Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 32


    "ఎగ్జాట్లీ... యూ ఆర్ కరెక్ట్ మిస్టర్ అన్వేషి- విశ్వాత్మ చేసిందదే. తన ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ మేధస్సును ఒక తపస్సులా వినియోగించి, తనకు నమ్మకస్థులైన ఇంజనీర్ల సహాయంతో విశ్వాత్మ క్రిప్టోగ్రాఫ్ అనే ఒక మిషన్ ను రూపొందించారు.

 

    కేవలం తనకు మాత్రమే తెలిసే విధంగా ఒక కోడ్ ను క్రిప్టోగ్రాఫ్ మెషిన్ లో సృష్టించి, వాటి బ్లూ ప్రింట్స్ ను నాశనం చేశారు. ఆ మెషిన్లో లీనమై వున్న కోడ్ దాదాపు కాలగర్భంలో కల్సిపోయినట్టే లెక్క. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ కోడ్ ను కనుగొనే శక్తి లేదు- ఒక్క విశ్వాత్మకు తప్ప, అదీ అతనికి మరో జన్మంటూ వుంటే- అయితే మాకు మాత్రం వుంటే- గింటే లాంటి సందేహాలు లేవు. ఆయన ఖచ్చితంగా తిరిగి జన్మిస్తారు. దానికి తిరుగులేదు" అన్నాడు మిత్ర ఎంతో విశ్వాసంతో.

 

    "ఎక్స్ క్యూజ్ మి సర్?" అంది శృతి.

 

    "ఎస్... ఎనీ డౌట్?" అడిగాడు మిత్ర.

 

    "దాదాపు ముప్పై ఏళ్ళక్రితం కన్నా సైన్స్ ఇప్పుడు ఎంతో పురోభివృద్ధిని, ఎన్నో అద్భుతాలను సాధించింది. విశ్వాత్మ సేఫ్ చేసి వుంచిన కోడ్ ను ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుగొనడం అసాధ్యం కాకపోవచ్చేమో-" తన పెదాల కదలికలను తదేకంగా చూస్తున్న అన్వేషిని గమనించనట్లు అడిగింది శృతి.

 

    ఆ మాటకు భుజాలెగరేశాడు మిత్ర.

 

    "బ్రహ్మంగారి కాలజ్ఞానం లోతుల్ని, నాస్ట్రడామస్ ప్రొఫెట్స్ లోని అంతరార్ధాల్ని, బేలూరులోని గాలిలో తేలే రాతిస్థంభంలోని మర్మం, హంపీలోని సరిగమపదనిస స్థంభాల్లో ధ్వనించే సంగీతపు సంకేతాల గురించి, బొర్రా గుహల్లో ఏర్పడిన శివలింగాల గురించి ఎన్నివేల ఏళ్ళయినా ఎందుకు తెలుసుకోలేక పోయారు?

 

    విశ్వాత్మ తీసుకొన్న నిర్ణయం ఎంత విచిత్రమైందో, దానిపట్ల చూసిన కృషీ, పట్టుదల అంతే. అసాధారణంగా కనిపిస్తాయి.

 

    విశ్వాత్మ తన ప్యాలెస్ లోని అంతర్భాగంలో రెండు గదుల్ని పటిష్టంగా నిర్మించారు. ఆయన రూపొందించిన క్రిప్టోగ్రాఫ్ మెషీన్ లో... అయ్ మీన్... కంప్యూటర్ లో కొన్ని ప్రశ్నల్ని, వాటికి సరైన సమాధానాలను ఫీడ్ చేశారు. దాన్ని ఆపరేట్ చేయగానే ప్రశ్నలకు సంబంధించిన ఫైల్ ఓపెన్ అవుతుంది. వాటికి జవాబులను సరిగ్గా ఫీడ్ చేస్తేనే అసలైన కోడ్ వస్తుంది.

