ఎవరెంత చెప్పినా నిర్మల ఆ పదిరోజులూ కళ్ళువాచిపోయేట్టు తిండి తిప్పలూ లేకుండా ఏడుస్తూనే వుంది. తండ్రి గది వదిలి రాలేదు. ఆ మంచం అంచున తల పెట్టుకునే వుండేది రోజంతా. ఏం చెప్పి ఎలా ఓదార్చాలో ఎవరికీ అంతుబట్టలేదు. పదిరోజులు తరువాత ఇంక కన్నీరు ఇంకిపోయినట్టు అలా శూన్యంలోకి చూస్తుండిపోయింది.
పదమూడోరోజు అందరు బంధువులూ వెళ్ళిపోయారు. శివశంకరంగారి తమ్ముడు రాధాకృష్ణ మాత్రం అందరి కోరిక మీద మరో నాలుగురోజులుండిపోయారు. అన్ని తంతులూ పూర్తయ్యాక ఒకరోజు తీరికగా కూర్చున్న వేళ, "రఘూ..... మీ నాన్న ఏమన్నా విల్లు రాశాడేమో తెలుసా?" అనడిగారు.
"తెలీదు చిన్నానా....." అన్నాడు రఘు
"ఏమ్మా.... నీకేమన్నా చెప్పాడా అన్నయ్య?" వదినగారిని అడిగారు ఆయన.
"సరిగా తెలియదయ్యా - రాసి వుంటారు భహుశా. ఆ మధ్య ఎప్పుడో అన్నట్టు గుర్తు. రాస్తున్నట్టు నాకేం చెప్పలేదు మరి." అంది శారదాంబ.
"రఘూ..... ఇనప్పెట్టె తీసి చూడు. విల్లుంటే మంచిదే. లేకపోతే ఆ ఆస్తి అంతా సమంగా ఐదు భాగాలు చేసుకోవాలి. పిల్లలు నలుగురు. మీ అమ్మకి అందరికీ సమంగా చెందుతుంది. తీసి చూడు ఎందుకయినా మంచిది." అన్నారు రాధాకృష్ణ.
"ఇప్పుడు ఆస్తి విషయాలు ఎందుకు చిన్నాన్నా? నాన్నపోయి పట్టుమని పదిరోజులు కాకుండా ఈ ఆస్తి పంపకాల మాటెందుకు? అయినా అమ్మా ఇంకా ఉండగానే ఇప్పుడు ఈ మాటలు ఎందుకు?"
"అలా కాదు కృష్ణా! మీ నాన్న ఏం రాశాడో చూసుకోడం మంచిది. తరువాత ఎవరిదీ ఎవరో తినిపోయారన్నట్టు మనస్పర్థలు పెంచుకోకుండా ముందు చూసుకుంటే మంచిది." అనుభవంతో అన్నాడు ఆయన.
ఇనప్పెట్టెలో విల్లు కనిపించింది - విల్లు రాసి మూడేళ్ళకిందటే రిజిష్టరు చేయించినట్టుంది. రాధాకృష్ణ ఆ కాగితాలు తీసుకుని అందరినీ కూర్చోబెట్టి చదివాడు -" ఈ నా ఆస్తి అంతా నా సార్జితం. నా తదనంతరం నా ఆస్తి కింది విధంగా పంచుకోవాలని నా కోరిక. నిర్మల ఈ ఇంటి ఆడపడుచు. దురదృష్టవశాత్తు ఆమె కాపురం చెడింది. కనక ఆడపిల్లకి నిలవనీడ వుండాలి కనక ఈ ఇల్లు ఆమెకి చెందాలి.
నా భార్య బతికినన్నిరోజులు ఈ ఇంట్లో వుండే హక్కు వుంటుంది. ఈ ఇల్లుకాక లక్షరూపాయలు నాకుమార్తె పేర ఫిక్సెడ్ డిపాజిట్లో వేశాను. ఆ వడ్డీ ఆమెకి చెందాలి - నా కొడుకులు ముగ్గురికీ పల్లెలో వున్న ముప్ఫై ఎకరాలలో తలా పది ఎకరాలు, ఒక్కొక్కరికి లక్షరూపాయల కేష్. నా భార్యకి కొబ్బరితోట, ఆవిడ బతికినన్నిరోజులు అనుభవించేహక్కు, ఆవిడ తదనంతరం అది కొడుకుల ముగ్గురికీ చెందుతుంది. నా కూతురి తదనంతరం ఈ ఇల్లు నా మగపిల్లల - మగపిల్లలకి, అంటే నా మనమలందరికి ఉమ్మడిగా చెందుతుంది. నా భార్య ఈ ఇంట్లో నా కూతురిని కనిపెట్టుకుని వుండాలని నా కోరిక. నా విల్లులో రాసినట్టు అందరికీ న్యాయం చేకూర్చే బాధ్యత నా తమ్ముడైన రాధాకృష్ణ మీద పెడుతున్నాను." విల్లు చదివిన రాధాకృష్ణ అందరివైపూ చూశాడు.
