పేదవాడి ప్రేమ
నల్లటి నున్నటి గచ్చు మీద ముత్యాలు విరజిమ్మినట్టుంది ఆకాశం. నల్లటి పెద్ద చెరువు విరిసిన ఒకే ఒక కలువలా తోడూ లేదన్నట్టు బిక్కు బిక్కూ మని చూస్తూ చంద్రుడు దిగులుగా నెమ్మదిగా కదులుతున్నాడు. కునికి పాట్లు పడ్తున్న గూర్ఖా వుండి వుండి ఒక్కసారిగా మెలుకువ తెచ్చుకుని అటెన్ షన్ లో నిలబడ్డట్టు తలవాల్చి స్తబ్దుగా వున్నా చెట్టు ఒక్కసారి హడావిడిగా పిల్లగాలులు వీచి మళ్ళీ కదలకుండా వూరుకున్నాయి. నల్లటి త్రాచులా నిగనిగలాడుతుంది. తెర్రీడు ఆ వెన్నెట్లో కక్కటిల్లి యేడ్చే పసివాడి నోటికీ పాలందించగానే యేడుపు మానినట్టుంది ఆ నిశీధి నిశబ్ధం--
ఆ నల్లటి నున్నటి రోడ్డు మీద తెల్లటి మెరిసే కారు వొకటి నెమ్మదిగా , అతి నెమ్మదిగా తల్లి మీద అలిగిన పసివాడు అమ్మ పిలిస్తే గునుస్తూ ఒక్కో అడుగు జార్చినట్టు వెడుతూంది. కారులో నల్లటి స్టీరింగ్ మీద తెల్లగా, అతి తెల్లగా తామర తూడులా కోమలమైన నల్లని స్క్వేర్ వాచ్ చేయి , స్టయిలుగా నడుపుతుంది.
గాలికి రెపరెపలాడే ఆమె పల్చటి షిఫాన్ గులాబిరంగు చీర, గులాబి రేకుల కంటే మెత్తగా వున్న ఆ చీర చెంగు , ప్రక్కనే వున్న ప్రియుని ముఖం వొక్కసారి కప్పేసి, ఉక్కిరిబిక్కిరి చేసేసి తప్పుకి క్షమాపణ లాగా, పరిహారార్ధంగ చల్లని, మెత్తని, సన్నని సంపంగ అత్తరు వాసన అతనికి అందిచ్చి తొలగిపోతుంది. ఏమేరుగని దానిలా!
"రాణీ!"మెల్లగా మెత్తగా ఏవో లోకాల్లో తేలిపోతూ అన్నాడతను.
"ఊ!" గోముగా ముద్దు ముద్దుగా గునిసింది రాణి.
"రాణి .....రాణి" అన్నాడు మళ్ళీ , 'అమ్మా' అమ్మా' అన్న' మాట తప్పించి మరోటి రాని పసివాడు ఏదో చెప్పడానికి పడే ఆరాటం అతనిది.
"ఊ" నవ్వింది. మబ్బుల్లో మెరిసినట్టు. "రోజూ! .......నా పిచ్చి రోజూ!" అంటూచేతినీ అతని క్రాపులో అల్లరిగా కదిపింది.
"రాణి.....రాణి, నువ్వూ నేనూ యిలా....యిలా ...ఎన్నటికీ యిలానే వుండిపోతే ...." ఆమె మెడ దగ్గిర మొగంతో అదుముతూ మెల్లగా అన్నాడు.
"ఊ" మళ్ళీ నవ్వింది రాణి.
"అబ్బ! ఏమిటా 'ఊ' బాష? ఏదన్నా మాట్లాడు!" మురిపెంగా అన్నాడు.
"మాటలెందుకు? ఇలాగే వుండిపోదాం. ఈ నిశ్శబ్దం లో , ఈ వెన్నెల్లో ,ఈ చల్లగాలిలో , ఈ సువాసనలతో , ప్రేమలో, పారవశ్యం లో .....వేరేం మాట్లాడవద్దు . రాజూ!" బొంగురు పోయినట్టున్న గొంతుతో తనలో తాననుకున్నట్టుంది రాణి.
