"ఇది నీ బుర్రకి పుట్టిన బుద్దేనా, ఎవరన్నా చెప్పార్రా" కాంతమ్మ కొడుకిలా మాట్లాడుతున్నాడంటే నమ్మలేక అడిగింది.
"అమ్మా నేనేం పసిపాపాయిని కాదు. నా చుట్టూ ప్రపంచం చూసి ఆమాత్రం తెల్సుకునే జ్ఞానం వుంది. యీ తరం వాళ్ళు కాస్త తొందరగా కళ్లిప్పి చుట్టూ చూసి నేర్చుకుందామని ప్రయత్నిస్తారు. ఈ చదువులు జ్ఞానం తప్ప బతుకుతెరువు కి ఉపయోగపడే రోజులు పోయాయనీ అంతా ఉద్యోగాల కేగబడితే చాలినన్నీ లేవనీ, విదేశాలలో మాదిరి వృత్తి విద్యలు నేర్చుకుంటే గాని ప్రగతి సాధించలేమని తెల్సుకుని ప్రతివాళ్ళు ఏదో చెయ్యాలన్న ఆరాటం కనిపిస్తుంది. యిది మంచి సైన్ మీరు ప్రోత్సహించడం పోయి తిడ్తున్నారు నన్ను...."
"భేష్, సోదరా భేష్......" వసంత హాస్యంగా చప్పట్లు కొట్టింది. "నా అభినందనలు అందుకో సోదరా, నీ కింత బుర్ర వుందని ఎప్పుడూ తెల్సుకోలేకపోయాం...."
"నీవు నోర్మూయావే, ప్రతిదానికి హాస్యం" కాంతమ్మ ఉరిమింది.
"ఒరేయ్ పిచ్పి పిచ్చి వేషాలు మాని తిన్నగా కాలేజీకి వెళ్ళి చదువుకో, చదువవగానే ప్రసాద్ ఆఫీసులో ఉద్యోగం వేయిస్తానన్నాడు. నీ చదువయి , నీకు ఉద్యోగం వేయించితే నా బాధ్యత తీరుతుంది. అప్పుడు మొభైల్ వ్యాన్ పెడతావో, హోటళ్ళు పెడతావో , పెసరట్లే వేస్తావో నీ యిష్టం. నా పోషణలో వున్నంతకాలం నా మాట మీద నడవాలి. నీ యిష్టం కుదరదు....' వెంకట్రావుగారు బెదిరిస్తూ అన్నారు.
శంకరు మొహం గంటు పెట్టుకున్నాడు. "ఛా....ఏ పని చేద్దామన్నా ఓ ప్రోత్సాహం లేదు. మా మిగతా ఫ్రెండ్స్ ముగ్గురిళ్ళలో రోజుకో ఫలహారం చేసి యిస్తున్నారు. యింట్లో చేయించి అమ్ముతున్నాం. మీరు చేయరని అడగలేదు. నా ఖర్మానికి నేనేదో నాలుగు డబ్బులు సంపాదిస్తుంటే సంతోషించాల్సింది పోయి..... అమ్మపెట్టదు, అడుక్కు తిననీయదు . నాకు కావలసినవి ఏం కొని యిస్తున్నారు మీరు ఓ మంచి బట్టలా, జోళ్ళా, సినిమా, హోటళ్ళ ఏ సరదాకి లేదు. యిప్పుడు నా అంతట నేను సంపాదించుకుంటుంటే " .....ఉక్రోషంగా అన్నాడు శంకర్.
"ఒరేయ్ నీ డబ్బు రంది బాగుంది కాని.....రేపొద్దున నీకు పిల్ల నేవడిస్తాడురా, చదువు సంధ్యలు లేనివాడిని ఏ ఆడపిల్ల పెళ్ళాడ్తుంది. నీ సంగతి అలావుంచు ఇంకా యిద్దరాడపిల్లలున్నారు వాళ్ళ పెళ్ళిళ్ళు అవద్దురా...." కాంతమ్మ నచ్చచెప్పే ధోరణిలో అంది.
