Previous Page Next Page 
మోడల్ పేజి 33


    "నీకు ఎంతసేపు నీవృత్తే ముఖ్యమైతే నేనెందుకు? ప్రేమెందుకు? పెళ్ళెందుకు......గుడ్ బై......నేను కావాలనుకుంటే నాతోపాటు తక్షణమే బయలుదేరు.....లేదంటే యిదే మన ఆఖరి కలయిక....." విసురుగా లేచింది మంగళ.

    తనకన్నా తన మాటకన్నా తన వృత్తే ముఖ్యమా అనే కోపం ఆమెలో నాల్కులు చాచింది.

    ఆ మాటలకు మనోహర్ కి శ్వాస బంధించినట్లయింది. తన పరిస్థితి అర్థం చేసుకోకుండా అంత మూర్ఖంగా మారుతుందని ఏనాడు వూహించని మనోహర్ మానసిక స్థితి తల్లక్రిందులైంది.

    "నా పరిస్థితి పూర్తిగా తెలుసు నీకు. నేను పందెం నుంచి మానుకుంటే మొదట పిరికివాడ్నవుతాను. నా పరువు, ప్రతిష్టలు మంట గలిసిపోతాయి, ఆఖరున నా ఆస్తులన్ని పోతాయి. ఇవేమీ కాదనుకున్నా తెలిసి తెలిసి ప్రదీప్ లాండి వాడ్ని వదిలేస్తే ఆ, నా పాపానికి నిష్కృతి వుండదు. మోడల్స్ తో ఆటలాడుకుంటున్న ఆ రాక్షసుడ్ని, వార్ని దోచుకుంటున్న ఆ బాస్టర్ ని వదిలితే ఆ అశాంతిలో నేను జీవితాంతం ప్రశాంతంగా బ్రతకలేను....."

    తనకన్నా ఆ చాలెంజ్ తో గెలుపే ముఖ్యమనుకుంటున్న మనోహర్ మీద కోపం, ప్రమాదాల్ని కోరి తెచ్చుకుంటున్నాడన్న బాధ, తనమాటను లెక్కచేయనందుకు ఉక్రోషం మంగళను పిచ్చిదాన్ని చేశాయి.

    మంగళ విసురుగా  రెండడుగులు వేసింది. అంతలో ఫోన్ మోగింది. విసురుగా ఫోన్ తీసిన మనోహర్ ఫోన్ లో మాటలు విని తోక తొక్కిన త్రాచులా బుస్సున పైకి లేచాడు. ఫోన్ పై చేతివేలు నరాలు చిట్లిపోయేలా బిగుసుకున్నాయి. ఆవేశంతో వూగిపోతున్నాడు. కొద్ది క్షణాల్లో అపర రుద్రుడిలా మారిపోయాడు.

    "నా చాలెంజ్ కి చరమగీత లేదు.

    నా పందెం ఎప్పుడూ చేదు ఆట కాదు.

    నేనే గెల్చి తీరతాను____ఆ గెల్పుతో వృత్తిని కళంక పరుస్తున్న నీకు అభేద్యమైన సమాధి కడతాను" అంటూ విసురుగా ఫోన్ పెట్టేశాడు.

    తలెత్తి చూసేసరికి విసురుగా వెళుతూ మంగళ కనిపించింది.

    గుండెల్ని పిండినట్లుగా అయింది. తన వార్ని తనకు కాకుండా చేస్తున్న ప్రదీప్ ని ఊరికే వదలకూడదు.

    ఇప్పుడతనిలో కోపం, కసి, పగ పట్టుదల విశ్వరూపం దాల్చాయి.


                                                                     *    *    *


    మనోహర్ ఇచ్చిన చెక్ వైపు ఓ క్షణం చూశాడు మధు. చెక్ ఇస్తూ ఉపయోగించని నీ తెలివితేటలు ఎందుకన్నట్లు? ఇది క్రాస్ట్ చెక్. ప్రదీప్ మార్చుకోవాలి తప్ప మరెవ్వరికీ పనికిరాదు. ఎందుకలా అన్నారు బాస్......??