"రాణీ' యిలా ఎన్నాళ్ళు?..... ఈ తపస్సు ఎప్పటికి విముక్తి? ఎన్నాళ్ళిలా కలయికలోని యెడబాటు అనుభవిస్తూ వేగాలి? ఎన్నాళ్ళకీ దేవి కటాక్షించదెం? దైవ దర్శనానికి క్యూలో నిల్చొని నిల్చొని విసిగెత్తిన తిరుపతి భక్తిడిలా ఆవేదనగా అన్నాడు.
"భక్తా! త్వరలోనే నీ అభీష్టం సిద్దించును"
"హాస్యం గాదు రాణీ! మీ నాన్నకి చెప్తానన్నావు, చెప్పావా?"
'లేదు, సమయం కోసం చూస్తున్నాను, ఇంక ఎంతో కాలం అగనులే"
"నువ్వు చాలా దూరం తీసుకొచ్చావు రాణీ, ఇంకిప్పుడు నువ్వు లేకుండా ఉండడమంటేఏమిటో అసాధ్య మనిపిస్తుంది. అలాగని మీ నాన్న మనమధ్య ఈ అంతస్తులన్నీ మరచి మన పెళ్ళికి ఒప్పుకుంటారా అన్నదీ సందేహమే"
"డోంట్ బి సిల్లీ రాజూ డియర్! మా నాన్నకి నే నొక్కతేనే గారాల కూతురన్న సంగతి మర్చిపోతున్నావు. నా మాట జవదాటడు. నా యిష్టాన్ని వ్యతిరేకించే సాహసం అయిన యెన్నడూ చేయలేదు. చెయ్యడు. కాబట్టి , ఇంక బుద్దిగా యింట్లోంకి వెళ్లి నిద్రపో." దేశవాళీ చలన చిత్రాల్లో నాటు కధానాయకుడు , నాయిక గడ్డం సున్నితంగా ఒకే ఒక వేలితో ఎత్తి పట్టుకున్నట్టు , అతని గడ్డం పట్టి యెత్తి కళ్ళలోకి ప్రేమగా చూసింది.
"ఓకే గుడ్ నైట్ రాణీ" అంటూనే సున్నితంగా రాణి చెయ్యి నొక్కిపట్టి దిగాడు రాజగోపాల్.
"గుడ్ నైట్ రాజ్!" రాజ్ ని డ్రాప్ చేసి, చొక్కా వూపుతో కారు ముందుకు వురికించి మాయమైంది రాణి. రాజలా నిలబడి చూస్తుండగానే!
* * * *
ఊరికి దూరంగా ఎత్తయిన కొండలమీద, ఎర్రని గుటల మీద, మనుష్యులకి, గోలకి, మురికికి , ఈగలకి, అన్నింటికి దూరంగా అంతస్తుకి చెందిన వాళ్ళకి, అంతస్తులుండే భవనాలుంటాయి. చెల్లా చెదరుగా విసిరిన గింజల్లాగ అక్కడోటి అక్కడోటి ఉంటాయి. ఒకదానితో ఒకదానికి సంబంధం లేదన్నట్టు, వెలేసినట్టు, మీతో మాకేం సంబంధం అన్నట్టు విడివిడిగా, ఎవరి ఆధిక్యం వారు చూపించుకోడాని కన్నట్టు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టు ఒకదాన్ని మించి ఒకటి వెలుస్తాయి ఆ కొండల తలలమీద . అందులో అన్నింటికంటే ఎత్తయిన చోట గుమాస్తాల మధ్య కలెక్టర్ల, నక్కలు తోడేళ్ళ మధ్య సింహంలాగా , ఠీవీగా తలెత్తి నిల్చోనంటుంది. ఓ యెర్ర రాళ్ళ బంగళా , అదే రాధారాణి నాన్న బంగళా!