"పెళ్ళేందుకవదు మహా చక్కగా అవుతుంది. ఈనాటి ఆడపిల్లలు సంపాదన లేని వాడిని కట్టుకోరు, ఎలా సంపాదించినా డబ్బునవాడు కావాలి. పోనీ అంతగా పెళ్లాడకాపోతే పీడా పోయింది" పెడసరంగా అన్నాడు.
"వీడికి మతి వుందో పోయిందో అర్ధం కావడం లేదు. గాలిలో మేడలు కట్టడం అంటే యిదే. వీడేదో దీన్లో వేలు సంపాదించవచ్చు అనుకుంటున్నాడు. బిజినెస్ , అందులో క్యాంటీన్ బిజినెస్ అంటే ఎన్ని మెళకువలు తెలియాలి.....ఏదో అల్లాటప్పాగా బజ్జీలమ్మినట్టు అనుకుంటున్నాడు. వ్యాను గీను ఎన్ని కావాలి."
"నాన్నగారూ మేం అంతా ఆలోచించాం. బ్యాంక్ లోను తీసుకుంటాం. ఓ వంటవాడిని పెట్టుకుంటాం. మా ఫ్రెండ్స్ యిద్దరికీ డ్రైవింగ్ వచ్చు. పనులు నలుగురం షేర్ చేసుకుంటాం. లాభం షేర్ చేసుకుంటాం ఒక్కరివల్ల అయితే కాదుకాని నలుగురు కలిస్తే ఎందుకవదు ఖర్చులు పోగా మనిషికి కనీసం వెయ్యి మిగులుతుంది. లంచ్ టైములో ఆఫీసులు, కాలేజీలు దగ్గిర ఎంత అమ్మకం జరుగుతుందో తెలుసా....." శంకర్ తండ్రి మెత్తపడుతున్నాడనుకుని ఉత్సాహంగా చెప్పాడు.
శంకర్ యిదంతా ఆషామాషీగా చెయ్యడం లేదని చాలాదూరం అలోచించి పకడబందీగానే చేసేందుకు నిర్ణయించుకున్నాడని ఆయనకర్ధం అయింది. బిజినెస్ లో ఓ ఏడాది రెండేళ్ళు నిలదొక్కుకుంటే తరువాత మంచి లభాలుంటాయని ఆయనికీ తెలుసు! కాని యిలా యీ వంటలమ్ముకునే బిజినెస్సు అంటే అయనకంగీకారం కావడం లేదు. యింకేదన్న అయితే అయిష్టంగా నన్నా వప్పుకునే వారేమో! నలుగురు ఏమంటారో నన్న భయం ఆయనది.
"ఉద్యోగం చేస్తే నా చదువుకి ఏమొస్తుంది. మహా అయితే గుమస్తా. జీతం ఐదువందలు...... ఈ కరువు కాలంలో ఏం సరిపోతుంది.' శంకరు తండ్రిని మెత్తపరచడానికి అనువైన సమయం ఇదేనని వేడి మీదే నాలుగు దెబ్బలు వేస్తె యినుము వంగుతుందని అన్నాడు. వెంకట్రావు గారికి శంకర్ మాటల్లో నిజాలని కాదనే శక్తి పోతోంది. అతని వాదన ముందు అయన అభ్యంతరం తేలిపోతోంది. ఏం అయినా అయన మనసు అవుననలేకపోతోంది. తరతరాలుగా మధ్యతరగతి మనుష్యులకి ప్రతినిధి అయన. రక్తంలో జీర్ణించుకుపోయిన పరువు ప్రతిష్టల కోసం ప్రాకులాడే మధ్యతరగతి సంసారి! తనకోసం తను కాక, నలుగురి కోసం బతికే మధ్యతరగతి మనిషి! సమాజం కోసం ఏడుపు దాచుకుని మందహాసం మొహాన్ని పులుముకోవాల్సిన తరగతి వ్యక్తీ అయన. ఈతరం వ్యక్తీ శంకరులా కావాలన్నది చేయగలిగే మనస్తయిర్యం ఆయనకి లేదంటే అది అయన తప్పుకాదు. మార్పుని అంగీకరించే గుండె బలం ఆయనకి.....ఆయనకే కాదు వెంకట్రావుగారి లాంటి మధ్యతరగతి మానవులకి వుండదు. అయన అలసిపోయినట్టు తల పట్టుకున్నారు.