"ఈయన అన్నంత పని చేశారు. ఇల్లు దీనిపేర పెట్టేశారు." అనుకుంది శారదాంబ. ఆవిడ కొడుకులు ఏమనుకుంటారోనని భయంగా వాళ్ళ వంక చూసింది. కొడుకులు ముగ్గురూ మొహాలు చూసుకోవడం గుర్తించింది. రఘు దివ్య వంక చూశాడు. దివ్య మొహం మాడిపోయింది. రఘు మొహంగంటు పెట్టుకున్నాడు. కృష్ణ, మోహన్ మాట్లాడకుండా వూరుకున్నారు. లత నిర్మల వంక చూసింది - అసలు విన్నట్టు లేదు. ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తుంది.
"ఏమంటావమ్మా వదినా! ఎవరి భాగాలు వారు ఇప్పుడే పంచుకుంటారా..... తరువాత చూసుకుంటారా?" రాధాకృష్ణ అడిగాడు.
"ఏమనడానికి నేనెవరినయ్యా! మగపిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళని అడిగి వాళ్ళెలా చెబితే అలా చెయ్యండి - అయినా నేనింకా బతికే వున్నాను..... నా కళ్ళముందే ఇలా ఆస్తులు పంచుకుని ఎవరికివారు అయిపోవాల్సిన అగత్యం ఏమి వచ్చింది. ఇప్పుడేం తొందర?" అంది శారదాంబ. "రఘూ..... ఇప్పుడింటికి నీవు పెద్దవాడివి. బాబాయికి మీరంతా కల్సి ఏదో ఆలోచించి చెప్పండి."
నా పెద్దరికం ఎవరుంచారులే అమ్మా! వుంచితే విల్లు రాశానని గాని, రాస్తున్నాననిగాని నాకు ఒక్కమాటన్నా చెప్పారా నాన్నగారు?" నిష్ఠూరంగా అన్నాడు. ఇంకా ఏదో అనాలని వున్నా తండ్రిపోయిన పదమూడోరోజే తగవులు ఎందుకు అన్నట్టు వూరుకున్నాడు. కాని దివ్యమాత్రం వూరుకోలేదు." అంటే, ఇప్పుడింక మీ తోవ మీరు చూసుకుని ఇంట్లోంచి వెళ్ళమని మీ నాన్నగారు రాశారు కనక మన ఏర్పాట్లలో మనం వుండాలి - గెంటించుకోకముందే ఇల్లు చూడండి వెళదాం. ఎలాగో ఇంట్లోంచి వెళ్ళాలి కనక ఎవరికి చెందింది వాళ్ళు పట్టుకెళ్ళడమే మంచిది." అంది, మొహం నల్లగా మాడ్చుకుని.
"దివ్యా.... అవేం మాటలు, మిమ్మల్ని ఇంట్లోంచి ఎవరు వెళ్ళమన్నారు? మీరెందుకు వెళ్ళడం?..... అలా మాట్లాడకు" శారదాంబ మందలింపుగా అంది.
"ఇంట్లోంచి వెళ్ళండి అని స్పష్టంగా రాయాలా? ఇల్లు కూతురుపేర పెట్టారంటే కొడుక్కి అందులో హక్కులేనట్టేగా! సిగ్గులేకుండా ఆడబిడ్డదయాధర్మం మీద మమ్మల్ని బతకమంటారా?" రెట్టించింది దివ్య.
"అవునమ్మా..... నిర్మలతో నిన్నుండమన్నారుగాని, నిర్మల భారం పెద్దకొడుకునైనా నాకు అప్పగించారా? ఇల్లంతా దానిపేర పెట్టడంలో అర్థం? మేమిక్కడ ఉండటం ఆయనకిష్టం లేదన్నట్టేగా! దివ్య అన్నట్టు నాకేం గతిలేక పడుంటానా? ఏమంటారు బాబాయ్...... మీ ఉద్దేశం ఏమిటి? పెద్దవాళ్ళు మీరు చెప్పండి." రఘు అన్నాడు.
రాధాకృష్ణగారు ఆలోచనలో పడ్డారు. రఘు చెప్పింది ఒకవిధంగా నిజమే! కొడుకులుండీ ఇల్లు నిర్మల పేరున పెట్టారంటే నిర్మలని సరిగా చూడరన్న భయమేకాక, నిర్మలకి ఓ నీడ వుండాలని ఆయన ఉద్దేశం అయి వుంటుంది. నిర్మల భవిష్యత్తు మీద ఎంత చింతవున్నా ఆరేడు లక్షలు చేసేంత పెద్దఇల్లు కూతురికి ఒక్కర్తికీ ఇవ్వడం ఆయనకీ సమంజసం అన్పించడం లేదు.