Previous Page Next Page 
చీకటి తొలగిన రాత్రి పేజి 31


    మీ నలుగురూ ....నలుగురిలో ఏ ఒక్కరైనా నాలో పేరుకుంటున్న నిరాశని, నిరుత్సాహాన్ని తొలగించి....నా భావం తప్పని నిజాయితీగా నిరూపించుతారని ఆశించడం వృదా అయిపొయింది.... నిన్న రాత్రి సినిమాలో వెంకట్రావు, అంతకు వారం క్రితం నా గదిలో శర్మ, తిరుపతిలో సారధి, నెలక్రితం స్వామి మీ అందరూ మీ నైజగుణమే చూపించుకున్నారు . నే ఆడదానిగా మాత్రమే , కనిపించాను మీ కంటికి!"
    శర్మ చదవడం ఆపి వెంకట్రావు వంక చూశాడు. మిగతా ఇద్దరూ కూడా ప్రశ్నార్ధకంగా వెంకట్రావు వంక చూశారు. వెంకట్రావు తల వంచుకున్నాడు.
    "నిన్నరాత్రి ఆవిడతో సినిమాకు వెళ్ళావా.....ఏం జరిగింది అక్కడ?" శర్మ నిలేసినట్లు అడిగాడు. వెంకట్రావు మొహం ఎర్రబడింది.
    "ఏం అన్నావు/ ఏం చేశావు?' ఏక కంఠంతో అడిగారు తక్కిన ముగ్గురూ, వెంకట్రావుకి తక్కిన వారిముందు దోషిలా నిలబడాల్సిరావడం పౌరుషం తెప్పించింది.
    "ఏం చేశాను/ మీరేం చేశారు?" ఎదురు తిరిగి ప్రశ్నించాడు. మిగతా ముగ్గురూ తల దించుకున్నారు.
    "ఊ తర్వాత చదువు" కాసేపటికి అన్నాడు స్వామి.
    ------ఎవరికి చెందని ఏ చెట్టునో కాసిన పువ్వుంటే ప్రతివాళ్ళకి ఏదో హక్కు వున్నట్లు! ఎవరికి వారే ఆ పువ్వు తమ స్వంతం అన్నట్టు దాన్ని అందుకునే స్వాతంత్యం తమకున్నట్టు, ఆ పువ్వుని పొందడంలో తప్పేమీ లేదని భావించడం మానవ సహజం.! కాని ఓసారి కోసి వాసన చూసిన పూవు పూజకు పనికిరాదు. మహా అయితే అలంకారానికి మాత్రమే పనికొస్తుందని అనుకుంటారు.
    అలాంటి పువ్వునే నేను. అందులో నా జీవితాన్ని తిరిగిరాని వంపులు త్రిప్పి నన్ను చూసిన ప్రతివాళ్ళకీ ఒకేభావం కలిగేలా చేసుకున్నాను. అంచేత మిమ్మల్ని ఈ విషయంలో తప్పు పట్టలేను. తప్పేమన్నా వుంటే నాది.
    ఐశ్వర్యం, అందం, చదువు, సంస్కారం అన్నీ వుండి ఎందుకిలా నా జీవితం అష్టవంకర్లు తిరిగింది అని ప్రశ్నించుకుంటే ఎవరిని ఏమనాలో తెలియని అయోమయస్థితిలో పడి ఆఖరికి నా దౌర్భాగ్యాన్ని , దురదృష్టాన్ని నిదించుకోడంతో ఆ ప్రశ్నకి జవాబు అఖరవుతుంది.
