Previous Page Next Page 
మోడల్ పేజి 30


    కమలిని మీద కూడా ఒక రకమైన వ్యతిరేక భావం మంగళలో చోటుచేసుకుంది, ఆ క్షణానే.

       
                                                                   *    *    *

    మనోహర్ ప్యారిన్ లో ఢిల్లీ వచ్చే ఫ్లయిట్ ఎక్కడం జార్జి ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎంటర్ కావటం  ఒకేసారి జరిగింది. జార్జ్ కారుని కనీసం పార్కింగ్ లో కూడా పెట్టకుండా ఎయిర్ పోర్టు లోకి పరిగెత్తాడు. ఎంక్వైరీ దగ్గరకు వెళ్ళి "సర్ లుప్దాన్సా ప్లయిట్ ప్యారిస్ టు  వచ్చిందా?" జార్జి లో టెన్షన్ క్షణక్షణానికి పెరిగిపోతోంది. ఎంక్వయిరీ ఆఫీసర్ వింతగా చూశాడు చెమటలు కక్కుతూ. రొప్పుతున్న జార్జివైపు.

    "అందులో మీ వాళ్ళున్నారా?"

    "యస్....."

    విచారంగా చూస్తూ "సారీ సర్.....ఆ ప్లయిట్ ప్యారిస్ నుంచి ఫ్రాంక్ ఫర్ట్ వరకూ క్షేమంగానే వచ్చింది. అక్కడి నుండి బయలుదేరిన గంటకు సిక్కు టెర్రరిస్టులుదాన్ని హైజాక్ చేశారు. ఐయామ్ వెరీసారీ."

    ఓ క్షణం అతనేమంటున్నాడో అర్థంకాలేదు.....అర్థమయ్యాక స్తంభించిపోయాడు. నిస్సత్తువ ఒక్కసారి అతన్ని ఆవహించింది. మనోహర్ కి  హెల్ప్  చేయగలుగుతున్నానన్న ఆశతో, ప్రాణాలకు తెగించి 40కిలో మీటర్ల దూరాన్ని కేవలం 24 నిముషాల్లో అధిగమించి వచ్చాడు. ఇంతలో ఈ ఉపద్రవం ఒకటి వచ్చి పడింది. పులిమీద పుట్రలా.

    జార్జి చాలా తెలివిగలవాడు. ఎంతో గుండె నిబ్బరం కలవాడు. ఒక పరాజయంతో నిస్పృహ చెందేవాడుకాడు. గత సంవత్సరం వరల్డ్ మోడలింగ్ అసోసియేషన్ ఆహ్వానం మీద ఇండియా నుంచి అమెరికా వెళ్ళిన ముగ్గురిలో మనోహర్ తోపాటు జార్జి కూడా వున్నాడు.

    న్యూయార్క్ లో ఆరు నెలలపాటు యాడ్ ఫోటోగ్రఫీలో, ఇండస్ట్రియల్ ఫోటోగ్రాఫీలో ట్రైయినింగ్ పొందివచ్చారు. ఆ స్నేహంతోనే మనోహర్ కి సహాయం చేయాలనుకున్నాడు జార్జి.

    నాలుగడుగులు బయటకు వేసి ఠక్కున ఆగిపోయాడు జార్జి, అతడి మెదడులో ప్లాష్ లా ఒక ఆలోచన వచ్చింది.

    మరలా వెనక్కు వచ్చాడు.

    "ఆ ప్లయిట్ ఉన్న పాంసింజర్స్ పేర్లు చెప్పగలరా?"

    "సారీ......నాకు తెలియవు. జనరల్ మేనేజర్ దగ్గరకువెళితే దొరకవచ్చు. ఫ్రాంక్ ఫర్ట్  ఎయిర్ పోర్టు నుంచి వివరాలు వచ్చాయి. అవి ఆయన దగ్గరే ఉన్నాయి........."

