ఆరోజు పదకొండు గంటల వేళ ఎవరో అందమైన అమ్మాయి ఆఫీసు కొచ్చి చకచకా చాలా స్వతంత్యంగా రతన్ లాల్ గదిలోకి వచ్చింది.
"హాయ్ , రతన్" అంది చనువుగా.
ఆమెని "హాయ్ గీతా ....వాట్స్ ప్లెజెంట్ సర్ ప్రైజ్ " అన్నాడు సంబరంగా.... పక్కనే షార్టు హాండ్ తీసుకుంటున్న వసంత ఆ నవ మోహనాంగిని విభ్రాంతిగా చూసింది. ఎవరో దివినించి దిగివచ్చిన అప్సరస లా కనిపించింది వసంత కళ్ళకి. ఎన్నో వేల గులాబీలని ముద్దచేసి చేసినట్లున్న గులాబి రంగు శరీరం, గులాబి కన్న కోమలంగా సుకుమారంగా వున్న దేహం. పేరుకి తగ్గట్టు సన్నగా లతలా, ముట్టుకుంటే కందిపోతుందనేటంత సౌకుమార్యంగా, ఆధునికంగా బాబ్డ్ హెయిర్ , స్లివ్ లెస్ బ్లౌజ్ అందంగా, నాజూగ్గా అమరినట్లులంకరించుకున్న ఆమెని చూసి, అబ్బ ఏం అందం, అన్ని కల్సిన యీ అద్భుత సౌందర్యం ఏమిటి అనిపించి కళ్ళు విప్పార్చుకుని ఆటే చూసింది.
వసంతాని చూసి రతన్ లాల్ చప్పున ఆ లతా, మిస్ వసంత. మై స్టెనో , అని ....మిస్ గీత అంటూ పరిచయం చేశాడు నవ్వి. వసంత, యూ కేరీ అన్.... మిగతా లేటర్సు తరువాత డిక్టేట్ చేస్తాను అంటూ నీవేళ్ళు అన్నట్టు చూశాడు.
గ్లాస్ పార్టిషన్ లోకి వెళ్ళాక వాళ్ళిద్దరి మాటలు గుసగుసల్లా వినిపించాయి తప్ప స్పష్టంగా వినపడలేదు. కాని వారిద్దరి హావ భావాలు చక్కగా కనిపిస్తూనే వున్నాయి. యిద్దరూ నవ్వుకుంటున్నారు. ఆమె ఏదో ముద్దులు గునుస్తూ కోపం అభినయించుతుంది. ఎవరీమె! రతన్ లాల్ కి ఏమవుతుంది? స్నేహితురాలా బంధువా , ప్రియురాలా.....వసంతలో లక్ష ప్రశ్నలుదయించాయి. టైపు చేయకుండా కూర్చుంటే అతనేం అనుకుంటాడోనని టైపు ఆరంభించింది కాని, వెళ్ళు అలవాటుగా టైపు కొడ్తున్నా ఏం కొడ్తుందో తెలియలేదు. ఆమె రాగానే అతని మొహం ఎలా వెలిగింది? తప్పకుండా ప్రేయేసీయే అయుంటుంది! తనని అక్కడ నించి పోమ్మన్నట్లుగా ఎలా చూశాడో.....ఆ యిద్దర్నీ చూస్తున్న వసంత మనసు అసూయతో భగ్గుమంది. అందుకే తను అతనికి కంటికి అనలేదు. అంత అందమైన అమ్మాయుండగా తన పట్ల ఏం ఇంటరెస్టు వుంటుంది. ఉక్రోషంతో రతన్ లాల్ ని మనసులో తిట్టుకుంది. యిద్దరూ లేచారు కుర్చీలోంచి.
రతన్ లాల్ వసంత దగ్గర కొచ్చి "నేను బయటకు వేడ్తున్నాను. ఫోనులో అర్జంటు ఉత్తరాలు ఏమన్నా వుంటే వచ్చి చూస్తాను సాయంత్రం. రొటీన్ అయితే జవాబులు పంపేసి మీ టైం కాగానే వెళ్ళిపోవచ్చు. అంటూ ఆమెతో బయటకు వెళ్ళిపోయాడు. యిద్దరూ ఒకరిని ఒకరు రాసుకుంటున్నట్టు, నవ్వుకుంటూ ప్రపంచంలోని అనందాని కంతటికీ ప్రతినిధిలా వెడ్తున్న వాళ్ళని చూసేసరికి వసంతలో ఉత్సాహం అంతవరకున్న కాస్తా ఆశ పోయి గాలితీసిన బెలూన్ లా అయిపొయింది.
ఆ సుందరి రాక లంచ్ వేళ అందరికి చర్చనీయాంశం అయింది. ప్రతివాళ్ళు ఆ అందాన్ని పొగిడారు. ఎవరా అని ఆశ్చర్యపడ్డారు. కుతూహలంగా చర్చించారు. అసలు సంగతి ఎవ్వరికీ తెలియలేదు ఊహాగానాలు తప్ప వసంత ఏం మాట్లాడకుండా కూర్చుంది. వసంత కళ్ళలో ప్రజ్వరిల్లుతున్న అసూయ ద్వేషాలు, ఆమె మాడిపోయిన మొహం చూసి ఎవరూ గుర్తించకపోయినా ఫతిమా గుర్తించింది. లంచ్ అవర్ అయ్యాక ఎవరి సీట్ల లోకి వాళ్ళు వెళ్ళాక వసంత టైప్ మిషన్ ముందు అన్యమనస్కంగా కూర్చుంది.
