Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 31

    ఒకటి పెట్టెని పెరట్లో బారెడు లోతు గొయ్యితీసి పూడ్చటం. అది ప్రస్తుతానికి మంచిపని అయినా, తన పెళ్ళానికి వున్న ఓ అలవాటు దరిమిలా తన ప్రాణానికి పీకులాట కావచ్చు.

    రంగశాయి పెళ్ళానికి చెట్లునాటడం మహా సరదా. ఈ రోజు గొయ్యి తీసి ఓ మొక్క పాతుతుంది. పట్టుమని నాలుగు రోజులు పూర్తికాకముందే పెద్ద అనుమానం వస్తుంది. ఈ క్రోటన్స్ ని ఆ పక్కకి మార్చి మందార కొమ్మని యిక్కడ నాటితే బాగుంటుందీ అని__అంతే వెంటనే పలుగు-పార పుచ్చుకొని మరోచోట గొయ్యితీస్తుంది.

    భార్యకి వున్న పిచ్చి అలవాటు రంగశాయికి బాగా తెల్సు. కనుక గొయ్యితీసి పెట్టెని దాచే (నాటే) ప్రయత్నం విరమించుకున్నాడు.
    పోనీ పెట్టెని పారేద్దామా అంటే అది అంత మంచిపనిగా కనబడలేదు.

    ఆలోచిస్తే దానిలో చాలా కష్టనష్టాలు కానవచ్చాయి అందుకని అదీ విరమించుకున్నాడు.

    బాత్ రూమ్ లోనే పైన అటకలాంటి అర వుంది. వంటింట్లో అటకమీద గంగాళం, ఇత్తడి గుండిగలు వగయిరా పెద్దసామాను దాస్తే, బాత్ రూమ్ లో అటకమీద ఇక్ష్వాకుల నాటివి, ఉపయోగ పడనివి పాత డొక్కు సామాను ఉంది.

    మూడు మంచంకోళ్ళు తుప్పుపట్టిన పంపుగొట్టాం పాడయిపోయిన ఫిట్టుకొట్టే పంపు డబ్బా, ఇనప తీగ, వాళ్ళ పిల్లలకి ఎప్పుడో చిన్నప్పుడు వాడిన మూడు కాళ్ళు సైకిలు తాలూకు కొన్ని భాగాలు, అన్నీ యిలాంటివే బాత్ రూమ్ లో అటకమీద వున్నవి.

    మరికొన్ని పాడయిన పార్టులు పైకి చేర్చడం తప్పించి అవి వాడిన పాపాన పోలేదు, దింపిన పాపానపోలేదు. ఆ ఇంట్లో అది చాలా సేఫ్టీ ప్లేసు.

    "ప్రస్తుతానికి యిది రాత్రి, పైగా తను అలసిపోయి వున్నాడు. భార్యాపిల్లలు వారందాకా వూరునుంచి రారు. పెట్టె సంగతి రేపు చూడొచ్చు. ప్రస్తుతం అటకమీద పడేస్తే నిక్షేపంగా మరుగున పడి వుంటుంది"

    ఈ ఆలోచన చేసిన రంగశాయి పెట్టెని బాత్ రూమ్ ఆటక మీద పడేసి అమ్మయ్య అనుకున్నాడు.

    తెల్లవారుతూనే యిక్కడేదో కొంప మునిగినట్లు భార్యా పిల్లలు ఊరునుంచి దిగుతున్నారని రంగశాయి అనుకోలేదు.

    తప్పదు ఆ పెట్టె బాత్ రూమ్ అటకమీద వుండాల్సిందే.

    ప్రస్తుతానికి రంగశాయి చాప్టర్ క్లోజ్.

                       17     

    ఉదయం పదిగంటల వేళ. ఫస్ట్ పోస్టు వచ్చింది. పోస్టు అన్న కేక విని చేతిలో వున్న పనిని వదిలేసి వచ్చింది సుందరి.

    సుందరి వచ్చేసరికి సుధీర్ కవరుని అటూ ఇటూ తిప్పి చూస్తున్నాడు.

    "ఎక్కడినుంచి వచ్చిందిరా కవరు?" సుందరి అడిగింది.

    "తెలీదు" అన్నాడు సుధీర్.

    "తెలీదు అని చూస్తూ కూర్చుంటే ఎలా? కవరు చించి చూడు" అంది సుందరి.

    "అది తప్పేమో అని చూస్తున్నా అక్కా!" సుధీర్ చెప్పాడు.

    "తప్పేమిటి?"

    "పరాయివాళ్ళకొచ్చిన కవరుని చించి చదవడం తప్పా, వప్పా?"

    "ముమ్మాటికీ తప్పే."

    "తప్పు కాబట్టే కవరు చిమ్పాలా, వద్దా అని మీమాంసలో పడ్డాను"

    "ఏ మాంసంలోనూ పడొద్దు. మనది కాని కవరుని చింపి చదవవద్దు. ఇంతకీ ఆ కవరు ఎవరికీ వచ్చింది?"

    "శంకర్రావుకి."

    "శంకర్రావుకి వచ్చిన కవరుని పట్టుకుని ఇంతసేపు మాటలని సాగదీస్తావేమిటి? కిటికీ తలుపు తెరిచే వుందికదా! కవరుని శంకర్రావు గదిలో పడెయ్యి" అంది సుందరి రవంత విసుగుతో.

    "ఈ కవరు ఈ శంకర్రావు కొచ్చింది కాదు-" కవరుని ఇంకా అటూ ఇటూ తిప్పుతూ సుధీర్ తాపీగా చెప్పాడు

 Previous Page Next Page