Previous Page Next Page 
ఇంటింటి కధ పేజి 32

   
    ఒకరోజు అనుకోకుండా ఓ అవకాశం దొరికింది. ఆరోజు చాలా ఉత్తరాలు, కాగితాలు టైపు చెయ్యాల్సి వచ్చింది. ఐదు గంటలు అయినా అవలేదు. యింకో గంట పని పడ్తుంది అనుకుంది. ఒక్కొక్కరూ ఆఫీసు నించి వెళ్ళిపోయారు. ఫ్యూను , యింకో ఎకౌంటెంట్ మాత్రం మిగిలారు. వసంత ఆ అవకాశం వదలదలుచుకోలేదు. కావాలనే కాస్త నెమ్మదిగా పని చేసింది. కాగితాలు టైపు అయ్యేసరికి ఏడున్నర అయింది. రతన్ లాల్ రెండు మూడు సార్లు అంతసేపు ఆమెని వుంచినందుకు నొచ్చుకుంటూ సారీ చెప్పాడు. "ఫరవాలేదు సార్, రోజూ వుండనుగా' వసంత చలాకీగా టైప్ చేస్తూ అంది. యీ అకౌంటెంట్ పోడేమిటి మధ్య వీడొకడు తగలడ్డాడు పదిసార్లు విసుక్కుంది వసంత. అతని పని పూర్తి చేసి ఏడుగంటలకి వెళ్ళాక వసంత గుండెలు గబగబా కొట్టుకున్నాయి. ఏదో జరగబోతుందన్న ఉద్విగ్నతతో ఆమె వణికింది. ఆఫీసులో యిద్దరే వున్నారు. ఫ్యూను ని కాఫీకి పంపిస్తాడు. అప్పుడు టైపు చేస్తుంటే తన వెనక నిలబడతాడు. నిలబడి నిలబడి ....ఏం చేస్తాడు? తను ఏం అటుందోనని బెరుకుగా తటపటాయిస్తూ 'వసంతా' అంటాడు పంపిస్తున్న స్వరంతో. తన భుజాల మీద చేయి వేసి,  తనేం చెయ్యాలో తోచక తడబడిపోతుంది. తనేమి కోపగించక పోవడంతో అతనికి ధైర్యం వచ్చి వెనక నించి తన తల మీద నిలిచి వంగి పెదాలు కలపబోతాడు. 'వసంత ఎన్నాళ్ళకీ అవకాశం దొరికింది మనకి.....ఐ లవ్ యూ' అంటాడు. అప్పుడు తనేం చెయ్యాలి. బెట్టు చెయ్యాలా? వెంటనే అంగీకరిస్తే చుల్కన అయిపోతుందేమో? కాస్త కోపం నరించి సార్, యిదేమిటి సార్ నన్నేమనుకున్నారు' అంటూ హార్ట్ అయినట్లు మాట్లాడాలా.....
    "వసంతగారూ ......ఎమిటాలోచిస్తున్నారు.....అసలే ఆలశ్యం అయిపొయింది, కానీండి, తొందరగా ఫినిష్ చేస్తే మనం వెళ్ళచ్చు" అన్నాడు రతన్ లాల్ అసహనంగా వసంత ఆలోచనం పడడం చూసి.
    వసంత తేరుకుని ఎలాగో టైపు పూర్తి  చేసింది. అతను సంతకాలు పెట్టేసి లేచి నిల్చుని "పదండి వెడదాం" అనగానే మొహం చిన్నపోయింది.
    "ఎనిమిదవుతుంది మీరు ఒక్కరూ ఎలా వెడతారు. పదండి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను" అనగానే, వసంత మనసు ఉరకలు వేసింది. ఆఫీసులో అయితే ఫ్యూను ఉంటాడు అని అలోచించి వుంటాడు. అందుకే కారులో లిప్టు యిస్తూ....."
    "ఫరవాలేదండీ ...రిక్షాలో వెళ్ళిపోతాను .....' అంది ఏం అంటాడో చూడాలని.
    "వద్దొద్దు రాత్రయింది . మిమ్మల్ని యింతవరకు వుంచేసినందుకు వంటరిగా పంపిస్తానా , కారులో డ్రాప్ చేస్తాను. రండి" అంటూ కారును సమీపించి లాక్ తీశాడు.
    ఆమె ఊహలకి భిన్నంగా అతను ముందు సీటు తలుపు కాక, బ్యాక్ డోర్ తెరిచి పట్టుకోడంతో వసంత మొహం వాడిపోయింది. ఏం అనలేక కారెక్కి కూర్చుంది. కారులో వేడుతున్నంత సేపు అతను రేపు పంపాల్సిన ఉత్తరాల గురించి ఏదో చెప్తుంటే వసంత వళ్ళు మండిపోయింది. యిదెం మనిషి వీడసలు మగడేనా వంటరిగా ఆడపిల్లలతో వేడ్తూ యివా మాట్లాడవలసిన విషయాలు తిట్టుకుంది . ఆలశ్యం అయినందుకు మరోసారి క్షమాపణ చెప్తుండగానే వసంత యింటి రోడ్డు వచ్చేసింది.
    వసంత కసిగా "యిక్కడాపండి , మా యిల్లు వచ్చేసింది" అంది కటువుగా.