    అంతలో ప్లాష్ లా వెలిగింది ఓ ఐడియా. హుషారుగా ఈలవేస్తూ ఫోన్ ఎత్తాడు. అవతలవైపు నుంచి ప్రదీప్ గొంతు వినిపించింది.

    "నేను  మధు చక్రవర్తిని మాట్లాడుతున్నాను......" అన్నాడు. ప్రదీప్ భయంకరమైన నవ్వు తెరలు తెరలుగా ఫోన్ డయాఫ్రమ్ ని బద్దలు కొట్టేంత పెద్దగా. ఠక్కున ఆగిపోయింది నవ్వు "మీ బాస్ ని పాతిక లక్షలు సిద్ధం చేమకోమను. కోరమాండల్ కంపెనీకి 15 లక్షలు, నాతో కాసిన పందానికి 10 లక్షలు. మొత్తం పాతిక......"

    తన బాస్ ప్రదీప్ తో విడిగా పది లక్షలు పందెం కాసినట్టు మధుకి అంతవరకూ తెలియదు. ఓక్షణం ఒళ్ళు జలదరించింది భయంతో.

    చప్పున తేరుకున్న మధు "గెలుపెవరిది అన్నది తేలడానికి మరో పదిహేను రోజులుంది. ఊరికే సంతోషపడకు. ఇప్పుడో షాక్ న్యూస్ వదులుతాను విను. అమాయకురాలు, అండలేని రోమాని చంపడం మగతనంకాదు. నిన్ను దారుణమైన నష్టానికి గురిచేస్తున్నాను. దమ్ముంటే కాచుకో. పాపం నీ టైర్స్ యాడ్ ఫిల్మ్ ని సెన్సార్ వాళ్ళు పుట్ బాల్ ఆడేశారు. అంటే  మూడింటికి మునిగావు. ఆగాదు, మధ్యలో అడ్డురాకు. సరికొత్త శుభవార్త విను. నీకివ్వమని ఢిల్లీ బివాష్ ముఖర్జీ పదిలక్షలకి చెక్ మా బాస్ అందించాడు. మీ ఇద్దరి గొడవ తెలియక ఆ పని చేశాడు. ఇప్పుడా చెక్ నా దగ్గర వుంది. దాన్నిప్పుడు నేను చెడుగుడు ఆడేస్తాను- పదిరోజులపాటు. చెక్  అందలేదని ఢిల్లీ ఫోన్ చేస్తావు. మనోహర్ కి ఇచ్చానని చెబుతారు. దాన్నతను చెడుగుడు ఆడేస్తున్నాడని చెబుతావు. వాళ్ళు నమ్మరు. ఎందుకంటే నీలాంటివాడుకాదు మనోహర్ అంటారు. నాలుగురోజులు ఆగమంటారు. ఆగుతావు. మరలా ఫోన్ చేస్తావు. వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు. సారీ.....మిస్ ప్లేస్ అయిందంటాం. నమ్మేస్తారు. కొత్త చెక్ ఇవ్వమంటావు. పాత చెక్ నెంబర్ డేట్ ఇస్తూ దాని కలెక్షన్ ఆపమని బ్యాంక్ కి రాస్తారు. వారు సరేనని రాస్తారు. ఆ తర్వాత మరోచేక్ తయారుకావడానికి మూడురోజులు. మొత్తం పది రోజులకిగాని క్యాష్ నీ చేతికి అందదు. పదిలక్షలకి పదిరోజులకి వడ్డీ ఎంతో నీకు బాగా తెలుసు. నీ టర్నోవర్ మీద చావుదెబ్బ..........నెలకి వందకి రెండు రూపాయల వడ్డీ. ఆ లెక్కన పది లక్షలకి పదిరోజులకి.........లెక్క తెలుసా! చెప్పనా? మర్చే పోయాను. పదకొండోరోజు మరో చావుదెబ్బకి సిద్ధంగా వుండు" అని ఫోన్ పెట్టేశాడు మధు.

