వంటింట్లో మాలతి, కాంతమ్మ గుసగుసలాడుకున్నారు. "ఓరి వీడి అసాధ్యం కూలా , పట్టుమని పద్దెనిమిదేళ్ళు లేవు, వీడిప్పటి నుంచి యిలా తయారయ్యేడేమిటి" కాంతమ్మ విస్తుపోయింది. "అందుకే కాబోలు ఆమధ్య కిలో మినపప్పుకి ఎన్ని యిడ్దేన్లు అవుతాయి , శనగపిండెంత , నూనేంత , కాఫీకి బ్రూ చవకా, డికాషన్ కాఫీ చవకా , పంచదార ఓపెన్ మార్కెట్ లో ఎంత అంటూ అడిగాడు. వీడికింటి విషయాల మీద యింత శ్రద్ధ ఏమిటి చెప్మా అనుకున్నాను. వీడు చేస్తున్న నిర్వాకం యిదా, రానీ వాడి పని చెపుతా."
"ఎంత చదివినా, ఉద్యోగాలు దొరకవనుకుని బిజినెస్ ఆరంభించి నట్లున్నాడు" ఎప్పుడూ వాడి దృష్టి డబ్బెలా సంపాదించడం ఎలా అనే" మాలతి అంది.
"నన్నడుగుతే వాడు చాలా తెలివైన పనే చేస్తున్నాడంటాను. బి.ఏ. లు చదివి ఆపై ఉద్యోగాలు దొరక్క బాధపడేకంటే స్వంతంగా ఆరంభించడం మంచిదే. కొన్నాళ్ళు పోయాక వాడన్నట్టు మొభైల్ వ్యాను పెట్టుకుంటే బోలెడు ఆర్జించవచ్చు. అందరూ ఉద్యోగాలకి ఎగబడితే ఎక్కడ దొరుకుతాయి" అంది వసంత.
"ఈవిడ గారోక్కత్తి దేశాన్నంతా ఉద్దరి చేటట్టు మాట్లాడుతుంది. వాడి దగ్గర ఆమాటలను .....పనికొస్తాడు ఇంకా.....' కాంతమ్మ కోపంగా చూసింది వసంత వంక.
మాటల్లో శంకర్ వచ్చాడు. ఇంట్లో జరుగుతున్నది తెలియక ధీమాగా జోళ్ళు టకటకలాడించుకుంటూ వచ్చాడు. ఆ తరువాత ఎంత భాగోతం జరగాలో జరిగింది. వెంకట్రావుగారు కొట్టినంత పనిచేసి తిట్టి తిట్టి ఆయాసంతో వగరుస్తూ చాటికిలపడ్డారు. కాంతమ్మ నెత్తి కొట్టుకుంటూ ఏడ్చింది. ముందు శంకరు బెదిరిపోయి జవాబుకి సిద్దపడి లేడేమో నీళ్ళు నమిలాడు. తరువాత ఎలాగో తెలిసింది యింక దాపరికం ఎందుకు అని ఎదురు తిరిగి జవాబిచ్చాడు. "నేనేం కానిపని చెయ్యలేదు. నా బతుకు తెరువు నేను చూసుకున్నాను. దొంగతనం చేశానా, కష్టపడి సంపాదిస్తున్నాను" అని సమర్ధించుకున్నాడు.
"నోర్మూయరా అప్రాచ్యుడా! కష్టపడి సంపాదించడం అంటే యింటి పరువు ప్రతిష్ట అన్ని వదలి బజ్జీలమ్మడంట్రా" వెంకట్రావుగారు మళ్ళీ పుంజుకున్నారు.
"ఏం, పరువుతక్కువ అప్రదిష్టపని అనుకుంటే వూరునిండా యిన్ని హోటళ్ళు ఎలా వచ్చేవి. మనం అంతా చక్కగా వెళ్ళి తింటాం దానికేం పరువు తక్కువలేదా"
"నూర్మూయి , అదీ యిదీ ఒకటా! హోటలు పెట్టడం, బండి మీద అమ్ముకోటం ఒకట్రా..."
"ఆ అందరూ ముందే ఫైవ్ స్టార్ హోటళ్ళు కట్టరు. నెమ్మదిగా పైకి వచ్చిన వాళ్ళే అంతా. ఈనాడు పెద్ద హోటళ్ళు వాళ్ళంతా ఒకప్పుడు చిన్న హోటళ్ళతో ఆరంభించి వుండవచ్చు. యినప కొలిమితో ఆరంభించాడు 'టాటా' యిప్పుడు ఇండియాలో అందరికంటే గొప్పవాడయ్యాడన్నమాట మరిచిపోకండి" శంకర్ తలెగరేసి అన్నాడు.
'ఆహాహా .....నీ చదువు యిందుకు పనికి వచ్చిందిరా బాబూ. బేష్ నీ కొడుకు ప్రయోజకుడయ్యడే వాడు బతుకుతెరువు వాడే చూసుకున్నాడు. రేపు నీ కొడుకు 'తాతా' బిర్లాలని మించిపోతాడే , యీ బండి వ్యాపారంతో . "వెంకట్రావు గారు కొడుకు వాదనని మాటలల్లో నెగ్గలేక హేళనగా అన్నారు.