ఆ బంగళా చుట్టూ భారీ ప్రహరీ గోడ వుంటుంది, మామూలు వాళ్ళకి అందనంత యెత్తున, అందమైన నగిషీలు చెక్కిన అల్యూమినియం రంగు గేటు, ఆ గేటు తెరిస్తే ఎర్రటి బాట, బాటకి రెండువైపులా విదేశీ దేశవాణీ రంగురంగుల మొక్కలు. పౌంటేన్లు , సిమెంటు బెంచీలు , గార్డెన్ చెయిర్లు , క్రీపర్లు, పూపొదలు, అన్నీ వుంటాయి. కాంటిలివర్ పోర్టికో, విశాలమైన వరండాలు, నున్నటి స్తంభాల మీద కెక్కించిన పూలతలు లైట్ గ్రీన్ డిస్ట్ పర్ కొట్టిన పెద్ద పెద్ద గదులు, ఎయిర్ కూలర్లు, మొజాయిక్, ఫ్లోరింగు, ప్లూర సెంట్ దీపాలు, ఖరీదయిన పల్చని నైలాన్ తెరలు, మొహాలు కనుపించే పాలిష్ వున్న నున్నటి నల్లటి ఫర్నిచర్, తివాచీలు, ప్లవర్ వాజ్ లు , ఆయిల్ పెయింటింగులు, డన్ లప్పిల్లోలు, ఫ్రిజిడైర్లు , రెడియోగ్రాములు, వాషింగ్ మెషిన్లు, టేప్ రికార్డర్లు, ట్రాన్సిస్టర్లు , హాట్ కోల్డు వాటర్, బాత్ లు, డైనింగ్ రూంలు , డ్రాయింగ్ రూలు, వెయింటింగ్ రూంలు , గెస్టు రూంలు , నాలుగు రకాల ఫోనులు, వైగారా, వైగైరా అవసరమైన, అవసరమైనవన్నీ వున్నాయి ఆ బంగళాలో! అవేగాక మెత్తగా మెల్లిగా జరజరా పాకే పాములాంటి పొడవైన ఇంపాల కారు, రెండు దేశీకార్లు వున్నాయి. రాణి నాన్నకి! ఇంకా ఏవేవో కంపెనీల్లో బోలెడు షేర్లున్నాయి . ఇవన్నీ వున్న రాధ నాన్నకి బ్యాంకుల్లో పెద్ద మొత్తాలుంటాయని వేరే చెప్పక్కర్లేదుగా!
ఆ నాన్నకి ముద్దుల పట్టి, గారాలచిట్టి, వరాలమూట, అపరంజి బొమ్మ- రాధారాణి! నాన్నకి ప్రాణం రాణి, లేకలేక పుట్టిన ఏకైక పుత్రిక! తల్లిలేని పసికూన! బంగాళాలకి , బ్యాంక్ ఎకౌంట్ కి, కంపెనీల షేర్లకి, కార్లకి అన్నింటికి ఏకైక వారసురాలు!
రాణి డిక్షనరీలో సుఖమే గాని, కష్టమన్న మాటేలేదు. పిక్ నిక్ లు పార్టీలు, హాలీవుడ్ సినిమాలు , విలాసాలు, వినోదాలు అన్నమాట క్షణాల మీద జరిపించే తండ్రి , వంగి సలాములు జేసే నౌకర్లు , యివి మాత్రమె జీవితంలో ఉంటాయనుకునే అమాయకురాలు. జీవితంలో దారిద్ర్హ్యం , కుళ్ళు, మురికి, ఈగలు, ఏడ్పులు, చావులు , పస్తులు , కొట్లాటలు రోగాలు అంటే యేమిటో తెలీని ముగ్ధ!
రాజుతో పరిచయమయ్యాక, అతని యింట్లో కనీసం ఓ పది గదులు లేవని , సోఫాసెట్లు, కర్టెన్లు, డైనింగ్ టేబిల్స్ , రేడియోలు లేవని వినికని ఆశ్చర్యపోయింది. కనీసం ఒక స్టాండర్డ్ హెరాల్డ్ కారు, అధమం లాంబ్రేట్టా అయినా లేదని విని తెల్లబోయింది. రాజు నాన్నకి మూడు వందల రూపాయలు జీతం అని విని మూడు రూపాయల్లాంటి ఆ మూడు వందలతో రాజు కుటుంబసభ్యులు ఆరుగురు యెలా బ్రతుకుతున్నారా అని వింతగా చూసింది! రాణి నాన్న లాంటి వాళ్ళు వెయ్యికి, మళ్ళీ మాట్లాడితే లక్షకి ఒకరు కూడా వుండరని రాజు చెప్పడం విని నిశ్చేష్టురాలైంది. భారత దేశ దౌర్భాగ్య స్థితికి జాలి పడింది, చింతించింది.