    ఆమె గొంతులో కరుకుదనం అతను గుర్తించకుండానే "గుడ్ నైట్, సారీ ఫర్ ది డిలే" అంటుండగానే కారు ముందు వెళ్ళిపోయింది.
    వసంత గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అన్పించింది. యింటిలోపలికి వెళ్ళగానే తల్లితండ్రి ఆరాటంగా అలశ్యానికి కారణం అడగడం మాలతి హాస్యంగా రాజశేఖరం కారులో డ్రాప్ చేశాడు అంటూ హాస్యం ఆడడం అన్నీ ఆరోజు వసంత సహనాన్ని పరీక్షించాయి. ఆ రాత్రంతా నిద్ర పోకుండా అలోచిస్తుండే తను పిచ్చిగా అందని పండ్లకి అర్రులు చాచటం లేదు గదా అన్న వివేకం మేల్కొలిపింది. ఆతనిక తనమీద ఏం యింటరెస్టు లేదు, వుంటే కనీసం మాటల్లో కాకపోయినా చూపుల్లో చెప్పేవాడు. తను అతాన్ని ఆకర్షించ లేకపోయిందా, తను అప్సరస కాకపోయినా, స్మార్టుగా వుంటుందని అంతా అంటారు, తను అతన్ని కదల్చలేక పోయిందా అసలు తనేందుకిలా ఊహిస్తుంది. పుస్తకాలలో రాసింది నిజజీవితంలో అవుతుందా, పాఠకులని మైమరపించి ఊహాలోకాల్లో ఉయ్యాలలూగించడానికి రాసే కల్పనా సాహిత్యాన్ని తను నిజజీవితానికన్వయించుకోడం పిచ్చిగాదు. ఎక్కడో ఏదో అలా జరుగుతుందని అందరి  జీవితాల్లో జరుగుతుందా! మహా అయితే వాడుకుని వదిలేస్తారు గాని తమ కింద పనిచేసే అమ్మాయితో ప్రేమలో పడి , అది పెళ్ళి దాకా రానిస్తారా తన వెర్రి కాకపోతే, తను చదువుండి జ్ఞానం లేకుండా ఎలా ఆలోచిస్తుంది. తనసలు ఏమాశిస్తుంది, రతన్ లాల్ తనని ప్రేమించాలనా! లేక అతనితో అనుభవం లేని థ్రిల్ల కావాల్సింది. ప్రేమించినా పెళ్ళాడుతాడా! అతనికి తనకి అంతస్థుల్లో తేడా ఆ ప్రేమని పెళ్ళి దాకా రానివ్వడు! మరి ఎందుకు వెర్రిగా ఆకాశానికి నిచ్చెన వేస్తుంది. రాత్రంతా తనని తాను తిట్టుకుంది. తెల్లారి మళ్ళీ ఆఫీసు కెళ్ళేసరికి రాత్రి నిర్ణయాలని మరచిపోయి అతను తనవంక చూస్తాడేమోనని, చూసి ..... తనేం అవుతున్నది తనకే అర్ధం కాని స్థితిలో పడింది వసంత. ఆరోజు నుంచి డల్ గా , నిరుత్సాహంగా వుంది వసంత. వసంత నిరుత్సాహానికి తోడూ యింట్లో పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రసాద్ డబ్బిస్తానన్న దగ్గిర నుంచి వెంకట్రావుగారు సంబంధాల వేటలో పడ్డారు కుదిరితే వసంతకి. మాలతికి యిద్దరికీ కలిపి చెయ్యాలన్న ఉద్దేశంలో వున్నారు. కాస్త మంచి సంబంధాలు కట్నాలిచ్చి చెయ్యాలని సంకల్పం.
    "నాకేం యిప్పటి నించి పెళ్ళి వద్దు" వసంత చిరాగ్గా అంది.
    "నోర్మూయ్ .....ఇరవై మూడు నిండుతున్నాయి. యిప్పటి నుంచి వద్దకపోతే అమ్మమ్మ అయ్యాక చేసుకుంటావా, యిన్నాళ్ళు డబ్బు జతపడక వూరుకున్నాం యిప్పుడింక ఆలశ్యం వీల్లేదు. పెళ్ళి చేసుకున్నాక ఉద్యోగం చేసుకుంటావో మానుకుంటావో నీ యిష్టం. నీ మొగడిష్టం. మా బాధ్యత తీర్చుకుంటే నిశ్చింత మాకు" కాంతమ్మ '
మందలించింది.
    "నాన్న పదివేల దాకా కట్నం యిస్తానంటున్నారు గదే, కాస్త మంచి సంబంధమే చూస్తారు లే" కమల నచ్చ చెప్తున్నట్లంది.
    వసంత యింక రెట్టించకుండా వూరుకుంది. ఆఫీసులో రతన్ లాల్ ప్రవర్తన చూసాక ఏదో నిర్లిప్తత తగా చూద్దాం ఎవడొస్తాడో ఎవరికి నచ్చుతుందో చూద్దాం, అంతగా నచ్చకపోతే అప్పుడే వద్దనచ్చు అనుకుని వూరుకుంది.

 Previous Page Next Page