వేగంగా ఎమర్జన్సీ ఎనౌన్స్ మెంట్ సెల్ దగ్గరకు నడిచి "ఆ ప్లయిట్ ఆపుచేయించాలి. చాలా అర్జెంట్ ప్లీజ్ " అన్నాడు ఆందోళనగా.
"సారీ ఇప్పటికే లేట్ అయింది....." అంటూ విసురుగా లేచాడు ఎనౌన్సర్.
మనోహర్ లో బాధ, కసి, ఉద్వేగం కలగలిసిపోయి అతన్నో ఉన్మాదిని చేశాయి 'షిట్' అంటూ రన్ వేమీద పరిగెడుతున్న ప్లయిట్ ని నిస్సహాయంగా చూస్తుండిపోయాడు.
అదెంతోసేపు లేదు. వెంటనే తేరుకొని కలకత్తా వెళ్ళేందుకు నెక్ట్స్ ప్లయిట్ కోసం ఎంక్వయిరీ కౌంటర్ వేపు నడిచాడు.
మరో మూడు గంటలకు ఓ ప్లెయిట్ వుందని తెలిసి నీరసంగా వచ్చి లాంజ్ లో కూర్చున్నాడు. అంతలో మంగళ గుర్తుకొచ్చింది ఈ సమయంలో మంగళ ప్రక్కనుంటే బావుండనిపించింది మనోహర్ కి.
వెంటనే ఫోన్ దగ్గరకువెళ్ళి హైదరాబాద్ కి ఫోన్ చేశాడు.
ఫోన్ లో వెంటనే మధు దొరికాడు. అందరూ బావున్నారంటూ ఆఖరున చెప్పినమాట మనోహర్ నవనాడుల్ని స్థంభింపచేశాయి.
ఎలా? ఎలా జరిగింది......?
రోమా ఎలా చనిపోయింది? అది హత్య అని చెప్పిన మధు మాటలు మనోహర్ ఒడల్ని జలదరింప చేశాయి.
వెంటనే కలకత్తా ట్రిప్ మానుకొని హైదరాబాద్ ప్లయిట్ ఎక్కేశాడు మనోహర్. ఎక్కేముందు ఏ వ్యక్తి కలిసి పదిలక్షల రూపాయల చెక్ ఇచ్చాడు ప్రదీప్ కి ఇమ్మంటూ. అదే సమయంలో కలకత్తా వెళ్ళే ప్లయిట్ లో వున్న తరంగిణి బాధతో మెలికలు తిరిగిపోతోంది, అతి బలవంత మీద ఆపుకోగలుగుతుంది.
మరో గంటలో ఇంజక్షన్ తీసుకోకపోతే తన పరిస్థితి దారుణంగా ఉంటుంది.
అంత బాధలోనూ అందంగా, స్వచ్చంగా, నిజాయితీగా కనిపించే మనోహర్ మొఖం తరంగిణి కళ్ళముందు లీలగా కదలాడింది. అంతలోనే మనోహర్ అంటే భయంకూడా వేసింది.
తనను వేటాడటం వలన అతనికి ప్రయోజనం? ఓ క్షణం విక్రమ్ మీద కూడా కోపం వచ్చింది.
* * *
హైదరాబాద్ లో ప్లయిట్ దిగగానే సరాసరి మాలాసౌధాకి వెళ్ళాడు మనోహర్. బాస్ ఆఫీసుకి వచ్చాడని తెలియగానే అందరూ అలర్ట్ అయిపోయారు. రోమా మరణవార్త అందరికీ తెలిసిపోయి హడలిపోతున్నారు. మనోహర్ ఆఫీసులో వర్క్ చేస్తుంటే ప్రదీప్ తమనికూడా చంపేస్తాడన్న భయం ప్రతి ఒక్కరిలోనూ గూడుకట్టుకొంది.
మనోహర్ సీట్లో కూర్చోగానే మధుకి కబురుపెట్టాడు.
మధు ఆతృతగా వచ్చాడు____తరంగిణి తీసుకొచ్చుంటాడనే ఆశపెద్దగా లేకపోయినా అసలు లేకపోలేదు.
అలసటగా, నిర్వికారంగా వున్న బాస్ మొఖం చూడగానే అర్ధమైపోయింది మధుకి.
