈ గొడవలు భరించే శక్తిలేదని తేల్చి చెప్పేశాడు. కృష్ణ మోహన్ కూడా అదే మంచిదన్నట్లు తేల్చాడు. విడిగా శారదాంబతో కూడా ఆయన చర్చించాడు. ఆవిడా అదే అభిప్రాయాన్ని బలపరిచింది. రాధాకృష్ణగారు విల్లులో ప్రకారం ఎవరి భాగాలు వారికి రిజిష్టర్ చేయించడానికి రిజిస్ట్రార్ ని రమ్మన్నాడు.
    కాగితాలమీద సంతకాలు జరుగుతుండగా హఠాత్తుగా "ఆగండి.... ఇదిగో ఈ ఇల్లు నాకవసరంలేదని కాగితం రాసి సంతకం పెట్టాను. నామీద ఎవరూ ఏడవనక్కరలేదు. అదిగో ఆవిడకే పట్టం కట్టండి. ఆవిడనే వుండమనండి ఇంట్లో. నేను వేరే ఇల్లు చూసుకున్నాను. రేపే వెళ్ళిపోతున్నాను" అంటూ కాగితాలు విసిరికొట్టింది నిర్మల.    
    "అదెలా అమ్మా..... మీ నాన్నగారు రాసినట్టు జరగాలిగాని." రాధాకృష్ణ ఏదో అనబోయారు.   
    "అక్కరలేదు చిన్నాన్నా! ఆయన కూతురిపట్ల సానుభూతితో రాశారు. కాని ఆ సానుభూతి తోడబుట్టినవాళ్లకే లేనప్పుడు పైయింటినుంచి వచ్చిన కోడలికెందుకుంటుంది? ఈ ఇంటి మూలంగా గొడవలు నాకక్కరలేదు. నా ప్రాణం విసిగిపోయింది. రెండుగదుల ఇల్లయినా నాదంటూ వుంటే ప్రశాంతంగా బతుకుతాను."     
    "నీ దయ, దానం నాకక్కరలేదు నీరూ..... తీసుకో ఆ కాగితాలు. "రఘు గంభీరంగా అన్నాడు.   
    "నీరూ..... ఆవేశపడకు. తొందరపడి...." రాధాకృష్ణ అన్నారు.
    "తొందరపడకపోతే లాభంలేదు చిన్నాన్నా..... ఇలాగే పరిస్థితులు కొన్నాళ్ళుంటే పిచ్చెక్కుతుంది నాకు. ఇల్లు ఉంచుకొని కొడుకుల్ని తరిమేశారు ఇంట్లోంచి అన్న అపవాదు నాకొద్దు. నే వంటరిదాన్ని..... ఎలాగైనా బతకగలను. పిల్లలు కలవాళ్ళు వాళ్ళకి ఇవ్వండి. ఇంకెక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి..... ఇవిగో కాగితాలు."

 Previous Page Next Page