Previous Page Next Page 
మోడల్ పేజి 31


    ఆమెంకా బయటకు రాలేదు. టెలీఫోన్ బూత్ వద్దకు నడిచాడు. ఒక కన్ను ఆమె కారుమీదే ఉంచి, ఇంటికి ఫోన్ చేసి "నేను రేస్ కోర్స్ గ్రవుండ్ దగ్గర ఆరవ వీధిలో 52 వ ఇంటిదగ్గరవుంటాను. మనోహర్ వస్తే అక్కడకు  రమ్మని చెప్పు" అని చెప్పాడు తమ్ముడికి.

    అంతలో ఆమె బయటకు వస్తోంది. మరొక యువతికి గేటుదాకా ఈమెను సాగనంపి లోపలకు నడిచింది.

    ఆమె కారు బయలుదేరింది.

   
                            *    *    *



    "హలో! నేను కమలిని మాట్లాడుతున్నాను. మీరు నాకున్న డ్యూ ఎమౌంట్ వెంటనే  పంపాలి.......అర్జంటు."

    ఫోన్ క్రెడిల్ చేసి మరో ఫోన్ చేసింది.

    "ఒక వెయ్యి  తగ్గించుకొనైనా వెంటనే పంపండి."

    పది చోట్లకు ఫోన్ చేసి తనకు చాలా కాలంగా రావాల్సి వున్న బకాయలు వసూలు కార్యక్రమం ఉధృతం చేసింది.

    ఎదురుగా లాయర్ సీతారామయ్య కూర్చున్నాడు. ఆఖరుగా ప్రదీప్ సక్సేనాకు ఫోన్ చేసింది. అవతల ప్రదీప్ ఫోన్  ఎత్తగానే మత్తుగా, గమ్మత్తుగా , కైపుగా , తెరలు తెరలుగా నవ్వింది. ఆమెకు ప్రదీప్ బలహీనత తెలుసు గనుక.

    కమలిని అన్నా, ఆమె అందమైన వంపులన్నా ప్రదీప్ కి పిచ్చి. ఆ బలహీనతనే ఒక సత్కార్యం కోసం ఆఖరుసారిగా వాడుకుంటూంది. ఆమె కళ్ళముందు పండంటి జీవితాల్ని నాశనం చేసుకున్న మోడల్స్ కనిపిస్తున్నారు దీనంగా, హీనంగా  బలహీనంగా బ్రతుకుదెరువు కోసం బాధలు పడుతూ. మోడల్స్ అంటే చాలాకాలం నుంచి లాయర్ సీతారాయమయ్యకి కూడా అసహ్యం అనిపించేది. కాని కమలిని లాంటివాళ్ళు కూడా మోడల్స్ లో ఉన్నారంటే అతనికి నమ్మబుద్ధి కాలేదు ముందు. కాని కమలిని ప్రయత్నాలు చూస్తుంటే ఆమె ఔన్నత్యానికి అతని హృదయం ద్రవించింది.

    అందుకే పైసా ఫీజు లేకుండా ఆమె తలపెట్టిన మాహత్కార్యాన్ని పకడ్బందీగా చెయ్యాలనుకుంటున్నాడు.

    "ప్రదీప్ జీ.......ఎలా ఉన్నారు......?" అడిగింది.

    ముందుగా కమలినిపై అనుమానపడ్డా అతనిలోని బలహీనత తెలివిగా ఆలోచించనివ్వలేదు.

    "బావున్నాను. ఇన్నాళ్ళకు మీకు నామీద దయ కలిగిందా?" ఆశగా అన్నాడు.

    "మీరంటే నాకు గౌరవం.......మీ తెలివి తేటలంటే నాకు గొప్ప అడ్మిరేషన్......రేపు రాత్రి మీకోసం హొటల్ బంజారాలో ఎదురుచూస్తుటాను. బైదిబై చిన్న  పనిబడింది మీతో నన్ను ఆ కష్టంనుంచి గట్టెక్కించి గల సామర్థ్యం మీకొక్కరికే వుంది......" అతనిలోని అహాన్ని ఎత్తేసింది తెలివిగా.

    ఆమె కళ్ళ వెంటనీరు, నోటివెంట చిరునవ్వు.

    పశ్చాత్తాపం, ఆనందం ఆమెలో కలగలిసి వున్నాయి ఇప్పుడు.

