తనది కాని వస్తువు మీద ఆశపడి రకరకాల కోరికలు పెంచుకుని వస్తువుని సొంతం చేసుకోవడం మూడో పొరపాటు.
కోదండరామయ్య ఆ పెట్టెని చూసి "ధర ఎంత? ఎక్కడ కొన్నావని" అడిగితే ఆడిన అబద్దం ఆడకుండా తాతలనాటి పెట్టె తరతరాలు అన్నట్లు అబద్దాలు ఆడడం జరిగింది. ఇది నాలుగో పొరపాటు.
ఒకటి కాదు రెండుకాదు.
నాలుగు పొరపాట్లు చేసిన రంగశాయి పెట్టెలో నిధి నిక్షేపాలు వున్నట్లు వెయ్యిన్నొక్క కలలు కని, అరగంట సేపు నానా పాట్లూపడి, తాళం రాక నిక్షేపంలాంటి కొత్త పెట్టెని కత్తితో కోసి తెరిస్తే దానిలో వుంది నగలుకాదు.
ఫెళఫెళలాడే సరికొత్త నోట్లూ కాదు.
శవం తలకాయ, చేతులు దర్శనమిచ్చాయి.
అలాంటప్పుడు దురాశ దుఃఖం చేటు అనుకోక మధ్యలో దేముడు ఏం చేశాడని.....
"ఓరి దేముడోయ్! నా కొంప ముంచావు కదయ్యా?" అనుకోడం?
నిందించడం, విచారించడం అయ్యాక, చివరికి ఆశ అనర్ధదాయకం అని పశ్చాత్తాపం చెంది, ముందు జరగవలసిన తతంగం కోసం దీర్ఘాలోచన చేశాడు రంగశాయి.
"శవాన్ని అలాగే పెట్టెలో వుంచి ఎక్కడో అక్కడ పారేద్దామా అంటే పెట్టెని చీల్చాడాయే! పైన గుడ్డలు చుట్టి తాళ్ళతో కట్టి పారెయ్యొచ్చుకాని పెట్టెని కోదండరామయ్య చూశారు ఈ పెట్టెని రంగశాయి ఇంట్లో చూశానని చెప్పినా చెపుతాడా రోగ్.
"......అలాగాక ప్రయాణమై వెళ్ళినట్లు రైలులో చాలా దూరం వెళ్ళి పెట్టెని కంపార్ట్ మెంట్ లో వదిలేసి గప్ చిప్ గా రైలుదిగి వెనక్కి తిరిగి చూడకుండా యింటికి రావచ్చు. కాని......తను పెట్టెతో ప్రయాణం చేయడం వెయ్యిమంది చూస్తారు. సాక్ష్యం ఇవ్వటానికి కొందరు ప్రబుద్దులు తయారవుతారు. అదిచాలు తన పీక్కి ఉరితాడై చుట్టుకోటానికి....."
రంగశాయి యిలా ఆలోచన చేసిచేసి చివరికి ఓ మంచి నిర్ణయానికి వచ్చాడు. అలా చేద్దాము అనుకున్న తర్వాత మనసు చల్లబడి స్థిమితపడ్డాడు.
ఉదయాన్నే బజారు వెళ్ళి కాస్త గట్టిగా వున్న దేవదారు చెక్కపెట్టె అడుగున్నర సైజుది, రెండు డజన్ల మేకులు కొనుక్కువచ్చాడు.
రంగశాయి బజారు వెళ్ళినప్పుడు ఓ షాపు ముందు షోకేసులో వున్న సూట్ కేసుని చూశాడు.
అది తన యింట్లో శవం తలకాయ వున్న రకం సూట్ కేసు.
రంగశాయి షాపులోకి వెళ్ళి బ్రీఫ్ కేసులు, వి.ఐ.పి. సూట్ కేసులు రకరకాలవి చూస్తూ షోకేస్ లో పెట్టిన పెట్టెగురించి అడిగాడు.
"అవి లేటస్ట్ తయారీ. మాకు మొత్తం ఆరు వచ్చాయి. రెడ్ కలర్ క్రీమ్ కలర్. రెండు రంగులు వచ్చాయి ఒక క్రీమ్ కలర్ పెట్టె మొన్న మధ్యాహ్నం అమ్మాము" అంటూ దాని ధర, కొత్తరకం తాళం వేసే విధానం, దాని పనితనం సేఫ్టీ వివరించాడు షాపువాడు.
"అమ్మలం......కొడుకు. మొన్న మధ్యాహ్నం పెట్టెని కొని రాత్రికి శవం తలకాయ పెట్టెలో వుంచి నా యింట్లో పారేసి పోయాడన్నమాట. హంతకుడిది మా పేటే అయివుంటుందా? వాడి పేరు ఏమిటో?" అనుకున్న రంగశాయి, తెలివిగా కొన్న వాడి పేరు, రూపురేఖలు అడిగాడు.
బిల్ బుక్ లో చూసి పెట్టెని కొన్నవాడి పేరు వి. గోవిందరావని, కాస్త వంగి నడుస్తాడని, యాసగా మాట్లాడుతాడని చెప్పాడు షాపులో కుర్రాడు.