 

    ఒకవేళ జవాబుల్ని తెలుసుకోవాలని ముందుగా ప్రయత్నించి ఫైల్ ఓపెన్ చేశామంటే, ప్యాలెస్ తో సహా మొత్తమంతా భూకంపం వచ్చి కూలిపోతుంది"

 

    "ఎందుకలా?" అడిగాడు అన్వేషి విస్తుపోతూ.

 

    "ఎందుకంటే విశ్వాత్మ క్రిప్టోగ్రాఫ్ మిషన్ కు శక్తివంతమైన ఎక్స్ ప్లోజివ్ అమర్చాడు కాబట్టి" సిగరెట్ యాష్ ట్రేలో వేస్తూ అన్నాడు మిత్ర.

 

    ఎందరో మేధావుల గురించి విన్నాడు- వారి గురించి చదివాడు- కానీ, అప్పుడెప్పుడూ పొందని విచిత్రమైన, ఇది అని చెప్పలేని అనుభూతికి లోనయ్యాడు అన్వేషి, ఇన్ స్క్రూటబుల్ మెంటాలిటీ. సంక్షిష్టమైన మనోస్థితి విశ్వాత్మ స్వంతం.

 

    "అంటే ప్రపంచం మొత్తంమీద ఇది ఎనిమిదవ వింతలా మిగిలిపొతుందన్న మాట" అన్నాడు అన్వేషి క్రమంగా తేరుకుంటూ.

 

    "అఫ్ కోర్స్- క్రిప్టోగ్రాఫ్ కోడ్ ను కనుక్కోవడం అంత సులభం కాదు- కనుక్కోవాలని వచ్చిన వ్యక్తి ముందు కంప్యూటర్ ను సరిగ్గా ఆపరేట్ చేయాలి. ఆ తర్వాత ఆ ప్రశ్నలకు సరైన జవాబులివ్వాలి.

 

    ఆ తర్వాత ఫౌండేషన్ ట్రస్టీలచే కొన్ని టెస్టులుంటాయి. వీటన్నిటి కన్నా ముందు, ఎక్స్ ప్లోజివ్స్ ప్రమాదాన్ని కూడా అధిగమించాల్సి వుంటుంది.

 

    ఒకవేళ ఇవన్నీ చేసినట్లయితే, విశ్వాత్మ ఫౌండేషన్ కు చెందిన ఆస్థి మొత్తం అతని పరమవుతుంది. అంటే అతను పునర్జన్మ పొందిన విశ్వాత్మగా నిర్ధారిస్తారన్న మాట" నిట్టూరుస్తూ అన్నాడు మిత్ర.

 

    "నాదో చిన్న డౌట్ సార్" అంది శృతి.

 

    తను సీరియస్ గా చెప్తున్నప్పుడు శృతి డిస్ట్రబ్ చేయడం మిత్రకు నచ్చలేదు- అందుకే అతను అసహనంగా ఆమెకేసి చూస్తూ-

 

    "ఏమిటి?" అని అన్నాడు.

 

    "ఏం లేదు. చనిపోయిన మనిషి ఆత్మ ఏ రూపంలో తిరిగి జన్మిస్తుందో తెలీదు. విశ్వాత్మ మగవాడుగానే జన్మిస్తాడనే నమ్మకం ఏమిటి? యువతిగా జన్మిస్తే... రూల్స్ ప్రకారం ఆమెకు ఆ ఆస్తినిస్తారా?"

 

    శృతి సరదాకోసం ఆ ప్రశ్న అడిగినట్లనిపించినా, అందులో లాజిక్కు లేకపోలేదనిపించింది మిత్రకు. కానీ దానికి తమ వద్ద కూడా సమాధానం లేదు.

 

    "గుడ్ క్వశ్చన్, పూర్వజన్మలో నేనే విశ్వాత్మనని, క్లయిమ్ చెయ్యడానికి ప్లాన్ వేస్తున్నావా?" నవ్వుతూ జోక్ వేశాడు మిత్ర.

 

    ఆ జోక్ కి శృతితో పాటు అన్వేషి కూడా నవ్వాడు.

