ఈ పని చేసినందుకు విశ్వాత్మను పిచ్చివాడి కింద జమకట్టలేదెవరు- దానికి కారణం అతనికున్న అపారమైన మేధస్సు... పరిణతి.
చాలాసేపటివరకూ అన్వేషి విశ్వాత్మ తాలూకు ఆలోచనలనుంచి తేరుకోలేక పోయాడు.
"ఈ ఆస్తికోసం అక్రమంగా ప్రయత్నించిన వాళ్ళెవరయినా వున్నారా?" తిరిగి అడిగాడు అన్వేషి.
"దాదాపు మూడు దశాబ్దాలుగా ట్రస్ట్ గురించి ప్రచారం చేయడం ఒక ఆచారంగా మారింది. అందుకు తగినట్టుగా ప్రపంచంలోని నలుమూలల నుండీ వేల సంఖ్యలో ప్రజలు ప్రయత్నించి చూశారు. బట్... ఎవరి ఆశలూ ఫలించలేదు. ప్రతి ఒక్కరినీ వారి బాహ్య చరిత్ర గురించి డిటెక్టివ్ ల ద్వారా తెలుసుకుని వెనక్కి పంపించేశాం. అంతేకాదు- వాళ్ళెవరూ క్రిప్టోగ్రాఫ్ లోని ప్రశ్నలకు సమాధానాలివ్వ లేకపోయారు.
మూడో కంటికి తెలియకుండా ప్యాలెస్ లోకి ఎవరైనా ప్రవేశించడానికి అణుమాత్రం అవకాశం లేకుండా కట్టుదిట్టమైన కాపలా 24 గంటలూ వుంటుంది. ఒక విధంగా ప్యాలెస్ కు బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం వుండదు" ఏమాత్రం సందేహానికి అవకాశం ఇవ్వకుండా అపారమైన విశ్వాసాన్ని కనబరుస్తూ చెప్పాడు మిత్ర.
"విశ్వాత్మ ఫౌండేషన్ లోకి అడుగుపెట్టిన ప్రతి వ్యక్తిని అపనమ్మకంగా పరిశీలించడంవల్లే దీన్ని పటిష్టంగా కాపాడగలిగాం. మా పరిశీలన ఎలా వుందో, వుంటుందో తెలుసా? చివరికి విశ్వాత్మే తిరిగి జన్మించి వచ్చినా సరే- ఆయనయినా తికమక పడవల్సిందే- విశ్వాత్మ చనిపోయిన దగ్గర్నుంచి ఆయన ఆత్మే మాకు బాస్.... ఆయన వీలునామా శిలాశాసనం.
మూడు దశాబ్దాలుగా చేస్తున్న ఈ కృషి ముందు కూడా అణుమాత్రం కూడా లోపం లేకుండా కొనసాగాలి" అన్వేషిని ఉద్దేశిస్తూ అన్నాడు మిత్ర.
అప్పటికే అన్వేషి కర్తవ్య నిబద్ధతలో మునిగిపోయాడు మానసికంగా. తనని తాను చేయబోయే కొత్త ఉద్యోగం తాలూకు నియమ నిబంధనలకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ప్రపంచంలో మరో ఉద్యోగానికయినా ఇంతటి మానసిక సంసిద్ధత అవసరం లేదేమో.
"మిస్టర్ అన్వేషీ! ఇంతగా మరీ మరీ ఎందుకు చెపుతున్నానంటే, మనం చేసే మొట్టమొదటి పొరపాటే చివరిది అవుతుంది కాబట్టి.
మన ప్రధానమైన రక్షణ కవచం ప్యాలెస్ చుట్టూ వున్న సెక్యూరిటీ. మనం దానిపైన ఓ కన్నేసి వుంచాలి" టేబుల్ పై ముందుకు వంగి రహస్యం చెపుతున్నట్లు తగ్గుస్వరంతో చెప్పాడు మిత్ర.
పునర్జన్మను నమ్మిన ఒక వ్యక్తి, ఆ నమ్మకం పట్ల ఇంత ఆసక్తితో జాగ్రత్తలు తీసుకుంటున్న మిత్రపై ఆ క్షణాన ఒక విధమైన అస్వాభావిక అభిప్రాయం ఏర్పడింది అన్వేషిలో.
"మిస్టర్ అన్వేషీ! మనం ఎప్పుడూ ఏ పరిస్థితుల్లోనూ అపనమ్మకాల జోలికి వెళ్ళకూడదు. అలాగే ఒక వ్యక్తి వ్యక్తిగత నమ్మకాలు అతని అభౌతిక్ వాదము, మన వృత్తికి, నిర్వహించే బాధ్యతకు ప్రాతిపదిక కాకూడదు. మన ముందున్న లక్ష్యం మాత్రమే మన నిరంతర ధ్యేయం. అంటే విశ్వాత్మ ఫౌండేషన్ ను కాపాడటమే మన కర్తవ్యం.
విశ్వాత్మ తిరిగొచ్చి తగిన సమాధానాలు చెప్పి, ఆధారాలు చెప్పి- తన ఆస్తిని తన స్వంతం చేసుకునే వరకూ మనం చాలా అప్రమత్తంగా వుండాల్సి వుంటుంది. పట్టుదల, దీక్ష, నిస్వార్థం, అంతకుమించిన అంకిత భావం మన జీవిత సర్వస్వం కావాలి...." చెప్పాడు మిత్ర ఎంతో ఉద్వేగంతో.
