Previous Page Next Page 
చీకటి తొలగిన రాత్రి పేజి 30


    "నావల్ల తప్పయింది తొందరపడ్డాను మీరు క్షమించాననండి.' వణుకుతున్న పెదాలతో అన్నాడు.
    "నీవేం అంటున్నావో అర్ధంగావడం లేదు"
    "నిన్న రాత్రి నిన్న రాత్రి నే తొందరపడ్డాను."
    "కలగన్నానా రాత్రి?' నవ్వింది రమాదేవి. సారధి చకితుడై చూశాడు. నిజంగానే అది కలా ఏమిటన్న సందేహం వచ్చింది.
    "చూడు సారదీ అప్పుడప్పుడు పీడకలలు వస్తుంటాయి వాటిని గురించి పట్టించుకుని మనసు పాడుచేసుకోకూడదు! మరిచిపోవాలి వెంటనే అలాంటివాటిని ." మృదువుగా సారధి చెయ్యి నొక్కి నెమ్మదిగా అంది రమాదేవి.
    సారధి కళ్ళు కృతజ్ఞతతో ఆనందంతో చెమ్మగిల్లాయి.

                                               *    *    *    *
    
    తరువాత నెలరోజులు గడిచాయి. ఆరోజు ఆదివారం! ఉదయం ఏడు గంటలయింది.
    మిత్ర బృందం తలుపులు బిగించుకుని నిద్రలో వున్నారు. ఆదివారం లేచి చేసే పనేం లేదు అని ఎనిమిది గంటల దాకా నిద్రపోవడం అలవాటు. శనివారం రాత్రి రెండో ఆటకో, పేకాట వేసుకుని ఏ ఒంటి గంటకో పడుకుంటారు. కనక లేవడానికి ఆలశ్యం అవడం తప్పదు. అంతేకాక ఆదివారం స్పెషల్ గా పూరీలో , దోసెలో చేస్తాడు మణి. అవి తయారు చేయడం ఎలాగో ఆలశ్యం అవుతుంది. కనుక, ఆలశ్యంగా లేచి వేడి వేడి టిఫిన్ తినడం ప్రత్యేకత.
    కాని ఏడు గంటలకే ఆరోజు మణి తలుపులు తట్టి లేపేశాడు.
    గాభరాగా విసుక్కుంటూ లేచిన వాళ్ళకి మణి, అతనితో పాటు గాభరాగా వున్న రమాదేవి బంట్రోతు రెడ్డి కనిపించాడు.
    "బాబుగారూ, మీ రొకసారి రావాలి. అమ్మగారు ఏమిటో పిలిస్తే పలకటం లేదు. ఇంత ఆలశ్యంగా ఎప్పుడూ లేవలేదు....." రెడ్డి ఆందోళనగా అన్నాడు.
    "నిద్రపట్టిందేమో, పడుకుని వుంటారు దానికింత గాభరా ఎందుకు?" నిద్రమత్తు వదలని శర్మ బద్దకంగా అన్నాడు ఆవలిస్తూ.
    "రాత్రి ఎన్నింటికి పడుకున్నారు. ఆలశ్యంగా పడుకున్నారా?...." వెంకట్రావు గదిలోంచి అప్పుడే లేచి వస్తూ విషయం విని అడిగాడు.
    "రాత్రి సినిమా కెళ్ళి ఒంటిగంట కొచ్చారు గదండీ. తరువాత ఎంతసేపటికి పడుకున్నారో తెలియదండి..... అమ్మగారు ఎంత ఆలశ్యంగా పడుకున్నా తెల్లారగానే లేచిపోతారండీ, రోజూ.....మీరొకసారి వచ్చి పిలవండి బాబూ....' గాభరాగా ఆందోళనగా అన్నాడు. చొక్కాలు తొడుక్కుంటూ, ఒక్కొక్కరూ రమాదేవి ఇంట్లోకి నడిచారు త్వరగా.
    రమాదేవి గది తలుపులు తడ్తూ నలుగురూ పిలిచారు. జవాబు లేదు. గదిలోంచి ఏ శబ్దమూ లేదు. అందరూ మొహాలు చూసుకున్నారు. "తలుపులు బద్దలు కొడదాం" స్వామి అన్నాడు ఆఖరికి.