    ఏమీ  తెలియని పిచ్చికోపం ప్రదీప్ ని ఉన్మత్తుడ్ని చేసింది. మధు రెచ్చగొట్టడంతో, శాంతి షినాయ్ గొడవతో టైర్స్ యాడ్ ఫిల్మ్ ఆగిపోయింది. అంతలో మరలా ఇది. అతని కళ్ళు కణకణ మండిపోతున్నాయి. కైలాష్ ని పిలిచాడు. కళ్ళజోడు తీశాడు విక్రమ్ ని పిలవమన్నాడు.

   
                                                                      *    *    *


    మనోహర్ కమలిని ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 7-30 కావస్తోంది. గేటు తీసుకొని, ఇంటివైపు వెళుతుండగా  కమలిని ఒంటరిగా లాన్ లో కూర్చుని కనిపించింది. లైట్ వేసుకొని కారణాన మసక చీకట్లో కమలిని అస్పష్టంగా కనిపిస్తోంది. నిశ్శబ్దంగా ఆమెవైపు నడిచాడు.

    యాడ్ వరల్డ్ లో తన అందచందాలతో, నటనా  కౌశలంతో, అభినయంతో సంచలనం సృష్టించినట్లుగా  లేదు. సాదాసీదా చీరలో, తలస్నానం చేసి ఆరబెట్టుకున్న కురులు నలువైపులా పర్చుకొని ఒక సాధారణ గృహిణిలా, సర్వస్వం కోల్పోయిన విరాగిణిలా కనిపించింది.

    "లైట్ వేసుకోకుండా చీకటిలో కూర్చున్నారేం......?"

    "వెలుగులో చెప్పుకోతగ్గంత గోప్ప జీవితాలు కావు మనవి" ఆమె కంఠంలో బరువు, మాటలో జీర సృష్టమవుతున్నాయి.

    "నేనలా అనుకోవటంలేదు. వృత్తికి నేనెప్పుడూ ద్రోహం చేయలేదు. దాన్ని అడ్డం పెట్టుకొని అవినీతిగా ఎప్పుడూ ప్రవర్తించలేదు...."

    "ఆఫ్ కోర్స్.......కాని నీవీ వృత్తికి పనికిరావు" స్థిరంగా అంది.

    ఆ మాటలకు విస్మయపడ్డాడు మనోహర్.

    "నాకర్థం కాలేదు.....ఏ తప్పు చేయనప్పుడు పనికిరాక పోవటమేంటి?"

    "ఏ తప్పు చేయలేవుగనుకే పనికిరావు. ఎథిక్స్, మొరాలిటి అంటూ ప్రాకులాడే నీలాంటివారు ఈ పారిశ్రామిక కుక్కల ప్రపంచంలో బ్రతకలేరు. మనవృత్తిలో ముఖ్యంగా కావల్సింది క్రియేటివిటి. ప్రస్తుత పరిస్థితుల్లో అదికాదు కావాల్సింది. నేడు వృత్తిని దగా, మోసం, దోపిడి, వంచన అనే మేఘాలు క్రమ్ముకున్నాయి. క్రమ్ముకున్న కాలుష్య కారు మేఘాల మధ్య చిరుదీపానివి నీవు నీ చీరుదీపాన్ని కాపాడుకొనే శక్తి నీకింకారాలేదు. కాపాడేందుకు నీకు అండగా మరొకరు లేరు......" ఓ క్షణం ఆగిజుత్తంతా ప్రోదిచేసి ముడివేసుకుంది.

    "ఈ రోజెందుకో మీరు వింతగా మాట్లాడుతున్నారు."

    నిశ్శబ్దంగా, వేదాంతిలా నవ్వింది. ఆ నవ్వులో ఎప్పటిలా జీవంలేదు.

    "నీవీ పందెం నుంచి మానుకోలేవా?" పట్టిపట్టి అడిగింది......అడగకూడదనుకుంటూనే. ఒక్కక్షణం అర్థంకానట్లుగా చూశాడు. మీరీకోర్కె మనస్ఫూర్తిగా అడిగి వుండరు. అవునుగదా?"

    ఆమె మాట్లాడలేదు. మెడలోని ఒంటిపేట గొలుసు పెదవులమధ్య పట్టుకుంది సాలోచనగా చూస్తూ.