    "చెప్పండి మేడమ్........మీరు ఏది కావాలన్నా  సిద్దమే."

    "ఏంలేదు.......నాకు రావాల్సిన బకాయిలు ఆరులక్షలుదాకా ఉన్నాయి రావటానికి వారంపట్టపవచ్చు. నేనొకతనికి ఐదు లక్షలుదాకా యివ్వాల్సివచ్చింది. అతను వెంటనే కక్కమని ఒత్తిడి చేస్తున్నాడు. మీరు గనుక సర్దితే మరలా వెంటనే......"

    కమలిని పూర్తి చేస్తుండగానే అందుకొని.....

    "దానికేముంది. ఎప్పుడు ఎలా ఇవ్వమంటారు?" ఐదులక్షలు కూడా హేండ్ లోనే ఇవ్వగల సత్తా తనకే వుందనీ నిరూపించుకోవాలనే ఇగో కమలినితో తను ఎన్నాళ్ళగానో ఆశిస్తున్న సుఖం దొరకపోతుందన్న బలహీనత అతనిలో వున్నాయి  ఇప్పుడు.

    "సరిగ్గా మరో గంటలో నేను చిక్కడపల్లిలోని మీరా సిల్క్ సెంటర్ ముందుంటాను. నమ్మకమైన వారికిచ్చి పంపండి. కైలాష్ తో మాత్రం కాదు. థ్యాంక్స్ వుంటాను" అంటూ ఫోన్ పెట్టేసింది.

    "లాయర్ గారు నేననుకున్న 25,00,000 దీనితో పూర్తవుతాయి గదా......." అంది.

    ఆమెకిచ్చే అప్పు ఎలా వసూలు చేసుకోవాలన్న ఆలోచన ప్రదీప్ క్రిమినల్ బ్రెయిన్ కి రాకపోలేదు. అప్పుడు అతనికి కనిపించింది పదిలక్షలు ఖరీదుచేసే కమలిని బిల్డింగ్.

    "దీనితో నీ జన్మ ధన్యమవుతుంది తల్లి....భావితరాలు నీ గురించి గొప్పగా చెప్పుకుంటాయి.....జాతి శ్వాసను మాలిన పరుస్తున్న దుర్గంధ భూయిష్టమైన నేటి సమాజంలో నీలాంటివారు వున్నారంటే విస్మయంగాను, వింతగానూ వుంది తల్లీ........నువ్వు చెప్పినట్లు అంతా రాశాను ఎక్కడా లొసుగు లేకుండా.

    కమలిని తృప్తిగా చూసింది లాయర్ ఇచ్చిన కాగితాల్ని. బాధో, ఆనందమో, పశ్చాత్తాపమో తెలియని అలౌకిక అనుభూతిలో వుంది కమలిని.

    కారు తాళాలు తీసుకొని లేచింది. ఇద్దరూ కూర్చున్న కారు మీరా సిల్క్ సెంటవేపు పోతోంది. ఆ కారుని ఆ సాయంత్రమే కొన్నతను తీసుకెళ్ళనున్నాడు.

    ఆ రాత్రికే కమలినిని మట్టుబెట్టే ప్రయత్నాలు చురుకుగా సాగిస్తున్నాడు కైలాష్ ప్రదీప్ కి తెలియకుండా. అది కమలినికి తెలుసు. తెలియబట్టే ఐదులక్షల ట్రాప్.

   
                                                                   *    *    *   

    మధు రోమా గురించి పిచ్చెత్తిన వాడిలా  తిరిగాడు రోడ్లన్నీ. ఎక్కడవుంది? ఏ పరిస్థితుల్లో ఉంది? ఎలా రక్షించాలి? తిరిగి తిరిగి మరలా  ఆఫీసుకొచ్చాడు. బాస్  ప్యారిస్ నుంచి ఇంకా రాలేదు. తరంగిణి దొరికిందో లేదో  తెలియదు. రోజులు గడిచిపోతున్నాయి. ఈలోపు రోమా పరిస్థితి అంతా అయోమయంగా వుంది. అంతలో పోస్ట్ తెచ్చిచ్చాడు చందూ. ప్రతి కవర్ లోనూ మనోహర్ ఈ ఛాలెంజ్ విజయం సాధించాలని వుంది.