"ఏం జరిగింది? రోమా ఎలా చనిపోయింది? రోమా కావాలనే ప్రదీప్ వర్గంలో చేరింది కదా?" మనోహర్ గొంతు జీరబోయింది.
రోమా చావు బాగా కృంగదీసింది మనోహర్ ని తను పందెంలో గెలవాలనుకుంటున్నాడేగాని అందులో మరొకరు పావులు కావటం ఇష్టం లేదు మనోహర్ కి.
"బంజారాహిల్స్ లో ప్రమాదకరమైన కొండచరియళ దగ్గర ఫిల్మ్ షూటింగ్ ఏర్పాటు చేశారు. రోమా ఒక్కటే మోడల్ షూటింగ్ లో ఆమెను కొద్దికొద్దిగా కొండ చివరకు వెళ్ళమంటూ వచ్చారు. కొండ చివరిరాయిమీద కాలుపెట్టగానే అది దొర్లిపోయి ఆమె అగాధంలో పడి చనిపోయింది."
అది వినగానే గుండె, గొంతు చిక్కబడినట్లయింది మనోహర్ కి,
"మరి హత్య అని ఎలా చెప్పగలవు......?"
"అది ప్రదీప్ యాక్సిడెంటల్ అని పోలీసుల్ని నమ్మించి ఫైల్ క్లోజ్ చేయించాడు. నాకెందుకో నమ్మబుద్ధిగాక పోలీస్ స్టేషన్ కెళ్ళి ఫైలంతా చదివాను. కొన్ని వందల సంవత్సరాలు స్థిరంగా వుండే పెద్ద పెద్ద బండలు స్థిరంగావుండి, ఏ కొద్ది ఆధారంలో సైతం గరిమనాభి స్థానాన్ని కల్గిఉంటుంది. అందుకే అనుమానం వచ్చి ఓరాత్రి నేను, చందూ వెళ్ళి లోకేషన్ షూటింగ్ స్పాట్ చెక్ చేశాం. ఎవరో పెద్ద పలుగుతో ఆ స్పాట్ లో బలంగా వున్న అడుగున బాగా కదిలించారు. ఆ మరుసటి రోజే షూటింగ్ జరిగింది? వర్షం కురవటం వలన ఎవరో కెలికినట్లుగా పోలీసులకు అనుమానం రాలేదు."
పళ్ళు పటపట కొరకాడు మనోహర్.
రూపా కొద్దిలో చావు నుంచి తప్పించుకున్నా___రోమా బలయిపోయింది.
కొద్దిసేపు పైల్స్ అవీ చూసి లేవబోతుండగా చందూ వచ్చాడు. "మంగళ మేడమ్ కమలిని గారింటినుంచి వారి బంధువుళ ఇంటికి వెళ్ళానని చెప్పమన్నారు మీరొస్తే" అన్నాడు.
ఓ క్షణం అర్థంకాలేదు. మంగళ కమలిని ఇంటినుంచి ఎందుకు వెళ్ళిందో!
"చందూ! ఆ అడ్రస్సు కెళ్ళి నేనొచ్చాననిచెప్పి మంగళను టాక్సీలో తీసుకురా" అంటూ ఓ స్లిప్ ఇచ్చాడు చందూకి.
కారు బయలుదేరింది.
మధుకి ఏది అడగాలన్నా భయంగా వుంది.
మనోహర్ మొఖం రక్తం చిమ్ముతున్నట్లుగా వుంది. కళ్ళు క్రోధంగా వున్నాయి.
"ఫిల్మ్ మేగజైన్స్ వచ్చాయా?" మనోహర్ అడిగాడు.
"వచ్చాయి సార్."
"ఎక్స్ పోజర్ వార్నింగ్, క్లోజప్ లెన్స్, స్ల్పిట్ ఇమేజ్ లెన్స్, లైట్ ఇండికేటర్, ట్రాలీ, ట్రాలీప్లాట్ ఫారమ్, పెన్ టాక్స్ కెమేరా, ఎక్ట్రా క్రోమ్ (EKTRA CHROME) 100 ఆసా (ASA) బ్లాక్ అండ్ వైట్ ఒక పాతిక, కలర్ ఒక పాతిక ఫిల్మ్ రీల్స్ , ఏరీ ప్లెక్స్ 35 ఎమ్. ఎమ్ మూవీ కెమేరా___అన్నీ గుర్తు పెట్టుకొని సిద్దం చేయి.