    "హడావుడిగా మేనేజర్ రూమ్ వైపు కదిలాడు. తరంగిణి ప్లయిట్ ఎక్కింది ప్యారిస్ లో. ఆ వెంటనే హైజాక్ జరిగుంటే ఆమె ప్రమాదంలో చిక్కుకున్నట్లు. కాని ఫ్రాంక్ ఫర్టు లో ఆగింది. ఆ తరువాత హైజాక్ జరిగింది. మనోహర్ అదృష్టం బావుంటే ఆమె లక్కీగా  ఫ్రాంక్ ఫర్టులో దిగి వుండవచ్చు.

    స్విస్ ఎయిర్ ప్లెయిట్ అమిత వేగంతో ఢిల్లీవైపు దూసుకువస్తోంది అందులో ఉన్న మనోహర్ స్థిమితంగా కూర్చోలేక పోతున్నాడు. లేచి పరిగెత్తాలన్న ఆతృత అతన్ని హైపవర్ టెన్షన్ కి తీసుకువెళుతోంది. ఎయిర్ కండీషనర్ ఫర్ ఫెక్టుగా పనిచేస్తున్న ప్లయిట్ లో సైతం మనోహర్ కి చెమటలు పడుతున్నాయి.

    జార్జి తరంగిణిని గుర్తించగలడా?

    గుర్తించినా ఆమెను తనోచ్చెవరకు ఆపగలడా?

    సరిగ్గా ఇదే సమయంలో జనరల్ మేనేజర్ ఇచ్చిన లిస్ట్ చూస్తున్నాడు జార్జి చకచకా.

    ప్యారిస్ లో ఎక్కినప్పుడు ప్లయిట్ 240 మంది వున్నారు. ఫ్రాంక్ ఫర్డ్ లో ఫ్లయిట్ బయలుదేరినప్పుడు 180  మంది ఉన్నారు. అంటే  60  మంది ప్రాంక్ ఫర్ట్ లో దిగిపోయారు. ఆ 60 మంది పేర్లు చూస్తున్నాడు.

    చూస్తూ చూస్తూ ఓ చోట ఠక్కున ఆగిపోయాడు. అతని కళ్ళు విస్మయంతో పట్టరాని ఆనందంతో ఒక్కసారిగా వెలిగిపోయాయి.

    హైజాక్ చేసినప్పుడు విమానంలో వున్న ప్యాసింజర్స్ పేర్లలో తరంగిణి పేరు లేదు. దిగిపోయిన ప్యాసింజర్స్ పేర్లలో ఉందంటే ఆమె క్షేమంగానే ఉన్నట్లు.....అయితే ఫ్రాంక్ ఫర్ట్ లో ఉన్నట్లుగా భావించాలా? లేక వెంటనే ఢిల్లీ బయలుదేరినట్లా? 

    మేనేజర్కి థ్యాంక్స్ చెప్పి మరలా ఎంక్వైరీ  దగ్గరకు వచ్చాడు.

    "సర్......ఫ్రాంక్ ఫర్టు నుంచి ఢిల్లీ వచ్చే ప్లయిట్ వివరాలు చెబుతారా?"

    హుషారుగా అడుగుతున్న జార్జిని చూసి విషయం అర్థం చేసుకున్న ఆఫీసర్ అభివందనలు  చెప్పి ఇంటర్నేషల్ ఎయిర్ సర్వీసెస్ చార్ట్ తీశాడు. సరిగ్గా అదే సమయంలో తరంగిణి ఎక్కినా ప్లయిట్ ఢిల్లీ వైపు వస్తోంది.


                                                                  *    *    *


    మధు, గిరీష్ కలిసి పోస్ట్ లో వచ్చిన  యువతుల ఫోటోలు చూస్తుండగా ఫోన్ వచ్చింది.

    మధు ఫోన్ ఎత్తాడు___"హలో రోమాని మాట్లాడుతున్నాను, నేను ప్రమాదంలో వున్నాను మధు. నీతో ప్రదీప్ కి చెందిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ప్రదీప్ హిట్ లిస్ట్ ఒకటి తయారు చేశాడు దాని ప్రకారం ఈ నెలలో చాలామంది చంపబడతారు. ముఖ్యంగా మనో" లైప్ కట్ అయింది.

    దిగ్గున లేచాడు మధు సీట్లోంచి.