    తలుపులు బద్దలు కొట్టి తెరిచారు. ప్రక్క మీద నిశ్చలంగా నిద్రపోతున్నట్టు నిర్జీవంగా పడి వుంది రమాదేవి శరీరం. అడిరిపోయారు అందరూ.
    తరువాత జరగవలసిన తతంగం అంతా జరిగింది. డాక్టరుని పరుగు మీద తీసుకొచ్చారు. నిద్రమాత్రలు తిని చచ్చిపోయిందని తేల్చడం కంటే ఏం చెయ్యలేకపోయాడు డాక్టరు. ఆ మాట డాక్టరు చెప్పకముందే మంచం ప్రక్కన టేబిల్ మీద ఖాళీ మాత్రల సీసా చెప్పింది. సీసా క్రింద పెట్టిన కాగితం కవర్లు తీశారు మిత్రులు ఆరాటంగా. వాళ్ళ నోట మాట రావడం లేదు. మెదడు మొద్దుబారిపోయినట్లయింది. కబురు తెలిసి రమాదేవి మిత్రబృందం , పరిచయస్తులు , స్నేహితులతో ఇల్లు నిండిపోసాగింది. కొందరు అయ్యో, అయ్యో అన్నారు. కొందరు రాని కన్నీరు తుడుచుకున్నారు. కొందరు కారణమేమిటన్న మీమాంసని చర్చిస్తూ మధ్య మధ్య నిట్టూర్పులు విడుస్తున్నారు. మరికొందరు ముందు జరగాల్సింది , ఏమిటన్న సందేహం వెలిబుచ్చారు.... ఎవరికి వారు ఆ బరువు.....తమ మీద ఎక్కడ పడుతుందోనని బెడురుతున్నారు. రమాదేవితో బాగా పరిచయమున్న వారు ఆమె తాలుకు దూర బంధువులు ఎక్కడెక్కడ వున్నారో జ్ఞప్తికి తెచ్చుకొని టెలిగ్రాం లు యీయడానికి మనిషిని పంపుతున్నారు. మరికొందరు పోలీసులకి చెప్పడమా, మానడమా అన్న సందేహాన్ని వెలిబుచ్చారు. చెప్పడమే మంచిదని నిర్ణయించి పోలీసులకి కబురు చెప్పారు. పోలీసులు వచ్చారు, వివరాలు రాసుకున్నారు. ఆ ఉత్తరాలు పరీక్షించారు. ఒకటి పోలీసు కమీషనర్ గారికి -- తను ఆత్మహత్య చేసుకునే కారణాలు కేవలం తన వ్యక్తిగత సమస్య అని, ఎవరికీ ఈ విషయంలో ఏ సంబంధం లేదని రాసిన ఉత్తరం. రెండోది ఆమె లాయరు రంగనాధం గారికి రాసింది. తన యావదాస్తి దానధర్మాల క్రింద వినియోగించాలని తన కోరిక అంది. పతిత స్త్రీల ఉద్దరణ కింద తన నివాస భవనంతో పాటు పదిహేను వేల రూపాయలు విరాళంగా యివ్వాలని సూచించింది. పట్టణంలోని మరో ఇల్లు "అనాధ బాలల నివాసంగా , తన చనిపోయిన కొడుకు పేరుమీదుగా విరాళం ఇస్తున్నట్లు వ్రాసింది. మిగిలిన రోక్కంలో తన క్రింద పనిచేసిన వారికి తలో ఐదు వేల రూపాయలు, ఆర్ధికంగా వెనుకబడిన తన పినతల్లి కొడుకికి పదివేల రూపాయలు, మేనత్త కొడుకుకి పది వేల రూపాయలు యీయాలని  సూచించింది. తన నగలు విలువైన సామగ్రి అన్నీ అమ్మి స్త్రీల కళాశాల బీద విద్యార్ధినులకి స్కాలర్ షిప్ గా వినియోగించాలని కోరింది. ఆమె ఇల్లు ఆమె కోరిక ప్రకారం నెరవేర్చే భారం లాయరుగారి మీద పెట్టింది. ఆమె విల్లు చదివిన అందరూ ఆమె ఉదారతని, త్యాగనిరతని కొనియాడారు. మూడో ఉత్తరం.....సారధి, శర్మ, స్వామి, వెంకట్రావు .....నల్గురు పేర్లు కవరు మీద వున్నాయి. కవరు సీలు చేసి వుంది. బరువుగా పెద్దదిగా వుంది. కవరు అందుకుంటుంటే వాళ్ళ మనసులో అప్పుడు చెలరేగిన భావాలు చెప్పడం కష్టం . మౌనంగా కవరు జేబులో పెట్టుకున్నాడు  శర్మ.
