Previous Page Next Page 
మోడల్ పేజి 34


    "నేను  అడిగింది ఫెంటాస్టిక్ స్టన్నింగ్ బ్యూటీని. అలాంటివారు బహు అరుదు. నిజంగానే అలాంటివారు అప్లయ్ చేసి, నన్ను అప్రోచ్ అయితే లక్షఇచ్చి వార్ని మోడల్ గా తీసుకోటానికి నేను సిద్ధమే....." సిన్సియర్ గా అన్నాడు మనోహర్.

    అది విని తృప్తిగా తల పంకించింది.

    మనోహర్ వెళ్ళిపోయేందుకు లేచాడు.

    ఇంకాసేపు తన  ఎదురుగా ఉండమని అడగాలనుకుని కూడా అడగలేకపోయింది. చీకట్లో నడిచి వెళ్ళిపోతున్న  మనోహర్ తన ఆశలకు, ఆశయాలకు ప్రతీకగా, భగవంతుడు తనకిచ్చిన వరంగా  భావించుకొని తృప్తిగా చూస్తూండిపోయింది. మనోహర్ కనిపించనంత దూరంపోయినా అలాగే అటే చూస్తూ, నిశ్శబ్దంగా, నిస్తేజంగా మిగిలిపోయింది.

    సరిగ్గా  అదే సమయంలో గెస్ట్ హౌస్ లో ప్రదీప్ తో ఘర్షణ పడుతున్నాడు విక్రమ్.

    "మీరు చెప్పినట్లు డ్రామా ఆడుతున్నాను, ఆడిస్తున్నాను. 25,00,000 ఇస్వటానికి సిద్ధంగా వున్నాను. కాని నా పని మీరు చేస్తూన్న ప్రయత్నాలు కనిపించటంలేదు. నాకోసం అప్పుడే ఇంటర్ పోల్ పోలీసులు (అంతర్జాతీయ పోలీసులు) తీవ్రంగా గాలిస్తూ ఇండియా సరిహద్దులు దాటివచ్చేశారు. అణువణువునా శోధిస్తూ ముందుకు సాగుతున్నారు జాగిలాల్లా.

    నేనెక్కువ కాలం ఇక్కడుండటం క్షేమంకాదు. నేను మరోదేశం పారిపోవాలి. ఈలోపు సొమ్ము చేసుకోవాలి. నీ చాలెంజ్ లో నీవు గెలిచే రోజు దగ్గరకు వస్తోంది. ఇది  నాకు  బాధగా వుంది. దీనికి మీ సంజాయిషీ?" తీక్షణంగా అడిగాడు ప్రదీప్ వైపు చూస్తూ.

    అంతర్జాతీయ క్రిమినల్ విక్రమ్. అలాంటివాడు తనకు భయపడతాడని ప్రదీప్ కి నమ్మకంలేదు. కాని విక్రమ్ తొలిసారిగా రెచ్చిపోయాడు. తనే లోంగి విక్రమ్ ఆవేశాన్ని తగ్గించాలి. లేదంటే ఇప్పుడు  ఎదురుతిరిగితే చాలెంజ్ లో తను ఓడిపోవడం, మనోహర్ గెలవటం ఖాయం.

    ఆలోచనల్నుంచి తేరుకొని కృత్రిమమైన నవ్వును మొఖంలో ఒలికిస్తూ "ఒక వారంలోపే నీ పని పూర్తిచేస్తాను. పార్టీలు సిద్దంగావున్నాయి. మంచి రేటు ఇచ్చే పార్టీతో మాట్లాడి  నీ పని సెటిల్ చేస్తాను. నన్ను  నమ్ము" అన్నాడు అనునయంగా.

    అప్పటికే విక్రమ్ ని మట్టు పెట్టడానికి ప్లాన్ సిద్దం చేశాడు ప్రదీప్.