    ఎవరూ రాసారో చూసి విస్తుపోయాడు మధు. ప్రముఖ ఇండియన్ ఫోటో గ్రాఫర్స్......జితేంద్ర ఆర్య, జె.పి సింఘాల్, ముఖేష్ షా, హారేష్ డాప్టరే. గౌతమ్ రాజధ్యక్ష, అజిత్ పటేల్, జ్యోతి ఠాకూర్, సూరజ్ రాయ్, రఘురాయ్ (ఇందిరాగాంధీ కుటుంబ ఫోటో గ్రాఫర్) జఫర్ హై, ప్రలాద్ కక్కర్, సాంతనుషియరే, దయారామ్ చావ్డా [మరో ఇద్దరు ఫేమస్ ఫోటో గ్రాఫర్స్......కిషోర్ ఫరేఖ్, మిత్తర్ బేడి ఇటీవలే మరణించారు.]

    మధు సంభ్రమామాశ్చర్యాల్లో మునిగిపోయాడు. ఇండియన్ ఫోటోగ్రఫీ వరల్డ్ ఏలే ఛాయా చిత్రకళ చక్రవర్తులు వీళ్ళు. తనబాస్  పందెం వీరికి తెలిసిందంటే దాదాపు ఫీల్డ్ అంతా తెలిసినట్లే.

    ఓ క్షణం భయమనిపించింది మధుకి. ఈ పందెంలో నెగ్గలేక పోతే......!? ఈ భావన  మధు  ఒళ్ళు చల్లబడేలా చేసింది.

    అంతలో ఫోన్ మోగింది.

    ఫోన్ లో విన్న మాట మధుని పెద్ద షాక్ కి గురిచేసింది. మెదడంతా మొద్దుబారిపోయింది. చేతిలో ఫోన్ జారిపడింది.

    ఎదురుగా వున్న చందూకి జరిగిందేమిటో అర్థంకాలేదు. ఫోన్ ఎత్తి హలో అన్నాడు ఫోన్ లో వినిపించిన మాటలతో చందూ కూడా బిగిసిపోయాడు.

    భయంకర ఉష్ణపవనం ఓ క్షణం ఆ ఇద్దర్ని చుట్టుముట్టింది.

    వెంటనే తేరుకున్న మధు అదురుతున్న గుండెతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వేపు తన మోటార్ సైకిల్ తోలుతున్నాడు అమితవేగంతో.

   
                                 *    *    *


    మనోహర్ ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగగానే సరాసరి జార్జి ఇంటికి వెళ్ళాడు. ఆ వెళ్ళేముందు ఎప్పటిలా నలువేపులా చూసుంటే తనక్కావల్సిన యువతీ కనిపించేది.

    హడావుడిగా వెళ్తున్న మనోహర్ ని  నవ్వుతూ చూసింది తరంగిణి.

    అందగాడే అనుకుంది మనస్సులో.

    మనోహర్ జార్జి ఇంటికి వెళ్ళగానే అతని తమ్ముడు చెప్పిన మాటలు అమృతపు కల్లులా అనిపించాయి మనోహర్ కి. వెంటనే వచ్చిన టాక్సీలోనే జార్జి చెప్పిన స్థలానికి చేరుకున్నాడు. ఓ గోడపక్కగా నిలబడి ఓ ఇంటివేపు చూస్తున్న జార్జిని చూడగానే ఆ ఇంట్లోనే తరంగిణి ఉందనిపించింది తరంగిణి దొరకబోతోందన్న ఉద్వేగం మనోహర్ నరాలు చిట్లి పోయేలా చేస్తోంది.

    జార్జి మనోహర్ ని చూసి చిరునవ్వు నవ్వి "యు ఆర్ లక్కీ బ్రదర్. తరంగిణి ఈ ఇంట్లోనే వుంది ఉదయంనుండి పడిగాపులు కాస్తున్నాను. ఆమె నా దృష్టినుంచి దాటిపోకుండా."

    పట్టరాని సంతోషం మనోహర్ ని ఉక్కిరి బిక్కిరి చేసింది.

    "కమాన్.......హరియప్....." అంటూ ఆ ఇంటివేపు  దూసుకెళ్ళాడు మనోహర్. ఆ వెనుకే జార్జి బయలుదేరాడు.

    కాలింగ్ బెల్ ప్రెస్ చేసాడు మనోహర్.

    రెండు నిముషాల తరువాత తలుపు తెరుచుకుంది. మరలా ఆశాభంగమే ఎదురయింది ఎదురుగా ఓ వృద్దుడు.