    రోమాకి ప్రమాదమేమిటి? కావాలనే ప్రదీప్ యూనిట్ లో చేరింది. అంతలో ప్రమాదం! హిట్ లిస్ట్! ముఖ్యంగా మనో.....! అంటే బాస్ కి........!?

    భయంతో మధు ఒళ్ళు గగ్గుర్పొడిచింది. ముఖం కళ తప్పింది. ఎలా రక్షించాలి రోమావీ.......! ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కుంది.........?

    "వాట్ మధు......ఎవరి నుంచా ఫోన్?......" గిరీష్ అడుగుతున్నా వినిపించుకోకుండా క్రిందకు పరిగెత్తాడు. మరో నిముషంలో మధు మోటర్ సైకిల్ వంద కిలోమీటర్ల స్పీడందుకుంది.

   
                                *    *    *


    మోడల్ వరల్డ్ లో క్రూరమైంది. మరొకటి లేదు. భద్రతలేని జీవితాలు మావి. పోలిటిక్స్ ప్లే చేయగలిగినంత సేపు నిలబడతాం. కడుపునిండా తింటానికిలేదు. కంటినిండా నిద్రకి లేదు. ఎప్పుడూ స్లిమ్ గా వుండాలి. బుగ్గలపైన, కళ్ళక్రింద కండ పెరగ కూడదు. దాంతో కళ్ళు విశాలంగా విచ్చుకోవు. కళ్ళు చివర్ల ముడతలు రాకూడదు. అందాన్ని చూసుకొని మురుసుకొని నిర్లక్ష్యంచేస్తే నిర్థాక్షిణ్యంగా గెంటివేస్తారు. ఇండియా మొత్తం మీద అందమైన పలువరుస వున్న ప్రామిస్ టూత్ పేస్ట్ మోడల్ మాయా అలగ్ కష్టాలు చెప్పనలివిగాదు. మాయా అలగ్ పళ్లు, అందంగా, తెల్లగా ముత్యాల్లా, దానిమ్మ గింజల్లా ముచ్చటగా వుండబట్టే ఆమె మోడల్ అయింది. ప్రతి క్షణం వాటిని కాపాడుకోవాలి. కాల్షియమ్ ఎక్కువ వుండే  ఆహరం తీసుకోవాలి. స్వీట్సు, వేడిపదార్థాలు, చల్లని పదార్థాలు తీసుకోకూడదు. ప్రతి రోజు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. ప్రతిదీ చూసి తినాలి. ఫోటోగ్రాఫర్స్ ని సంతృప్తి పర్చకపోతే చాన్స్ లు రావు. సంతృప్తి పరిస్తే శరీర లావణ్యం దెబ్బతింటుంది. మేగ్నిఫిషియంట్ ఆర్క్ లాంప్స్ కాంతుల్లో మెరిసే మా అందాల వెనుక విషాదకరమైన చీకటి నీడలు.

    ఎప్పుడు టీ.వి ఆన్ చేసినా, ఏ సినిమాకు వెళ్ళినా, ఏ పత్రిక తిరగేసినా, రంగు రంగుల దుస్తుల్లో ఒయ్యారాలు ఒలకబోస్తూ కనబడతాం మిమ్మల్ని నవ్విస్తాం, కవ్విస్తాం, అలరిస్తాం మీతోటి వస్తువుల్ని కొనిపిస్తాం. ఆ అందాల వెనుక, హంగుల రంగుల వెనుక అంతులేని విషాదం.

    చీకటి ప్రపంచంలో మెరిసే నీడలం మేము. వినియోగదారుల గుండెల్లో మా అద్భుతమైన అందాలతో భాస్వరం రగిలిస్తాం.......ఓ ప్రక్క మా గుండెలు వేదనతో మండిపోతున్నా, మా సంసార జీవితాలు కూడా అంత సుఖంగా వుండవు భర్తల అనుమానం, అవమానం. హింసలతో మానసికంగా చచ్చిపోతాం.

    మనస్సున్న ఓ పేదవాడ్ని చూసి పెళ్ళిచేసుకోము. పెళ్ళయిన పిల్లలున్న హీరోల్ని, మోడల్స్ ని ప్రేమించటం క్రేజ్. వారు మా సంపాదన లాక్కొని తన్ని తగలేస్తే సినీనటి సావిత్రిలా కుక్కచావు."

