Previous Page Next Page 
అగాధాల అంచులో పేజి 30

    "బస్ ఇంక చెప్పకు. మీ వాళ్ళు ఎట్లాంటివాళ్ళో నీకు తెలిసిందే కదా! వాళ్ళు అవసరం వస్తే ఎంతకయినా తెగించే రకాలు. పృధ్వీరాజ్ ని మాయం చేశారు మైండిట్?"

    "అంతేనంటావా?" అమాయకంగా ప్రశ్నించింది నందితాదేవి.

    రాజు లేచివెళ్ళి నందితాదేవి చేయి పుచ్చుకున్నాడు "వందనా! నీదంతా పసిపిల్ల తత్వం. నిన్ను చూస్తుంటే జాలి వేస్తున్నది. అందరం ప్రమాదంలోనే వున్నాము- నేను నువ్వు మీ అక్క నా అంచనా ప్రకారం పృధ్వీరాజ్ కూడా మనందరం అగాధాల అంచులలో సాగిపోతున్నాము. ఎంతో నేర్పుతో బహుజాగ్రత్తగా ఓదార్పుతో నడక సాగించాలి. కాలు జారిందా అగాధంలో పడిపోతాము. అక్కడితో పడ్డవాళ్ళ చాప్టర్ క్లోజ్. వడ్డున పడ్డామనుకో బతికి బట్ట కట్టినట్లే. ఈ నా చెయ్యి ఎల్లవేళలా రక్షిస్తూనే వుంటుంది. నన్ను నమ్మి నాతో సహకరించు. అర్ధంలేని ఆలోచన. తొందరపాటు నిర్ణయంతో ముళ్ళదారిలో నడక సాగించకు. నేను అగాధంలో పడ్డా నిన్ను వడ్డుకునెట్టి రక్షిస్తాను ప్రామిస్" రాజు సానునయంగా అన్నాడు చేతిలో చేయివేస్తూ.

    నందితాదేవి బేలగా చూసింది. "ఈ ఒట్టు దేనికి!" అంది.

    "నువు పసిపిల్లవుకదా!" రాజు దూరం జరిగి మళ్ళీ మంచంమీద కూర్చుంటూ అన్నాడు.

    "ఇతని రూపం గాంభీర్యంగా వుంటుంది. మాటలు తియ్యగా వుంటాయి. నిజంగా మనసూ మంచిదయితే నా రాజుని నాకు అప్పగించవచ్చు" రవ్వంత తృప్తి చెందింది నందితాదేవి.

    "పృధ్వీరాజ్ గురించి ఎంక్వయిరీ చేశాను. అతని విషయంలో తెలిసిన కొన్ని వార్తలు అనుమానాస్పదంగా వున్నాయ్. మోసగాడో, మొనగాడో ఓ విధంగా రహస్య జీవితం గడుపుతున్నాడు. ఈ విషయం నందితాదేవికి చెప్పటం మంచిదికాదు. అలా అని చెపితే ఏడ్చి మీదపడి రక్కుతుంది కూడా. నమ్మకపోగా నన్నో మోసగాడికింద జమకట్టి ఇక్కడనుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. మరో రహస్యం కూడా తెలుసు. కాని దానిని బైట పెట్టలేదు.

    "నందితాదేవి!"

    "మళ్ళీ ఏమిటి?"

    "ఇది చదువు" అంటూ జేబులోంచి పేపరు కటింగ్ తీసి ఇచ్చాడు.

    నందితాదేవి చదివింది.

    నవ వధువులని మాయం చేస్తున్న నయవంచకులు.

    హెడ్ లైను నీటుగా పెద్ద అక్షరాలతో వుంది. కింద ఇలా వుంది.

    "ఈ మధ్య పెళ్ళి పీటలమీద పెళ్ళికూతుళ్ళు మాయమైన వార్తలు తరుచు వినిపిస్తూనే వున్నాయి. అలాంటి విచిత్రమైన వుదంతమే మరొకటి,

    "ఈ నెల ఎనిమిదిన జి.గోపాలరావుగారి అమ్మాయి నందితాదేవి వివాహం ఘనంగా జరగనుంది. మరో మూడు గంటల తర్వాత వివాహం జరగబోతుండగా విచిత్రంగా ఆమె ఇంట్లోంచి మాయమయింది. ఒక స్త్రీ మగపెళ్ళివారి తరపు మనిషినని చెప్పి మత్తుమందు కలిపిన ప్రసాదం దాసీలచేత తినిపించింది. ఆ తర్వాత ఆమె, పెళ్ళికూతురు ఏమయ్యారో ఎవరికీ తెలియదు. మగ పెళ్ళివారు మా మనిషి మీ ఇంటికి రాలేదని చెప్పారు. నవవధువులని మాయం చేస్తున్న నయవంచకులని పట్టటానికి పోలీసులు రంగంలోకి దిగారు.

    "నవ వధువు నందితాదేవి అందమైనది. మంచి తెలివికలది. బీ.కామ్ ఫస్ట్ క్లాసులో పాస్ అయింది. ఆమె పలురకాల పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులు పొందింది.

    "అనుమానాస్పదంగా వున్న వ్యక్తులని ఓ కంట కనిపెట్టమని వధువుల గురించి ఆచూకీ తెలిపితే పోలీసులకి తెలియజేసి సహకరించమని కోరుతున్నాము. నందితాదేవి ఫోటో ప్రచురిస్తున్నాము. ఆమె ఆచూకీ తెలిస్తే తెలియపరిచినవారికి ఘనంగా బహుమతి ఇస్తామని నందితాదేవి పెదనాన్నగారు అయిన జి.గోపాలరావుగారు తెలియజేస్తున్నారు.  

 Previous Page Next Page