తన మనసులోని భావంకూడా అదే అన్నట్టు కనురెప్పలార్చింది శృతి. ఆధ్యాత్మిక నమ్మకం ఒక పక్క- అధునాతనమైన సైన్స్ ఇంకోపక్క- మిత్ర సమాధానాలతో చాలా సంతృప్తిగా ఫీలయ్యాడు అన్వేషి. ఏ కుతంత్రాలకూ తావులేని ఒక కొత్త సవాలుగా బాధ్యతగ స్వీకరిస్తున్నందుకు అతనికి చాలా ఆనందంగా వుంది. ఉద్రిక్తతగా కూడా వుంది.
"మానసిక అవినీతే లోకంలో అన్ని అనర్థాలకూ మూలం. ఫ్రాంక్ గా మీ అభిప్రాయాలను గౌరవిస్తున్నాను" అన్నాడు అన్వేషి ఒక స్థిరమైన నిర్ణయానికి వస్తూ.
అన్వేషి మాటల్లోని పట్టుదలతో కూడిన నిజాయితీ మిత్రను ఆకట్టుకుంది. భవిష్యత్తులో ఒక అద్భుతాన్ని సాధించబోయే నాయకుడి వంక చూస్తున్నట్లు అనిపించిందతనికి.
"ఈ క్షణం నుంచీ మన మధ్య వృత్తిపరమైన హోదాలు మరిచిపోయి స్నేహితుల్లా మన నిర్దేశిత లక్ష్యంవైపు పయనిద్దాం. 3170 కోట్ల 60 లక్షల కోసం ఆశపడనివాళ్ళు ఈ ప్రపంచంలో ఒక అయిదుశాతం వుంటారేమో. మిగతా 95 శాతం విశ్వాత్మ మూడువేల కోట్ల కోసం ఏదో ఒక ప్రయత్నం చేయకపోరు. అందులో అసలైన విశ్వాత్మ కూడా ఉంటారు. సో... మన బాధ్యత ఎంత సంక్లిష్టమైనదో నీకీపాటికి అర్థమై ఉండాలి."
"మైడియర్ ఫ్రెండ్! 35 కోట్లు బహుమతిగా పొందే శుభదినం నీకు రావాలని మనసారా కోరుకుంటున్నాను. అంతేకాదు- నేటి నుండి విశ్వాత్మ ఫౌండేషన్ నీకు వసతితో పాటు, సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది" అన్నాడు మిత్ర సుదీర్ఘ ప్రయాణంలో అలసిపోయిన బాటసారిలా నిట్టూరుస్తూ.
"థాంక్యూ సర్... ఈ క్షణం నుంచే విశ్వాత్మ ఫౌండేషన్ డిటెక్టివ్ గా నా బాధ్యతలు స్వీకరిస్తున్నాను" కృతనిశ్చయంతో సమాధానమిచ్చాడు అన్వేషి.
సంతృప్తిగా నవ్వుతూ కరచాలనం చేశాడు మిత్ర.
"విశ్వాత్మ ఫౌండేషన్ తరఫున స్వాగతం" అంటూ అభినందించింది శృతి నవ్వుతూ.
ఆ నవ్వు వెన్నెలంత అందంగా, వేకువ సమయంలో తొలిమంచులా అద్భుతంగా వుందనిపించింది అన్వేషికి. కానీ మరుక్షణమే అతడ్ని చిత్ర విచిత్రమైన ఆలోచనలు చుట్టుముట్టేశాయి.
విశ్వాత్మ ఆధ్యాత్మిక విశ్వాసం నిజమే అయితే ఈపాటికి ఆయన ఎక్కడో ఒకచోట జన్మించే వుంటారు. ఫాస్ట్ లైఫ్ రిగ్రేషన్స్ అతనిలో ప్రారంభం కాగానే ఆయన ప్రయాణం జ్ఞానభారతికేసి వుండవచ్చు. తిరిగి జన్మించే విశ్వాత్మ ఎలా వుంటారో?
విశ్వాత్మ ఎలా వుంటారో తను జ్ఞానభారతిలో చదివేప్పుడే ఫోటోల ద్వారా, పెయింట్స్ ద్వారా, వీడియో క్యాసెట్స్ ద్వారా చూసాడు. ఇక చూడవల్సింది ఈ జన్మలోని ఆకారాన్ని. ఉద్వేగభరితమైన ఉద్యోగం- విశ్వాత్మ కానివారి నుంచి కోట్లాది రూపాయల విలువచేసే ఆస్తుల్ని కాపాడడం- విశ్వాత్మను గుర్తించి ఆయన సంపదను ఆయనకు అప్పజెప్పడం. ఆలోచిస్తూనే అక్కడి నుండి లేచాడు అన్వేషి.
* * * *
ఉదయం తొమ్మిదిగంటలు... వైట్ కలర్ మారుతీకారు బంజారా హిల్స్ దాటి జూబ్లిహిల్స్ కొండల మధ్య నున్న విశ్వాత్మ ప్యాలెస్ వైపు దూసుకుపోతోంది. అన్వేషికి ప్యాలెస్ ను చూపించే బాధ్యత శృతికి అప్పగించాడు మిత్ర. విశ్వాత్మ ఫౌండేషన్ లో శృతి వుద్యోగా? లేక ట్రస్టీ మెంబరా? మిత్ర పి.ఏ.నా? ఏ విషయం సరిగా అర్థం కావడంలేదు అన్వేషికి. వెంటనే అడగడం ఎందుకని వూరుకున్నాడు అన్వేషి.
హయ్యర్ అఫీషియల్స్ తో కూడా ఎంతో క్యాజువల్ గా మాట్లాడగలిగే శృతికి అన్వేషితో అలా కుదరడంలేదు.