బెడ్ రూమ్ తలుపు వేసి కిచెన్ లోకి వెళ్ళి ఇటు తలుపులు వేసుకుంది.
అప్పుడు కనిపించింది నందితాదేవికి ఓ అద్భుత దృశ్యం.
వంటింట్లో పొగ బయటకెళ్ళింది. తలుపు కాలినచోట నల్లగా మది వుంది. అలా కాలిన చెక్కమీద కత్తితో గీకితే పెచ్చులు లేస్తాయి తేలిగ్గా. కూరలు తరిగే చాకుతో తలుపుమీద గీకింది. నల్లగా మాడిన పెచ్చు లేచివచ్చి తర్వాత మళ్ళీ గట్టి చెక్క మిగిలిపోయింది. "రాత్రిపూట అయితే తలుపు కాల్చటం తేలిక. అర్ధరాత్రి పొగ ఎవరి కంటా పడదు. రాత్రి దాకా వుంటే శవంమీంచి యింకా దుర్గంధం బయలుదేరి అన్ని తలుపులూ మూసివున్న ఇంట్లో తను భరించలేదు. ఇంటి చుట్టూ చెట్లు వున్నాయి కాబట్టి పెరటివేపు తలుపులలోంచి తను బయటపడటం పగలయినా పెద్ద కష్టం కాకపోవచ్చు. సాధనమున పనులు...
నందితాదేవి వంటగదిలో అన్నీ వెతికింది. ఇంట్లో పంపు లేదు. అరబిందెడు నీళ్ళు మాత్రమే వున్నాయి. పంపు పెరట్లో వున్నట్లుంది. బాత్ రూంలో పెద్ద బక్కెట్ నీళ్ళు వున్నాయి. స్నానం చేసినా జపం చేసినా అవసర నిమిత్తం అయినా ఆ బక్కెట్ నీళ్ళే గతి. ఫ్రిజ్ లో ఐస్ వాటర్
తయారుకావటానికి నాలుగు సీసాలలో నీళ్ళు ఉన్నాయి. కొద్దిగా ఐస్ వుంది. కాల్చిన తలుపు చల్లార్చటానికి సర్వం ఈ నీళ్ళతోనే కానివ్వాలి.
"చస్తుంటే సంధ్య మంత్రం అన్నట్లు దిక్కుమాలిన ఆకలీ ఇప్పుడేనా?" కడుపులో భగ్గున మండుతుంటే విసుక్కుంది. తీరుబడిగా రెండు యాపిల్ కాయలు తిని మళ్ళీ తలుపునికాస్త తగలెట్టి పొగ ఎక్కువ చుట్టుకోకుండా కిటికీ కొద్దిగా అలాగే తెరిచివుంచి బెడ్ రూంలోకి వచ్చింది.
ఆ మధ్యాహ్నం పళ్ళు, బిస్కెట్స్, బ్రెడ్ తిని పెరుగు తిన్నది. బిందెలో రెండు చెంబుల నీళ్ళు బొక్కెనలో సగానికి, రెండు బాటిల్స్ ఐసు వాటరు మిగిలాయి సాయంత్రం అయ్యేప్పటికి. అంతేకాదు మనిషి దూరేంత సందు తలుపుకి చేయగలిగింది. సెంటు పూసిన గుడ్డ ముక్కుకి అడ్డంగా కట్టుకుంది. అయినా శవం మీంచి బయలుదేరిన వాసనకి కడుపులో తిప్పటం మొదలుపెట్టింది.
"అర్ధరాత్రి దాకా దేనికి ఈ ఇంట్లోంచి బయటపడితే మంచిది. ఎనిమిదిన్నరకే ట్రైనుంది. అది అందుకోగలిగితే-"
ఉన్న అరబక్కెటు నీళ్ళతో స్నానం చేసింది. చక్కగా టాయిలెట్ అయింది. మరోసారి గుర్తు తెచ్చుకుని అన్నీ చూసుకుంది! తనకి పనికొచ్చేవి తీసుకుంది. ఒకసారి బయటకెళితే ఇహ ఇంట్లో అడుగు పెట్టేదిలేదు. మరొకసారి జాగ్రత్తకోసం ఆలోచించింది తీవ్రంగా.
అప్పుడు గుర్తుకు వచ్చింది నందితాదేవికి. టాయ్ పిస్టల్ గురించి. ఎవరినయినా బెదిరించటానికి. అపదలోను పనికివస్తుంది అనుకుంది.
టాయ్ పిస్టల్ తో పాటు ఈ తఫా జాస్మిన్ నైట్ గౌను అవసరమొస్తే ధరించవచ్చని గౌను మోడల్ ఆకర్షణీయంగా వుంటే తీసుకుంది. కాలక్షేపానికి ట్రైనులో చదవటానికి "ఛేజ్" నవల తీసుకుంది.
"జాస్మిన్! నిన్ను ఎప్పటికీ మరిచిపోను. నీ అంతిమ కోర్కె నెరవేర్చటానికే బయలుదేరుతున్నాను" జాస్మిన్ శవం దగ్గర నుంచుని అంజలి ఘటించి నెమ్మదిగా పలికింది నందితాదేవి.
తనకి తెలియకుండానే రెండు మంచిపనులు చేసింది. ఒకటి నైట్ గౌను తీసుకోటం. రెండు "ఛేజ్" నవల తీసుకోవటం అదే కాదు. అది టాయ్ పిస్టల్ కాదని నిజందేనని నందితాదేవికి ఏమాత్రం తెలియదు.
వేడిగా ఏమన్నా తాగి ఆ ఇంట్లోంచి బయటకు వెళదామనుకుంటూ వంటగదిలో కాలు పెట్టింది. కరెంట్ పోయింది తడుముకుంటూ వెళ్ళి అగ్గిపెట్టె అందుకొని అక్కడే వున్న కొవ్వొత్తిని వెలిగించింది. వేడివేడిగా బోర్న్ విటా కలుపుకుని తాగింది. ఆ తర్వాతే మొదలైంది నరకయాతన.
కరెంటుపోయి పావుగంటపైన అయింది. ఫ్యాన్ తిరగనందువలన చిరుగాలి కూడా లేదు. ఓ పక్క భరించ రానంత దుర్గంధం మరో పక్క ముచ్చెమటలు. మరో పడి నిముషాలలో నా పని అయిపోతుంది సుమా! అని బెదిరిస్తున్నట్లు కాలుతున్న కొవ్వొత్తిఆఖరిముక్క.