    ప్రదీప్ ని పూర్తిగా నమ్మక విక్రమ్ కూడా ప్రదీప్ డబుల్ గేమ్ ఆడితే ఎదుర్కొనటానికి సిద్ధంగా వున్నాడు.

    ఇంటర్నేషనల్ క్రిమినల్ చార్లెస్ శోభరాజ్ కి ఏమాత్రం తగ్గడు విక్రమ్. అది ప్రదీప్ కి తెలియదు.

    విక్రమ్ బయటకు వెళ్ళగానే ఫోనొచ్చింది ప్రదీప్ కి.

    ఫోన్ లో విన్న మాటలతో ప్రదీప్ మొఖంమీద చిరునవ్వు ఓ క్షణం లాస్యం చేసింది.

    వెంటనే బొంబాయికి ఫోన్ చేశాడు. "హలో నేను సక్సేనాని మాట్లాడుతున్నాను. బిల్డింగ్ ఎంతవరకొచ్చింది........?"

    "పూర్తి కావచ్చింది సార్" అవతల్నుంచి వినిపించింది.

    "త్వరగా అయిపోవాలి. అమ్మాయి వచ్చేసింది. బిల్డింగ్ ఇంకా పూర్తికాలేదని తెలిస్తే బాధపడుతుంది. నా బేబీ బాధపడితే నేను తట్టుకోలేను. ఆమె ఏదడిగినా క్షణాల్లో సమకూర్చి పెట్టడం నాకు కొండంత తృప్తి.

    డబ్బులు ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. ఇంటర్నేషనల్ ఫ్యాషన్ సెంటర్స్ స్థాయికి ఏమాత్రం తగ్గకూడదు.

    నా కూతురు ఈ దేశానికే ఫ్యాషన్ క్వీన్ కావాలి.....అర్థమైందా......నీ కనస్ట్రక్షన్ కూడా ఆ స్థాయిలో వుండాలి. ఉంటాను" ప్రదీప్ ఫోన్ పెట్టేశాడు.

    బెల్ నొక్కగానే ప్రదీప్ కి ఎంతో విశ్వాసపాత్రుడైన నౌకరు భూటాని వచ్చాడు. కొన్ని విషయాల్లో ప్రదీప్ కైలాష్ ని కూడా నమ్మడు. స్వవిషయాల్లో భూటానీనే నమ్ముతాడు.

    "భూటానీ! అమ్మాయి వచ్చేసింది. రేపు ఉదయానికి ఇక్కడకు వచ్చేస్తోంది. జాగ్రత్తగా రిసీవ్ చేసుకురా. అమ్మాయి ఆఫీసువైపు రాకుండా చూడు. మనం ఆడుతున్న రెండు గేమ్ లు [విక్రమ్ తో, మనోహర్ తో] బేబికి తెలియగూడదు గుర్తుంచుకో. బేబి తల్లిపోయిన దగ్గర్నుంచి నీ చేతుల్లోనే పెరిగింది. నీమీద బేబీకి గొప్ప గురివుంది. ఆ చనువు తో ఆమెను ఇటువైపు రాకుండా చూడు. ఎంతసేపూ ఆమె దృష్టి ఫ్యాషన్ సెంటర్ బిల్డింగ్ వైపు మరల్చు......"

    విశ్వాసంగా తలూపి బయటకు నడిచాడు భూటాని.

    టాక్సీలో హొటల్ వైపు వెళుతున్న విక్రమ్ రహస్యంగా తనను వెంటాడుతున్న చందూని గమనించలేదు.


                                                                   *    *    *

    కలకత్తా వెళ్ళేందుకు ఎయిర్ పోర్టుకి బయలుదేరాడు మనోహర్. మధు చాలా స్పీడ్ గా కారు డ్రైవ్ చేస్తున్నాడు. వెనుకసీట్లో మనోహర్ ప్రక్కనే గిరీష్ కూర్చున్నాడు. ఎవరూ మాట్లాడుకోవటంలేదు. కారు ఎయిర్ పోర్టులో ఆగగానే  మధు ఎంక్వయిరీ వైపు పరుగెత్తాడు.