    తల్లి లేని ఏకైక గారాలబిడ్డగా, అపురూపంగా ఆడిందాటగా పెరిగాను. తనకున్న డబ్బుతో ----- అందం, చదువు సంస్కారం , సంప్రదాయం మాత్రం వుండి డబ్బు లేని అల్లుణ్ణి దేశం అంతా తిరిగి సంపాయించి ఇల్లారికం తెచ్చుకున్నారు నాన్న! ఆ ఉప్పుతిని ఆ యింటికే నిప్పంటించే కృతఘ్నుడవుతాడని ఆయన ముందు కలగనలేదు. విజ్ఞానశాస్త్రంలో మరింత విజ్ఞానం ఆర్జించడానికి విదేశాలు వెళ్ళి, ఆ వున్న కాస్త జ్ఞానం పోగొట్టుకుని కట్టుకున్న భార్యని, కళ్ళార చూడని కొడుకుని వదిలి మరో స్త్రీని పెళ్ళాడిన దౌర్భాగ్యుని కృతఘ్నతని ఆనాడు నేను ఎలా సహించగలిగానో, నా ఐశ్వర్యాన్ని, నా అందచందాలని తృణప్రాయంగా తృణీకరించగాల్గినమనిషి నిబ్బరాన్ని, మెచ్చుకోవాలో ఆ నిబ్బరాన్ని అందించిన మరో స్త్రీ అదృష్టానికి అసూయపడ్డాను నా దౌర్భాగ్యానికి చింతించాను, తెలియని స్థితి అది. నాన్న కున్న పలుకుబడి , డబ్బు, అయన తిట్లు , బెదిరింపులు , శాపనార్ధాలు ఏవీ అల్లుణ్ణి త్రిప్పి తీసుకురాలేకపోయాయి! ఆ ఖర్చు పెట్టిన డబ్బంతా కక్కమన్న నాన్న ఆవేశానికి జవాబుగా కొన్నాళ్ళకి డబ్బుతో పాటు ఉచిత సలహా కూడా ఇచ్చాడా ప్రబుద్దుడు. మీ కూతురికి మరో పెళ్ళి చేయండి అని, రెండేళ్ళు విదేశాలలో వుండి భారతదేశ సంస్కృతీ మరచిపోయిన ఆ మహానుభావుడికి ఈ దేశంలో వివాహితురాలిని, బిడ్డ తల్లిని పెళ్ళాడుతానని ముందుకు వచ్చే మగ మహారాజులుండరన్న సంగతి గుర్తురాక పోవడంలో వింత లేదు. ఏనార్ధం జీవితానికి గుర్తుగా బిడ్డ మాత్రం మిగిలాడు.
    కూతురి బ్రతుకులో నిప్పులు తను పోయకపోయినా తనే చేతులారా పోసినట్టు గుండెలు బాదుకుంటూ ఏడ్చిన అయన గుండె ఆ దెబ్బలు ఎన్నాళ్ళో తినలేక ఆగుండె కాస్తా ఆగి ఊరుకుంది ఓనాడు.
    డబ్బుకి దగ్గిరచేరే తోడేళ్ళ గుంపు తప్ప నిజమైన అభిమానం, ఆదరణ చూపే నా అన్నవాళ్లు లేని నాకు ఆ బిడ్డే సర్వస్వంగా మిగిలాడు. నా ఆశలు కలలు కోరికలు అన్నీ చిన్న ప్రాణం మీదే నిల్పి, మిగతా ప్రపంచాన్ని , మిగతా సుఖాలని నిర్లక్ష్యం చేశాను! కాని దేవుడు తను సృష్టించిన వాటిని నిర్లక్షించే శక్తి నాలాంటి మానవ మాత్రురాలికి మానవాతీత శక్తులుండకూడదని గాబోలు నా ఏకైక ఆశని మ్రోగ్గలోనే త్రుంచేశాడు. నా యావత్తు ఆస్తి ధారపోస్తానన్నా ఏ డాక్టరూ నా బిడ్డని బ్రతికించలేకపోయారు.
    తరువాత - తరువాత- ఏముంది! ఎందుకు బ్రతకాలో , ఎవరి కోసం బ్రతకాలో తెలియక బ్రతుకుతూ , మనుష్యుల మీద కసి పెంచుకుంటూ, నా ఈ స్థితికి కారణమైన వ్యక్తిని ఏమి చెయ్యలేక ఆ వ్యక్తీ వారసులయిన పురుష జాతినే ఎహ్యించుకోవడం మొదలుపెట్టాను. మగాడన్న వాడిని నల్లిని నలిపినట్టు  నేలరాసి పారేయాలనిపించేది. నా అందం, డబ్బు, పణంగా  పెట్టి శలభల్లా చుట్టూ తిరిగే మగవాళ్ళని మత్తెక్కించి కవ్వించి కసిదీరా  కాటేయలన్నంత విషం నిలువెల్లా పెంచుకున్నాను. ఆడదంటే ఏమిటో, ఆడది తలిస్తే ఏం చెయ్యలేదో చేసి చూపించాలనీ క్రూరంగా ఆలోచించాను. ఎవరిని లెక్క చెయ్యకుండా , నా యిష్టం వచ్చిన రీతిని విచ్చలవిడిగా తిరిగినా ఎవరూ నోరెత్తకుండా చెయ్యగలిగే ఆయుధం డబ్బు నాకుంది! నాకేం లోటు అని వికట అట్టహాసం చేసేదాన్ని.
