అలాంటి బంగారు పిచ్చుక రాణి ఆకాశమంతేత్తు అంతస్తుని మరిచి రాజునేలా కటాక్షించింది? తెలియాలంటే ప్రజలు షేక్స్ పియర్ నాటకాల్నుంచి తెలుగు సినిమాల దాకా ఎన్నో పాత్రల్ని యెన్నో సన్నివేశాల్ని తరిచి పరిశీలించాలి; ప్రేమ గుడ్డి దన్న సూక్తి మర్చిపోకూడదు. రాణి చిరునవ్వుల పన్నీటి జల్లుల కోసం , వాడి కత్తుల్లాంటి వాలుచూపుల సూటి తాకిడి కోసం ప్రాకులాడే కన్ వర్టిబుల్ కార్లున్న వాళ్ళు, బకింగ్ హం పాలెస్ లాంటి భవంతులున్న వాళ్ళు, టెర్లిన్ సూట్లవాళ్ళు, మిట్టమధ్యాహ్నపు ఎండ లోంచి చీకటి గుయ్యారంలోకి అడుగుపెట్టినట్టు మొన్నే విదేశాల్నుంచి దిగిన వాళ్ళు, చెక్కుల్తోనే గాని నోట్లతో నాణాల్తో వ్యవహరించి యెరుగని ఉన్నతోద్యోగు;లు, అసలు సిసలైన డింపిల్స్ విస్కీ తప్పించి సేవించి యెరుగని విలాస పురుషులు, ప్రతి రాత్రీ ఏ హోటలు నునుపు ఫ్లోర్ మీదనో సుందరాంగుల బిగి కౌగిలిలో గీపెట్టీ సంగీతానికి లయగా అడుగులు జార్చనిదే ప్రొద్దు గడవని రసికులు, కత్తి కఠారుల్తో గాకుండా దేవుడిచ్చిన చేతుల్తో తిండి తినడం అండమాన్లో ఆదివాసుల అలవాట్లనుకునే అత్యాదునికులు - యింత మందుండగా అవేవీ యేమిటో తెలియని మిల్ యారన్ చొక్కా, పర్ఖాలా పాంటు తో ఉదయాన్నే లేచి బుద్దిగా కాలేజీ పాఠాలు చదువుకునే రాజు రాణి ప్రేమని పొందడం యెలా సాధ్యపడింది? ఏమా కధ అని అడిగితె........
ఒంటిగా పోతున్న అబల, కుసుమ కోమలి గులాబి రేకులాంటి జవ్వని, చెలికత్తెలు వెంటరాగా రెండో అట యింగ్లీషు సినిమా చూసి విలాసంగా కబుర్లు చెప్పుకుంటూ కిలకిలా నవ్వుకుంటూ , ఒక్కొక్క నెచ్చెలిని డ్రాప్ చేసి, యిళ్ళ దగ్గిర దింపి , యింటికి తిరిగి వస్తుంటే, ఆ ఎగుడుదిగుళ్ళ రోడ్ లో , నిర్మానుష్యమైన నడిరాత్రి టైర్ బరస్టవడం, టైరు మార్చుకోలేని, కారు వదిలి నడవలేని నిస్సహాయస్థితిలో దిక్కులూ వెతుకుతూ బిక్కుబిక్కుమని చూస్తున్న వేళ, రెండో అట సినిమానే చూసి మెల్లిగా ఓల్డ్ హార్స్ లాంటి సైకిల్ను వేధిస్తూ వస్తూన్న రాజు, పౌరాణిక చలన చిత్రాల్లో శ్రీ మహావిష్ణువు పిల్చినా పిలవకపోయినా శిష్టరక్షణార్ధం దర్శన మిచ్చినట్టు, ప్రత్యక్షమవడం, "ఏమండీ, ' అని ఆమె అతి మధురంగా పలకరించి, చూపుల్తో కట్టేసి ప్రాదేయపడ్డం , అతడు ఆమెకి సహాయపడ్డమే తన జీవిత పరమావధిగా భావించి స్టేప్నీ మార్చడం, ఆమె అతని వంక కృతజ్ఞత తో నిండిన వాల్జూపు విసిరి, యింటి దగ్గిర విడవడం, మర్నాడు ఆదివారం తేనీటికి , ఆతర్వాత వాహ్యాళికి ఆహ్వానించడం, అలా అలా కలుసుకున్న సమయాల్లో పురుష పుంగవు లేందర్లోనో కనబడని ఆకర్షణ ఆమెకి అతనిలో కనబడ్డం - అవీ రాణి ప్రేమాయణంలో నాందీ ప్రస్తావనలు!