    "దిగవలసినంతవరకు___పీకల వరకూ దిగిపోయాను. ఇప్పుడిక వెనకడుగు వేయలేను. నాక్కావాల్సిన మీరంతా నాలో స్థయిర్వాన్ని, ధైర్యాన్ని నింపండి. లేదంటే మాత్రం వెనుకంజ వేయమని సలహా ఇవ్వొద్దు......"రోషాన మనోహర్ మొహం ఎర్రబడింది.

    ఎవరు పందెం నుంచి విరమించుకోమని అడిగినా మనోహర్ లో కోపం ప్రజ్వరిల్లుతోంది.

    "నన్నర్థం చేసుకోటానికి ప్రయత్నించు. మంగళ క్కూడా ఇది ఇష్టంలేదు. పెళ్ళి చేసుకొని సుఖంగా...."

    "ఆపండి మేడమ్......భయపెట్టి, ప్రలోభపెట్టి నా ప్రయత్నంలో నన్ను నీరు కార్చవద్దు......లేదంటే చెప్పండి వెళ్ళిపోతాను......" అంటూ లేచాడు.

    ఉలికిపాటుగా లేచి మనోహర్ చేయి పట్టుకొని ఆపింది.

    అప్పుడు చూశాడామె కళ్ళలోకి మనోహర్. దీనంగా, శూన్యంగా ఉన్న ఆమె చూపులు___ఆ చూపుల చుట్టూ ఉబికివస్తున్న కన్నీరు.

    చలించిపోయాడు ఆమెనాస్థితిలో చూసి. ఆమెకు దగ్గరగా వచ్చి చూపుడువేలితో ఆమె కంటినీరును తుడిచాడు.

    "సారీ.....వెరీసారీ......నా ఆవేశం మీకు తెలుసుగా......అందుకే అలా.....మీ మీద నాకున్న గౌరవానికి, అభిమానానికి మరొక విషయంలో అయితే మీ మాట జవదాటే వాణ్ని కాదుకాని____"

    "నామీద నీకుంది గౌరవం, అభిమానమేనా?" అడిగింది బాధగా చూస్తూ.

    ఆమె ఇంకా తననుండి ఏం ఆశిస్తుందో అర్థంకాక తికమకపడ్డాడు.

    "నీకు హాని తలపెడతాడా రాక్షసుడు___అనే భయంతో అలా అన్నాను కానీ......గో ఎ హెడ్..... నీ లాంటివారివల్లే వృత్తికి మంచి రోజులు రావాలి. నాదో కోరిక తీరుస్తావా......?" అంది ఆశగా చూస్తూ.

    వింతగా చూశాడు కమలిని వైపు ఎప్పుడూ ఎంతో ధైర్యంగా, నిబ్బరంగా ఉండే మేడమ్ ఈ రోజెందుకు బేలగా  వుంది.....?" చెప్పండి అదొక్కటితప్ప ఏదైన, ఎంతటిదైనా తీరుస్తాను" అన్నాడు ఆమెవైపు గౌరవంగా చూస్తూ.

    "ఆ నమ్మకంతోనే నీమీద బరువైన, బాధ్యతాయుతమైన పని పెట్టబోతున్నాను......"

    "చెప్పండి.......ఏమిటది?" ఆతృతగా అడిగాడు.

    "ఇప్పుడుకాదు____తరువాత తెలుస్తుంది......" అంది నిరాసక్తంగా.

    "మీరెందుకో ఇవ్వాళ విచారంగా, అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకని?" ఆమెనా స్థితిలో ఎప్పుడూ చూడని మనోహర్ కు బాధగా వుంది.

    "ఎక్కడో పుట్టాను......ఎక్కడో పెరిగాను.......ఎంతో సంపాదించాను .... పేరు ..... డబ్బు ..... కాని ..... కాని....." ఆమె గొంతు చిక్కబట్టి నట్లయింది.

    మనోహర్ మౌనంగా చూస్తున్నాడు.

    "అన్నీ అనుభవించాను. కాని ఒక అసంతృప్తి మిగిలిపోయింది. సెంటిమెంటు.......మాతృపరమైన సెంటిమెంటు. అది సెంటిమెంటో......చెదిరిన నా జీవితానికి పరమార్థమో, అదేంటో తెలుసా......తల్లి కావాలనే కోర్కె.....'స్త్రీ పరమైనచిన్నకోర్కె.....'