    "సార్......మేం తరంగిణి కోసం వచ్చాం. చాలా అర్జంటుపని. కొంచెం పిలుస్తారా?"

    వృద్ధుడు వింతగా చూసి "ఇక్కడ తరంగిణి అనేవారెవరూ లేరు" అంటూ ఇంట్లోకి తొంగిచూస్తూ "అమ్మా దేవి......ఎవరో వచ్చారు వయ్యారంగా.

    ఆమెను చూడగానే మనోహర్ మొఖం కళ తప్పింది. జార్జి పొరపాటు పడ్డాడు. కాస్త అటూ యిటూగా తరంగిణి పోలికలన్నీ ఈమెలో ఉన్నాయి.

    నిస్పృహగా వెనుతిరిగాడు మనోహర్. వెనుకనుండి ఆమె "ఎవరు కావాలి?" అడిగింది ఎందుకు చెప్పటం అనుకొని, మరలా అంతలోనే అన్నాడు "తరంగిణి....."అడుగులు బయటకు వేస్తూనే వున్నాడు. అంతలో "మీకు తరంగిణి కావాలా! మీరు విక్రమ్ అవునా?"

    ఠక్కున ఆగిపోయాడు మనోహర్. ఏదో లింకు దొరికినట్ల నిపించింది. వెంటనే వెనక్కు తిరిగాడు.

    "అవును. నాపేరు విక్రమ్, నేను తరంగిణికోసం వచ్చాను......" అన్నాడు చిన్న అబద్దం ఆడిస్తూ.

    "మీరు హైదరాబాద్ లో వున్నారని తరంగిణి చెప్పిందే?"

    ఓ క్షణం కలవరపడ్డా వెంటనే తేరుకొని___

    "అక్కడినుండే వచ్చాను....."అన్నాడు స్నేహ పూర్వకంగా చూస్తూ.

    "తరంగిణి అదృష్టం బావుండి ఫ్రాంక్ ఫర్ట్ లో సిగిపోయింది అక్కడో ఫ్రెండ్ ని కల్సుకొనేందుకు. లేకుంటే హైజాక్ చేసిన ప్లయిట్ లో ఇరుక్కుపోయేది. మరో ప్లయిట్ ఎక్కి ఢిల్లీ వచ్చింది......"

    "ఆమె ఇప్పుడెక్కడుంది?" బుల్లెట్  లా వచ్చిన ఆ ప్రశ్నకు ఆమె ముందు ఆశ్చర్యపడినా, దాన్ని మరోలా  అర్ధం చేసుకొని.

    "కలకత్తా వెళ్ళే ప్రయత్నంలో వుంది. తరంగిణీ నుంచి ఫోన్ వస్తే  ఎయిర్ పోర్టు కెళ్ళి  ఇప్పుడే వస్తున్నాను....."

    అంటుండగానే వేగంగా వెనుతిరిగి, మరలా అంతలోనే ఆగిపోయి కలకత్తా వెళ్తే ఎక్కడుంటుంది.....? అందామె.

    "ఎస్ ప్లనేడ్......ఒబరాయ్ హొటల్" అందామె.

    వడివడిగా నడుస్తూనే వాచీ చూసుకున్నాడు.

    టైమ్ పది నిముషాలు మాత్రమే వుంది.

    మరో నిముషంలో కారు గంటకు వంద కిలోమీటర్లు స్పీడ్ లో ఎయిర్ పోర్ట్ వేపు దూసుకుపోతోంది.

    జరిగినదంతా తెయిసుకున్న జార్జి నుదురు కొట్టుకున్నాడు నిస్పృహగా.

    ఎయిర్ పోర్టులో ఈమెను పంపించడానికి బయటకువచ్చిన యువతే తరంగిణి. ఒక్కసారి ఆమెవేపు పరిశీలనగా చూసుంటే చిక్కిపోయేది. మనోహర్  టెన్షన్ చూస్తుంటే బాధనిపించింది జార్జికి.

    కారు ఎయిర్ పోర్టులో ఎంటరయ్యేసరికి సరిగ్గా 7-15 అయింది.

    మనోహర్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అప్పటికే ప్లయిట్ డోర్ మూస్తున్నారు. స్టెయిర్ కేస్ పక్కకి  లాగేస్తున్నారు.

    ఒక్కక్షణం వృధా చేయలేదు. 

 Previous Page Next Page