    ఈ రోజెందుకు కమలిని చిత్రంగా మాట్లాడుతోంది. "ముప్పయి వాటిన మోడల్స్ కూడా ఎందుకు నగ్నంగా మోడలింగ్ చేయాలి......? అప్పటికే డబ్బు, పేరు వస్తాయిగా......" అడిగింది మంగళ.

    "ముప్పయిదాటిన మోడల్స్ లో తమకు వయస్సు పెరుగుతున్నట్లు, యౌవనానికి దూరమవుతున్నట్లు తాము శారీరకంగా ఆకర్షణ కోల్పోతున్నట్లు, ఇన్ ఫీరియర్ గా ఫీలై___తమలో శారీరకంగా మార్పు రాలేదని నిరూపించుకొనేందుకు ఫోటోగ్రాఫర్ అడిగిన భంగిమల్లో ఫోజ్ ఇస్తారు. అదో కాంప్లెక్స్......

    తిండిలేక కొందరు మోడల్స్ అయితే, గ్లామర్ కోసం కొందరు, దౌర్భాగ్యం ఏంటంటే ఈనాడు పెద్ద పెద్ద కుటుంబాల యువతులు, ఐ.పి.ఎస్. ఐ.ఎ.యస్. అధికారుల కూతుర్లుకూడా ఇందులోకి దిగుతున్నారు. మంచి హొదాగల ఉద్యోగాలు చేసే అధికారిణులు కూడా పార్టుటైం మోడలింగ్ చేస్తున్నారు. వారంతట వారే వస్తున్నప్పుడు తక్కువకాక మరేమవుతారు?

    ఈనాడు పత్రికలు కూడా నగ్నమైన యువతుల ఫోటోలు  లేందే అమ్ముడు బోవటంలేదు. అమెరికాలో ప్లే బోయ్ అనే పత్రిక కేవలం న్యూడ్ ఫోటోలే ప్రచురిస్తుంది. పెంట్ హౌస్  అనే పత్రిక కూడా వాటి సర్క్యూలేషన్ ఎంతో తెలుసా 59,00,000 కాపీలు.

    ఈ దిక్కుమాలిన స్త్రీ దోపిడి ప్రపంచమంతా వుంది. మేమే కాదు, గృహిణి అయినా అంతే. ఇంట్లో వంటగత్తెగా, ఇళ్ళు చక్కదిద్దే పని మనిషిగా, బానిసగా, పిల్లల్నికనే యంత్రంగా మగ్గి చావాల్సిందే. మగాడు రెండు వందలు సంపాదించినా అదే గొప్ప అదే స్త్రీ ఇంట్లో ఆరువందల పని చేసినా లెక్కలోకిరాదు. ఆడదాని ప్రస్తావన లేని ఆర్ధిక శాస్త్రాన్ని తగలెయ్యాలి,

    ఆడమ్ స్మిత్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ కాదు. ఫారర్ ఆఫ్ మేల్ సైడ్ ఎకనామిక్స్ మగవాడి సంపాదనకు విలువకట్టే ఆర్ధికశాస్త్రం ఆడదాని కష్టాల్ని మాత్రం సేవలుగా లెక్కించి నిర్లక్ష్యం చేసింది.

    స్త్రీకి విలువ్వని ఏ శాస్త్రమైనా, ఎందుకు తగలెయ్యక.

    ఆడదాని చావు మగాడిచేతిలో వున్న ఈ సమాజం భ్రష్టుపట్టి పోవాలి. క్రుళ్ళిపోవాలి, కృశించిపోవాలి ప్రపంచ స్త్రీల్లారా ఈ సమాజాన్ని మర్డర్ చేయండి....." చెబుతూ చెబుతూ ఓక్షణం ఆగి మరలా అంది "ఏమిటి ఈమె కాసేపు ఎకనామిక్స్, కాసేపు సోషియాలజీ మాట్లాడుతోంది అని అనుకుంటున్నావు గదూ? అనుభవాలు.....దారుణమైన అనుభవాలు.

