Previous Page Next Page 
చీకటి తొలగిన రాత్రి పేజి 35

 

    రాణి మంచి చెడ్డలు, పినతండ్రి వ్యాపార లాభనష్టాలు, యింటి నౌకర్లు, అజమాయిషీ అంతా తను లేనిదే తలక్రిందులయిపోతుందని బాబాయి లాంటి అమాయకులు రాణి లాంటి పసిపిల్లలు ఇద్దరూ తను లేకపోతే ఈపాటికి నడివీధి పాలయ్యేవారని బుజ్జి ఊహ. తన విషయాల్లో జోక్యం కలిగించుకోవద్దని రాణి ఎన్ని సార్లు చెప్పినా , ఏదో పసిది కోపంలో అన్నదని, గోతిలోకి దిగుతాను, విషం తింటాను , నా యిష్టం!" అని యేచంటిధన్నా అంటే మాత్రం పెద్దవాళ్ళూరుకుంటారా , ఊరుకోడం భావ్యమా అన్న ధోరణిలో మంచీ చెడ్డా తెలిసున్న బుజ్జి ఆమె మాటలు లెక్క చెయ్యడం మానేశాడు. అసలు బుజ్జికి రాణి అలా మంచి నీళ్ళలా డబ్బు ఖర్చు చేసెయ్యడం , నానా అడ్డమైన వాళ్ళతో తిరగడం, వాళ్ళని సినిమాలకి, పిక్ నిక్ లకి, పార్టీలకి తీసుకెళ్లడం గిట్టదు. కాని ఏం చెయ్యడం? చెప్తే రాణి వింటుందా? నిర్లక్ష్యంగా వెళ్ళిపోతుంది. బాబాయికి చెప్తే "ఆ, పోనిద్దూ , ఏదో చిన్నపిల్ల సరదా, ఆ డబ్బంతా దానిదేగా! ఇంకెవరున్నారు నాకు? అంటాడు. అని ఆమెనలా నెత్తి కేక్కించుకోడం బుజ్జి కిష్టం లేదు. ఎవరున్నా రేమిటి? పదిహేనేళ్ళప్పుడు వచ్చి ఆయన్నే అంటిపెట్టుకున్నందుకు ఆమాత్రం యిస్తే బాబాయి సొమ్మేం పోతుంది?
    తిరగడానికి ఓకారు, ఇంట్లో తిండి, ఖర్చుకి ఓ మూడు నాల్గొందలు తప్పించి ఇంకేం ఈయడం లేదు బాబాయి! ఇచ్చే లక్షణాలు కనబడడం లేదు. రాణికి డబ్బంటే నిర్లక్ష్యం. అలాంటివాడే ఆమెకి భర్తయి వస్తే అతని పంట పండుతుంది. నయా పైసల నుంచీ లెక్కబెట్టే రాజులాంటి వాడు వస్తే అతని పని ఉత్తదే! ఆ మాత్రం గ్రహించగల సూక్ష్మ బుద్ది , బుజ్జి!
    అందుకే రాణి తన తిరుగులేని నిర్ణయం ప్రకటించి బయటికి వెళ్ళాక తలపట్టుక్కూర్చున్న బాబాయిని నెమ్మదిగా ఊరడించాడు బుజ్జి.
    "నువ్వేం బాధపడకు బాబాయి, ఇలాంటి రాజుల్ని వందమందిని వదిలిస్తాను. అసలు రాణి చుట్టుపట్ల మైలు వ్యాసార్ధం లో ఎక్కడా ఇలాంటి వెధవలు జేరకుండా అవతల వుంచుతాను. ఆ సంగతి నా కొదిలేసి నిశ్చింతగా ఉండు.
    'అదేదో త్వరగా చూడరా బాబూ! దాని ధోరణి చూస్తె నాకు పిచ్చేత్తుతోంది! గట్టిగా వద్దంటే ఏం చేస్తుందో....అన్నట్టు ఇలాంటి వన్నీ సాధ్యమైనంతవరకు సున్నితంగా చూడ్డం మంచిది! ఎలా నిబ్బరించుకోస్తావో!"
    'అదంతా నీ కెందుకు? నా చేతిలో పాతికవేలు పారెయ్యి. వాడి ప్రేమ తిమ్మిరి వదిలిస్తాను "
    "పాతిక కాకపోతే యాభై తీసుకెళ్ళు, కాని చేసేదేదో తొందరగా చెయ్యి."
    బుజ్జి నవ్వాడు. తన సమర్ధత మీద బాబాయికింకా నమ్మకం కుదరనందుకు విచారించాడు. తన బుద్ది కుశలత , కార్య శూరత్వం ఈ ఒక్క సారి ప్రదర్శించి బాబాయి కళ్ళల్లో ఆకాశం అంత యెత్తున లేవాలనుకున్నాడు.
    