    మనోహర్, గిరీష్ లాంజ్ లో వున్న సోఫాలో కూర్చున్నారు.

    కాసేపట్లో మధు తిరిగి వచ్చాడు. "ప్లయిట్ గంట లేటట సార్" అన్నాడు మధు.

    జరుగుతున్న ఆలస్యానికి మనోహర్ కి చికాగ్గా, ఆందోళనగా వుంది. తను వెళ్ళేవరకూ ఆమె ఎటూ కదలకుండా వుంటే బావుంటుందని భావిస్తున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో టాక్సీ దిగి హొటల్ లోకి వెళ్ళి మరలా పది నిమిషాల్లో బయటకు వచ్చాడు విక్రమ్. మరలా టాక్సీ ఎక్కాడు.

    వెనుకే చందూ మోటార్ సైకిల్ బయలుదేరింది.

    మరలా అంతలోనే విక్రమ్ ఎక్కడికి బయలుదేరినట్లు.....??!! చందూ చురుగ్గా ఆలోచిస్తూనే విక్రమ్ వెళుతున్న టాక్సీని వారికి అనుమానం రాకుండా అనుసరిస్తున్నాడు. విక్రమ్ ఎక్కిన్న టాక్సీ సరాసరి ఎయిర్ పోర్టుకి వచ్చింది. విక్రమ్ టాక్సీ దిగి ఎయిర్ పోర్టులోకి నడిచాడు. ఓ క్షణం నలువైపులా పరికించాడు. వెంటనే బుక్ స్టాల్  దగ్గరకు నడిచి ఎవరికీ అనుమానం రాకుండా మేగ్ జైన్స్ తిరిగేస్తూ నిల్చున్నాడు.

    మరో రెండు నిముషాల్లో చందూ ఎయిర్ పోర్టులోకి ఎంటర్ అయ్యాడు. నలువైపులా చూశాడు. కొద్దిదూరంలో ఓ సోఫాలో కూర్చుని మనోహర్, గిరీష్ కనిపించారు అయినా వారిని గమనించనట్లే కాఫీషాప్ వైపు నడిచి అక్కడే ఆగిపోయి విక్రమ్ తన దృష్టినుంచి తప్పిపోకుండా చూస్తున్నాడు అప్రమత్తంగా చందూ.

    చందూని మధు గమనించాడు. చందూ చూపుల్లోని భావాల్ని పసిగట్టి తనూ మరికొంత దూరంలో నిలబడి చందూని, చందూ చూస్తున్న వ్యక్తిని గమనిస్తూ నిలబడిపోయాడు.

    "సార్......పనామాబ్లేడ్స్ కంపెనీ ఆఫర్ వచ్చింది......" అన్నాడు  జంకుతూనే గిరీష్.

    ఆలోచనల్నుంచి మనోహర్ ఉలికిపాటుగా తేరుకొని గిరీష్ వైపు చూశాడు.

    "ఆ ఆఫర్ నీకిస్తున్నాను. నీ టాలెంట్ వ్రూఫ్ చేసుకో........." ఓ క్షణం ఆగి మరలా అన్నాడు. "అన్నం పెట్టేవాడి చెయ్యి నరకాలనుకోవటం మానవత్వం కాదు. గురువునే నాశనం చేయాలనుకోవటం దారుణం.

    అవసరం వున్నంతవరకు వాడుకొని అది  తీరగానే ఆ మనిషి గురించే వ్యంగ్యంగా మాట్లాడుకోవటం, వారికి ఎసరుపెట్టటం హత్యని మించిన మహాపాతకం. ఆ సంస్కారహీనుల లిస్ట్ లోకి నువ్వు చేరకు....."

    గిరీష్ ఉలిక్కిపడ్డాడు బాస్  విసుర్లకు.