 

    అన్వేషి నవ్వును తదేకంగా చూసిన శృతి, ఈ డిటెక్టివ్ గారి పర్సనాలిటీయే కాదు, నవ్వు కూడా చాలా బావుంటుందే అని అనుకొంది లోలోన.

 

    "నీలాంటివాళ్ళకు ఇలాంటి డౌటు వస్తుందనే తను మళ్ళీ మగవాడిగానే జన్మిస్తానని, ఆయన తన డైరీలో రాసుకొన్నాడు. విశ్వాత్మ డైరీలోని కొన్ని భాగాలు, జిరాక్స్ ప్రతులు జ్ఞానభారతి యూనివర్శిటీ లైబ్రరీలో వున్నాయి. ఒకసారి చదవడం మంచిది" అంటూ తన చూపుల్ని శృతి వైపునుండి అన్వేషి వైపు మరల్చాడు డైరెక్టర్ మిత్ర.

 

    "అయితే అందరూ భావించేటట్టు విశ్వాత్మ తన మేధస్సును మాత్రమే ఉపయోగించలేదు. ఈ చిక్కుముడిని సవాల్ గా విసిరేముందు విశ్వాత్మ తన జ్ఞాపకశక్తిపట్ల తనకున్న అపారమైన నమ్మకాన్ని మాత్రమే నమ్ముకున్నాడు...." అన్నాడాయన.

 

    "ఏమిటా నమ్మకం?" ప్రశ్నించాడు అన్వేషి.

 

    విశ్వాత్మ వీలునామాలో మరో అద్భుతమైన క్లాజ్ కూడా వుంది. బహుశా అది నీలాంటి డిటెక్టివ్ లను దృష్టిలో వుంచుకునే రాశాడను కుంటాను" అన్వేషి వైపు చూస్తూ చెప్పడం ప్రారంభించాడు.

 

    "ఒకవేళ విశ్వాత్మ ఆస్తిని ఎవరైనా అడ్డదారిలో కైవసం చేసుకుంటే, అ విషయాన్ని నిరూపించిన వ్యక్తికి 35 కోట్లు బహుమతిగా ఇవ్వబడుతుంది"

 

    కొద్దిక్షణాలు ఆ రూమ్ సూదిపడితే వినబడేంత నిశ్శబ్దంలో మునిగి పోయింది.

 

    "ఫ్రాడ్ జరిగే అవకాశం వుంటుందని వూహించడమే విశ్వాత్మ మేధస్సుకు నిదర్శనం. అంతేకాదు ప్యాలెస్ చుట్టూ గట్టి భద్రతా ఏర్పాట్లు వుండేలా జాగ్రత్తపడ్డాడు. అందుకే ప్యాలెస్ చుట్టూ రాత్రి పగలు సుశిక్షితులైన సైనికుల్లాంటి గార్డ్స్ ను కాపలాగా నియమించడం జరిగింది...."

 

    మిత్ర మాటల్లో విశ్వాత్మ ఫౌండేషన్ పట్ల అతనికున్న సిన్సియారిటీ, దృఢ సంకల్పం అన్వేషిని దాదాపు ఆశ్చర్యంలో ముంచి ఆకట్టుకున్నాయి. తను నిర్వర్తించబోతున్న బాధ్యత సామాన్యమైంది కాదని మొట్టమొదటిసారిగా తెలుసుకున్నాడు అన్వేషి.

 

    విశ్వాత్మ ఆలోచన, నమ్మకం ఆధునికశాస్త్ర విజ్ఞానానికో సవాల్ లాంటిది. అసలింతవరకు ప్రపంచంలో ఇలాంటి ఆలోచన, ఆశాభావం ఎవరికీ వచ్చి వుండదు. కనుకే ప్రపంచవ్యాప్తంగా విశ్వాత్మ వీలునామా పెద్ద చర్చనీయాంశమై పోయింది.

 Previous Page Next Page