    ఎందుకు నేటి స్త్రీలంతా ఫ్యాషన్ మీద, గ్లామర్ మీద పడి భ్రష్టుపట్టి పోతున్నారు? తమకు జరిగే అన్యాయం గురించి ఎందుకు ఆలోచించరేం? ఎదురు తిరగరేం?"

    ఏదో చేయాలని ఆకాశాన్ని అంటుతున్నట్లు ఎగిరిన సముద్రకెరటం ఏమీ చేయలేక ఒడ్డున కొట్టి నిస్సహాయంగా వెనక్కి వెళ్ళినట్లుగా  వుంది కమలిని ముఖం.

    ఈమెకు తెలియని విషయం లేదా అని అనిపించింది వింటున్న మంగళకు.

    విస్ఫారిత నేత్రాలతో తనవైపే వింతగా చూస్తున్న మంగళ వైపు చూస్తూ "ఆడదాని అందాన్ని గౌరవంగా చూసే  రోజురావాలి......అద్భుత సోయగాల్ని సిన్సియర్ గా, ఎలిగెంట్ గా చూసే రోజు రావాలి.

    నీవో రచయిత్రివైతే నా అనుభవాల్ని నవలా రూపంలో నలుగురి ముందుంచి ఈ అసభ్య సమాజపు కళ్ళు తెరిపించేదానిని.

    ఆరిపోయే ముందు వెలుగు ద్విగుణీకృతమవుతుంది. అలాగే నా బ్రతుకు.

    ఏది ఏమైనా నీవు, మనోహర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయి సుఖప్రదమైన సంసారిక జీవితం గడపాలని నాకోర్కె....."అంది వివరంగా. అంతలో ఫోన్ మ్రోగింది.

    ఫోన్ ఎత్తి పట్టుకున్న ఆమె క్షణక్షణానికి ఒణికి పోతున్నట్లుగా వుంది. మొఖమంతా చెమటలు పట్టింది.

    ఫోన్ పెట్టేసి గాభరాగా-

    "ఈ ఊర్లో నీకు బంధువులున్నారా మంగళ?" అడిగింది.

    హఠత్తుగా ఆ ప్రశ్న ఎందుకు వేసిందో అర్థంకాలేదు.

    ఉన్నారన్నట్లుగా తలూపింది.

    "ఇలా  అంటున్నానని ఏమీ అనుకోవద్దు. అర్జంటుగా వాళ్ళింటికి వెళ్ళిపో......." అంది.

    మోడలింగ్ వృత్తిమీద మంగళ పెంచుకొన్న అసహ్యం, కసి, పగ, కోపం అకారణంగా కమలినిపై మళ్ళింది.

    మంగళ విసురుగా లేచి బట్టలు సర్దుకుంది. కన్నీళ్ళతో నిండిన కళ్ళతో చూస్తోంది. కమలిని వెళుతూన్న మంగళవైపు.


                               *    *    *

    "మరో అరగంటలో ఒక ప్లయిట్ ఫ్రాంక్ పర్ట్ నుంచి వస్తుంది" అన్నాడు ఎంక్వైరీ ఆఫీసర్.

    నిముషాలు లెక్కబెడుతూ కూర్చున్నాడు జార్జి ఎయిర్ పోర్టు లాంజ్ లో.

    తరంగిణి సరాసరి రాకుండా ఫ్రాంక్ ఫర్టులో ఎందుకు దిగినట్లు......? దిగిన వెంటనే మరో ప్లయిట్ లో ఢిల్లీ వస్తుందన్న గ్యారంటీలేదు. తన పరీక్షలు వృధానా?

    ఒక దృశ్యంకోసం గంటల తరబడి చేతిలో కెమేరాతో కూర్చోవటం ఫోటోగ్రాఫర్స్ కి అలవాటే.

    ఆలోచనల్లో ఉండగానే ఫ్లయిట్ వస్తున్నట్టు ఎనౌన్స్ మెంట్ వినిపించింది. ఠక్కున లేచి అవుత గేట్ ముందుకొచ్చాడు. చూస్తుండగానే ప్లయిట్  లాండ్ అయింది. దిగుతున్న  ప్యాసింజర్స్ లో తరంగిణి కోసం కళ్ళు చికిలించుకొని చూస్తున్నాడు జార్జి.