"వెళ్ళు.....నన్నాలోచించుకొని వెళ్ళు ఒక్కరోజు మనశ్శాంతిగా వుండనీయకు నన్ను. ఏదో దిక్కుమాలిన గొడవలు.....ప్రశాంతంగా వంటికి నిండుగా ఒక్కరోజు పడుకునే అదృష్టం నాకు లేదు. వెళ్ళు నా బుర్ర వేడెక్కిపోయింది. నేనేం చెప్పలేను యిప్పుడు" అయన అవసరాన్ని మించిన కోపం చూపుతూ కసిరారు.
అప్పటికి గండం గడిచినట్టు శంకర్ లోపలికి జారుకున్నాడు. మాలతి వసంత లోపలికి వెళ్ళారు. భర్తని పలకరించే ధైర్యం లేక కాంతమ్మ అలాగే కూర్చుంది.
* * * *
వసంతకీ మధ్య ఆఫీసులో ఎందుకో చాలా నిరుత్సాహంగా వుంటుంది ఆశించింది ఏదో జరుగుతుందని ఎదురు చూసింది. జరగకుండా డల్ గా రోజులు ఒక్కోటి గడిచిపోతుంటే ఏదో నిరుత్సాహంగా వుంది. ఆఫీసులో అందరిలా తనూ వస్తుంది వేడ్తోంది అంతే. ఏ ప్రత్యేకతా , ద్రిల్లూ ఏమీ లేకుండా పోయింది ఉద్యోగంలో. రతన్ లాల్ తనపట్ల ఏ మాత్రం కుతూహలం కనపరచడం లేదు. అలా అని చెడ్డగా , అధికారం చెలాయించరు. మర్యాదగా పలకరిస్తాడు. కావాల్సిన పని చేయించుకుంటాడు. ఎ రోజన్నా అదోలా వుంటే యోగక్షేమాలు అడుగుతాడు. అంతే....అంతకుమించి చొరవ చూపించడు. ఆఫీసులో యిద్దరి మధ్య అడ్డు గ్లాస్ పార్టిషన్ మాత్రమే. వసంత ఎన్నోసార్లు అతన్ని చాటుగా పరిశీలించింది. అతను తన వంక చూస్తుంటాడెమోనని , కావలిస్తే సూటిగా చూస్తాడు, మాట్లాడుతాడు తప్ప దొంగచూపులు చూడడు. వసంతకి పెద్ద అవమానం అనిపించింది. వయసులో వున్న ఆడపిల్ల స్మార్ట్ గా తయారై వస్తే మగాడు గుర్తించక పొతే అంతకంటే యింకేం అవమానం కావాలి ఉడుక్కుంది. అతని దృష్టి మరల్చాలని ఎన్నోసార్లు తెల్సినా విషయాలైనా తెలియనట్టు కల్పించుకుని అడిగేది . తన సీతులోంచి లేచి నాలుగైదుసార్లు దేనికో దానికి అతని టేబిల్ దగ్గిరికి వచ్చేది. రతన్ లాల్ బర్త్ డేనాడు తనకేం ప్రత్యేకత యివ్వలేదని ఆరోజు నించి పట్టుదలగా అతన్ని ఆకర్షించాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది.