Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 34


    అందుకే కార్లోంచి రోడ్డు ప్రక్కకి వేగంగా వెనక్కి వెళ్ళిపోతున్న చెట్లను చూస్తూ కూర్చుంది.

 

    అన్వేషి కూడా శృతి సంభాషణ ఎలా ప్రారంభిస్తుందా అనే ఉత్సకతతో ఓరచూపులు చూస్తూ ఏకాగ్రతతో డ్రైవ్ చేస్తున్నాడు.

 

    అతను కారు నడుపుతున్నాడు కనుక తన కళ్ళలోకి చూసి సమాధానం ఇవ్వడం కుదరదనే ఊహ మనసులోకి రాగానే శృతికి కాస్త రిలీఫ్ అనిపించింది.

 

    "ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నారు?" ఓరగా చూస్తూ అడిగింది శృతి.

 

    అన్వేషి ఏమీ లేదన్నట్టు భుజాలెగరేశాడు సన్నగా నవ్వుతూ. మాట్లాడితే మంచి ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్టు బుంగమూతి పెట్టుకున్న శృతి ఓరకంట చూశాడు అన్వేషి.

 

    "వెరీ బ్యూటిఫుల్" పైకే అన్నాడు అప్రయత్నంగా.

 

    "ఏమిటి?" ప్రశ్నార్థకంగా చూసిందామె సీతాకోకచిలుక రెక్కల్లా కనురెప్పలు కదలాడిస్తూ.

 

    "ఓ ఉర్దూకవి చెప్పిన విషయం ఒకటి జ్ఞాపకం వచ్చింది" అన్నాడు అన్వేషి.

 

    "ఏం చెప్పారు?" మృదుమధురంగా వీణ మీటినట్లుగా వుంది ఆ కంఠస్వరం.

 

    "దేవుడు గులాబీని, లిల్లీఫ్లవర్ ని, పావురాన్ని, సర్పాన్ని, తేనెను, యాపిల్ ను సృష్టించి వాటిల్లోంచి ఒక్కొక్క గుణాన్ని తీసి ఆడపిల్లను సృష్టించాడట. అందుకే ఆడపిల్లలో ప్రేమ, అసూయ, ద్వేషం ఎక్కువ శాతంలోనే వుంటాయట"

 

    "వెరీ నైస్" అందామె. ప్రేమ అనే పదం అన్వేషి నోటివెంట వెల్వడగానే ఎందుకో శృతి బుగ్గలు ఎరుపెక్కాయి ఆ మరుక్షణమే.

 

    మీ బుగ్గలు చాలా సుకుమారం- అని అందామనుకున్నాడు. ఇంతలో కారు మలుపు తిరిగింది.

 

    నలువైపులా చిన్నచిన్న కొండల మధ్య యముడు సృష్టించిన వింత సృష్టిలా విశ్వాత్మ ప్యాలెస్ కనబడడంతో అతని నోట మాట రాలేదు.

 

    ఆ ప్యాలెస్ ను చూడగానే అతని వంటిమీద చిరుచెమటలు పట్టాయి. అప్పటికప్పుడే అతనిలో ఏదో ఉద్వేగం... ఉత్సాహం.... ఊహకందని భావం అతడ్ని నిలువునా కదిలించి వేశాయి. అతని నరాల్లో రక్తం చకచకా పరుగులు తీయడం, గుండెలో ఏదో తెలీని అలజడి. అతని పరిస్థితి అతనికే వింతగా వుంది.

 

                              *    *    *    *

 

    విశ్వాత్మ ప్యాలెస్ ని చేరుకోగానే నిలువెత్తు ఐరన్ గేట్ ముందు సడన్ బ్రేక్ వేశాడు అన్వేషి.

 

    అక్కడ ఆగిన కారును గమనించిన ఒక సెక్యూరిటీ గార్డు పరిగెత్తుకొంటూ వచ్చాడు.

 

    ఒక చేతిలో స్టెన్ గన్, మరో చేతిలో వైర్ లెస్ తో సుశిక్షితుడైన కమెండోలా వున్నాడతను.

 

    శృతి విండోగ్లాస్ ఓపెన్ చేసి తన ఐడెంటిటీ కార్డు అతనికి చూపించింది. సెక్యూరిటీగార్డు అన్వేషి వైపు అనుమానపు చూపులతో చూశాడు.

 

    సరిగ్గా అదే సమయం-

 

    లోపల్నుంచి మిత్ర ఫోన్ ను రిసీవ్ చేసుకున్న సెక్యూరిటీ ఇన్స్ పెక్టర్ పరుగు పరుగున వచ్చి శృతికి, అన్వేషికి సెల్యూట్ చేసి లోపలికి వెళ్ళమని సంజ్ఞ చేశాడు.

 

    కారు గేటుదాటి లోపలికి ప్రవేశించింది. సెక్యూరిటీ ఇన్స్ పెక్టర్ లోపలున్న సెక్యూరిటీ గార్డ్సుకి ఈ విషయం వైర్ లెస్ లో చెపుతుండడాన్ని విండో మిర్రర్ లోంచి గమనించాడు అన్వేషి.

 

    కారుదిగి పరిసరాలను గమనించసాగాడు అన్వేషి.

