ఈ కేసు విషయంలో పోలీసువారు రాత్రింబవళ్ళు తీవ్రంగా పరిశోధన, విచారణ జరుపుతున్నారు."
నందితాదేవి చదవటం ముగించి ఫోటోవైపు చూస్తూ అంది.
"ఇది అక్క ఫోటో కాదు. నా ఫోటో"
"మీ ఇరువురూ ఒకే పోలికతో వుంటారు. దాదాపు ఆ ఫోటో మీ అక్కదే. ఫోటోలో నీలాగా పడింది."
"కాదు, ఈ ఫోటో నే తీయించుకున్నది. అందుకే నే గట్టిగా చెప్పగలుగుతున్నాను. అక్క ఇంట్లోంచి పారిపోతూ తన ఫోటోలని మాయంచేసి దాయటమో, తనతో తీసుకెళ్ళటమో చేసి వుంటుంది. అక్క ఫోటో లేక నాది వేశారు. పేరు అక్కది-ఫోటో నాది."
"ఐ.సీ. మరొకటి కూడా తడుతున్నది. పేపరుకి ఈ వార్త ఫోటో మీ పెదనాన్నే ఇచ్చి వుంటాడు. మీ అక్కనుగాని నిన్నుగాని పట్టుకోటానికి ఇదో పధకం. ఇప్పుడు మీరిద్దరూ ప్రమాదానికి మరింత దగ్గరయ్యారు. నందిత ఏ పరిస్థితులలో మునిగి ఎలా వుందో భగవంతుడికే తెలియాలి" అంటూ నందితాదేవిని చూసి, "ఓహ్. ఎంత పొరపాటు పనిని చేశాం? నేనూ గమనించలేదు" అన్నాడు రాజు.
"ఏం చేశాము? ఏమయింది?" నందితాదేవి కంగారుపడింది. "నేను ముస్లిం వేషంలో వున్నాను. హోటల్లో రూమ్ తీసుకునేవరకూ నీవూ బురఖాలో వున్నావు. స్నానం చేసిం తరువాత వేషం మార్చావు. కట్టు బొట్టు ఆంధ్ర వనితవని తెలిసిపోతుంది. పైగా పేపరులో ఫోటో కూడా పడింది"
"ఎలా?" నందితాదేవి ముఖం పాలిపోయింది.
"డోంట్ వర్రీ. ఈ హోటల్లోంచి వెళ్ళిపోదాం. గది విడిచి బైటికి రాకు. అవసరమైతే బురఖానే వాడు" రాజు జాగ్రత్తలు చెపుతున్నాడు.
ఎదుటి గదిలోకి దూరిన ఆంధ్ర వనితని గురించి రాజ్ తో చెప్పటం మర్చిపోయింది నందితాదేవి. అతనితో చెప్పినంత మాత్రాన తరుముకొస్తున్న ఆపద తప్పిపోయేది ఎలాగూలేదు. ఈ సత్యం ఇరువురికీ తెలియదు! నిర్భయంగా మాట్లాడుకుంటున్నారు.
మరికొన్ని గంటల తర్వాత వీళ్ళ ప్లాన్ విఫలమయ్యే పటిష్ఠమైన పధకం ఇదే హోటల్లో మరో రూమ్ లో జరుగుతున్నది చాలా తీవ్రంగా.
12
గ్యాస్ సిలిండర్లు రెండు లేని ప్రతి ఇంట్లో కిరసనాయిలు తప్పక వుండాల్సిందే. జాస్మిన్ కి గ్యాస్ స్టవ్ తో పాటు ఒక సిలిండర్ వుంది. గ్యాస్ అయిపోతే వాడటానికి కాబోలు చిన్న డబ్బాలో కిరసనాయిలు, పాత అట్టపెట్టెలో బుల్లి స్టవ్ వున్నాయి. స్టవ్ బదులు హాట్ ప్లేటు ఎందుకు కొనలేదో తెలియదుగాని అదిలేదు.
నందితాదేవి డబ్బా మూత తీసి చూసింది. సగం డబ్బాకి పైగా కిరసనాయిలు వుంది.
నందితాదేవి ఆ ఇంట్లోంచి బయటపడే ఉపాయం తోచి ఆ పని అప్పుడే చేయగల వేయి ఏనుగుల బలం వచ్చేసరికి అవతల పూర్తిగా తెల్లవారిపోయింది.
"కిరసనాయిలు తలుపుమీద పోసి అగ్గిపుల్ల ముట్టిస్తే చాలు భగ్గుమంటుంది. కాని అది చాలా ప్రమాదానికి దారి తీయవచ్చు. పూర్తిగా ఇల్లే కాలిపోతుంది. అంతేనా? ఇటు జాస్మిన్ శవంతోపాటు తనూ సజీవంగా దహనం అవుతుంది. తను చేయాల్సింది అదికాదు. కిరసనాయిలు గుడ్డ మీద పోసి వక తలుపుకి మాత్రమే కావాల్సినంత మేర రాస్తుంది. కొద్ది మంట వచ్చి కొద్దిగా మాత్రమే తలుపు కాలుతుంది. అలా కొద్ది కొద్దిగా కాల్చి తలుపులోంచి తను బయటకి వెళ్ళే మార్గం వరకే చూసుకుంటుంది. వెళుతూ వెళుతూ ఆ తలుపుకి ఏదయినా అడ్డం పెట్టిపోవాలి. ఈ పని ముఖ్యం" నందితాదేవి ఆలోచించింది. మరోసారి కాఫీ తాగింది. ఇప్పుడే కొద్దిగా ట్రై చేద్దామనుకుంటూ రంగంలోకి దిగింది. బిందెడు నీళ్ళు, కిరసనాయిలు డబ్బా, ఒక చిన్న పాతగుడ్డ పీలిక, అగ్గిపెట్టె.
కిరసనాయిలు వత్తుగా కొంతమేర తలుపుమీద పూసింది. అగ్గిపుల్ల అంటించి తలుపుకి ముట్టించింది. మరీ పెద్ద మంట అయితే ఆర్పటానికి సిద్ధంగా చెంబునిండా నీళ్ళు చేతిలోకి తీసుకుంది.