    "నీలో క్రియేటివిటి వుంది. పట్టుదల వుంది. కష్టపడగలవు, నువ్వో మంచి ఫోటో గ్రాఫర్ వి  అవగలవనే నా నమ్మకాన్ని వమ్ముచేయకు. ప్రదీప్ నన్నేం చేయలేడు. భయపడో, ప్రలోభపడో అతని వైపుకి చేరే నీలాంటివారు కూడా నన్నేం చేయలేరు. రూపా చక్రవర్తి హత్యచేయబడివుంటే నిన్ను క్షమించగలిగే వాడ్ని కాదు. నాకు, మధుకి, రూపాకి తెలిసిన స్క్రిప్టులోని వివరాలు కైలాష్ కి చేరాయి. రూపాపై హత్యాప్రయత్నం జరిగిన రోజు షూటింగ్ లో రూపా కాస్ట్యూమ్స్ లో భాగంగా ఆమె నడుమునుంచి నీళ్ళలోకి పూసలదండ వ్రేలాడుతుందనే వివరం తెలియబట్టే తెలివిగా ప్లాన్ వేశారు. మధుమీరు నాకు పూర్తి విశ్వాసం. అది చేరవేసింది నువ్వే. ఎందుకంటే మనం రాసుకున్న స్క్రిప్టు మనకు తప్ప మామూలు వాళ్ళకు అర్థం కాదు. నువ్వు బుకాయించాలనుకున్నా ప్రయోజనంలేదు. నా లాజిక్ నీవు కాదనలేవు....."

    చాలా  తీక్షణంగా వున్నాయి మనోహర్ మాటలు.

    తన వ్యవహారం బయటపడటంతో గిరీష్ మొహం పేలవంగా మారిపోయింది. సిగ్గుపడుతున్నట్లుగా, చేసిన ద్రోహానికి కుళ్ళిపోతున్నట్లుగా. అవమానంగా తలవంచుకున్న గిరీష్ ని చూసి అన్నాడు. "వాళ్ళు వివరాలు కోరింది రూపాను హత్య చేయటానికని తెలియకే నీవు ఆ పని చేసివుండవచ్చు. అయినా నమ్మకద్రోహమే....."

    తనను భయపెట్టి, ప్రలోభపెట్టి ఆ పని చేయించిన కైలాష్ పై కోపం, అంత ద్రోహం చేసినా క్షమించి వదిలేసిన మనోహర్ ఔన్నత్యం గిరీష్ గుండెని మెలిపెట్టింది.

    "ఎందుకో ఏ చిన్నతప్పుకి ఎవర్నీ  క్షమించని నేను నిన్ను క్షమించగలుగుతాను. బహుశా అది నీలో వున్న టాలెంట్ ని గుర్తించికావచ్చు."

    ఉబుకుతున్న కన్నీటితో క్షమించమన్నట్లుగా రెండుచేతులు జోడించాడు గిరీష్. చుట్టూ ఉన్నవారు చూస్తారని కూడా లెక్కచేయకుండా.

    గిరీష్ పశ్చాత్తాపంలో నిజాయితీగా  వుండు. పనామా కంపెనీ యాడ్  ఫిల్మ్ నువ్వే ఇండి పెండెంట్ గా చేసుకో......" అన్నాడు మనోహర్ వాచీ చూసుకుంటూ.

    గిరీష్ కృతజ్ఞతగా  చూస్తూ "నా తొలి ప్రయత్నానికి మీ సలహా సహకారాలు కావాలి సార్" అన్నాడు అభ్యర్థిస్తున్నట్లుగా.