రాజు ముందు ముందు, రాణి లాంటి శ్రీమంతురాలు తనని తలచడం ఈ భూమ్మీద మానవాళి మనుగడని ఉప్ఫని ఊది పారేసే ఉపద్రవమేదో అని బెదిరాడు, జంకాడు , తబ్బిబ్బేయాడు. తనకేందుకనుకున్నాడు. ఆమె వంక చూడ కూడదనుకున్నాడు. కాని విడవక వెంటబడ్డ రాణి ప్రేమ వాహినుల్లో మునిగి తల మున్కలయ్యాక షేక్స్ పియరెమన్నాడు, కారల్ మార్స్ ఏమన్నాడు, డి. హెచ్ లారెన్స్ ఏమన్నాడు? అని ప్రశ్నించుకుని ఇది ప్రగతి వైపు మానవుడి పురోగమనంలో అతి ముఖ్యమైన మెట్టు, సర్వమానవ స్పౌభ్రాత్రానికి సాగే నిరంతర కృషికి పరాకాష్ట , పెట్టుబడిదారీ వర్గాల మీద అభివృద్ధి నిరోధక శక్తుల మీద, శ్రామికులు, కష్టపడి పనిచేసే మంచివాళ్ళు తీసే గట్టిదెబ్బ అనుకున్నాడు. అనుకోని ఈ ప్రేమని సాధ్యమైనంత త్వరలో పుష్పింపజేసి, ఫలింప జేయ్యాలనుకున్నాడు.
"వాట్!" రాణి నాన్న ఆశ్చర్యంతో తల మున్కలయిపోయాడు హటాత్తుగా రాణి చెప్పిన మాట విని.
'అవును నాన్నా, నేను రాజుని పెళ్ళాడానికి నిశ్చయించుకున్నాను. రాజుని తప్ప యింకేవర్నీ పెళ్లాడను" మళ్ళీ రెండోసారి నొక్కి చెప్పింది.
ఎయిర్ కండిషన్డ్ గదిలో కూర్చున్నా గాని, ఇన్ కంటాక్స్ లెక్కల్తో చెమటలు గక్కేస్తున్న సృసింహరావుకి , ప్రహ్లాదుడు మొట్టమొదటిసారి "నారాయణా' అన్నప్పుడు హిరణ్యకశిపుడుకి వచ్చినంత చిరాకు వచ్చింది.
"ఎవడు వాడు? మొన్న మనింటికి టీ తాగిపోడానికి వచ్చిన వాడేనా? ప్రేమించడానికి నీకా పర్ఖాలా మొగం తప్పించి ఇంకెవడూ కనపళ్ళేదా? నిన్నిన్నాళ్ళు గాజుమేడల్లో , ఫోం కుషన్ల మీద, యింపాలా కార్లో, డ్రాలన్ చీరల్లో నేలమీది దుమ్ము, గడ్డి చెత్త అన్నింటికి దూరంగా దాచి పెంచానే, నీకీ పాడుబుద్దులేలా వచ్చాయి?"
తన పందొమ్మిదేళ్ళ జీవితంలో ఏనాడూ ఇంత కఠినంగా మాట్లాడి యెరుగని నాన్నని చూసి రాణి మొదట నమ్మలేకపోయింది. ఆ తర్వాత కళ్ళలోకి నీళ్ళు చిమ్మాయి. తలదించుకుని కిటికీ దగ్గిరికి పరుగెత్తి ఊచలు పట్టుకుని బయటికి చూస్తూ వెక్కివెక్కి యేడ్చింది.