"దరిద్రుడా.... మీనాన్నాగారి పరువు ప్రతిష్ట ఏం కావాలనుకున్నావురా , రేపొద్దున నలుగురిలో అయన తలెత్తుకు తిరగాలా వద్దా. మీ అబ్బాయి బజ్జీలమ్ముతున్నాడని అంతా అడిగితె మొహం ఎక్కడ పెట్టుకువాలిరా, చదువుకోరా అంటే నీకిదేం బుద్ది" కాంతమ్మ ఆగ్రహం అవధులు దాటింది. నిండా మునిగాక చలేమిటన్న నిబ్బరం కన్పించింది శంకరులో.
'అమ్మా.....చదువు విజ్ఞానంకి అంటే వప్పుకుంటాను గానీ, అది ఈ రోజుల్లో బతుకుతెరువుకి ఉపయోగపడడం లేదు. నాకసలు చదువంటదు. కష్టపడి ఎలాగో డిగ్రీ తెచ్చుకున్నా మనలాంటి అనామకులకి ఉద్యోగం యిచ్చే దాతలు లేరు. యిచ్చినా వాళ్ళిచ్చే నాలుగైదు వందలతో యీ రోజుల్లో బతకలేం.
"బజ్జీలమ్మీ వేలు సంపాదించుతావా!" వెంకట్రావు గారు గర్జించారు "ఎన్ని వేలు సంపాదించావురా యిప్పటికి ?"
"శంకర్ ఒక్కక్షణం తండ్రి వంక నిబ్బరంగా చూసాడు. "నాన్న గారూ, బజ్జీలమ్మి నెలకి ఒక్కొక్కళ్ళం నెలకి రెండువందలు సంపాదిస్తున్నాం. కొన్నాళ్ళు పోయాక మొబైల్ వ్యాన్ తిప్పుతాం. నలుగురం ఒక్కొక్కరం వెయ్యి సంపాదిస్తాం. మేం అంతా లెక్కలు వేశాం. అంతా ప్లాన్ చేశాం. కావలిస్తే చూడండి. యీ మూడు నెలలో నా చేతి ఖర్చుల పోను ఐదువందలు పోస్టాఫీసు సేవింగ్స్ లో వేశాను" అంటూ పాస్ బుక్ తెచ్చి చూపాడు.
"డబ్బొక్కటేరా కావాల్సింది. పరువు వద్దురా. పాలు అమ్మి, కూరలమ్మి సంపాదిస్తున్నారు. అలా అని అవన్నీ మనం చెయ్యగలమా..... మనకో స్థాయి అంటూ ఏడ్చింది గదా" పాస్ బుక్ చూసి కాస్త తగ్గి వెంకట్రావు గారు కొడుక్కు నచ్చచెప్పే ధోరణిలో అన్నారు.
"హు..... అందుకే మన మధ్య తరగతి సంసారాలు రానురాను అధోగతికి పడ్తున్నాయి. మిడిల్ క్లాస్ కాస్తా లోయర్ క్లాస్ కి దిగజారడానికి యీ ఫాల్స్ ప్రిస్టిజ్ కారణం. ఏం చేసినా పరువో అంటూ ఏడుస్తాం. ఎవరే అనుకుంటారో నని భయం. మనలో చెయ్యాలని వున్నా ఎవరికో భయపడి యిబ్బండులున్నా సహిస్తారు గాని, తెగించే ధైర్యం లేక పరిస్థితులకి లొంగి నానాటికీ దిగజారిపోతున్న మన మధ్యతరగతికి ;పరువు' అన్న పదం వదిలిననాడే ముక్తి, మోక్షం వస్తాయి. సంపాదించేది ఒకడు, తినేది పదిమంది. నలుగురు నాలుగుపనులు చేసుకుంటే హాయిగా బతకవచ్చున్నది మనకు తట్టదు. ఏం ఆఫీసులో చేసేదే ఉద్యోగమా! వసంత బయటకు వెళ్ళి నాలుగు కాగితాలు టైపు కొట్టి సంపాదిస్తుంది. పెద్దక్కయ్య పిల్లలని ఆడించి సంపాదిస్తుంటే లేని నామోషి నేను బజ్జీలమ్మితే ఎందుకుండాలి" శంకర్ జవాబు చెప్పమన్నట్టు నిలేశాడు. వెంకట్రావు గారు జవాబుకి గుటకలు మింగారు. కాంతమ్మ కొడుకింత పెద్ద వాడేప్పుడయ్యాడు అని విస్తుబోయింది.
"అనరా అను, ఆడపిల్లల చేత ఖర్మ కాలి ఉద్యోగం చేయిస్తున్నానని నీవు దేప్పరా, గతిలేక వప్పుకున్నాను ఆ ప్రసాద్ అలా చెయ్యు జారిపోయాడు. కనీసం నీవన్నా చదివి సంపాదించి కాస్త నేను రిటైర్ అయ్యేనాటికి అందివస్తావనుకుంటే నీవిలా....." అయన శంకర్ మాటలకు జవాబెం చెప్పాలో తెలియక నిస్సహాయంగా అన్నారు.
నేను చదివి ఉద్యోగం చేస్తేనే మిమ్మల్ని అధుకుంటానా! రేపు మొబైల్ వ్యాన్ పెట్టి సంపాదిస్తే అదుకోనా? నే చదివి ఉద్యోగం చేసి ఆ వచ్చే నాలుగైదు వందలతో నేనేం తింటాను, మీకేం పెడ్తాను, అంత కంటే పెద్దస్థాయిలో బతకాలనే కదా ఎక్కువ సంపాదించాలని తాపత్రయం ఆరిందాలా మాట్లాడాడు శంకర్.