 

    ప్యాలెస్ చుట్టూ ఎత్తయిన గోడ, దానిపై ఎలక్ట్రికల్ ఫెన్సింగ్. ప్యాలెస్ ముందు ఎత్తయిన గోపురంలాంటి బెల్ వేలాడుతోంది. ఎవరైనా దొంగచాటుగా ప్రవేశిస్తే ఆ బెల్ ఆటోమేటిగ్గా ఏక్టివేట్ అయి మోగుతోంది. ఇరవై నాలుగు గంటలూ చుట్టూ సుశిక్షితులైన సైనికుల్లాంటి సెక్యూరిటీ గార్డ్స్, ముఖద్వారం ముందు సింహాల్లాంటి నాలుగు ఆల్సేషియన్ డాగ్స్ భీకరమైన ముఖాలతో తచ్చాడుతున్నాయి.

 

    ప్యాలెస్ చుట్టూ ఎత్తయిన కొండలు, ఆవరణలో దట్టమైన చెట్లుండడంతో అక్కడి వాతావరణం, వీచే గాలి ఆహ్లాదంగా వుంది. అంతవరకూ సెక్యూరిటీ ఇన్స్ పెక్టర్ తో మాట్లాడి అన్వేషి దగ్గరకు వచ్చింది శృతి.

 

    "ఏంటీ డిటెక్టివ్ గారూ కవిలా తన్మయత్వంలో పడిపోయారు?" అంది కాస్త కొంటెగా.

 

    "అందరిలాగే అనుభూతి పొందడంలో థ్రిల్ ఏముంది? అన్వేషించి మరీ ఆస్వాదించడం ఒక కళ! నాకు ఆ రెండో పద్ధతి అంటే కాస్త ఇంట్రెస్ట్ ఎక్కువ" లతలను అల్లుకున్న తీగల్లా చిరుగాలి తాకిడికి నుదుటిపై నాట్యం చేస్తున్న ఆమె ముంగురులు వంక, నెలవంకల్లాంటి కనుబొమల కలయిక వంక కన్నార్పకుండా తదేకంగా చూస్తూ అన్నాడు అన్వేషి.

 

    'బాబోయ్... ఇతను మామూలు డిటెక్టివ్ కాదు. ఈస్తటిక్ సెన్స్ వున్న గూఢచారి' అనుకొంది శృతి.

 

    "పదండి వెళ్దాం.... మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచే మహల్లోకి తీసికెళతాను" అందామె ముందుకు నడుస్తూ.

 

    తలూపి ఆమె వెనక నడిచాడు అతను.

 

    ప్యాలెస్ అంటే ప్యాలెస్ లా వుంది.

 

    ఎత్తయిన స్తంభాలు.... విశాలమైన ఇటాలియన్ గ్రానెట్ ఫ్లోర్ కారిడార్లు... బలమైన నగిషీల తలుపులు... లక్షరూపాయల విలువైన షాండెలీర్లు... గోడల ప్రక్కన, స్తంభాల పక్కన అందంగా అమర్చిన దంతాల ప్రతిమలు. కుర్చీలు, సోఫాలు, ఇతర ఫర్నిచర్, ప్రతిరూమ్ లోనూ పెద్ద పెద్ద పెయింటింగ్స్.

 

    రూమ్ తర్వాత రూమ్ ని చూపిస్తూ అక్కడున్న ఫర్నిచర్, పెయింటింగ్స్ విశేషాలను చెబుతూ, విశ్వాత్మ అభిరుచిని చెబుతోంది శృతి.

 

    కళాత్మకతకు అచ్చమైన నిదర్శనంలా తీర్చిదిద్దిన ప్యాలెస్ ను చూసి విశ్వాత్మ కళాహృదయాన్ని మనసులోనే అభినందించాడు అన్వేషి.

 

    ప్యాలెస్ లోని అన్ని గదుల్లోకి చివరగా వున్న గదిముందు నిలబడి పెయింటింగ్స్ ను చూస్తూ నిలబడ్డ అన్వేషివైపు పరిశీలనగా చూస్తూ- "మీరు కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుంటారా?" అంది శృతి.

 

    ఎందుకన్నట్లు ఆమెవైపు చూశాడతను.

 

    "నాకో చిన్న కోరిక" అందామె.

 

    "చెప్పండి" అన్నాడతను.

 

    "మీ చూపుల్లో నేననుకున్న భావన కనిపిస్తే చూడాలని ఆశ" కాస్త సిగ్గుపడుతూనే అందామె.

 

    తమ ఇద్దరిమధ్యా పరిచయం పాతబడుతూ, స్నేహం ఆహ్లాదంగా మారడాన్ని గమనించాడు అన్వేషి.

 

    "ఓ.కె" అంటూ కళ్ళు మూసుకున్నాడతను.

 

    మెల్లగా ఆ గది ద్వారాలను తెరిచింది శృతి.

 

    ఓ వింత వెలుగు స్పర్శ తాకినట్లయింది అతనికి.

 

    కళ్ళు తెరవండని అందామె.

 

    పూర్ణచంద్రుడి వెన్నెల్లా ఎత్తయిన అద్దాల అమరికతో, ఇటాలియన్ చలువరాళ్ళను పరిచిన ఆ రూమ్, ప్యాలెస్ వెలుపల ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలల్లాంటి ఫౌంటెన్ ను, దానిచుట్టూ పట్టుచీర ఆరేసినట్లుగా పెంచిన పచ్చికను ప్రతిబింబిస్తూ ఓ అపురూప దృశ్యాన్ని, స్వప్నంలాంటి నిజాన్ని ఆవిష్కరించినట్లు మనోహరంగా వుందా గది.

 Previous Page Next Page