మొగుణ్ని వదిలేసినందుకే, చదువుకున్న ఆడవాళ్ళే లోకువ చేసి మాట్లాడుతున్నారు. ఇంకెవడితోనన్నా పెళ్ళి లేకుండా తిరిగితే కనులు పొడిచినట్టు పొడుస్తారు.
అందుకే ఆడదాని జీవితం అరిటాకులాంటిదంటారు. ఏం జరిగినా ఆడదానికే నష్టం. లోకంలో నూటికి ఎనబైమంది బాధలుపడ్తున్నా ఆ కాపురాలు ఎందుకు చేసుకుంటున్నారో ఇప్పుడర్థం అయింది." నిట్టూర్చుతూ అన్నారు శివశంకరంగారు.
"ఇప్పటికయినా అర్థం అయింది. సంతోషం. కాని ఏం లాభం? దాని బతుకు ఇంక ఇంతేగా" మాటలు విని వచ్చిన శారదాంబ అంది. ఆయన ఈసారి భార్యమీద గట్టిగా అరవలేకపోయారు. మానసికంగా, శారీరకంగా బలహీనమైపోయిన ఆయన 'వాదించలేను. ఓడిపోయాను' అన్నట్టు కళ్ళు మూసుకుని వుండిపోయారు. అలాంటి స్థితిలో భర్తని ఎప్పుడూ చూడని శారదాంబ గట్టిగా ఏమనలేకపోయింది. ఎంతో ఉత్సాహంగా మాట్లాడాలని వచ్చిన లత నీరు కారినట్టు అయి నెమ్మదిగా గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది. 'నిర్మలకి అనవసరంగా లేనిపోని ఆశలు కల్పించాను. ముందు మామగారితో మాట్లాడి తరువాత నిర్మలకి చెప్పాల్సిందేమో?' నిర్మలకి ఏం చెప్పాలో తెలియక ఆ రోజంతా ఆమెని తప్పించుకుని తిరిగింది లత. ఎవరూ చెప్పనక్కరలేకుండానే అందరి మౌనం చూడగానే నిర్మలకి అర్థమయింది. అయితే అందరూ అనుకున్నంత బాధ పడలేదు నిర్మల. ఆమె ఇలాంటి దెబ్బలకి అలవాటుపడిపోయినట్టు, దెబ్బలు తిని శరీరం, మనసు మొద్దుబారినట్టు ఏ భావనకి లోను కాలేదు.
"ఇది జరిగేది కాదని నాకు తెలుసు వదినా! నీవెందుకు మధ్యన బాధపడుతున్నావు?" అంటూ లతని తనే నవ్వుతూ పలకరించింది మర్నాడు.
లతకి నిర్మలని చూస్తే గొంతు నిండుకుంది. పైకి నవ్వుతూ మాట్లాడుతున్న నిర్మల మనస్సులో నిరాశ గుర్తించి సానుభూతిగా, "సారీ నిర్మలా..... అనవసరంగా నీకు ఏవో ఆశలు కల్పించాను" అంది.
"నాకేం ఆశలు, కోరికలు లేవు వదినా! అన్నీ చచ్చిపోయాయి ఎప్పుడో" అంది అదోలా నవ్వి. వాళ్ళిద్దరి సంభాషణ వింటున్న శారదాంబ కళ్ళు వత్తుకుంటూ వెళ్ళిపోయింది.
మరో సంవత్సరం అతి మామూలుగా గడిచిపోయింది. ఆ కుటుంబానికి శివశంకరంగారు ఈ ఏడాదిలో దాదాపు జబ్బుపడ్డవారిలా అయిపోయారు. మనిషి శుష్కించిపోయారు. జుట్టు అంతా పూర్తిగా తెల్లబడిపోయింది. అరవై రెండేళ్ళకే ఎనభై ఏళ్ళ వార్థక్యం వచ్చినవారిలా అయిపోయారు. కోర్టుకి వెళ్ళడం చాలా వరకు మానుకున్నారు. ప్రాక్టీసు అంతా రఘుకి అప్పగించారు. ఎప్పుడైనా క్లిష్టమైన కేసుంటే తప్ప ఇల్లు కదలడం మానేశారు. ఇంట్లో కూడా అందరితో మాటలు తగ్గించేశారు. అలా వాలు కుర్చీలో పడుకుని ఏ పేపరో, ఏ భాగవత రామాయణాలో చదవడం లేదా అలా శూన్యంలోకి చూస్తూ ఆలోచించడం, భార్య పిలిచినప్పుడు వెళ్ళి తిని రావడం తప్ప మరో వాపకం లేదు ఆయనకి.
మూడోకొడుక్కి కూడా పెళ్ళి చేసేస్తే కన్నందుకు తన బాధ్యతలు తీరిపోతాయని అనుకుంటారు ఆయన. మోహన్ బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. సంబంధాలు చాలా వస్తున్నాయి, ఏదో ఒకటి చూసి స్థిరపరచే బాధ్యత రఘుకి, శారదాంబకి అప్పజెప్పేశారు. నిర్మల తన రొటీన్ జీవితానికి అలవాటుపడిపోయినట్లు, బాధపడటానికి అతీతురాలైపోయినట్టు యాంత్రికంగా రోజులు గడుపుతూంది. కాలేజీకి వెళ్ళడం, ఎప్పుడన్నా మంచి సినిమా వస్తే ఫ్రెండ్స్ తో గాని, తల్లిదండ్రులతోకాని వెళ్ళడం, పుస్తకాలు చదువుకోవడం, కాలక్షేపానికి పి.హెచ్.డి. చెయ్యాలని నిర్ణయించుకునిరోజంతా పుస్తకాలు రిఫర్ చేసుకుంటూ, కాగితాలు రాసుకుంటూ కూర్చుంటుంది. ఇంకో ఏడాదిలో డాక్టరేట్ తెచ్చుకోవాలని పట్టుదలగా రిసెర్చి వర్కు చేస్తూంది. దివ్య ఇద్దరిపిల్లలతో పక్కా గృహిణి అయిపోయింది.