                                                    *    *    *    *
    మరో పదిరోజులు వాతావరణం స్తబ్దుగా వుంది. రాణి బుజ్జితో మాట్లాడం మానేసింది. తండ్రి తో కూడా పలకరిస్తే ముక్తసరిగా తప్పించి వేరే మాట్లల్లేవు. నృహసింహరావు చాలా ఇబ్బంది పడ్డాడు. బుజ్జి కేసి ఆత్రుతగా చూసేవాడు. "నీకేం ఫర్వాలేదు' అని అభయహస్త మిచ్చే వాడు బుజ్జి.
    ఒకానొక సుప్రభాతాన యింకా నైట్ గౌను లో నుంచి బయటికి రాకుండానే, సోఫాలో వాలి బెడ్ టీ సిప్ చేస్తూ మార్నింగ్ ఎడిషన్ పేపరు తిరగేస్తున్న రానికి నగరంలో వార్తల శీర్ధిక క్రింద క్రితం సాయంకాలం ఏదో చోట జరిగిన కొట్లాట వైనం కనిపించింది. అలాంటి వార్తలంటే యిష్టం రాణికి! సర్దాగా చదివింది. ఎవరో విద్యార్ధి సైకిలు మీద అటు వెళుతున్నాడు. ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ప్రక్కనున్న కల్లు పాకలో మస్తుగా తాగి అప్పుడే బయటకు వచ్చి రోడ్డు కడ్డం పడి తందనాలుడుతున్నారు. ఆ అబ్బాయి గంట మ్రోగించాడు, నోటితో చెప్పాడు. కాని ఆ వ్యక్తులు లొంగలేదు. పైగా బూతులు తిట్టారు. ఆ అబ్బాయి సైకిలు దిగి వాళ్ళని అదిలించబోయాడు. కొట్లాట జరిగింది. జనం మూగారు. ఆ చీకట్లో సరిగ్గా ఏం జరిగిందో ఎవరికి తెలియదు . ఆ అబ్బాయికి మాత్రం బలంగా గాయాలు తగిలాయి. ఆస్పత్రికి తీసుకు వెళ్తుంటే దారిలో మరణించాడు. ఆ అబ్బాయి పేరు రాజగోపాల్. వయస్సు ఇరవైరెండేళ్ళు. కాలేజీలో చదువుతున్నాడు.  
    రాణి ఆస్పత్గ్రికి పరుగెత్తింది. శవపరీక్ష జరుగుతోంది. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. జనం 'అయ్యోపాపం' అంటున్నారు. రౌడీ వెధవలని తిట్టి పోస్తున్నారు. తన రాజ్ ఇంక లేడు!
    ఇంటికి తిరిగొచ్చింది మెట్ల మీద కనబడ్డాడు బుజ్జీ. ఏదో అనాలనుకుంది. ఇంకేమిటో చెయ్యాలనుకోంది.
    'ఇది చూశావా రాణీ! ఎంత దారుణం ! పాపం, రాజగోపాల్ నెవరో కొట్టి చంపేశారు. నిన్న సాయంకాలమే మాట్లాడానతనితో నీ పెళ్లి గురించి! ఇంతలో ఇలా అవుతుందని ఊహించను కూడా లేదు. ఎంత ఘాతుకం" విచారం వ్యక్తపరిచాడు బుజ్జి.
    కళ్ళలో నీరు చిమ్ముతుంటే మెట్ల మీదకి పరుగెత్తింది రాణీ. రెండు రోజులు బయటికీ రాలేదు. గదిలోకి తండ్రిని కూడా రానియ్యలేదు. ఆ రెండు రోజులు పూర్తిగా శోకరసం అనుభవించింది.
    మూడో రోజు తండ్రి లోపలికి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. ఆమె కళ్ళు యింక నీళ్ళు లేక ఏడవనట్టు నిర్లిప్తంగా వున్నాయి.
    "నువ్వు గెలిచావు నాన్నా! ఆనందించు" అంది రాణి.
    నృశింహరావు గొల్లుమన్నాడు. జరిగినదానికి బాధ వ్యక్తపరిచాడు. రాజంటే సానుభూతి ప్రకటించాడు. అతని కుటుంబానికి సహాయం చేస్తానన్నాడు. బుజ్జిని యింటిలో నుంచి పంపించేశాడు.
    