ఫతిమా లోపలికి వచ్చి వసంత మనసులో భావాలు అర్ధం చేసుకున్న దానిలా ఆమె భుజం మీద చెయ్యేసి "డోంట్ బి సిల్లీ వసంతా, ఆశ పడడానికి కూడా అర్హత వుండాలి, మనకే అర్హత లేదన్నది నీకు తెలియదా? వాళ్ళెక్కడ మనం ఎక్కడ.....పిచ్చిపిచ్చి ఆలోచనలు మాను, యిన్నాళ్ళు ఏదో హాస్యంగా ఏడిపించడానికి అన్నాను గాని, నిజంగానే నీవు "మైగాడ్" అంటూ ఒడారుస్తున్నట్లు మందలిస్తున్నట్టు అంది.
వసంత మొహం ఎర్రబడింది. "అదేం లేదు' అన్నట్టు విసురుగా తల ఆడించింది. "కమాన్ .....నా దగ్గిర దాపరికమా నీవబద్ధం చెప్పినా నీ మొహం చెప్పలేకపోతుంది . డోంట్ బి సిల్లీ దట్సాల్ ఐ వాంటెడ్ టు టెల్ యూ" అంది భుజం నొక్కి వెడుతూ.
వసంత కళ్ళలో కరిగిన నీరు రుమాలుతో వత్తుకుని టైపు మిషను తెరిచింది.
* * * *
గత రెండురోజులుగా రామారావు పిల్లలని తీసుకురావడం లేదు. కమల మొదటిరోజు ఆరాటంగా ఎందుకు రాలేదో, ఆలశ్యంగా తీసుకోస్తాడేమోనని ఎదురు చూసింది. ఆరోజంతా రాకపోయేసరికి ఏమయిందో, ఏదన్నా వూరు వెళ్ళారేమో ననుకుంది. పిల్లలిద్దరూ కమల దగ్గిర బాగా మాలిమిఆయ్యారు.యీ నెలరోజులుగా. కమలకీ, మిగతా పిల్లల కంటే వీళ్ళిద్దరితో బాగా చేరిక అయిందేమో వాళ్ళు రాకపోతే ఆరోజంతా తోచలేదు. పాపం రామారావు ఏం అవస్థ పడుతున్నాడో వాళ్ళతో , ఎందుకు ఎందుకు రాలేదో అని పదిసార్లు అనుకుంది.
ఆ మర్నాడు రాకపోవడంతో సాయంత్రం వరకు ఎలాగో ఆరాటం అనుచుకుని ఆఖరి కింక ఆగలేక యింటికి వెళ్ళే ముందు ఒకసారి అతనింటికి వెళ్ళి సంగతేమిటో చూసి రావాలని నిర్ణయించుకుంది. వూరి కెడితే చెప్పకుండా వెడతాడా వంట్లో బాగాలేదేమో అని ఆదుర్దా పడింది.
ఆమె అనుకున్నట్టే కమల వెళ్ళేసరికి వీధి వరండాలో పాప ఆడుకుంటున్నదల్లా 'అంటీ' అని ఒక్క పరుగుతో వచ్చి కమలని వాటేసుకుంది సంబరంగా. రెండు రోజులకే వాచిపోయినట్టు. కమల పాపనేత్తుని "రెండు రోజుల్నించి రావడం లేదేం కరుణా" అంది లోపలికి నడుస్తూ.
"డాడీకి.....జ్వరం" అంది కరుణ వచ్చి రాని మాటలతో.
'అయ్యో అలాగా......'[ అంటూ కమల గబగబ లోపలికి వెళ్ళింది.
రామారావు కమల గొంతు గుర్తుపట్టి లేవాలని ప్రయత్నించాడు . అతని కళ్ళు చింతనిప్పుల్లా వున్నాయి.
"లేవకండి, లేవకండి. జ్వరమా.....ఎందుకు రాలేదా అని రెండు రోజులు ఎంతగానో అనుకున్నాను. కొంచెం ఎవరి చేతనన్నా కబురు పెట్టక పోయారా వచ్చి పిల్లల్లని తీసుకెళ్ళే దాన్ని" అంది గబగబ.
రామారావు శుష్కహాసం చేస్తూ మంచం మీద వాలిపోయి , "ఏదో మామూలు జ్వరం. ఒకరోజులో పోతుందనుకున్నాను నిన్న, యివాళ యింకా ఎక్కువైంది" నీర్సంగా అంటూ కళ్ళు మూసుకున్నాడు.
మాట్లాడే ఓపిక లేక, రెండు రోజులకే పీక్కుపోయిన అతని మొహం చూసి చాలా జ్వరం వుందని గుర్తించింది కమల. ఇల్లంతా అడవిలా అక్కడ విడిచిన గుడ్డలు, బొమ్మలు , కాగితాలు , బ్రెడ్ ముక్కలు పడివున్నాయి. బాబు వకటికి వెడితే తుడిచే వాళ్ళు కూడా లేరు. బాబు పక్క బట్టలు కింద దొర్లుతున్నాయి. పాపం జ్వరంతో , యిద్దరు చిన్న పిల్లలతో ఎలా మేనేజ్ చేసాడో రెండు రోజులుగా. అతని దయనీయమైన స్థితి చూసేసరికి కమల గుండె తరుక్కుపోయింది. బాబు పక్కన మంచంలో నిద్రపోతున్నాడు.
"కూర్చోండి , మీకనవసరంగా శ్రమ ఇచ్చాను పిల్లలని దించి రామ్మందామనుకున్నాను పక్క వాళ్ళాబ్బాయిని. కాని, సాయంత్రం మళ్ళీ తీసుకురావడానికి ఆ అబ్బాయి యింట్లో వుండడు."