"అదేమిటదలా , సాంఘిక చిత్రాల్లో ఖండిత నాయికలాగా కిటికీ ఊచలు పట్టుకు ఏడుస్తుందెందుకు? జుట్టు కాస్త విరబోసుకో చెల్లమ్మా ! సరిగ్గా అతికినట్టుంది?" విట్టు వేసి నవ్వాడు బుజ్జి.
రాణి మొగం లేతగులాబి రంగుది , ముదురు యేరుపయ్యింది. కళ్ళు నిప్పుకణాలయ్యాయి. ముక్కు పుటాలదిరాయి. చురుక్కున వెనక్కి తిరిగింది.
"సంతోషించాం గానీ, నీ చచ్చు విట్లుకి నువ్వే నవ్వుకుంటూ కాసేపు బయట కూర్చో, నేను నాన్నతో మాట్లాడాలి."
నృసింహరావు ఎన్నడూ చూడని రాణి కన్నీరు చూసి గిలగిల్లాడిపోయాడు. తల్లి పోయినప్పట్నుంచి ఆమె కంట తడి పెట్టగూడదని ఆడింది ఆటగా పాడింది పాటగా పువ్వుల్లో పెట్టి పెంచాడు.ఆమె పంతం, పట్టుదల ఆయనకి బాగా తెలుసు. ఏం చెయ్యడం? ఎలా నచ్చజెప్పడం? అని తికమక పడ్తున్న మనిషికి బుజ్జిమాటలు కొంత ఊపిరి సరిపెలాజేశాయి. బుజ్జి ఆయనకి అన్నగారి కొడుకు, కుడిభుజం, ప్రిన్సిపాల్ ప్రైవేట్ పర్సనల్ సెక్రటరీ, మంత్రి సలహాదారు , యింకా ఇలాంటి వెన్నో ! దేవుడు తన దగ్గిరున్న తెలివి తేటల్లో సగం బుజ్జికిచ్చేసి మిగిలినవి మిగతా మానవులందరికీ పంచి పెట్టాడని ఆయనకి గట్టి నమ్మకం.
"చూడు తల్లీ! నువ్వు కావాలంటే కొండ మీద కోతిని తెస్తాను. కాని ఈ రాజేమిటమ్మా! అతను నీకు తగునా ?" అల్లరి చేసే పిల్లకి మిఠాయి చేతిలో వుంచి బుజ్జగించినట్టన్నాడు నృసింహరావు.
"నాకు కోతీవద్దు, కొండముచ్చువద్దూ అతన్ని విడిచి నేనొక్క క్షణం వుండలేను. నేను బతకాలనుంటే అతన్ని అంగీకరించండి, లేదంటే...."
అదోలా నవ్వాడు ముసలాయన. మంచీ చెడు తెలియని చిన్నపిల్లాడు మేడ మీంచి దూకుతానని మారాం చేస్తుంటే నచ్చజెప్పలేక అవస్థ పడ్తూ, అసహయతని దాచుకుంటూ చిరాగ్గా ఏడవలేక నవ్వినలాంటి నవ్వు.
"రాణీ, రాజంటే నువ్వు ప్రెజెంట్ చేసిన టెర్లిన్ టీ షర్ట్ తొడుక్కుని నీతో కార్లో తిరిగేవాడేనా?"
రాణి బుజ్జిని కొరకొర చూసింది. రాణీ కంటికి బుజ్జి, హిందీ సినిమాల్లో హీరో హీరోయిను నాలుగయిదు డ్యూయెట్లు పాడుకున్నాక సహించలేక? ఇంటర్యూ లయ్యాక విజ్రంభించే విలన్, తెలుగు జానపద చిత్రాల్లో రాజుగారి రాజ్యం కాజెయ్యాలని యెత్తేస్తే రాజుగారి బావమరిది?