                                                *    *    *    *
    అదంతా జరిగి అయిదేళ్ళకి పైగా అయింది.
    ఇప్పుడు రాణికి ఓ అందాల పాపాయి ఏణార్ధం పాపాయి. పత్రికల్లో పుష్టికి , ఆరోగ్యానికి నామూనాగా కోట్ల విలువచేసే చిరునవ్వు చిందిస్తూ కనిపించే పాపాయిల్ని మించి పుష్టిగా, ఆరోగ్యంగా ఉల్లాసంగా వుంటుంది. మాటలు సరిగా రావు. ముద్దుముద్దుగా, అమ్మని నాన్నని మురిపిస్తుంది. ఆ మురిపాలంటే పాప నాన్నకి అంటే రాణి భర్తకి, అంటే కృష్ణారావుకి పంచప్రాణాలు, అందుకని ఆ మురిపాల కోసం ప్రతీసాయంకాలం గుర్రమై పాపని లాన్ అంతా త్రిప్పుతాడు. వాళ్ళ వెనకాలే నడుస్తూ వాళ్ళిద్దర్నీ చూస్తుంటే ఆనందంతో పరవశమయిపోతుంది రాధారాణి.
    కృష్ణారావు అందగాడు. వెయ్యి రూపాయల జీతగాడు. అన్నిటినీ మించి సరసుడు. అతన్ని కట్టుకున్న నెల్లాళ్ళకే రాణి తండ్రినీ, రాజునీ ఇంకా రమ, బాల, లత, సుధ లాంటివాళ్ళని చాలా మందిని మరిచిపోయింది. కావలసినప్పుడు తండ్రి రెక్కలు గట్టుకు వాలతాడు. పాత దీపాన్ని రాయగానే భూతం ప్రత్యక్షమైనట్లు, అక్కర్లేకపోయినా వారానికో మూడు నాలుగుసార్లు ప్రత్యక్షమై వాళ్ళకేం లేవో వెతికి చూసి, తెలుసుకొని మరుక్షణం తెచ్చి పెడ్తాడు. రాధ, కృష్ణ నిలబడి మధ్య ఇద్దరూ చెరో చేత్తో పాపను పట్టుకున్న వాళ్ళ ప్యామిలీ ఫోటో చూస్తె యెవరి కన్నా కింద 'ఆదర్శం' అని వ్రాయబుద్దేస్తుంది.
    ఓ వెన్నెల రాత్రి ఏక శయ్యగతులై వున్న వేళ రాధ నడుం చుట్టూ చెయ్యేసి కృష్ణ మెల్లిగా అన్నాడు. "రాణీ! డార్లింగ్. నీకో సంగతి చెప్పాలి. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదనుకో. కాని మన మధ్య యెలాంటి అరమరికలూ వుండకూడదు. అందుచేత నీకా సంగతి చెప్పేస్తే నాకేదో దించినట్టవుతుంది! నేను కాలేజీలో వుండగా ఓ అమ్మాయికి ఉత్తరాలు వ్రాస్తుండేవాడిని. ఇద్దరం ఏమేమిటో వ్రాసుకునే వాళ్ళం. చివరికి ఆమెకి పెళ్ళవగానే మా ప్రేమ ఉత్తరాలతోనే ముగిసిపోయింది..... యేమిటో, ఇప్పుడంతా చూస్తె చాలా సిల్లీగా ఉంటుంది. ఆ ప్రేమలూ, ఆ కబుర్లూ ఏదేమిటో తెలియని పసితనం గదూ?"
    'అవును , ఎంత సిల్లీగా ఉంటుంది ఇప్పుడాలోచిస్తే! రాజగోపాల్ అని ఓ ముతక ఖద్దరు అబ్బాయిని కార్లో సినిమాలకీ షికార్లకీ తిప్పెదాన్ని కొన్నాళ్ళు! రెండు నెలలు కాకుండానే అతగాడు ఎవళ్ళో రౌడిలతో తగువు పెట్టుకొని దెబ్బలు తిని మరో లోకానికి వేంచేశాడు...... ఇప్పుడనిపిస్తుంది అపుడనుకున్నవన్నీ కొంపదీసి నిజమైయుంటే .....ఎంత పోగొట్టుకొనే దాన్నో!' మత్తుగా అంటూ కళ్ళు మూసుకొని తలని మెడకీ, భుజానికి మధ్య యిరికించి బలంగా హత్తుకుంది. ఆమెకి నిజంగానే ఏదో బరువు దించినట్టు తేలికయింది మనసు. ఆ సంగతి అతనికి చెప్పేశాక.

                                                           ***

 Previous Page Next Page