Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 32

    సుందరికి వళ్ళు మండింది. "ఆ చెప్పేదేదో సరిగ్గా చెప్పి తగలడు" అంటూ విసుక్కుంది.

    "ఈ ఇంట్లో మన పక్క గదిలో అద్దెకి వుండే శంకర్రావు ఇంటిపేరు వి (V) అవునా!"

    "అవును."

    "మన ఇంటిపక్క ఇల్లుగల శంకర్రావు ఇంటిపేరు యు (U) అవునా!"

    "అవును. అయితే ఏమిటి?"

    "అదీ విషయం. అక్కడే జరిగింది ఓ పొరపాటు."

    "పొరపాటు అంటే....?"

    "సరీగ ఇంగ్లీషురాని పోస్ట్ బాబుగారు V కి Uకి భేదం తెలియక మన పక్క ఇంటి U. శంకర్రావు లెటర్ ను మన ఇంట్లో అద్దెకి వుండే V. శంకర్రావుది అనుకుని ఇక్కడ పారేసి పోయాడు."

    "అయితే, ఈ కవరు ఆ త్రాష్టుడిదన్నమాట!"

    "అక్షరాలా యస్." అన్నాడు తమాషాగా సుధీర్.

    క్షణకాలం సుందరి ఆలోచనలో పడింది.

    సుందరి మొగుడు సుబ్బారావు. సుందరి తమ్ముడు సుధీర్. వాళ్ళు ముగ్గురూ ఆ ఇంట్లో అద్దెకి వుంటున్నారు. డిటెక్టివ్ నవలలు, జేమ్స్ బాండ్ లాంటి తెలుగు సినిమాలు అమితంగా ఇష్టపడే సుధీర్ చదువుకు సున్నా చుడుతుంటే వాళ్ళ నాన్న కోప్పడి ప్రైవేటుగా మెట్రిక్ చదవమని అక్కాబావ ఇంట్లో పెట్టాడు సుధీర్ ని.

    ఇంటివాళ్ళు అయిదు గదులుగల ఆ ఇంటిని సుందరి వాళ్లకు అద్దెకు ఇచ్చి పక్క వూళ్ళో వుంటున్నారు. అయిదు గదులు వాళ్ళకి ఎక్కువ కాబట్టి, వాకిలివైపున్న ఒక గదిని, కాస్త వసారాను V. శంకర్రావు అనే అతనికి అద్దెకు ఇచ్చారు.

    వి. శంకర్రావు బుద్దిమంతుడు. తలొంచుకుని ఆఫీసుకెళతాడు, తలవంచుకుని యింటికి వస్తాడు. తన మానాన తను పడుండే రకం.
    కొత్తగా పెళ్ళయింది.

    పెళ్ళయిన ఏడాదిలోపునే పిల్లనో, జెల్లనో కనడానికి పెళ్ళాం పుట్టింటికి వెళ్ళింది. అతని భార్యకు ఈ నెలలో పురుడు వస్తుందని డాక్టరమ్మ చెప్పడంవలన వి. శంకర్రావు ఓ నేల రోజులు శలవుపెట్టి అత్తారింటికి నిన్న మధ్యాహ్నమే వెళ్ళాడు.

    వి. శంకర్రావు మంచివాడు కావడంవలన సుందరి, సుబ్బారావులకి అతనివలన ఏ కష్టమూ లేదు.

    సుందరి, సుబ్బారావుల ఇంటివాళ్ళు ఆ యింట్లో లేనందున సొంతిల్లులాగా హాయిగా ఉంటున్న వీళ్ళకి ఈ ఇంటిపక్క ఇల్లు ఓనరు యు. శంకర్రావువల్ల మహా తలనొప్పి ఏర్పడింది.

    రెండిళ్ళమధ్య కాంపౌండ్ గోడ నాలుగు అడుగుల ఎత్తు మాత్రమే వుండడం, పైగా యు. శంకర్రావు ఇల్లు ఎత్తుమీద ఉండడం వలన తలనొప్పి ఏర్పడలేదు.

    సుందరి వయసు ఇరవై ఎనిమిది. బ్యూటీక్వీన్ కాకపోయినా ఎర్రగా, బుర్రగా లడ్డులాంటి శరీరంతో కర్లీ హెయిర్ తో రెచ్చగొట్టే చూపులతో ఆ....రకం మగాళ్ళకి ఆ....రకం గుబులురేపే విధంగా ఉంటుంది.

    సీతాదేవి అందంగా వుంటుంది. 'సీతమ్మతల్లి ఎంత సుకుమారి, ఎంత లావణ్యవతి' అని చూసి వూరుకుంటారు కొందరు మగవాళ్ళు.
    రంభ అందంగా వుంటుంది. దీని తల్లి సిగతరగ ఏమందంరా దీనిది! రంభా పొందు రమణీయమైన విందు' అని నాలుక చప్పరిస్తారు కొందరు మగవాళ్ళు.

    ఎప్పుడూ ఆ దృష్టితో అఘోరించే మగవాళ్ళు సుందరిని చూచి నాలుక చప్పరించి వికారపు చేష్టలు చేస్తుంటారు.

    దాంతో సుందరికి చాలాసార్లు అనుమానం వస్తుంటుంది. తను రంభా ఊర్వశి తలదన్నే రమణీ లలామననేమోనని.

    ఈ అనుమానంతో తను అందగత్తెనన్న మాట తనే రూడి చేసుకున్నది. అలంకరణనుకూడా ప్రాముఖ్యం ఇవ్వడం మొదలుపెట్టింది.

    సాయంత్రం కాగానే తెల్లచీర, తలలో బుట్టెడు మల్లెపూలు వుండాల్సిందే.  

 Previous Page Next Page