    పది నిముషాలు గడిచాయి. ఒక్కొక్కరే అవుట్ గేట్ నుంచి బయటకు వస్తున్నారు. అప్పుడు పడింది జార్జి దృష్టి ఆమెమీద. సన్నగా, నాజూగ్గా, కవ్వింపుగా, కైపుగా అజంతా, ఎల్లోరా శిల్పాళ అద్భుత భంగిమలను కూడా చిన్న బుచ్చుతూ స్టయిల్ గా వస్తోంది. ఆమె కళ్ళకు పెద్ద  పెద్ద గాగుల్స్, తలమీద హేట్, పట్టు జలతారులాంటి కురులు గాలికి కదలాడుతుండగా అవుట్ గేట్ దాటింది. కళ్ళు చెదిరే అందం ఆమెది.

    మనోహర్ చెప్పిన లక్షణాలన్నీ ఆమెలో వున్నాయి. ఆనందంతో ఎగిరి గంతేసినంత పనిచేశాడు జార్జి.ఆమెనే ఫాలో అయ్యాడు. ఆమె బయటకు నడచి లగేజి కన్వేయర్ బెల్ట్ దగ్గరకు నడచింది.

    లగేజీకోసం ఎదురుచూస్తున్న ఆమెను దూరంనుండి గమనిస్తూ, ఆమెను ఎలా తీసుకెళ్ళాలా అని చురుగ్గా ఆలోచిస్తున్నాడు జార్జి.

    ఆమె లగేజ్ తీసుకొని వెనుతిరిగింది. వెంటనే ఆమె ముందుకువచ్చి "లిప్టు కావాలా మిస్....."మర్యాదగా అడిగాడు జార్జి.

    ఆమె జలపాతంలా గలగలా నవ్వింది......జార్జిని చూసి కాదు. దూరంగా కనబడ్డ ఒక దృశ్యం చూసి. అంతలోనే ఆమె జార్జి వైపు తిరిగి "మా కారు రావాలి. రాలేదు. రేస్ కోర్స్ గ్రౌ వుండ్స్ దగ్గర డ్రాప్స్ చేయగలరా?" వీణ మీటినట్లుగా ఉంది ఆమె గొంతు. "విత్ ప్లెజర్.........మీ ఇల్లు అక్కడుందా మిస్?"

    "కాదు. మా అంకుల్ ఇల్లది......."

    "ఎక్కడనుండి వస్తున్నారు?"

    "ప్యారిస్"

    కారు బయలుదేరింది.

    "ఎన్నాళ్ళుంటారు ఇక్కడ?"

    "రెండు రోజులుంటాను....."

    "ప్యారిస్ ఏం పని.........?"

    "వరల్డ్ ప్యాషన్స్ మీద డిప్లోమా చేశాను."

    కారు ఆమె చెప్పిన ఇంటి ముందాగింది. థ్యాంక్స్ చెప్పి ఓ ఇంట్లోకి వెళ్ళిపోయింది. కారును తీసుకెళ్ళి  దూరంగా పెట్టివచ్చి. ఇంటికి ఎదురుగా, ఆ యింటిలోని వారికి కనిపించని స్థలంలో కూర్చున్నాడు ఆమె పై నిఘా వేసి.

    క్షణాలు, నిముషాలు, గంటలు గడిచిపోతున్నాయి. సాయంత్రం ఆరవుతుండగా ఆమె కారులో బయటకు  వచ్చింది. వెంటనే తన కారుతో ఆమె కారుని వెంబడించాడు. ఆమె కారు తిన్నగా ఎయిర్ పోర్టు లో ఆగింది.

    కారు నెంబరు గుర్తు పెట్టుకొని ఆ కారు ప్రక్కనే తన కారు పార్క్ చేసి బయటే చూస్తూ నిల్చున్నాడు. ఏదో ప్లయిట్ వచ్చినట్లుంది. ఎయిర్ పోర్టు అంత హడావుడిగా వుంది. అరగంట  గడిచిపోయింది.

 Previous Page Next Page