మరీ ఎత్తుగా మంట రాలేదు. కొద్దిగా మండినట్లే మండి ఆరిపోయింది. దాని స్థానంలో పొగ బయలుదేరింది సన్నసన్నగా.
"వెరీగుడ్, ఇలా కొద్దికొద్దిగా కిరసనాయిలు రాచి మంట చేస్తుంటే తలుపులోంచి తను బయటపడే దారి వస్తుంది... నందితాదేవి సంతోషంగా అనుకుంటూ వుండగానే వూహించని మరో ప్రమాదం వచ్చిపడింది. "ఆరి భగవంతుడా" అనుకుంది తెలివితెచ్చుకుంటూ.
గబుక్కున నీళ్ళు తలుపుమీద కొట్టింది.
కిటికీలు తలుపులు అన్నీ బంధించబడి వున్నాయి. మంట ఆరింతర్వాత బయలుదేరిన పొగ గదిలో కొద్దిగానే కమ్ముకుంది. ఆ కాస్త పొగకే వుక్కిరిబిక్కిరి అయినట్లు అయి కోరుకీ వచ్చింది. కిటికీ, తలుపులు తెరిస్తే పొగ బయటికి పోతుంది. ఇంటి తలుపులు తాళంవేసివుంది. కిటికీలోంచి పొగవస్తుంటే అది ఎవరికంటనైనా పడితే, బస్. కధ మొదటికొస్తుంది. అది మరో ప్రమాదం.
చాలా కొద్దిగా తెరిచీ తెరవనట్లు కిటికీ తలుపు తెరిచిపెట్టి- వంటగదిలోంచి మధ్య గదిలోకి వచ్చి వంటగది తలుపు వేసింది. జాస్మిన్ శవం మీంచి వాసన బాగానే బయలుదేరింది. గుప్పున చెడువాసన వచ్చి నాసికా రంధ్రాలను తాకింది. రెండంగలలో బెడ్ రూమ్ లో దూరి ఫుల్ స్పీడ్ తో ఫ్యాన్ పెట్టుకుని, తలుపులు వేసుకుంది. బెడ్ మీద బోర్లా పడి దిండులో ముఖం దాచుకుంది.
కొద్దిసేపు వెచ్చని కన్నీటితో తలగడ తడిసిపోయింది.
భారం దిగి మనసు తేలికయింది. కళ్ళు తుడుచుకుంది.
"ఛీ... నేనేనా ఏడ్చేది. తనకి చాలా ధైర్యమని ఫ్రెండ్సు పొగిడేవాళ్ళు, నిజంగా అలాగే వుండేది తను. చీకటంటే భయంలేదు. దెయ్యాలంటే అసలే భయంలేదు. మొగపిల్లలు "ఝాన్సీ రాణీ అంటావా, రుద్రమదేవి అంటావా" అని తను వినేటట్లు, ప్రశ్నలేసుకునే వాళ్ళు. ఆ మాట తన్ని గురించి అని తెలుసు. అయినా తెలీనట్లు అడిగేది. ఆ యుద్ధంలో పాల్గొన్నది ఆ యిద్దరూ కాదండీ. రజియా సుల్తానా అనుకుంటాను యామై కరెక్టు."
కంగుతిన్నట్లు అయేది అబ్బాయిలకి. ఏ యుద్ధమో ఏమిటో వాళ్ళు అనుకున్నది లేదు. అందుకే "కరెక్టు- కరెక్టు" అనేవాళ్ళు.
"ఎంత ధైర్యమే నీకు" స్నేహితురాళ్ళ పొగడ్త. అలాంటి తను ఏడుస్తున్నది. ఏడ్చే పరిస్థితిలోనే చిక్కుకుంది కాబట్టి ఏడ్పు వచ్చింది ఎంత కష్టమొచ్చినా ఏడ్వనని ఏటికి ఎదురీదగలనని అనుకుంది ఇప్పుడు...
"ఛత్, నేనేమిటి పిరికిపందలా ఏడ్వటం ఏమిటి? ధైర్యం నా సొత్తు. సాహసం నా ఊపిరి అని ఆనాడు ప్రతిజ్ఞ చేశానే- అది ఏమయింది? శక్తి- ఆ శక్తిని నడిపే నాయకుడు. ఇంక నేను కన్నీళ్లు పెట్టుకోకూడదు"
"శక్తి" తలుచుకోగానే అమిత శక్తి వచ్చింది. బుర్ర వేగంగా పనిచేయటం ప్రారంభించింది. పడుకున్నదల్లా లేచి రంగంలోకి దిగింది.
ముందు గదిలోకి వెళ్ళి లైటు వేసింది. జాస్మిన్ మరణిస్తూ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఇంట్లో వున్న డెట్టాల్ సీసా తెచ్చి కొద్ది నీళ్ళలో కలిపి శవం మీద, ఆ గదిలోనూ చల్లింది. సుగంధద్రవ్యాల కోసం వెతికితే కలరా వుండలు, సెంటు సీసా దొరికాయి. సెంటుసీసా అలాగే వుంచి కలరా ఉండలు పొడికొట్టి శవం చుట్టూ చల్లింది. అప్పటికే చీమలు రెండు బారులుగా శవం కింద దుప్పటిలోకి వెళుతున్నాయి. రాజకోటలోకి బారులుతీరి ఒక క్రమంలో వెళ్ళే సిపాయిల్లాగా.
తన సూట్ కేసు కాక ఎయిర్ బ్యాగ్ జాస్మిన్ ది తీసుకుంది. బుక్ షెల్ఫ్ లో వున్న "సిగ్నల్" అనే నవల తీసుకొని బ్యాగ్ లో పెట్టుకుంది. జాస్మిన్ శవం ఇప్పటికే భయంకరంగా మారిపోయి వుంటుంది. అందుకే దుప్పటి కొద్దిగా తొలగించి చెయ్యి దుప్పట్లోకి పెట్టి జాస్మిన్ చేతిని అందుకుంది. కొద్ది ప్రయత్నం మీద ఉంగరం లాగగలిగింది వేలినుంచి. అలాగ తనకి పనికివస్తాయి అనిపించే కొన్ని వస్తువులని కూడా తీసుకుంది. బ్యాగ్ సర్దేసింది. లైటు అర్పేసింది.