కాపీ రైటర్ స్ర్కిప్ట్, విజువలైజర్ ఆల్బమ్ కూడా దగ్గరే పెట్టుకో........"
మనోహర్ మొహంలో పట్టుదల స్పష్టమవుతోంది. తరంగిణి దొరకలేదు.......ఒకప్రక్క ప్రదీప్ కల్గించే చికాకులు. అయినా వేటికి చలించక స్థిరంగా షూటింగ్ కి సిద్దమవుతున్న మనోహర్ ని చూస్తుంటే తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపించింది మధుకి.
కారు దిగి ఇంట్లోకి వెళ్ళేసరికి, మంగళను తీసుకొని చందూ వచ్చేశాడు. మనోహర్ ని చూసిన మంగళ హృదయం ద్రవించిపోయింది. పిచ్చివాడిలా వున్నాడు. గడ్డం పెరిగింది___కొద్దిగా చిక్కిపోయాడు, మొహం చాలా అలసటగా జ్వరం వచ్చినవాడిలా వున్నాడు.
తన మనూని ఇబ్బందుల్లో పడేసిన ప్రదీప్ మీద విపరీతమైన కోపం వచ్చింది మంగళకు. అంతకు ముందే చందూ చెప్పగా తెలిసింది, రోమా చనిపోయినట్లు.
తరంగిణి దొరికినట్లుగా లేదు.
"మధు......ప్రదీప్ కివ్వమని బివాష్ ముఖర్జి చెక్ యిచ్చాడు, పది లక్షలకు. నీ తెలివితేటలు ఉపయోగించు....." అంటూ చెక్ అందించాడు మర్మగర్భంగా చూస్తూ.
"చందూ ఎయిర్ పోర్టుకెళ్ళి శాలిని పాటిల్ ని కలిసి కలకత్తాకి ఒక టిక్కెట్ రిజర్వ్ చేయమను, క్విక్ అర్జంటుగా అయిపోవాలి....."
"మధు, చందూ ఇద్దరూ బయటకు వెళ్ళిపోయారు. సర్వస్వం కోల్పోయిన వాడిలా వున్న మనోహర్ ని దగ్గరకు తీసుకొని లాలించాలని వుంది మంగళకు.
మనోహర్ పరిస్థితి అలాగే వుంది.
మంగళ పడిలో పేదతీరాలని ఆరాటంగా వుంది.
కొంతసేపు ఎవ్వరూ మాట్లాడుకోలేదు. తుఫానుముందు ప్రశాంతత వారిద్దరి మధ్య చోటు చేసుకుంది.
ముందుగా తేరుకున్న మంగళ వెళ్ళి మనోహర్ ని ఆర్తిగా తన గుండెలకేసి హత్తుకుంది. ఆమె నడుంచుట్టూ చేతులు వేసి ప్రశాంతత పొందే ప్రయత్నంలో వుండగా మంగళ అడిగింది హఠాత్తుగా "మనూ! ఈ పందెం నుంచి విరమించుకోలేవా?"
ఉలిక్కిపడి మంగళను వదిలేసి వెర్రిగా చూశాడు.
"అసాధ్యం మంగళ" అన్నాడు స్థిరంగా.
"ఆ మాటకు ఒకింత బాధపడిన మంగళ "ఇన్ని కష్టనష్టాల్ని ఎదుర్కొంటూ ఎలా నెగ్గుకు రాగలవు....?"
"నెగ్గుకు రాగలను చూస్తుండు" పట్టుదల, కసి అణువణువున మనోహర్ లో అనూహ్యమైన స్పందన పుట్టిస్తున్నాయి.
"ఈ గొడవలకు అన్నిటికి దూరంగా మనం వాల్తేరు వెళ్ళిపోయి సెటిల్ అవుదాం. కావాలంటే అక్కడే నువ్వో స్టూడియో పెట్టుకుందుగాని........"
పిచ్చిదాన అన్నట్లు నవ్వాడు మనోహర్.
"ఎంత తేలిగ్గా ఊహించావు.......ఎంత తక్కువ అంచనా కట్టావు నన్ను........అది నన్ను రక్షించుకోవాలనే ప్రేమతో ఆరాటంతో నువ్వు చేస్తున్నా పొరపాటా? ఒక సాధారణ పాస్ పోర్ట్ ఫోటోలు తీసే ఎమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ తో పోల్చావా? నన్ను" బాధగా అన్నాడు.