    తల్లిని కావటం ద్వారా నేను చేసిన పాపాల్ని, భయల్ని,  బాధల్ని కడుక్కుందామని గాదు. కేవలం స్త్రీ జన్మకు సార్థకత కోసం......"

    "చాలాసార్లు అడుగుదామని అడగలేకపోయాను......మీరెందుకు పెళ్ళి చేసుకోలేదు......?"

    నిర్జీవంగా నవ్వింది. పగలబడి నవ్వింది. ఆ నవ్వులో అంతర్లీనంగా ఆమె పడుతున్న బాధ స్పష్టమవుతోంది.

    "ఒకప్పుడు వెర్రిగా, పిచ్చిగా సంపాదించాను యంత్రంలా టైమ్ లేదు ప్రేమించటానికి, పెళ్ళి చేసుకోవటానికి. ఆ హడావుడి అంతా అయ్యాక చూసుకుంటే పెరిగిన వయస్సు, ఆకర్షణ కోల్పోతున్న శరీరం, కావాల్సినంత డబ్బు తీసుకొని ఆ తరువాత నేను   చెడ్డదాన్నని వదిలేసిన నా  కుటుంబసభ్యులు____మిగుల్చుకున్న డబ్బు మిగిలాయి. ఆ తరువాత నన్ను ప్రేమించామంటూ వచ్చిన నిజాయితీగల ప్రేమికుల్ని చూసి___విసిగి వేసారి నా జీవితం నాకు నేర్పిన పాఠాల వలన వారిని గుర్తించలేదు. నా ఒంటరి జీవితానికి తోడు అవసరం స్ఫురణకు రాలేదు.

    మగవాణ్ణి నమ్మలేకపోయాను. అందరు మగాళ్ళు దుర్మార్గులే అనుకొని. కొంతకాలానికి నాకు ఒక మంచి మనిషి కనిపించాడు. కాని అప్పటికి చీకటి పడిపోయింది. అతడు నన్ను గుర్తించలేనంత చీకటిలాంటి వయస్సు పైనబడింది. నాకు నాలుగు పదులు. అతనికి మూడు పదులు కూడా లేవు. నా కోర్కె వింతగానూ వుంటుంది. విలువ లేకుండానూ వుంది. కాని నా  ప్రేమలో నిజాయితీ వుంది. సిన్సియారిటీ వుంది. నలుగురినీ నేను (మోడల్స్) ప్రేమించగలను. ప్రేమించాను అని గర్వంగా చెప్పు కోవాలనే వెర్రి ఆశ. అది ఫలించకపోయినా చెప్పుకొని తృప్తి పడదామనే పిచ్చి ఆశ. కాని నా ప్రేమకు అవినీతిని అంటగడతారు. వళ్ళుపై తెలియక నీకంటే 15 ఏండ్ల చిన్నవాడ్ని ఎలా ప్రేమించావంటారు? ప్రేమకు స్పందన ముఖ్యమని నాకు తెలుసుగాని, వయస్సు అని నాకు నా వయస్సుకు తెలియదు. అమలిన శృంగారానికి దర్పణమైన, అద్భుత ప్రణయామృతానికి అర్థం చెప్పిన నండూరివారి ఎంకి - నాయుడుబావల పవిత్ర, పరవశ శృంగారానికే మచ్చ అంటగట్టే ప్రబుద్దులున్న సమాజం మనది.

    ఏమైతేనేం నా ప్రేమ విఫలమయింది. అతన్ని కాదని మరొకర్ని చేసుకోలేకపోయాను. రాజీపడి, మనస్సు చంపుకొని పెళ్ళి చేసుకుందామనే అనుకున్నాను-కనీసం తల్లినన్నా అవుదామన్న ఆశతో. కాని కాలాతీతమైంది. నా కడుపు పండేందుకు వీలులేనంతగా  ఎండిపోయిందంట. అది తెలిశాక మరిక పెళ్ళెందుకు కనిపించింది. చివరకు వృద్దకన్యగా మిగిలిపోయాను. అయినా తల్లి కావాలనే మాతృపరమైన కోర్కె నన్ను అనుక్షణం చిత్రహింసకు గురిచేస్తూనే వుంది" అంటూ తన కడుపుమీద చేయివేసి నిమురుకుంటూ "అయినా నా పిచ్చిగాని నలుగురు నడిచిన దారిలో మొక్కలెలా మొలుస్తాయి......? అందుకే ప్రియుడిగా చూసుకున్న అతనిలో యిప్పుడు కొడుకును చూసుకుంటున్నాను. చిత్రంగా లేదూ.....?" అంటూ ఆగిపోయింది.