"నా వెర్రిగాని శవాన్ని దాయడానికి పెట్టెని కొన్నవాడు నిజం పేరు చెపుతాడా, నిజం అడ్రస్ ఇస్తాడా? అలాగే మాట మారుస్తాడు, వేషం మారుస్తాడు" అనుకున్న రంగశాయి పెట్టెధర ఎంతో తెలుసుకుని "నేను వి.ఐ.పి. కొందామని వచ్చాను. కాని నాకు ఈ పెట్టె నచ్చింది. సాయంత్రం మా ఆవిడని తీసుకువచ్చి ఈ పెట్టెని చూపించి అప్పుడు ఏదో ఒకటి కొంటాను అని చెప్పి చల్లగా షాపులోంచి బయటికి వచ్చేశాడు.
"కోదండరామయ్య పీనాసి మరియు జిడ్డుగాడు ఈ తఫా మళ్ళీ వచ్చినప్పుడు పెట్టె ఏ షాపులోకొన్నావు, ఎంత ధర అని అడగవచ్చు. అప్పుడు ధైర్యంగా షాపుపేరు, పెట్టె ధర చెప్పవచ్చు....."
రంగశాయి ఈ ఆలోచన చేసి పెట్టెధర కనుక్కుని షాపు పేరు గుర్తుపెట్టుకున్నాడు.
కోదండరామయ్య నిజంగా జిడ్డే.
మరోసారి రంగశాయి యింటికి వచ్చినప్పుడు షాపుపేరు, పెట్టెధర కనుక్కోవడం తప్పక చేస్తాడు. అప్పుడు రంగశాయి షాపుపేరు చెప్పంగానే కోదండరామయ్య దెబ్బతినడం ఖాయం, ఆపై నోరు మూసుకోడమూ ఖాయం.
అది అలా__
వి గోవిందరావన్న శాల్తీ ఎవడూ లేడని, కోదండరామయ్య పెట్టెకొంటూ కావాలని పేరు మార్పు చెప్పిందేగాక యాసగా మాట్లాడి కాస్త వంగి నడిచాడని సాక్ష్యాన్ని తప్పుతోవపట్టించే మార్గం యిదన్న సత్యంతో చేసిన పని అని రంగశాయి గ్రహించలేడు అన్నదీ ఖాయమే.
ఇది యిలా!
ఏది ఎలా అయినా ముందా శవం తలకాయని ఇంట్లోంచి తరలించాలి.
ఇది మూడోకంటికి తెలియకూడదు.
అందుకే రంగశాయి దేవదారు చెక్కపెట్టె కొనుక్కుని వచ్చాడు.
నేరాలు చీకటి చాటున రాత్రిళ్ళు జరుగుతాయి.
అందువలన రంగశాయి పగలు పెట్టె కొనుక్కు వచ్చినా పథకం నడిరాత్రి అమలు జరపదల్చుకున్నాడు.
రాత్రి పన్నెండు-
రంగశాయి సూట్ కేస్ లో వున్న శవం తలకాయని, అవయవాల మూటని, రెండు చేతులని, లెటర్ ని దేవదారు చెక్క పెట్టెలో పెట్టి, పైన దినపత్రిక కాగితాలని చుట్టినట్లు సర్ది పెట్టె మూతవేసి పెట్టెని వెంటనే తీయడానికి వీలులేకుండా నాలుగు పక్కలా మేకులను కొట్టాడు.
ఆ తర్వాత-
రంగశాయి పంచె కట్టుకుని, బనీను వేసుకుని తలగుడ్డ చుట్టుకున్నాడు.
ఇంటి తలుపు తాళంవేసి పెరటి మార్గాన ఇంట్లోంచి బయటికి వచ్చి నెత్తిన పెట్టె పెట్టుకుని వేగంగా ముందుకి సాగాడు.
ఇప్పుడు రంగశాయి కూలివాడిలా వున్నాడు.
అయినా నెత్తిమీద పెట్టెలో వున్నది సిమ్ లా యాపిల్స్ కాదు.
శవం తలకాయ, కొన్ని అవయవాలు.
అందువలన మనసు పింజాం పింజాం అంటున్నది. గుండె దడదడ లాడుతున్నది.
ఆ వీధిలోనే ఎవరో ఒకరి యింట్లో పారేయవచ్చు. అలా చేయతంకన్నా కాస్త దూరం అయితే మంచిదికదా అన్న ఆలోచన చేసిన రంగశాయి వేగంగా నడుస్తూ రెండు వీధులు దాటాడు.
మూడో వీధిలో రంగశాయిని చూచి వీధి కుక్కలు అరవడం మొదలుపెట్టాయి.
రంగశాయి మనసు ప్రమాదాన్ని పసిగట్టింది.
ఓ ఇంట్లోంచి పెట్టెని దొర్లించి కాళ్ళకి బుద్ది చెప్పాడు.
ఎక్కడా ఆగకుండా క్షేమంగా ఇంట్లోకి వచ్చి (పడి) 'అమ్మయ్య! పీడా వదిలింది' అనుకున్నాడు.
అక్కడితో రంగశాయి పని పూర్తికాలేదు.
రంగశాయి బాత్ రూమ్ లోకి పెట్టెని తీసుకెళ్ళాడు.
అక్కడ ఆ పెట్టెమీద కిరసనాయిలు పోసి తగలబెట్టాలని అనుకున్నాడు.
కిరసనాయిలు టిన్ను ఖాళీగా దర్శనం ఇచ్చింది.
రంగశాయికి వళ్ళు మండింది.
ప్రస్తుతం వళ్ళు మండినా, దురద పుట్టినా చేసేదేమీ లేదు కాబట్టి పెట్టెని తగలబెట్టే కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశాడు ఇప్పుడు యింక రెండే పద్దతులు వున్నాయి.