Previous Page Next Page 
చీకటి తొలగిన రాత్రి పేజి 32


    ఇంకేం మిగిలింది? తిండి, తిరగడం, త్రాగడం , క్లబ్బులలో డాన్సులు, పార్టీలు నా జీవితం . మొగాడ్ని ఆకర్షించే అందం వుండి విచ్చలవిడిగా తిరిగే వంటరి ఆడదాని పవిత్రతని ఎవరూ నమ్మరు! నమ్మక పొతే నాకు వచ్చినా నష్టం ఏముంది? నేను మొండిదాన్ని! ప్రపంచాన్నే, మనుష్యులనే ధిక్కరించి బ్రతుకుతున్న దానికి దేని గురించి భయం.
    రోజులు గడుస్తున్న కొద్ది యీ జీవితం పాతబడి విసుగు పుట్టించసాగింది.
    ఎవరికీ కనపడని లోతయిన గాయం కాలం మందు వేసినట్లు పూడ్చసాగింది. ప్రతీకార వాంచతో భగభగ మండే మనసు మీద కాలం నీళ్ళు చిలకరించి చల్లార్చింది.
    ఆ సమయంలో తారసబడ్డ మీ నలుగురిని చూసిన వేళా విశేషం  ఏమిటో గాని, మమత, మానవత్వం, అనురాగం , ఆప్యాయత అన్న పదాలకి తిరిగి అర్ధాలు స్పురించడం మొదలుపెట్టాయి. ఎక్కడా లభ్యం కాని ఆత్మీయత ఆదరణ మీనించి లభ్యం అవుతాయని ఆశించాను. కాని అది అత్యాశ అయింది. మీరూ పురుషులేనన్న మాట నేను ఎందుకు మరచిపోవాలి? నా నమ్మకాన్ని , నా ఆశని నా కోరికని కూలద్రోశారు మీరు. తక్కిన లోకంతో పాటే కలిసిపోయారు మీరూ! నేనిచ్చిన చనువుని నేచూపిన ఆప్యాయతని, అనురాగాన్ని అపార్ధం చేసికొన్నారు మీరు. ఎన్నో డక్కా మొక్కీలు తిని బండ బారిన హృదయం ఎందుకో యింత చిన్న సంఘటనలకే చలించిపోయింది....నా నమ్మకం ఈ సారి దెబ్బతినడం మానుతున్న గాయాన్ని రేపినట్లయింది. నాలో ఆరిపోతున్న జ్వాల తిరిగి ప్రజ్వరిల్లింది....! ఎంత సరిపెట్టుకుని ప్రతిసారీలాగా రాజీ పడదామన్నా సరిపెట్టుకోలేక పోయాను. ఎన్నోసార్లు ఎన్ని విషయాలలో ఓటమి ఎదురయినా నాకు యీ సారి యీ ఓటమి సహించరానిదయింది. బ్రతికి జీవితంలో పోరాడి గెలవడానికి శక్తి సామర్ధ్యాలు కరవయి, బలహీనతలు చుట్టుముట్టి.....అడుగడుగునా ఎదుర్కొంటూ ఎన్నిరోజులు యీ బ్రతుకు నెట్టడం?"
    ఆడదంటే మరే భావమూ పురుషులకి కలగకపోవడం ఓ శాపమేమో . అందుబాటులో వున్న ఆడదంటే ఆశించని వాడేవాడు? పువ్వులాంటి ఆడది ముల్లు లాంటి పురుషుల చేతిలో నలిగిపోయి, హింసలకి, గురి అవడం తరతరాలుగా జరుగుతున్నదే'! కానీ, చిత్రమేమిటంటే ..........ఏ ముళ్ళయితే హింసిస్తాయో, ఆ ముళ్ళ కంచే పువ్వుకి శ్రీరామ రక్షా అయి కాపాడడం చిత్రం గాదూ! ఆ ముళ్ళ కంచే అనే మగవాడే ఆడదానికే అండ అయి కాపాడడం సృష్టి చిత్రమే గాబోలు! ఆ ముళ్ళ కంచె అడ్డుగా లేకపోతే ఆ పూవుని సజీవంగా ఒకరోజయినా వుంచుతారా? రోడ్డున పోయే ప్రతివాడికి అందమైన ఆ పువ్వు మీదే దృష్టి! ఆఖరికి నోరేరగని పశువులు కూడా ఆ నవనవ లాడే పువ్వుని మొక్కతో సహా పీకేస్తాయి , నా జీవితం అంతే!
    ప్రతిక్షణం ఆపదల బారి నుంచి తప్పించుకోడానికి నాకే ముళ్ళ కంచే అండ లేదు. అందుకే అనుక్షణం ఎదురయ్యే ఆపదల నుంచి నన్ను నేను రక్షించుకోడానికి, పోరాడడానికి నాకింకా ఓపిక లేదు! ఎప్పటికైనా సుకుమారమైన పువ్వు కంటకం ముందు తల ఒగ్గవలసిందే! గెలుపు ముల్లుదే. ఓటమి పువ్వుదే! అంచేతే ఓడిపోయి వెళ్ళిపోతున్నాను.....శెలవు! నేను లేని తర్వాతనయినా నన్ను సోదరిగా గుర్తించి , బ్రతుకులో ఓడిపోయి పారిపోయిన అక్కకి ఒక్క కన్నీటి బొట్టు అయిన తన కోసం కార్చే వారున్నారంటే ఆమె ఆత్మకి శాంతి.
    మీ నల్గురు సుఖసౌఖ్యాలతో భావిజీవితం గడపాలని నా ఆఖరి కోరిక! ప్రార్ధన! మళ్ళీ జన్మలోనయినా ఇంత వంటరి జీవితం ప్రసాదించవద్దని ఆ భగవంతుడిని వేడుకుంటాను ------ శెలవు ------! రమాదేవి---
    శర్మ చేతుల్లో మొహం దాచుకున్నాడు కళ్ళు నిండుకోగా!
    "మనమే చంపేశాం. మనమే ఆవిడని నిలువునా హత్య చేశాం" బలవంతంగా ఆమె ప్రాణాలు తీసేశాం"  ఆవేదనగా కళ్ళు తుడుచుకున్నారు నల్గురూ.

            
                                                                                -------***--------

 Previous Page Next Page