    ఆమె మౌనంగా రోధిస్తుంది. వెక్కిళ్ళు పడుతోంది. అక్కడ అలుముకున్న శ్మశానానిశ్శబ్దంలో ఆమె ఏడుపు హృదయవిదారకంగా వుంది.

    మనోహర్ గుండెల్ని పిండినట్లు విలవిలల్లాడాడు.

    చాలా సేపటివరకూ మాట్లాడుకోలేదు. కమలిని హఠాత్తుగా లేచి మనోహర్ దగ్గరకు నడిచి అతని తలను ఎత్తి నుదురుమీద ఆప్యాయంగా ముద్దెట్టుకుంది. అలా ఎందుకు చేసిందో మనోహర్ కి అర్థంకాలేదు. మంగళ వెళ్ళిన విషయం చెప్పాడు. అతనిలో మంగళ వెళ్ళిపోయిందన్న బాధమెలిపెడుతోంది. తను ఒకరికోసం......ఆ ఒకరు మరోకరికోసం......ఆ మరొకరు దేనికోసమో!!! జీవితం చాలా చిత్రమైంది. అంత బాధలోంచి చప్పున తేరుకుంది కమలిని, "మన పర్సనల్ విషయాలు తరువాత, తరంగిణి దొరికిందా?" అడిగింది.

    "దొరికినట్లే దొరికి తప్పిపోయింది......." అంటూ జరిగినదంతా చెప్పాడు.

    కమలిని నిట్టూర్చింది.

    "నీవేం నిరుత్సాహపడకు. కడవరకు పోరాడు. నీ ప్రయత్నంలో పట్టుదలలో నిజాయితీ వుంది. అంతిమ విజయం నీదే" అంది మనోహర్ లోని నిస్పృహను పారద్రోలే ప్రయత్నంలో భాగంగా.

    ఆమెవైపు కృతజ్ఞతగా చూశాడు.

    "కాని ఇంతవరకూ నా సందేహాన్ని నివృత్తి చేయలేదు....." అంది నిశ్శబ్దంగా నవ్వుతూ.

    అర్థం గానట్లు చూశాడు మనోహర్.

    "ముందుగానే సోఫియాని నీ ప్రాజెక్టుకి మోడల్ గా తీసుకున్నావ్ . అలాంటప్పుడు ప్రకటన ఎందుకిచ్చావ్?"

    మనోహర్ కి ఆశ్చర్యమేసింది___ఆమెకా విషయం ఇంకా గుర్తున్నందుకు. అంటే ప్రతి చర్య గురించి అంత సునిశింతగా ఆలోచిస్తోందా?!!

    "సోఫియాని మోడల్ గా తీసుకున్నట్లు ప్రదేప్ కి తెలియగూడదనే పాతికవేలు ఖర్చుపెట్టి ప్రకటన ఇచ్చి అతని దృష్టి మరల్చాలనుకున్నాను. కాని ఫోటోలు తారుమారుచేసి పెద్ద దెబ్బ కొట్టాడా బాస్టర్డ్......"

    "కేవలం ప్రదీప్ ని తప్పుదారి పట్టించడానికే పాతికవేలు ఖర్చు పెట్టడం నీ స్వవిషయం. నీ వ్యాపార ఎత్తుగడ. కాని ఆ ప్రకటన చూసి ఎంతోమంది అమ్మాయిలు ఆశగా అప్లయ్ చేసి ఎరురుచూస్తూంటారు. వారిలో ఆశలు రేపిన నీవు వారికిచ్చే సమాధానం......?" కాస్త కరుకుగానే అడిగింది.

 Previous Page Next Page