    మంచి, చెడు , నీతి, నియమం అన్న పదాలకి అర్ధాలు మరిచి నాకానందాన్ని ఇచ్చే రీతిని జీవితాన్ని నా యిష్టం వచ్చిన రీతిలో మలుచుకుందామనుకున్నాను.
    కానీ తరతరాలుగా రక్తంలో జీర్ణించుకుపోయిన సంస్కృతీ , సంప్రదాయాలు, పిరికిమందు పోసిం పాపభీతి మనసులో పెట్టి వెనక్కి లాగుతుంటే పగ, పంతం, ముందుకు లాగుతుంటే రెండింటికి మధ్య నలిగిపోతూ నన్ను నేను మరిచిపోటానికి తాగుడు, తందనాలు అలవాటు చేసుకున్నాను. ఏది చేసినా పై పై వూరట, తాత్కాలిక ఉపశమనం తప్ప నిజమైన మనశ్శాంతి వీటి వాళ్ళ లభ్యం కాదని కొన్నాళ్ళకి అర్ధం అయింది. పూజ, పురస్కారాలు, త్రాగుడు దేనిలోనూ లభ్యం కాని మనశ్శాంతి మరెక్కడ దొరుకుతుందో అర్ధం కాక చిత్రహింసకి గురి అయ్యేదాన్ని మళ్ళీ పెళ్ళి చేసుకుంటే? పురుష జాతినే ఎహ్యించుకునే నాకు ఆ మాట తల్చుకోవడానికి అసహ్యం వేసేది. ఎలాగో సరిపెట్టుకుంటే బతుకులో నవ్యత లభిస్తుందని ఆశించినా, నన్ను ఎవరన్నా పెళ్ళాడుతానని ముందుకు వస్తే అది కేవలం డబ్బు కోసం మాత్రం అని తెలుసు! మొఖం ఎదుట అభిమానం, గౌరవం చూపిస్తూ మొఖం చాటుకాగానే నా గురించి వచ్చే వ్యాఖ్యానాలు ఎలాటివో నాకు తెల్సు. నామీద మనుష్యుల కున్న అభిప్రాయం తెలిసి నన్ను మనసారా ప్రేమించలేని మనిషితో ఏం సుఖపడగలను?
    పరిచయస్తులు , మిత్రులు 'మళ్ళీ పెళ్లాడకూడదా' అని సలహా లిచ్చేవారు. ఆ సలహా ఇచ్చేవారిలో ఎవరూ పెళ్ళాడడానికి ముందుకు రారని నాకు తెలుసు. ఎవరిదాకానో ఎందుకు మొన్న మొన్న శర్మ నాకోసం ఆరాటంగా అర్రులు చాస్తుంటే "పెళ్లాడుదాం ' అన్నాను. అంతే కలవరపడిపోయి ఆ క్షణంలోనే నేనెక్కడ బలవంతంగా తనని పెళ్ళాడేస్తానేమో నన్నంత గాభరాగా వెళ్ళిపోయాడు. ఆడదాన్ని అనుభవించడానికి అడ్డురాని వయసు, పరువు, ప్రతిష్ట , పెళ్ళికి అడ్డ్డు వస్తాయని క్రూరంగా నవ్వుకున్నాను.
    చదువుతున్న శర్మ మొఖం ఎర్రబడిపోయింది. మొఖం గంటు పెట్టుకున్నాడు. తక్కిన ముగ్గురి చూపుకి జవాబుగా 'ఆవిడని పెళ్లాడకూడదా అని అడిగితే నేను చేసుకుంటా ననేమిటి అర్ధం?' సంజాయిషీ ఇస్తున్నట్లు గొణిగాడు.
    అదీ లాభం లేదని తేలాక ఏ పిల్లావాడినైనా తెచ్చుకొని పెంచుకుంటే అన్న ఆలోచన వచ్చింది. కాని మాత్రుత్వంలో మమత, కన్నబిడ్డ మీద మమకారం, కన్నకడుపు తీపి అన్నీ అనుభవించాక , ఎక్కడ నించో తెచ్చిన బిడ్డకి తల్లిగా న్యాయం చేకూర్చలేననిపించి ఆ ఉద్దేశమూ విరమించుకున్నాను.

 Previous Page Next Page