    తరువాత పోలీసులు తతంగం పూర్తి చేశారు. బంధువులు ఎప్పుడు కొచ్చేది లేనిది ఏది తెలియని విషయం గనక శవాన్ని వుంచడం మంచిది కాదు అని దహనక్రియలు వెంటనే జరపడం మంచిదని అందరూ నిర్ణయించారు . ఏర్పాట్లు అందరూ కలసి చెకచేక చేసేశారు. రమాదేవి శరీరాన్ని ఆమె అంతస్తుకి తగిన ఆర్భాటంతో అగ్నికి ఆహుతి చేశారు.
    అందరితో పాటు యాంత్రికంగా రమాదేవి శరీరంతో శ్మశానం దాకా వెళ్ళి వచ్చారు మిత్రబృందం. వాళ్ళ నోట మాట లేదు. వాళ్ళ మెదడు మొద్దు బారినట్లు ఆచైతన్యంగా , యాంత్రికంగా జరుగుతున్న తతంగంలో పాల్గొన్నారు.
    అంతా మిగిసి ఇంటికి వచ్చే వాళ్ళ మనసులో అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. రమాదేవి ఆత్మహత్య ఎందుకు చేసికొంది? కారణమేమిటి? ఆవిడ కేం లోటని యింత దారుణానికి పాల్పడింది.
    అనే ప్రశ్నలు ఇల్లు చేరగానే నల్గురి నోట పైకి వచ్చాయి. "అన్నట్టు ఆ ఉత్తరం ఏదిరా? దాన్లో ఏమన్నా రాసిందేమో కారణాలు?" సారధి ఉత్తరం సంగతి గుర్తొచ్చి హటాత్తుగా అడిగాడు. ఉత్తరం మాటే మరచిన శర్మ జేబు తడిమి ఉత్తరం పైకి తీసి చింపాడు.
    "చదువు" అన్నారు ముగ్గురూ ఏకకంఠంతో.
    "తమ్ముళ్ళూ!" నలుగురూ ఒక్కసారి గిల్టీగా ఒకరి మొహాలలోకి ఒకరు చూసుకుని కళ్ళు వాల్చుకున్నారు.
    "నా అన్నవాళ్ళు లేని నాకు మీ నలుగురిని చూసిన మొదటి రోజే ఇలాంటి తమ్ముళ్ళు నాకూ వుంటే ఎంత బాగుండేది అనిపించింది. వుంటే యీ అక్కకీ , జీవితంలో వంటరిగా పోరాడలేక అలసిపోయే అక్కకి ఎంత ఊరటగా వుండేది అన్పించింది. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎవరూ లేని నాకు సోదరప్రేమ ఎలాంటిదో తెలియకపోయినా మీతో పరిచయం వృద్దవుతున్నకొద్ది ఆ అనుభూతి తెలియసాగింది. రక్తం పంచుకుని పుట్టాక పోతేనేం అనిపించిన క్షణాలు వున్నాయి నాకు.
    కానీ, అంత అదృష్టం నాకు పట్టనీయలేదు మీరు. మిగతా లోకంతో పాటు మీరూ కలిసిపోయారు...మీకంటే పెద్దదాన్నే! మీ కంటికి అమ్మగా కన్పించకపోయినా 'అక్క' గా నైనా కనిపించకపోవడం నా దురదృష్టం కాక మరేమిటి? కన్నతల్లిని, రక్తం పంచుకుపుట్టిన సోదరిని తప్ప మరో ఆడదాన్ని ఓ పురుషుడు 'ఆడదాని' గా తప్ప మరో పవిత్రభావంతో చూడలేడన్న సత్యం మరోసారి తెలుసుకున్నాక నేనెంత క్రుంగిపోయానో ఎలా చెప్పగలను?

 Previous Page Next Page