    "మోడలింగ్ చేస్తామంటూ వచ్చేవార్ని ఒక్క చూపుతో వారు పనికివస్తారో రారో కనిపెట్టగలగాలి. అది అహంకారం కాకూడదు. టెస్ట్  షాట్స్  (ఫోటో జెనిక్ అవునో కాదో తెలుసుకునేందుకు తీసే  ఫోటోలు) చెక్ చేయకుండా ఎవర్నీ అంగీకరించకూడదు, ప్రతి వర్క్ లోనూ ఫోటో గ్రాఫర్ మాధనపడాలి____రొటీన్ వర్క్ చేయకూడదు. వర్క్ మొదలైన దగ్గర్నుంచి టియర్ షీట్స్ [ఫైనల్ డిజైన్స్] వరకూ ప్రతీది జాగ్రత్తగా  గమనిస్తూ వుండాలి.

    ప్రతి ఫోటో గ్రాఫర్ శాంతాను షియరే  [ఫేమస్ ఇండియన్ యాడ్ ఫోటో గ్రాఫర్] కావాలనే కాదు, ఇన్ గ్రిడ్ బెర్గ్ మెన్ కూతురు ఇస్ బెల్లా రోజ్ లిన్ (వరల్డ్ ఫేమస్ యాడ్ ఫోటోగ్రాఫర్) కావాలని కోరుకోవాలి. (ఇస్ బెల్లా రోజ్ లీ గంటకు 35,000 చార్జ్  చేస్తుంది) మన ఫోటో గ్రఫీతో అరణ్యవాసంలో సీతాదేవి కట్టుకున్న నారచీరాల్ని కూడా అద్భుతంగా చూపించగలగాలి.

    అన్నింటికి మించి కాంపిటీటివ్ జీల్ వుండాలి.

    WOMAN SHOULD BE THE OBJECT OF BEAUTY, NOT SEX ఇది మర్చిపోతే చీప్ అయిపోతాం. పైపెచ్చు అది డిగ్రేడింగ్ అడ్జేక్టివ్ అవుతుంది.

    ప్రోడక్టుని బట్టి మోడల్స్ సెలక్షన్ వుండాలి. ప్రొఫెషనల్ మోడల్ కి అందంతోపాటు అభినయం రావాలి. గ్లామర్ మోడల్స్ కేవలం అందంగా వుంటే చాలు. ఆ ప్రొడక్ట్సు ఏ తరగతి  ప్రజలకు అమ్మాలనుకుంటున్నారో తెలియాలి. ఆ ప్రజల అభిరుచులు, అలవాట్లు కల్చర్ తెలుసుకొని వార్ని ఆకర్షించే విధంగా మన వర్క్ వుండాలి.

    అవసరం అయితే మన క్లాయింట్స్ కే సలహా ఇవ్వగలిగే ధైర్యం వుండాలి.

    అందుకో ఉదాహరణ చెబుతాను. ఓ కంపెనీ లిప్ స్టిక్ తయారు చేసింది. దానిపేరు 'కిస్ అండ్ కిల్'  నేనా పేరు వద్దని చెప్పాను. నన్ను వర్క్ నుంచి తొలగించారు.

    ఆ తరువాత అది రిలీజ్ అయి అనూహ్యంగా ప్లాప్ అయింది. ఎందుకంటావ్?" మధ్యలో ఆగి ప్రశ్నించాడు.

    గిరీష్ అర్థంకానట్లు చూశాడు.

    "లిప్ స్టిక్ వాడేది స్త్రీలు. ముఖ్యంగా యువతులు ఆ లిప్ స్టిక్ కావాలంటే దాని పేరు పెట్టి అడగాలి. ఏ యువతైనా కిస్అండ్ కిల్ అనగలదా? నన్ను ముద్దెట్టుకుని చంపేయ్ అని అనగలదా? ఇబ్బందిపడిపోరు? సిగ్గు పడిపోరు? అందుకే ప్లాప్ అయింది. అలాంటివాటికి వర్క్ చేస్తే నమకూ చెడ్డపేరొస్తుంది. డబ్బుకోసం కక్కుర్తిపడి అలాంటివి వప్పుకాకూడదు. ముఖ్యంగా వినియోగదారుల నమ్మకాల్ని, సెంటిమెంట్స్ ని దెబ్బ తీయకూడదు.

 Previous Page Next Page