సౌమ్యంగా అన్నా చాచి చెంపకాయ కొట్టినట్లయింది మంగళకు. అంతలోనే సర్దుకుంది.
"రూపా కొద్దిలో చావు తప్పించుకుంది. రోమాకౌర్ దారుణంగా చంపబడింది. ఇంకెంతమందో......ఈ ప్రమాదాలు నిన్ను మాత్రం వదులు తాయని ఎలా చెప్పగలవు......?"
"వదలకపోవచ్చు. ఈ చాలెంజ్ లో నేనూ పోవచ్చు. అయినా నేను వెనకడుగు వేయను........." స్థిరంగా వున్నాయి మనోహర్ మాటలు.
"నీకు నీ ప్రాణం అంటే లెక్కలేకపోవచ్చు-కాని నిన్ను నమ్ముకున్న నాకు........"
మాట్లాడలేదు మనోహర్.
దాన్ని మరోరకంగా అర్ధంచేసుకున్న మంగళలో రాక్షసత్వం చోటు చేసుకుంది.
"నీవరకే నువ్వే చూసుకున్నా, నిన్ను నమ్ముకున్నవార్ని పట్టించుకాకపోయినా, నీకు ప్రేమ, పెళ్ళి, అనుబంధాలు అనవసరం....."
"అంతమాట అంటుందని వూహించని మనోహర్ దెబ్బతిన్న పక్షిలా విలవిల లాడిపోయాడు. ఆమాట అని మనూని బాధపెట్టానా అని ఓ క్షణం మంగళకు అనిపించినా నిర్లక్ష్యంగా తీసుకుంది.
"మంచికో చెడుకో ఈ చాలెంజ్ లో గొంతువరకు కూరుకుపోయాను. ఇప్పుడు నేను వెనుదిరిగి నన్ను ప్రదీప్ వదులుతాడని నమ్మకం లేదు. పిరికివాడిలా కష్టం వచ్చిందని పారిపోను. చావో, బ్రతుకో తేలిపోవాలి. నన్ను ఘోరంగా అవమానించిన ప్రదీప్ ని, నా శక్తి సామర్థ్యాల్ని కించపర్చిన ప్రదీప్ ని, వదలగలిగినా నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల్ని నాశనం చేయ ప్రయత్నించిన ఆ దుర్మార్గుడ్ని వదలను. రాక్షసుడిలా అమాయకురాలైన రోమాని చంపేసినవాడ్ని అసలు వదలను.
ఇవన్నీ కాదనుకున్నా యాడ్ వరల్డ్ కి చీడపురుగైనా వాడ్ని అంతకంటే వదలను. నేను గెలిచి వాడ్ని గెంటి వృత్తికి మంచిరోజులు రావాలని ఆశపడుతున్నాను......" ఆవేశంతో మనోహర్ వణికిపోతున్నాడు.
"మరి నా సంగతి?"
"నువ్వు నన్నర్ధం చేసుకుంటావనుకున్నాను. అది లేకపోగా.....నన్ను మామూలు మనిషిగానే గుర్తించావు అదే నా బాధ. సవాలక్ష మందిలో ఒకడ్ని కావాలనుకొనే వాడ్ని కాదు నేను. అందరిలా చదువుకొని, ఆ చదువుతో ఉద్యోగం తెచ్చుకొని, పెళ్ళి చేసుకొని, పిల్లల్నికని, వార్ని పెంచి మరలా వారు చదువుకొని___ఇలాంటి అతి సాధారణమైన జీవితాన్ని నేను కోరుకుంటే ఇంత రిస్క్ , ఇన్ని కష్టాలు పడక్కర్లేదు.
ఏదో సాధించాలి......నలుగురు చేయలేంది నేను చేయాలి, నాక్రియేటివిటీతో యాడ్ వరల్డులో అత్యద్భుతాలు సృష్టించాలనుకుంటున్న నన్ను కేవలం ఒక సాధారణమైనవాడిగా లెక్కించి నీ వెంటవచ్చి స్టూడియో పెట్టుకోమని అనగలిగావు...."మనోహర్ లో బాధ సుళ్ళు తిరుగుతోంది.