నిర్మలతో ఎప్పుడులాగే ఎక్కువ మాట్లాడదు కాని ఆమె గురించి పట్టించుకోవడం, అనడం మానేసింది. లతకి ఏడోనెల. అప్పుడప్పుడు నిర్మలకి ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. సుధాకర్ కి నెల క్రితం పెళ్ళయింది అంటూ రాస్తే ఆ ఉత్తరం పట్టుకు అలా చాలాసేపు కూర్చుండిపోయింది నిర్మల. రోజులు ఎవరికోసం ఆగవన్నట్టు గడుస్తున్నాయి.
ఇంక ఈ గుండెలో బాధ నేను మోయలేనన్నట్టు..... శివశంకరంగారిది అసలే బలహీనమయిన గుండె ఓ రోజు నోటీస్ ఇవ్వకుండా ఆగిపోయింది. రాత్రి నిద్రలో ఎప్పుడో ఆగిపోయింది ఆయన గుండె. ఉదయం తండ్రికి కాఫీ పట్టుకొచ్చిన నిర్మల ఆ రోజు తండ్రి ఇంకా పడుకుని వుండటం చూసి ఆశ్చర్యంగా, అనుమానంగా దగ్గిరకి వెళ్ళి లేపబోయింది. కట్టెలా వున్న తండ్రి శరీరం చూసి కెవ్వుమంది.
శివశంకరంగారు పోయి పదమూడోరోజు. రావల్సిన బంధువులు అందరూ వచ్చారు. జరగవలసిన తంతు అంతా జరిగింది. కొడుకులు ముగ్గురూ తండ్రి అంత్యక్రియలు ఘనంగా చేసి తమ ధర్మం నెరవేర్చారు. దానాలు, ధర్మాలు పెద్ద యెత్తున జరిగాయి. ఏభై ఐదేళ్ళకే మీదపడిన వైధవ్యంతో శారదాంబ ఆ దుఃఖం నుంచి కోలుకోలేదు ఇంకా. అందరికంటె నిర్మల దుఃఖానికి అంతులేదు. ఉన్న ఆధారం పోయి దిక్కులేనిదయినట్లు విలపించింది. కొండంత అండగా తనను ఆదుకునే తండ్రి మరిలేడు అనగానే ఆమెని ఆపడం ఎవరి తరం కాలేదు. తన వెనుక నిలిచి, ధైర్యం యిచ్చి, మంచయినా, చెడయినా తన పక్షాన నిలిచి, తనకోసం అనుక్షణం బాధపడే తండ్రి పోతే తనకింక ఎవరు దిక్కు అన్నట్టు తలబద్దలు కొట్టుకు ఏడ్చింది.
ఈ లోకాన్ని లెక్కచేయకుండా తనకోసం ఎదిరించి, ఎవరేమన్నా నేనున్నాను నీకు అని తన రెక్కలకింద దాచుకొన్నట్టు దాచుకున్న తండ్రి అంత తొందరగా తనని వదిలి విడిచిపోతాడని ఎన్నడూ అనుకోలేదు. ఇంకా కనీసం ఓ పది ఏళ్ళన్నా తండ్రి అండ తనకు వుంటుందనుకున్న నిర్మల ఆ హఠాత్ సంఘటనకి తట్టుకోలేకపోయింది. ఒక్కమాటా చెప్పకుండా, ఒక్కసారి ప్రేమగా తనని దగ్గరకి తీసుకోకుండా, ఎవరూ దిక్కులేనట్టు వంటరిగా, పిలిస్తే పలికే దిక్కులేనట్టు తండ్రి అలా చనిపోవడం భరించలేక దుఃఖానిచ్చింది నిర్మలకి. 'డాడీ..... నాకెవరున్నారు ఇంక? నన్నెవరికి అప్పజెప్పి వెళ్ళావు..... నేనెలా బతకాలి ఇంక..... ఎవరి ఆసరాతో బతకాలి?' అంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే చూడలేకపోయారు అందరూ. అందరి మనసులూ ద్రవించిపోయాయి.
అంత దుఃఖంలోను శారదాంబ నిర్మలని పట్టుకుని, "నేనింకా బతికి వున్నానే. నీ తల్లిని నేనున్నానే" అంటూ ఓదార్చవలసి వచ్చింది.
కృష్ణ, లత నిర్మలని పొదివి పట్టుకుని - "మేమందరంలేమా నీరూ!" అంటూ ఓదార్చబోయారు.
ఆఖరికి రఘు కూడా నిర్మల దుఃఖం చూసి చలించాడు. 'నీరూ..... అలా మాట్లాడకు. మేము నీకు శత్రువులం కాదే. నాన్న ఇచ్చిన ప్రేమాభిమానాలు మేం ఇవ్వలేకపోయినా నీకే లోటు రానీయ్యమని నమ్ము' అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.